Title Picture

1953 తెలుగు 'దేవదాసు' చిత్రం గురించి

ఎప్పుడో వందేళ్ళనాడు శరత్ చంద్ర చటర్జీ రచించిన బెంగాలీ నవల 'దేవదాసు' ఆధారంగా బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషలలో సుమారు డజను చలన చిత్రాలు తయారైనాయి. 1928లో ఇంకా సినిమాలు మాటలు నేర్వకముందే - ఒక మూకీ చిత్రం కూడా దేవదాసు కథతో తయారయింది. 2002 సంవత్సరం సెప్టెంబరు 16 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారు 'దేవదాసు' చలన చిత్రోత్సవం నిర్వహించి తమకు అందుబాటులో వున్న ఆరు 'దేవదాస్' చిత్రాలను ప్రదర్శించారు. వాటిలో అతి ముఖ్యమైనవని మేము అనుకున్న మూడు చిత్రాలను గురించి 2002 అక్టోబరు, నవంబరు, డిసెంబరు 'రసమయి' మాసపత్రికలో వ్యాసాలు, లేఖలు, ఫొటోలు వగైరా ప్రచురించాము-మొత్తం 40 పేజీలు. అయినా ఇంకొక్క వ్యాసం మిగిలిపోయింది. దాన్ని కూడా ప్రచురించాలని అనుకుంటుండగానే అది ఎలాగో మరుగున పడిపోయింది; తర్వాత మరపున పడిపోయింది. ఆకస్మికంగా, ఆశ్చర్యకరంగా అది ఇప్పుడు 'త్రవ్వకాలలో' బయల్పడింది. ఇంక ఉండబట్ట లేక వెంటనే దానిని ఉన్నదున్నట్లుగా, అక్షరం మార్చకుండా ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఇది 2002లో రాసినది-అంటే ఇరవయేళ్ళ నాటిది.

'దేవదాసు' గొప్పపాత్ర. దేశ భాష కాలావధులకు అతీతంగా అందరి సానుభూతినీ చూరగొన గలిగిన పాత్ర అది.

Picture

దేవదాసు బలహీన వ్యక్తిత్వం కలిగినవాడనీ, చంచల స్వభావంగలవాడనీ, అసమర్థుడనీ, అతడి విషాదానికి ఆ లక్షణాలే కారణాలనీ, పార్వతిమాత్రం నిబ్బరంగా తట్టుకోగలిగిందనీ, ఆత్మాభిమానంగల స్త్రీ అనీ అనడం ఎంత వరకు న్యాయం? దేవదాసు కంటే ఆమె ఏ విధంగా ఉన్నతమైనది?

దేవదాసు తనను అసహ్యించుకున్నా 'ఆత్మాభిమానం' ప్రదర్శించక, పూర్తిగా ఆత్మార్పణం చేసుకుని, అతడికోసం తన వృత్తిని, సంపాదనను, సుఖాన్ని త్యాగం చేసి, అతడికి సేవ చేసి జన్మధన్యమయిందనుకున్న చంద్రముఖ యింకా ఎంత ఉన్నతవ్యక్తిత్వంగలది? వరించి వచ్చిన సౌందర్యవతిని మైకంలో సైతం తాకని దేవదాసు ఎంత గొప్పశీలవంతుడు? దేవదాసు చిన్నప్పుడు కోపం వస్తే పార్వతిని కొట్టేవాడు, తిట్టేవాడు. మళ్ళీ అంతలోనే తప్పును ఒప్పుకుని, ఆమెను సముదాయించేవాడు. తనమీద అతడికి ఎంత అభిమానమో ఆమెకు తెలుసు. అందుకే కదా ఆమెకెప్పుడూ అతని మీద కోపంరాలేదు. అప్పుడు లేని ఆత్మాభిమానం ఆమెకు అత్యంత ప్రమాదకర మైన, క్లిష్టమైన తరుణంలో ఎందుకొచ్చింది? తండ్రిని ఎదిరించమని అంతకు ముందు అతడికి సలహా యిచ్చిన ఆమె అతడు ఏదో తెగించడానికి సిద్ధపడి వచ్చినప్పుడు తను తన తండ్రిని ఎదిరించడానికి ఎందుకు సిద్ధపడలేక పోయింది? దేవదాసు జీవితం విషాదమయం కావడానికి ఆమె తొందరపాటుతనం, 'ఆత్మాభిమానం' కారణం కాదా? ఇవి ఇప్పటికి తొమ్మిది దశాబ్దాలుగా పాఠక, ప్రేక్షకలోకంలో చర్చించబడుతున్న అంశాలు. దేవదాసు, పార్వతి, చంద్రముఖి-ఈ మూడుపాత్రల మధ్యగల వైరుధ్యాల వల్లనే నవల అంతగా ఆకట్టుకొన్నది. ఆ నవలను, ఆ మూడు పాత్రలను మరచిపోవడానికి అవకాశం లేకుండా ప్రతి తరంలోనూ ఒక కొత్త సినిమాలో వారు దర్శనమిస్తూనే వున్నారు; పునర్జన్మిస్తున్నారు. దేవదాసు చిత్రాలేకాక, ఆ తరహా ప్రేమ కథా చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. పాఠకులు, ప్రేక్షకులు ఆ మూడు పాత్రలను మరచిపోవడం అసంభవం. వారి మనస్సులో ఆ ముగ్గురూ చిరంజీవులు.

