Humor Icon

లోభం అనేది ప్రతివారిలోనూ అంతో యింతో వుండకమానదు. అసలు కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలు (అరిషడ్వర్గం) అన్నీ కలిస్తేనే మానవుడు తయారవుతాడు. వాటిలో ఏ ఒక్కటి పూర్తిగా లోపించినా మానవుడు తయారుకాడు. అయితే మానవుల్లో ఇన్ని రకాలుండటానికి కారణం ఏమిటంటే, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విధంగా వాటిలోని పాళ్లు భేదిస్తూ వుంటాయి. ఒకడిలో వున్న కామ-క్రోధాదుల నిష్పత్తి ప్రకారం వాడి వ్యక్తిత్వం వుంటుంది. మొత్తానికి అన్నిటి పాళ్ళూ వుంటాయి ప్రతివాడిలోనూ. ఈ నిష్పత్తిని బట్టే, కోమటికి కుంకుడు కాయంత లోభం, నియోగికి నిమ్మకాయంత నిక్కు, గొల్లకి వేపకాయంత వెర్రి అని అంటూ వుంటారు.

ఎంత చెప్పినా అసలు మిగతా ఐదింటి కంటే లోభత్వమే కొంచెం ప్రమాదం తక్కువదనుకుంటా. లోభిని చూస్తుంటే కోపమే కాదు, నవ్వూ జాలీ కూడా వేస్తాయి. అయితే వీళ్ళలో రకాలున్నారు. ఎదుటివాడికి కానీడబ్బు యివ్వకుండా, తాము శుభ్రంగా అనుభవించే వాళ్లున్నారు. తనది తాను అనుభవించకుండా, ఒకళ్ళని అనుభవించనీకుండా వుండేవాళ్లున్నారు. అనుభవించక, అనుభవించనీక, పైపెచ్చు ఎదుటి వాళ్ళ నుంచి కాజేయాలనుకునే వాళ్ళూ ఉన్నారు.

పైన చెప్పిన వారి వారి లోభత్వపు పరిమాణాలను బట్టి, సమరధ, అతిరథ, మహారధుల్లాగానే సమలోభి, అతిలోభి, మహాలోభి అని విభజింపవచ్చును. వీళ్ళల్లో ఒకటో వాడికంటే రెండో వాడూ, రెండో వాడికంటే మూడో వాడు ప్రమాదకారులు. వీళ్ళని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒకావిడ వుంది. ఆవిడ బాగా ఆస్తిపరురాలే. ముప్పూటలా సుష్టుగా తినేది. కార్తీక ఏకాదశికైనా సరే, పొరపాటుసైనా ఉపవాసం వుండేదికాదు. పిల్లికి బిచ్చం వెయ్యటం, కాకికి ఎంగిలి చెయ్యి విదపటం లాంటి పొరపాటు పనులు జీవితంలో ఎన్నడూ చేసి ఎరుగదు. తన ఆస్తిలోని ప్రతి నయా పైసా, ప్రతి మెతుకూ తనకే వంటబట్టాలన్నది ఆమె అభీష్టం. ఎవరయినా చుట్టాలువస్తే "మా యింట్లో భోజనం చెయ్యమంటే మాత్రం మీరు చేస్తారా?" అని ముందరి కాళ్ళకి బంధాలు వేసేది. ఈవిడ పీనాసి అనే కీర్తి బంధుప్రపంచంలో అర్థణామందాన వుంది. ఈవిడ సంగతి తెలిసికూడా పంతం కొద్దీ భోంచేయాలనుకునే మొండి ఘటాలు ఎవరైనా వస్తే, వాళ్లని బహుతమాషాగా తరిమేసేది ఒక్క పూటలోనే. నెయ్యి లేకుండా కొరివికారం వేసి పెట్టేది. కటిక నీళ్ళ మజ్జిగ పోసేది. అంతే-యిహ జన్మలో వాళ్ళు మళ్లీ ఎంత బలవంతం చేసినా భోంచేయరు ఆ యింట్లో. ఆ గడపే తొక్కరు. ఈవిడ "సమలోభి" జాతి స్త్రీ.

