క్లేవైలిన్

పాశ్చాత్య దేశాలలో ఇటీవల కాలంలో కొత్త వాద్యాలెన్నో వాడుకలోకి వచ్చాయి. ఇవి ఎక్కువగా విద్యుత్ శక్తితో పనిచేసే వాద్యాలు. ఎలెక్ట్రిక్ గిటార్, ఎలెక్ట్రిక్ ఎకార్డియన్, సోలోవాక్స్, యూనివాక్స్, పియానో ఎకార్డియన్, క్లేవైలిన్, ఫార్ఫీసా ఆర్గన్, మ్యూజీగన్, ట్రాన్సీ కార్డ్ - ఇవన్నీ ఆధునిక వాద్యాలే. ఇవి జాజ్, పాప్ మ్యూజిక్ లలో బాగా ప్రచారంలోకి వచ్చాయి గాని, శాస్త్రీయ సంగీతంలోకి చొరబడలేక పోయాయి. ఈ వాద్యాలన్నీ మన దేశానికి కూడా దిగుమతి అయినాయి. ఆనవాయితీ ప్రకారం ముందు బొంబాయికి వచ్చి, అక్కడి నుంచి మద్రాసుకు వచ్చాయి. హిందీ సినిమా సంగీతంలో ఈ వాద్యాలు విరివిగా ఉపయోగించబడుతున్నాయి. ఇవి లేకుండా ఈనాడు హిందీ సినిమా సంగీతం లేదనే చెప్పాలి. నేపథ్య సంగీతంలో - ముఖ్యంగా క్లైమాక్స్ లో - వీటి హడావిడి ఎక్కువగా ఉంటుంది.

ఎలెక్ట్రిక్ ఎకార్డియన్, పియానో ఎకార్డియన్

ఈ వాద్యాలపై హిందీ సినిమా పాటలు వాయించిన రికార్డులు చాలానే వచ్చాయి. వీటిలో బాగా ప్రచారంలోకి వచ్చిన వాద్యాలు ఎలెక్ట్రికల్ గిటార్, పియానో ఎకార్డియన్, యూనివాక్స్. వాన్ షిప్లే, హజారా సింగ్, సునీల్ గంగూలీల ఎలెక్ట్రిక్ గిటార్ రికార్డులు, ఎనోఖ్ డేనియల్, వి. బల్సారాల పియానో ఎకార్డియన్ రికార్డులు తరచుగా రేడియోలో వినిపిస్తూనే ఉంటాయి.

సోలోవాక్స్, యూనివాక్స్, ఫార్ఫీసా ఆర్గన్

యూనివాక్స్ ఒక్కటి పది వాద్యాల పెట్టు. ఈనాడు ఇది సినిమా నేపథ్య సంగీతానికి తప్పనిసరి వాద్యం. హార్మోనియం లాగా కనిపించే ఈ వాద్యంలో క్లారినెట్, శహనాయ్, నాదస్వరం, వేణువు, ఎకార్డియన్, మౌత్ ఆర్గన్ వంటి ఎన్నో రకాల వాద్యాల నాదాలను పలికించవచ్చును. వి. బల్సారా ఒక ఇ.పి. రికార్డు (7 EPE 1124)లో యూనివాక్స్ ను క్లారినెట్ లాగా, కాష్ఠతరంగ్ లాగా, వేణువులాగా, శహనాయ్ లాగా వాయించారు. బీహార్, గుజరాత్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల జానపద గీతాలను ఆయన వాయించారు. యూనివాక్స్ నాద వైవిధ్యం, వైచిత్ర్యం ఈ రికార్డులో తెలుస్తుంది. హార్మోనియం వలెకాక యూనివాక్స్ లో గమకాలు బాగా పలుకుతాయి. దీనిపై శాస్త్రీయ సంగీతం కూడా వాయించవచ్చు. ఆమధ్య బెంగుళూరులో ఒకాయన యూనివాక్స్ పై కర్ణాటక సంగీతం వినిపించారు.

