Title Picture
ప్రసాద్ ఆర్టు పిక్చర్స్ వారి రజతోత్సవ చిత్రం 'ఇల్లరికం' ఆధారంగా ప్రసాద్ ప్రొడక్షన్సువారు నిర్మించిన 'ససురాల్' చిత్రం ఉత్తర హిందూస్థానంలో దిగ్విజయయాత్ర జరిపి, పెక్కు కేంద్రాలలో శత దినోత్సవాలు, రజతోత్సవాలు చేయించుకొని, ఈ నెల 13వ తేదీన ఆంధ్రదేశంలో విడుదల అయింది. 'ఇల్లరికం' చిత్రాన్ని చూసిన అశేష ప్రజానీకానికి ఈ చిత్రాన్ని గురించి వేరే చెప్పనక్కరలేదు. ఆ చిత్రానికి సరిగా నకలుగా ఉంది ఈ చిత్రం. రజతోత్సవ చిత్రమనే యోగ్యతాపత్రం చేతపట్టుకొని వచ్చింది కనుక ఇది వినోద ప్రధాన చిత్రం అవునా కాదా అని తటపటాయించవలసిన పని లేదు. బాక్సాఫీసు హంగులు ఎన్ని ఉంటే ఇంత విజయాన్ని సాధించగలిగిందో మనం అంచనా వేసుకో వచ్చు. ఈ చిత్రం ఆంధ్రదేశంలో ఇంత ఆలస్యంగా 'అడుగు పెట్టడానికి కారణం ఉంది. తెలుగు ప్రేక్షకులు 'ఇల్లరికం' చిత్రాన్ని ఎంత ఎక్కువగా మరచిపోతే అంత ఎక్కువగా ఈ చిత్రానికి డబ్బులు వస్తాయి.

ఈ చిత్రాన్ని చూసేవారందరూ, అడుగడుగునా తెలుగు చిత్రంతో పోల్చుకుంటూ చూడడం తథ్యం. అందువల్ల ఒకింత ఆశాభంగం కలగడం కూడా కద్దు. హిందీ చిత్రంలోని ఏ నటుడూ, ఏ నటి కూడా తెలుగు చిత్రంలోని ఏ నటునికంటె, నటికంటె మెరుగుగా నటించలేదు. హిందీలో రాజేంద్రకుమార్, సరోజాదేవి కంటే తెలుగులో నాగేశ్వరరావు, జమున తప్పనిసరిగా బాగా నటించారు. తెలుగులో రేలంగి నటన చూసినవారికి హిందీలో మహమూద్ నటన చాలా చప్పగా ఉంటుంది. కొత్తగా పైకి వస్తున్న నటుని సహజధోరణిలో అతను ప్రేక్షకుల అభిమానం కోసం అతిగా నటించి, వృధాశ్రమ పడ్డాడు. తెలుగులో సి.యస్.ఆర్. నటించిన పాత్ర హిందీలో వికృత రూపం దాల్చింది. ఆ పాత్రను ఒప్పించడం సి.యస్.ఆర్ కే చెల్లుననిపించింది. రమణా రెడ్డి ధరించిన పాత్రను ధూమల్ చక్కగా నిర్వహించాడు.

సంగీతం శంకర్ జై కిషన్ ల నుంచి ఆశించతగినంత స్థాయిలో లేకపోయినా, తెలుగు చిత్రంలో కంటే తప్పనిసరిగా బాగుంది. ఛాయాగ్రహణం ఇత్యాది అంశాలు విశేషంగా ఏమీ లేవు. రచన తెలుగు స్క్రిప్టుకు అక్షరాక్షర అనువాదంలా ఉంది. నిడివి 14 వేల అడుగులపైచిల్లర ఉంది (తెలుగు చిత్రం కంటే చాలా తక్కువ). మూడు గంటల పొద్దును కులాసాగా గడపదలుచుకున్న ప్రతివారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చును.

నండూరి పార్థసారథి
(1961 అక్టోబరు 22వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post