Title Picture

ఇండియాలో మంచి డిటెక్టివ్ చిత్రం వెలువడడం విశేషమే. డిటెక్టివ్ చిత్రం తీయడానికి ప్రత్యేక ప్రతిభ అవసరం. ఈ మధ్య హిందీలో ఇటువంటి చిత్రాలు కొల్లలుగా వెలువడుతున్నాయి. వీటిలో నూటికి నాలుగైదు చిత్రాలయినా సంతృప్తికరమైనవి వెలువడడం లేదు. ఈ చిత్రాలలో నిజానికి సంగీతం, ఛాయాగ్రహణం చక్కగా ఉంటున్నాయి. కానీ వీటిలో తరచుగా కనుపించే పెద్దలోపం ఒకటుంది. ఈ చిత్రాలలో సస్పెన్సును పోషించడం సరిగా జరగడం లేదు. అనవసరమైన నృత్యాలతో, పాటలతో, హాస్యంతో ప్రేక్షకుల దృష్టిని కథ మీద నుంచి మళ్ళించి చికాకు కల్గిస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుల ఉత్కంఠస్థాయి దిగజారిపోతున్నది. సస్పెన్స్ ఖూనీ అయిపోతున్నది. ఈ చిత్రాల నిడివి ఇంకా బాగా తగ్గాలి.

భారతీయ చిత్రాల అవధిలో పరిశీలిస్తే పతంజల్ వారి 'వారంట్' చిత్రాన్ని మంచి డిటెక్టివ్ చిత్రాల కోవలోకి చేర్చవచ్చును. సస్పెన్స్ తో, హత్యతో ఈ చిత్రం ప్రాంభమవుతుంది. సస్పెన్సు హత్య కాకుండా చివరికంటా గొప్పగా పోషించుకుంటూ వచ్చాడు. హాస్యనటి టున్ టున్ కోసం కేటాయించిన కొద్ది సన్నివేశాలు మినహా కథాగమనానికి అవరోధం కల్పించే హంగులూ, హంగామాలు ఏమీ ఇందులో లేవు.

కేదార్ కపూర్ దర్శకత్వం ప్రశంసనీయంగా ఉంది. రోషన్ సంగీతం గొప్పగా ఉంది. ఉన్న ఆరు పాటలూ చాలా చక్కగా ఉన్నాయి. నేపథ్య సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. సాధారణంగా హిందీ డిటెక్టివ్ చిత్రాలు అన్నింటిలో వలెనే ఇందులో కూడా ఛాయాగ్రహణం చాలా బావుంది.

చక్కగా నటించడం అశోక్ కుమార్ కు సహజం. సహజంగానే నటించాడు ఆయన. ఈమధ్య చాలా చిత్రాలలో లాగానే ఇందులో కూడా షకీలా హాయిగా, సునాయాసంగా నటించింది. అంతకంటే ముఖ్యంగా ఆమె చాలా అందంగా ఉంది. హంతకుడుగా పతంజల్ చక్కగా నటించాడు.

నిర్మాత: పతంజల్; దర్శకత్వం: కేదార్ కపూర్; సంగీతం: రోషన్; ఛాయాగ్రహణం: ఎన్.ఎన్.శుక్లా; రచన: మసూద్ మషాదీ; పాటలు: ప్రేమ్ ధవన్, ఆనంద్ లక్ష్మీ; తారాగణం: అశోక్ కుమార్, షకీలా, పతంజల్, ధూమల్, రాజ్ మెహ్రా, మాస్టర్ ఆకాశ్ దీప్, టున్ టున్, హెలెన్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 జూన్ 25వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Next Post