ఇహ రెండోజాతి లోభి ఒకాయన వున్నాడు. ఆయన పేరు రామన్న పంతులు గారు. ఆయనకి వున్న చొక్కా ఒక్కటే. దాన్నెప్పుడూ ఆయన తొడుక్కునే వాడుకాడు. జాగ్రత్తగా పెట్లో పెట్టి పూజించేవాడు. ఒక్క ఉత్తరీయం మాత్రం పైన వేసుకునేవాడు. కోర్టు పక్షి కావటం చేత, కోర్టుకు వెళ్ళేటప్పుడు మాత్రం వుపయోగించేవాడట. అంతే దాన్ని తొడుక్కుని వెళ్ళేవాడని కాదు సుమండీ... మాసిపోదూ! చంకన పెట్టుకు వెళ్ళేవాడు కోర్టుకి. "రామన్న పంతులు గారూ!" అని పేరు పిలవగానే, చొక్కా తొడుక్కుంటూ వెళ్ళేవాడట. సాక్ష్యం చెప్పటమో, ఏదో ఆ పని అయిపోగానే మళ్లీ విప్పుకుంటూ వచ్చేవాడట తన స్థానం లోకి. చక్కగా మళ్లీ మడతపెట్టి పెట్లో పెట్టేసేవాడు యింటికి వచ్చి. ఇలా సాక్ష్యాలు చెప్పిన బాపతు సంపాదించిన డబ్బుతో ఆయన ఒక మంచి పెన్నుకొన్నాడు పాతిక రూపాయలు పెట్టి. అందులో సిరా పోసేవాడు కాదు. పాడయిపోతుందని. అసలు దాన్ని చేత్తోనే ముట్టుకునేవాడు కాదు. జాగ్రత్తగా ఉత్తరీయం కొంగుతో పట్టుకుని రోజూ దాన్ని తుడుస్తూ వుండేవాడు. సాయంకాలం కేవలం పెన్నుని అందరికీ ప్రదర్శించేందుకు, షికారు బయల్దేరేవాడు. పెన్నుని జందానికి వేలాడదీసుకుని ఠీవిగా నడిచేవాడు రోడ్డుమీద. ఒకరోజు అది కాస్తా ఎక్కడో జారిపడిపోయింది రోడ్డు మీద. కాప్ మాత్రం చక్కగా జందానికి వ్రేలాడుతూంది, యింటికి వచ్చేసరికి. "లబో" మని గోల పెట్టాడు. తీరాచేసి ఆ పెన్ను ఆయన మనవడికి దొరికింది. అతను పట్నంలో కాలేజీలో చదువుతూ, సెలవులకి వచ్చాడు. రోజూ తాతగారి జందానికి వేలాడుతున్న ఆ పెన్నును చూసి వుసూరుమంటూ గుటకలు మింగేవాడు, అంతమంచి పెన్ను వూరికేపోతోందే అని. సరే ఎట్లాగయితేనేం అతనికి దొరికింది. ఇంటికి వచ్చి ఆ కుర్రాడు అందులో ఇంకుపోసి రాస్తున్నాడు. ఇంటికి వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసి నిలువునా ప్రాణాలు పోయినంతపనైంది ఆయనకు. పోయిన పెన్ను దొరికినందుకు సంతోషించవచ్చునా! దానికి బదులు, ఆ పెన్ను స్థితికి ఆయనకి ఏడుపొచ్చినంత పనైంది. కోపంతో వణికిపోయాడు. గుడ్డతో పట్టుకోకుండా, వట్టి చేత్తో పట్టుకున్నాడు. బంగారంలాంటి పెన్నుని, పైగా సిరాపోశాడు, ఇహ ఎందుకైనా పనికొస్తుందా అది! ఎంత సుకుమారమైందీ, ఎంత ఖరీదైంది! ఆయనకి లోభంతోపాటు, క్రోధానికి కూడా లోటులేదు. ఆ కోపంలో మనవడి చేతిలోంచి పెన్ను లాక్కుని, నేలకేసి విస్సిరికొట్టాడు. పాళీ విరిగిపోయింది. ఇంకా ఆయనకి కసితీరక, బండరాయితీసుకువచ్చి దాన్ని ముక్కలు ముక్కలుగా నలక్కొట్టేశాడు. ఈయన "అతిలోభు"ల్లో అగ్రగణ్యుడు.

ఇహ మూడోజాతికి చెందిన మహాలోభివరేణ్యుడు ఒకాయన వున్నాడు. ఆయన అణాపెట్టి అగ్గిపెట్టికొని మాసిపోతుందని దానికి చక్కగా తెల్లకాయితంతో అట్టవేసి పెట్టెలోదాచి, చుట్టకాల్చుకునేందుకు అగ్గిపుల్లకోసం ఊరంతా తిరిగేవాడట అడుక్కుంటూ.

లక్షలు లక్షలు నిక్షేపాలు పెట్టుకుని కానీ ఖర్చుచేయకుండా, యింట్లో వాళ్లని బికారులను చేసి, పిల్లలకి చదువుసంధ్యలు లేకుండా చేసి, యిది చాలక కోర్టులు చుట్టూ తిరుగుతూ, కొంపలు కూలుస్తూ, అందరి నెత్తినా చేతులు పెట్టి వేలకు వేలు ఆర్జించే భస్మాసురులు కూడా యీ 'మహాలోభి' కోవకు చెందినవారే.

అయితే ఒక విధంగా చూస్తే 'లోభి'కి మించిన త్యాగి ఎవడున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే లోభి చనిపోయేముందు మూటకట్టుకుపోడు, పుణ్యాత్ముడు. ఈ విషయం అతడికి తెలిసికూడా, కానీ ఖర్చు చెయ్యకుండా నిలవచేస్తాడు ముందు తరం వాళ్లకోసం. త్యాగి వున్నదంతా నలుగురికీ కొద్ది కొద్దిగా పంచి పెట్తాడు - లోభి ఒక్కళ్లకే, ఏక మొత్తంగా ఒక్కసారే యిచ్చిపోతాడు ఈ నిక్షేపాలు. వారసులుంటే సరేసరి - వాళ్లకే పోతాయి. లేకపోతే ప్రభుత్వానికో, ఏ అనాధ శరణాలయానికో పోతాయి. అదీకాక పోతే కనీసం దొంగలకయినా పోతాయి. అంతేగాని వూరికే మాత్రం పోవు. ఈ దృష్టిలో చూస్తే సమలోభికంటే అతిలోభి, అతిలోభి కంటే మహాలోభి పరోపకారపరాయణులు, పుణ్యాత్ములు. అందుకే అరిషడ్వర్గంలోనూ యిదే కాస్త ప్రమాదం తక్కువది.

నండూరి పార్థసారథి
(1972 లో 'స్నేహలత' పత్రికలో ప్రచురితమైనది)

Next Post