Title Picture

'సుబ్బణ్ణ' రచయిత శ్రీమాస్తి వేంకటేశ అయ్యంగార్ పరిచయం

'సుబ్బణ్ణ' నవలా రచయిత కీర్తి శేషులు శ్రీ మాస్తి వేంకటేశ అయ్యంగార్ సుప్రసిద్ధ కన్నడ రచయితలలో ఒకరు. దేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారంగా పరిగణన పొందిన 'జ్ఞానపీఠ' అవార్డును అందుకున్న నాల్గవ కన్నడ రచయిత ఆయన.

కన్నడ సాహిత్య ప్రియులు 'మాస్తి కన్నడ భాష ఆస్తి' అనేవారు.

ఆయన 'శ్రీనివాస' అనే కలం పేరుతో రచనలు చేసేవారు. మైసూరు మహారాజు నల్వదికృష్ణరాజ ఒడయరు 'రాజసేవాసక్త' అనే బిరుదుతో ఆయనను సత్కరించారు.

మాస్తిగారు ప్రధానంగా కథానికల రచయితగా ఖ్యాతిపొందారు.

1891 జూన్ 6వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని కోలారు జిల్లాలో మాలూరు తాలూకాలోని హొసహళ్ళి గ్రామంలో ఆయన జన్మించారు. 1986 జూన్ 6వ తేదీన 95 యేళ్ళ వయస్సులో బెంగళూరు నగరంలో మరణించారు. ఆయన జన్మించిన తేదీ మరణించిన తేదీ కూడా జూన్ 6వ తేదీయే.

మాస్తి గారు తన జీవితంలోని 70 సంవత్సరాల కాలంలో కన్నడ భాషలో 123 గ్రంథాలు, ఇంగ్లీషులో 17 పుస్తకాలు రచించారు. 1983లో 'చిక్కవీరరాజేంద్ర' అనే గ్రంథానికి గాను ఆయనకు 'జ్ఞానపీఠ' అవార్డు లభించింది. కొడగు ప్రాంతపు చివరి రాజా వారి గురించిన కథ అది.

మాస్తి గారి మాతృభాష తమిళం. తమిళం మాట్లాడే శ్రీ వైష్ణవ కుటుంబంలో ఆయన జన్మించారు. కాని తమిళంలో ఒక్కరచన కూడా చేయలేదు. ఆయన కుటుంబం ఎక్కువ కాలం మాస్తి గ్రామంలో నివసించడం వల్ల 'మాస్తి' వారుగా ఖ్యాతి పొందారు.

ఆయన ఇంగ్లీషు సాహిత్యంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. మైసూరు మహారాజా వారి పరిపాలనా కాలంలో ఇండియన్ సివిల్ సర్వీసులో చేరిన తర్వాత (అప్పట్లో దాన్ని మైసూరు సివిల్ సర్వీసు అనేవారు) కర్ణాటకలోని పెక్కు ప్రదేశాలలో పనిచేసి జిల్లా కమిషనర్ స్థాయికి ఎదిగారు. 26 యేళ్ళు వివిధ హోదాలలో పనిచేసి 1943లో జిల్లా కమిషనర్ హోదాలో ఉండగా రాజీనామా ఇచ్చారు. తనకంటే జూనియర్ అయిన ఒక వ్యక్తిని ప్రమోట్ చేసి మంత్రి పదవితో సమానమైన హోదా ఇవ్వడంతో నిరసన వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా ఇచ్చారు.

మొదట కొంతకాలం ఇంగ్లీషులో రచనలు చేశాక తర్వాత కన్నడ భాషలో 'శ్రీనివాస' కలం పేరుతో రచనలు చేశారు. కన్నడంలో మాస్తి వారి తొలి రచన 'రంగనమదువె'; చివరి రచన 'మాతుగర రామణ్ణ'. 'కెలవు సన్నకతెగళు' (కొన్ని చిన్న కథలు) అనే పుస్తకం కన్నడ భాషలో ఒక ముఖ్య గ్రంథం. తాత్విక, కళాత్మక, సామాజిక విషయాలపై ఆయన పెక్కు కవితలు రచించారు.

