Title Picture
షకీలా, రాజ్ కపూర్

మెజారిటీ హిందీ చిత్రాలపై మోజుగల వారికి, రాజకపూర్ నటించిన చిత్రం కదా అని కొండంత ఆశపెట్టుకొనే వారికి 'శ్రీమాన్ సత్యవాది' చిత్రం ఆశాభంగం కలిగించదనే చెప్పవచ్చును. సర్వసాధారణంగా హిందీ చిత్రాలలో ఉంటున్న సుగుణాలు, దుర్గుణాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఆ గుణాలు-మంచి సంగీతం, అంతకు మించిన ఛాయాగ్రహణం, మించని అభినయం, చౌకబారుకథ, కారు చౌకనృత్యాలు, అదేస్థాయి దర్శకత్వం. వీటిని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ చిత్రం ఆశాభంగం కలిగించదు.

'సత్యమేదైవము, సత్యమేజయం'-ఇది ఈ చిత్రం చేసే నినాదం. చిత్రంలోని చౌకరకం ప్రేమ, అవినీతిని ప్రోత్సహించగల బాల్ రూమ్ సన్నివేశాలు, హాస్యమనే పేరుతో చేసే వెకిలి చేష్టలు, నాటురకం సస్పెన్సు చూసి విచక్షణా జ్ఞానం గల ప్రేక్షకులు శపిస్తారేమోనన్న భయం కలిగినప్పుడల్లా దర్శకుడు ఒక్కసారి పై'సత్య' నినాదాన్ని జపించారు. చివరికి సత్యమేజయం అని నిరూపించి, ఈ చిత్రానికి కూడా నీతి, జాతి ఉన్నవని నమ్మించాలని ప్రయత్నించారు.

ఇందులో నాయకుడు మూర్తీభవించిన సత్యమట. లేక కలియుగ హరిశ్చంద్రుడట. సత్యం చెప్పటం వలన హరిశ్చంద్రుడు పడినట్లే ఇతను కూడా అంత భారీ ఎత్తున కాకపోయినా, కొన్ని కష్టాలు పడ్డాడు. కాని అంతకంటే ఎక్కువగా అందమైన అమ్మాయితో రాక్సెన్ రోళ్ళు చేశాడు. అల్లరి చేశాడు. చివరికి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇంతకంటే చెప్పుకునేందుకు కథ అన్నదేమీ ఇందులో లేదు. ఉన్నదాన్నే కథ అనుకోమంటారు దర్శక నిర్మాతలు. అనుకుంటే ఈ చిత్రం బాగానే ఉంటుంది. కొత్తదనం లేకపోయినా మంచి పాటలు చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఛాయాగ్రహణం చక్కగా ఉంది.

Picture
షకీలా, రాజ్ కపూర్

అదేపనిగా ఇటువంటి పాత్రలను ధరించడం రాజకపూర్ కీర్తికి అంతక్షేమం కాదేమోనని ఆయన అభిమానులకు అనిపిస్తుంది. రాజకపూర్ ప్రత్యర్థిగా మహమూద్ చాలా చక్కగా నటించాడు. అతని చేష్టలు ఎక్కడైనా అతిగా ఉంటే అందుకు అతను బాధ్యుడు కాకపోవచ్చును. షకీలాకు రాజకపూర్ వంటి అగ్రశ్రేణి నటునితో నటించడమే అబ్బురం. ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకొన్నది. నాజిర్ హుస్సేన్ నటన విశేషంగా లేదు. రాధాకిషన్ నటన మామూలుగానే అద్భుతంగా ఉంది.

మొత్తానికి ఈ చిత్రం వినోబాభావే లాటి వారికి బాగా పని కల్పించగలదు. నీతి - రాజకపూర్ నటించినంత మాత్రాన ప్రేక్షకులకు అత్యాశ కూడదు. పాటలు అద్భుతంగా ఉన్నంత మాత్రాన ఏ చిత్రాన్నిగాని భరించలేము.

నిర్మాత: మహీపత్ రాయ్; దర్శకత్వం, రచన: ఎస్.ఎం.అబ్బాస్; సంగీతం: దత్తారామ్; ఛాయాగ్రహణం: జయేంద్ర కపాడియా; తారాగణం: రాజ్ కపూర్, షకీలా, మహమూద్, నాజిర్ హుస్సేన్, రాధాకిషన్, కుముద్ త్రిపాఠి, మోనీ చటర్జీ, సుశీల్ కుమార్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 ఫిబ్రవరి 12వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post