Title Picture
ఎం.జి.ఆర్, పద్మిని

ఒక రాజుగారికి పబ్లిక్ గా ఒకరాణి, ప్రైవేటుగా మరొక రాణి ఉంటారు. మొదటి ఆవిడ హిందూస్త్రీ, పట్టమహిషి. రెండో ఆవిడ ముస్లిం స్త్రీ. ఇద్దరూ చెరొక మగపిల్లాణ్ణి కంటారు. ముస్లిం ఆవిడకి కొంచెం ముందు పుడతాడు. అతని పేరు దావూద్ ఖాన్. పట్టమనిషి కొడుకు పేరు దేసింగు. రాజుగారు ముస్లిం భార్యను, బిడ్డతోసహా దొడ్డిదారిని ఆడవికి పంపేస్తాడు. దేసింగు, దావూద్ పెరిగిపెద్దవారై యం.జి. రామచంద్రన్ అంతటి పరాక్రమవంతులవుతారు. అనేక పాటలు, యుద్ధాలు, కుట్రలతో కథ బోలెడు గడిచిన తర్వాత దావూద్ జన్మరహస్యం తెలుస్తుంది. తమ్ముడి మీద పగబడతాడు. దేసింగును చంపననీ, అతనికి తను అన్నననే విషయం చెప్పననీ ఒట్టు వేయించుకుని దావూద్ తల్లి చనిపోతుంది. అక్కడ రాజుగారు కూడా కాలం చేయడంతో దేసింగు రాజు అవుతాడు. తన స్థానాన్ని ఆక్రమించుకొన్న తమ్ముణ్ణి జయించడానికి దావూద్ బయలుదేరుతాడు. చివరికి క్లయిమాక్సు లాగా ఘోరమైన యుద్ధం జరిగి దావూద్ చనిపోతాడు. కయ్యాలు అన్నిటికీ కారకుడైన దమనకుడు వచ్చి 'దావూద్ నీ అన్నే సుమా' అని చెప్పి, దేసింగు చేత కత్తి పోటు తిని మరణిస్తాడు. భరతమాతను, రాజ్యాన్ని, చనిపోయిన సైనికులనూ, ప్రేక్షకులను, ఉద్దేశించి బారెడు స్వగతోపన్యాసం చేసి తను కూడా పొడుచుకుని చనిపోతాడు దేసింగు.

యం.జి.ఆర్. ఇందులో దేసింగు, దావూద్ పాత్రలను నిర్వహించాడు. ఆయన నటన కత్తి యుద్ధంలా ఉంది. ఆయన పట్ల ప్రత్యేక అభిమానంగల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక చూడాలి. యం.జి.ఆర్-భానుమతి జంట వేడుకగా ఉంది.

మిగతా నటీనటులు శాయశక్తులా కష్టపడ్డారు. కథ నిక్షేపం లాంటిది. తమిళం నుంచి అనువదించకుండా సరాసరి తెలుగులోనే నిర్మిస్తే ఎంత బాగుండిపోను అనిపిస్తుంది.

శ్రీ శ్రీగారి రచన చిత్రానికి తగ్గట్టుగానే ఉన్నది. సంగీతం యథోచితంగా ఉంది. ఈ చిత్రాన్ని విడుదల చేసిన శ్రీఫిలింస్ వారు పబ్లిసిటీలో సరిక్రొత్త ప్రయోగం చేశారు. అసలు ఈ కథ బుర్రకథగా ప్రసిద్ధి పొందినది కావడం వలన వారు విజయవాడలో కొన్ని చోట్ల ఈ బుర్రకథను చెప్పించారు. సినిమా కంటే బుర్రకథ చాలా బాగుందని కన్నవారు, విన్నవారు విశేషంగా మెచ్చుకొన్నారు.

నిర్మాత: పి.ఎన్.రెడ్డి; దర్శకుడు: టి.ఆర్.రఘునాథ్; డైలాగ్ డైరెక్షన్: ఎస్. శ్రీనివాసరావు; మాటలు, పాటలు: శ్రీ శ్రీ; సంగీతం: పామర్తి; ఛాయాగ్రహణం: రెహమాన్; తారాగణం: భానుమతి, పద్మిని, ఎం.జి.రామచంద్రన్, రాజేంద్రన్, తంగవేలు, ఎం.ఎన్.రాజం, రాగిణి, ఎన్.ఎస్.కృష్ణన్, టి.ఎ.మధురం వగైరా.

నండూరి పార్థసారథి
(1960 డిసెంబర్ 11వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post