1944 నుంచి 1965 వరకు 'జీవన' అనే ఒక మాసపత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. 1993 నుంచి కర్ణాటకలోని సుప్రసిద్ధ రచయితలకు 'మాస్తి వేంకటేశ అయ్యంగార్ అవార్డు' ఇవ్వబడుతున్నది. ఆయన నివాసం బెంగళూరు నగరంలోని బసవనగుడి ప్రాంతంలో. కోలారు జిల్లాలోని మాలూరు తాలూకాలో గల 'మాస్తి' గ్రామంలో ఆయన స్వగృహాన్ని లైబ్రరీగా మార్చి కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అక్కడకు దగ్గరలోనే ఆయన స్మృత్యర్థం మాస్తి రెసిడెన్షియల్ స్కూలును 2006-07లో ప్రారంభించారు.

'సుబ్బణ్ణ' గురించి మాస్తి

'సుబ్బణ్ణ' నవలా? కథా? చిన్ననవల అనీ, పెద్ద కథ అనీ అనుకోవచ్చు. ఈ రచన చదివిన వారికి ఇది 'కథ' కాదనీ, 'చరిత్ర' అనీ అనిపిస్తుంది. 'అది కొంత, ఇది కొంత' అని కూడా కొందరికి అనిపిస్తుంది. 'సుబ్బణ్ణ' అనే వ్యక్తి-ఈ రచనలో ఉన్నమాదిరి ఒక వైలిన్ విద్వాంసుడు-నిజంగానే ఉన్నాడనీ, అయితే అతడితో తనకు ప్రత్యక్ష పరిచయం లేదనీ, అతడిని గురించి పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత తెలిసిన కొందరు - కొన్ని సందర్భాలలో, కొద్ది కొద్దిగా చెప్పిన విషయాలను ఒక వరసలో పేర్చుకొని, వాటిలో విశ్వసనీయంగా కనిపించిన వాటిని ఒక కథగా మలచుకున్నట్లు మాస్తి గారు చెప్పారు. "సుబ్బణ్ణకు భార్య ఉందని గాని, ఆమె పేరు లలిత అని గాని నాకు ఎవరూ చెప్పలేదు. సుబ్బణ్ణ సంసార జీవితం గురించి కూడా ఎవరూ ఏమీ చెప్పలేదు. కాని నేను ఈ కథలో ఒక ముఖ్యపాత్రగా ఆమెను ప్రవేశపెట్టాను. ఆమె ఒక అసాధారణ సంస్కారం గల వ్యక్తి. సుబ్బణ్ణ వంటి గొప్ప కళాకారునికి అటువంటి భార్య ఉండటం సహజంగా ఉంటుందని నాకు అనిపించింది. ఈ నవల వెలువడిన తర్వాత పాఠకులు ఆమెను ఒక కల్పిత పాత్రగా కాక నిజమైన - గొప్ప వ్యక్తిత్వం కలిగిన- భార్యగానే గుర్తించారు" అని మాస్తి గారు తన మాటగా చెప్పారు.

'సుబ్బణ్ణ' తొలి ముద్రణ 1928లో వెలువడింది. తెలుగులో అనువాదానికి నా చేతికి అందినది పదిహేనవ ముద్రణ. అది 1979లో వెలువడింది. ఆ తర్వాత ఎన్ని ముద్రణలు వెలువడినాయో నాకు తెలియదు. మాస్తి గారు ఆ నవలను స్వయంగా 1943 వ సంవత్సరంలో ఇంగ్లీషులోకి అనువదించారు. దాన్ని 'శ్రీనివాస' అనే కలం పేరుతో కాక 'మాస్తి వేంకటేశ అయ్యంగార్' అనే పేరుతోనే అనువదించారు.