Picture

ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ, గౌరవం వున్నా, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢమైన బంధం వున్నా సరియైన తరుణంలో సరియైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల, ఆత్మార్పణం ఉండాల్సిన చోట 'ఆత్మాభిమానం' వచ్చి కూర్చోవడం వల్ల ఏది జరగకూడదో అది జరుగుతుంది. పార్వతి, దేవదాసుల కథలో అదే జరిగింది.

దేవదాసు పిరికివాడు, సంఘానికి వెరచేవాడు అయితే చంద్రముఖి ఇంటికి తరచుగా ఎందుకు వెడతాడు? వేశ్యయింటికి పోవడం రసికత్వానికి చిహ్నంగా భావించి, మజా చేయడానికి వెళ్ళే జమీందార్లలాగా అతడు వెళ్ళలేదు. న్యూనతా భావంతో నెత్తిన చెంగేసుకుని, చీకట్లో రహస్యంగా వెళ్ళలేదు. తలఎత్తుకునే, బాహాటంగానే వెళ్ళినా చంద్రముఖిని తాకలేదు. తనను ఆమె తాకితే చీదరించుకున్నాడు. తాగిన మైకంలో కూడా అతడు ఆమెను ముట్టుకోనివ్వలేదు. పార్వతి తప్ప మరో స్త్రీ స్పర్శను అతను సహించలేకపోయాడు. పార్వతిని కూడా అతనెప్పుడూ కాముకదృష్టితో చూడలేదు. ఆమె తన భార్యకావాలన్న కోరికే అతడికి లేదు. అతడు అసాధారణ శీలవంతుడు, ధనకాంక్షలేని వాడు; చంద్రముఖి వృత్తిని అసహ్యించుకున్నాడు గాని వ్యక్తిగా ఆమె పట్ల అగౌరవం లేదు. స్వార్థబుద్ధిలేనివాడు. జేబులో డబ్బుంటే ఎంత అని చూసుకోకుండా యివ్వగలిగినవాడు. పిత్రార్జితం కూడా డబాయించి తీసుకోలేదు. తండ్రిపోయాక అంతా అన్నకే వదిలేసి తన తాగుడికి కొద్దిగా తెచ్చుకున్నాడు. చంద్రముఖికి కొంత డబ్బుయిచ్చాడు - ఆమె నుంచి ఏ సుఖం ఆశించకుండా. దాదాపు సన్యాసి లాగా బతికాడు.

తండ్రిపోయాక తనవాటాకు వచ్చిన డబ్బుతోనే అన్నదానం చేశాడు. తన జీవితాన్ని నరక ప్రాయం చేసిన తండ్రి మీద అతడికి ద్వేషం లేదు. తను బాధపడ్డాడు. బతకాలన్న కోరిక లేక, చనిపోవాలనే తాగాడు. అది తన ప్రాణం తీస్తుందని తెలిసే తాగాడు. తండ్రి మరణ శయ్యమీద వున్నా అతడు వెళ్ళలేదు. తాగుబోతుగా మారిన తన మొహం ఆయనకి చూపించడం ఇష్టం లేక వెళ్ళలేదు. ఏ కారణాల వల్ల అతడిని బలహీనుడని అంటున్నారు? ఒకవేళ బలహీనుడే ననుకున్నా ప్రపంచంలో బలహీనతలులేని వాళ్ళవరైనా వున్నారా?