సంగీత ప్రియులను ఆశ్చర్యపరచగల ఒక వార్త ఇటీవల పత్రికలలో వచ్చింది. కంప్యూటర్ పై సంగీతం వినిపించే పద్ధతిని కనుగొన్నట్లు కాన్పూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డాక్టర్ రామసుబ్రహ్మణ్యం ప్రకటించారు. కంప్యూటర్ పై కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం కూడా వినిపించగలమనీ, ఏ రాగం కావాలంటే ఆ రాగం వినిపించగలమనీ ఆయన చెప్పారు. వైలిన్, వేణువు, వీణ, మృదంగం, ఆర్గన్ శహనాయి... ఇంకా ఏ వాద్యం కావాలంటే ఆ వాద్యం వినిపిస్తుందట కంప్యూటర్. నిజంగా ఒక విద్వాంసుడు ఎదురుగా కూర్చుని వాయిస్తున్నంత సహజంగా ఉంటుందట ఆ సంగీతం. తిరువనంతపురంలో ఆ మధ్య జరిగిన కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నాల్గవ వార్షిక సమావేశంలో డాక్టర్ రామసుబ్రహ్మణ్యం, ఆయన తోటి ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.బి. థోసర్ కలిసి కంప్యూటర్ తో సంగీతం పాడించే పద్ధతిపై ఒక నివేదిక సమర్పించారట.

గ్లాస్ హార్ప్

ఎనిమిదేళ్ళ క్రిందట మన దేశానికి వచ్చిన పశ్చిమ జర్మనీకి చెందిన బ్రూనో హాఫ్ మన్ అనే ఆయన 'గ్లాస్ హార్ప్' అనే ఒక అతి విచిత్ర వాద్యంపై అచ్చమైన పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం వినిపించారు. మద్రాసులో మాక్స్ మ్యూలర్ భవన్ వారి ఆధ్వర్యాన ఆయన కచేరీ జరిగింది. ఆ వాద్యం ఆయన స్వయంగా సృష్టించింది. పశ్చిమ జర్మనీలో ఆయన శిష్యులు కొద్దిమంది తప్ప మరెవ్వరూ ఆ వాద్యం వాయించరు. ప్రపంచంలో మరెక్కడా అది వినిపించదు.

గ్లాస్ హార్ప్

'గ్లాస్ హార్ప్' స్వరూపం, నాదం, వాయించే తీరు అతి విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. దీనిని మరొక వాద్యంతో పోల్చి చెప్పడానికి వీల్లేదు. నలుచదరంగా ఉండే ఒక బల్లపై చట్రంలో నీళ్ళు పోసి ఉంటాయి. ఆ చట్రంలో మద్యపాత్రల వంటి గాజు పాత్రలు వరుసగా నిలబెట్టి ఉంటాయి. ఈ గ్లాసులు వివిధ పరిమాణాలలో ఉంటాయి. మొదటి వరసలో గ్లాసులు పెద్దవిగా, రెండో వరసలోవి కొంచెం చిన్నవిగా, మూడో వరసలోవి ఇంకా చిన్నవిగా-అలా క్రమంగా కొన్ని వరసలు పేర్చి ఉంటాయి. ఈ విషయంలో మాత్రం ఈ వాద్యాన్ని మన 'జలతరంగ్'తో పోల్చవచ్చు. అయితే జలతరంగ్ పాత్రలలో నీరు పోసినట్లుగా ఈ 'గ్లాస్ హార్ప్' పాత్రలలో నీరు పోయరు. ఇందులో నీరు గ్లాసుల అడుగున ఉన్న చట్రంలో పోస్తారు. వాద్య కారుడు తన రెండు చేతుల వ్రేళ్ళను నీళ్ళతో తడిచేసుకుని ఆ గ్లాసుల అంచులపై నెమ్మదిగా, సుతారంగా రుద్దుతూ ఉంటే అతి మధురమైన సంగీతం వినిపిస్తుంది. దాని నాదం అతి విచిత్రంగా, అద్భుతంగా ఉంటుంది. వైలిన్ నాదం, వేణునాదం సమపాళంలో మేళవించినట్లుగా, ఎంతో నాజూకుగా, ఏదో గంధర్వలోకం నుంచి లీలగా వినిపిస్తున్నట్లుగా ఉంటుంది. పక్కనే కూర్చుని వింటున్నా ఎన్నో యోజనాల దూరం నుంచి వినిపిస్తున్నట్లుగా, మరచిపోయిన మధుర స్వప్నాలను రహస్యంగా జ్ఞాపకం చేస్తున్నట్లుగా వినిపిస్తుంది. అంత అద్భుత సంగీతం కేవలం ఆ కాసిని గ్లాసుల లోంచి వస్తున్నదంటే నమ్మబుద్ధి కాదు.