'సుబ్బణ్ణ'తో నా అనుబంధం

జర్మలిస్టుగా 'ఆంధ్రప్రభ'లో నేను పనిచేసిన సుమారు 37 సంవత్సరాలలో ఆ పత్రిక బెంగళూరు ఎడిషన్ లో మొదటి విడత 11 సంవత్సరాలు, రెండో విడత నాలుగేళ్ళు - మొత్తం 15 యేళ్ళు పనిచేశాను. 'విధానవీధి'లోని ఎక్స్ ప్రెస్ బిల్డింగ్ లో 'ఇండియన్ ఎక్స్ ప్రెస్', 'కన్నడ ప్రభ' దినపత్రికలతో పాటు 'ఆంధ్రప్రభ' దినపత్రిక కూడా ఉండేది. ఒకే అంతస్తులో ఈ మూడు పత్రికల ఎడిటోరియల్ డిపార్ట్ మెంట్లు పక్క పక్కనే ఉండేవి. నేను రోజూ ఆంధ్రప్రభ, ఎక్స్ ప్రెస్ లతోపాటు 'కన్నడ ప్రభ' కూడా చదువుతూ ఉండేవాడని. మొదటి సారి 11 సంవత్సరాలు సబ్ ఎడిటర్ గా, రెండో సారి 1984 నుంచి 1988 దాకా న్యూస్ ఎడిటర్ గా పనిచేశాను. కన్నడం ధారాళంగా మాట్లాడలేకపోయినా, చదివి చక్కగా అర్థం చేసుకోగలిగేవాడిని. 1986 లోనో, 1987లోనో ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ నుంచి అప్పటి మా ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు బెంగళూరు వచ్చారు. సుమారుగా ఆ కాలంలోనే మాస్తి గారు పోయారు. "ఆయన రచనల్లో ఏదైనా ఒక దానిని తెలుగులోకి అనువదించి మన ఆదివారం అనుబంధంలో సీరియల్ గా ప్రచురించుకుంటే బాగుంటుంది కదా... ఒక్కసారి వారి ఇంటికి వెళ్ళి అనుమతి తీసుకుందామా" అని పొత్తూరి గారు అన్నారు. నిజమే.... బాగుంటుందని నాకూ అనిపించింది. అడ్రస్ కనుక్కుని బసవనగుడి ప్రాంతంలోని మాస్తి వారి ఇంటికి వెళ్ళాము. మాస్తి వారికి కొడుకులు లేరు. ఆయన వ్యవహారాలన్నీ కూతురు, అల్లుడు చూస్తున్నారు. మేము వారిని పరిచయం చేసుకుని మా ఉద్దేశం తెలియజేశాము. వారు చాలా సంతోషించి 'సుబ్బణ్ణ' నవలను మా చేతుల్లో పెట్టారు.

"ఇది ఒక గొప్ప సంగీత విద్వాంసుని కరుణామయ జీవిత గాధ. తెలుగు సాహితీ ప్రియులకు తప్పకుండా నచ్చే కథ" అంటూ 'సుబ్బణ్ణ' పుస్తకాన్ని వారు మా చేతుల్లో పెట్టారు. వారి ఇంట్లో నుంచి బైటకు వచ్చేశాక-వారి నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఆ మాటే మా ఎడిటర్ గారితో అన్నాను.

"వారు ఎంతో ఆదరంతో అనువాదం హక్కులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ లిఖితపూర్వకంగా హక్కు అడగడం దేనికండీ. పైగా ఇది అరవయ్యేళ్ళనాటి నవల" అన్నారు ఎడిటర్ గారు.

అయితే ఎవరి చేత అనువాదం చేయించాలి అనే ప్రశ్న ఉత్పన్నమయింది. "మీకు అభ్యంతరం లేకపోతే నేను అనువాదం చేస్తాను" అన్నాను.