తండ్రిని ఎదిరించలేకపోవడం బలహీనతా? ఎదిరించి పార్వతిని చేసుకుందామనుకునే సరికి కాలాతీతమైంది. పార్వతిని బలంగల పాత్ర అని ఎలా అన్నారు? దేవదాసే తన సర్వస్వం అనుకున్న పార్వతి, అతను లేకుండా తను జీవించలేననుకున్న పార్వతి నేను తల్లిదండ్రులను ఒప్పిస్తానని అతను అన్నప్పుడు ఎందుకు సరేననలేకపోయింది? అంతగాఢమైన ప్రేమలో 'ఆత్మాభిమానం' అనేది అడ్డం వస్తుందా? సర్వం అర్పించుకున్న ప్రేమా అది? ఆ కొద్ది నిమిషాలలో ఆమె అన్నమాటలు, ఆమె ప్రవర్తన ఇద్దరి జీవితాలను నరకం చేశాయి. తండ్రి నెదిరించలేని దేవదాసును పిరికివాడంటే, పార్వతి తన తండ్రిని ఎదిరించగలిగి వుండేదా? 'నేను చేసింది ఒకే ఒక్క తప్పు. దానికి ఇంత శిక్షా' అని దేవదాసు అంటున్నప్పుడు ప్రతి పాఠకుని, ప్రేక్షకుని గుండెతరుక్కు పోతుంది. ఆమె లేకుండా తను జీవించలేడు, ఆమెపై తప్ప మరెవరిపైనా తను ఆధారపడలేడు అనే సంగతి తెలుసుకోవడంలో ఆలస్యం జరిగింది. తెలుసుకునే సరికి ఆమె అహంకారంతో, ఆత్మాభిమానంతో బిగదీసుకుంది. పరిస్థితి చేయిజారిపోయాక ఇద్దరూ నిస్సహాయ స్థితిలో పడిపోయారు.

ప్రేమ వైఫల్యం పొందినా పార్వతి నిబ్బరంగా నిలబడగలిగింది. భర్త సంసారాన్ని చక్క దిద్దింది కాబట్టి ఆమె వ్యక్తిత్వం బలమైనదనీ, వైఫల్యాన్ని తట్టుకోలేకపోయాడు కాబట్టి ఇతడు బలహీనుడనీ చాలా మంది అంటుంటారు. పార్వతిలాగే ఇతడూ ఒక జమీందారు కూతుర్ని పెళ్ళి చేసుకుని, కలకత్తాలో బంగళా కొనుక్కుని (లోపల పార్వతి కోసం ఎంత బెంగ పడుతున్నప్పటికీ) నిబ్బరంగా కాపరం చేయగలిగితే అతడిని సమర్ధుడైన, 'బలవంతుడైన' కథానాయకుడుగా అంగీకరించేవారా? పార్వతి మరొక పురుషుని స్పర్శని భరించగలిగింది. దేవదాసు మరొక స్త్రీ స్పర్శను భరించలేకపోయాడు. మరొక స్త్రీతో సంబంధం అతడి ఊహలోకి కూడా రాలేదెప్పుడూ. తనను ప్రేమించి, తన కోసం వేశ్యా వృత్తిని మానుకుని, తనసేవకే జీవితాన్ని అంకితం చేసుకున్న చంద్రముఖి స్పర్శను తాగుడుమైకంలో సైతం భరించలేకపోయాడు. చంద్రముఖి నిస్వార్థ త్యాగాన్ని, నిష్కల్మషమైన ఆమె ప్రేమను అర్థం చేసుకున్నాక ఆమెపై అతడికి ఎంతో గౌరవం కలిగింది. అయినా, ఆమె పొందును కోరుకోలేదు. తన కోసం ఆదాయాన్ని వదులుకున్న ఆమెకు గౌరవంగా బతకడానికి డబ్బిచ్చాడు. అతడు బలహీనుడా? అతడు పండితుడు, మేధావి, మహా పురుషుడు కాడు. కాని అసాధారణ శీలవంతుడు. పల్లెటూరు నుంచి పట్నానికి పోయి, కాలేజీలో చదువుతూ, సూటూ, బూటూ వేసినా, దండిగా డబ్బున్నా, అడ్డుపెట్టే వాళ్ళెవరూ లేకపోయినా అతడికి చెడు అలవాట్లేవీ అబ్బలేదు - సిగరెట్టు తప్ప.

నండూరి పార్థసారథి
(2002 సెప్టెంబరు రచన)

Previous Post Next Post