గ్లాసుల అడుగున ఉన్న పీఠం-గ్లాసుల అంచులపై తడి వ్రేళ్ళతో రుద్దుతున్నప్పుడు కలిగే ధ్వనిని ప్రతిధ్వనించేదిగా ఉంటుంది. గ్లాసుల పరిమాణంలో మాదిరిగానే వాటి మందంలోకూడా తేడా ఉంటుంది. మందంగా, పెద్దవిగా ఉండే గ్లాసులు మంద్రస్థాయిలో ధ్వనిస్తాయి. పలుచగా, చిన్నవిగా ఉండే గ్లాసులు తార స్థాయిలో, మధ్య రకానివి మధ్య స్థాయిలో ధ్వనిస్తాయి. కచేరీ ప్రారంభించే ముందు వాద్యకారుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలట. వ్రేళ్ళకు తడి ఆరిపోయినప్పుడల్లా మళ్ళీ శుభ్రమైన నీటితోనే కడుక్కోవాలట.

ఒక గ్లాసు ఒకానొక స్వరాన్ని పలికించాలంటే దాని పరిమాణం ఎంత ఉండాలి, మందం ఎంత ఉండాలి అనేది నిర్ణయించడానికి, అంత నిర్దుష్టమైన స్వరాలను పలికించే గ్లాసులను దుకాణాలలో వెతికి సంపాదించడానికి బ్రూనోహాఫ్ మన్ కు ఆరు సంవత్సరాలు పట్టిందట. చివరకి ఆయన శ్రమ ఫలించి, సంగీత ప్రపంచానికి ఒక అమూల్యమైన కానుక లభించింది. పశ్చిమ జర్మనీలో ఆయన ఈ వాద్యాన్ని కొంత ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఒక చిన్న పాఠశాలను స్థాపించి కొందరికి ఈ వాద్యం నేర్పుతున్నారు. దీనికి ప్రచారం లభించడంతో కొన్ని సంస్థలు ఇప్పుడు దీని కోసం ప్రత్యేకంగా గ్లాసులు తయారుచేస్తున్నాయి. ఆయన అనేక దేశాలలో పర్యటించి. కచేరీలు చేసి, సంగీత ప్రియుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. 'సోలో' కచేరీలు మాత్రమే కాక, వాద్య బృందంతో కూడా దీనిని వాయించారు.

బ్రూనో హాఫ్ మన్

ఈ వాద్యం పూర్తిగా శాస్త్రీయ సంగీతానికి అంకితమైన వాద్యం. మూడున్నర స్థాయిలు దీనిపై వాయించవచ్చు. పూర్వం యూరప్ లో 'గ్లాస్ హార్మోనికా' అనే పేరుతో ఇటువంటి వాద్యం ఒకటి ప్రచారంలో ఉండేది. గ్లాస్ హార్మోనికా కోసం మోజార్డ్, బీతోవెన్ వంటి మహా విద్వాంసులు ప్రత్యేకంగా కొన్ని కాన్ చెటోలు రచించారు కూడా. 18వ శతాబ్దాంతం వరకు గ్లాస్ హార్మోనికాకు కచేరీలలో గొప్ప స్థానం ఉండేది. ఆ తర్వాత కొందరు దానిని గురించి కొన్ని ఆక్షేపణలు లేవదీశారు. ఆ వాద్యం మానసిక ఆరోగ్యానికి మంచిది కాదనీ, మెదడులోని నరాలమీద దుష్ర్పభావం కలిగిస్తుందనీ కొందరు ప్రచారం చేశారు. ఈ ప్రచారం వల్లనో, మరే కారణాల వల్లనో గ్లాస్ హార్మోనికాను వెలివేశారు.

దాదాపు 150 సంవత్సరాల తర్వాత బ్రూనోహాఫ్ మన్ మళ్ళీ దానిని స్వీకరించి, దానిలో మార్పులు చేసి, కొత్త రూపం ఇచ్చి, 'గ్లాస్ హార్ప్' అనే కొత్త పేరు పెట్టారు. మద్రాసులో జరిగిన కచేరీలో ఆయన మొదట యూరప్ లోని అన్ని దేశాల జానపద సంగీత రీతులను మచ్చుతునకలుగా వినిపించారు. తర్వాత మోజార్డ్, బీతోవెన్, బాఖ్ మున్నగు ప్రసిద్ధ విద్వాంసుల రచనలను వాయించారు.

నండూరి పార్థసారథి
(1974 మే 31వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post