"మీకు కన్నడం వచ్చునా?" అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"ధారాళంగా మాట్లాడలేకపోయినా చదివి చక్కగా అర్థం చేసుకోగలను" అని చెప్పాను.

"మీరే చేయగలిగితే అంతకంటే కావలసిందేముంది? వెంటనే మొదలు పెట్టండి" అన్నారు ఎడిటర్ గారు.

అనువాదానికి కొన్ని నెలలు పట్టింది. ప్రచురణ కోసం రచనను హైదరాబాద్ పంపించాను. ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో సీరియల్ గా మూడు వారాలు ప్రచురితం కాగానే దానికి అభ్యంతరం తెలుపుతూ మద్రాసు నుంచి మా ఎడిటర్ గారికి ఒక లేఖ చేరింది. అది రాసిన ఆయన పేరు ఎర్రమిల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. "మాస్తి వారి అనుమతి పొంది 1958లోనే మేము ఆ నవలను పుస్తక రూపంలో ప్రచురించి విడుదల చేశాము. ఇప్పుడు మళ్ళీ మీరు మరొకరితో అనువాదం చేయించి ఎలా ప్రచురిస్తారు?" అని శాస్త్రిగారు రాశారు.

నా అనువాదం అలా అర్థాంతరంగా ఆగిపోయింది. ఎడిటర్ గారు నాకు 'సారీ' చెప్పారు. నా అనువాద రచన ప్రచురణ అలా ఆగిపోయింది. 1958లోనే ఆ పుస్తకం ప్రచురితమైన సంగతి నాకు తెలియదు.

1958లో నేను హైదరాబాద్ లో బి.ఏ. చదువుతున్నాను. నా మొదటి కథ 1957లో ఆంధ్రప్రభలో ప్రచురితమయింది. అప్పట్లో ప్రభ వీక్లీలో నా కథలు నాలుగైదు ప్రచురితమైనాయి. వీక్లీ బాధ్యతలు విద్వాన్ విశ్వంగారు నిర్వహిస్తూ ఉండేవారు. నా కథలను ప్రచురణకు స్వీకరిస్తున్నట్లు ఆయన నుంచి ఉత్తరాలు వచ్చేవి. 1959 డిసెంబరు నుంచి నేనూ ఆంధ్రప్రభ ఉద్యోగినయ్యాను. విద్వాన్ విశ్వంగారు నాకంటే ఇరవయ్యేళ్ళో, పాతికేళ్ళో పెద్దవారు. నేనంటే ఆయనకు చాలా అభిమానం. కాని 'సుబ్బణ్ణ' పుస్తకాన్ని తాను అనువదించిన సంగతి ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆ పుస్తకాన్ని 'సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్' (SLBT) అనే సంస్థ సహకారంతో విద్యాసాగర్ కార్పొరేషన్ (మద్రాసు) వారు ప్రచురించారు. ఎర్రమిల్లి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఆ సంస్థను నిర్వహించే వారనుకుంటాను. ఇప్పుడు ఆయన, విద్వాన్ విశ్వంగారు కూడా లేరు. అసంపూర్తిగా ప్రచురితమైన నా అనువాద రచన ఇప్పుడు 'త్రవ్వకాలలో' బయల్పడింది. శాస్త్రిగారి కుమారుడు రామకృష్ణగారు ఈ మధ్య ఫోన్ సంభాషణ ద్వారా నాకు పరిచయమయ్యారు. 'ఆ పుస్తకం కాపీరైట్ మా దగ్గరే ఉంది. మీరు నిరభ్యంతరంగా మీ అనువాద రచనను ప్రచురించుకోవచ్చును' అని ఆయన ఎంతో ఆదరంతో అనుమతి ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇదీ 'సుబ్బణ్ణ' అనువాద రచన చరిత్ర.

నండూరి పార్థసారథి
(January 01, 2022)

Previous Post