Title Picture
పృధ్వీరాజ్ కపూర్

పురోగమిస్తున్న లఘు పరిశ్రమలలో డబ్బింగు పరిశ్రమ ముఖ్యమైనది. చిత్రాలను డబ్బు చేయడానికి డబ్బు ఆట్టే అక్కర్లేదు. అయినా డబ్బు బాగానే చేసుకుంటాయి. ఈ పరిశ్రమలో శ్రమ తక్కువ. ముడి ఫిలిం వ్యయం బొత్తిగా ఉండదు-ఈ కరువు కాలంలో.

పై విషయాల దృష్ట్యా ధనలక్ష్మీవారు పూర్వకాలంలో (సుమారు ఒకటిన్నర దశాబ్దాల క్రితం) ఉత్పత్తి అయిన 'మహారథి కర్ణ' హిందీ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి అనువదించారు. మహాభారత గాథలు యెన్నిసార్లు విన్నా, కన్నా పాతపడవనీ, అవి అమరగాధలనీ వేడివేడి గారెల్లా ఉంటాయనీ నిర్మాతల భావం. వ్యాసుని భారతాన్ని ఇప్పటికీ చాలామంది అనువదిస్తున్నారు కదా. 15 ఏళ్లు దాటితేనేం అనువదించడానికి, అని వారు ఈ చిత్రాన్ని డబ్బు చేసుకోవాలనుకున్నారు.

కర్ణుడుగా పృధ్వీరాజ్ కపూర్ ఎంతో హుందాగా, అందంగా ఉన్నాడు. అయితే ఆయన పాత్ర చిన్నది. పెద్ద పాత్ర కృష్ణుడిది. దాన్ని సాహు మోదక్ ధరించాడు. దుర్యోధనుడిగా కె.ఎన్. సింగ్, కుంతిగా దుర్గాఖోటే నటించారు.

ఈ నటుల చిన్నతనపు రోజులవి. వారిని ఇప్పుడు పోల్చుకోవటం కష్టం. పదిహేనేళ్ల పాతదృశ్యాలకు, ఇప్పటి సరికొత్త శబ్దానికీ, పాత, కొత్త సంప్రదాయాలకువలెనే పొత్తుకుదరలేదు. ఘంటసాల పాడిన రెండు పద్యాలు బావున్నాయి. 'పాత'ను మెచ్చుకునే అలవాటున్నవారికి ఈ చిత్రం బాగుంటుందేమో! ఈ చిత్రానికి సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు సాహిత్య పర్యవేక్షణ చేయటం, కొన్ని పాటలు, పద్యాలు, జాషువా, కరుణశ్రీ గార్లు అందజెయ్యటం విశేషం.

నండూరి పార్థసారథి
(1960 జనవరి 31వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Next Post