Title Picture

రచయిత పరిచయం

books1
జననం 24, ఏప్రిల్ 1927. స్వస్థలం కృష్ణాజిల్లా ఆరుగొలను. హైస్కూలు చదువు నూజివీడు, బందరు. కాలేజి చదువు రాజమండ్రి. 1948 జనవరి నుంచి 1960 జూన్ వరకు 'ఆంధ్రపత్రిక'; ఆనాటి నుంచి 'ఆంధ్రజ్యోతి'; 1976 నుంచి 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక సంపాదకత్వం; రచనలు : 'మార్కట్వేన్' ('టామ్ సాయర్', 'హకల్ బెరీఫిన్', 'రాజూ-పేద', 'విచిత్రవ్యక్తి', 'టామ్ సాయర్ ప్రపంచయాత్ర') నవలలకు, ఆర్.ఎల్. స్టీవెన్ సన్ ('కాంచనద్వీపం') నవలకు, ఆస్కార్ వైల్డ్ ('బాలరాజు') కథలకు అనువాదాలు; 'సవ్యసాచి' పేరుతో రాజకీయ వ్యంగ్య గేయాలు; 'హరివిల్లు' ('బాలగేయాలు'); 'కథాగేయ సుధానిధి' (ఈసప్ కథలు); విశ్వాత్ముల నరసింహమూర్తి 'మిత్రలాభం-మిత్రభేదం' బొమ్మల కథలకు, బాపు 'అసంప్రేక్ష్యకారిత్వం' బొమ్మల కథకు గేయ రచన; 'చిలక చెప్పిన రహస్యం' (జానపద కథ); 'ఉషస్విని' (కవితా సంపుటి); 'అక్షరయాత్ర' - సాహిత్య వ్యాసాలు; ఖగోళ భౌతిక శాస్త్రరచన 'విశ్వరూపం'; మానవ పరిణామ శాస్త్ర గ్రంథం 'నరావతారం'; సంపాదకీయ సంకలనాలు : 'అనుపల్లవి', 'చిరంజీవులు', 'విశ్వదర్శనం' - పాశ్చాత్య తత్వ చింతన; 'విశ్వదర్శనం' - భారతీయ చింతన.
ఇవన్నీ కాక-ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో సీరియల్ నవలలుగా ప్రచురింపబడి ఇప్పటి వరకు పుస్తక రూపంలో అచ్చుకాని ఇంకొన్ని అనువాద రచనలు : 'శనిదేవత రథచక్రాలు' (మూలం: నికొలాయ్ గొగోల్); 'మార్టిన్ రాట్లర్' (ఇంగ్లీషు మూలం: ఆర్.ఎమ్.బాలన్ టైన్); 'అరుణవలయం' (మూలం: ఎడ్గార్ వాలెస్).
ఇన్ని రచనలు చేసినా ఎందుకనో ఆయన ఆత్మకథ రాసుకోవాలని అనుకోలేదు. డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారు మొహమాటపెట్టడం వల్లనో ఎందుకో చాలా టూకీగా ఆత్మకథ రాశారు-2004 సంవత్సరంలో. అదే ఈ రచన.
-నం.పా.సా
books2

ఆత్మకథ

నాకు ఇది వివాహ షష్టిపూర్తి సంవత్సరం. 1944లో నా వివాహం జరిగింది. కట్నాలులేవు. అప్పుడు నాకు పదిహేడు సంవత్సరాలు. ఆమెకు పది సంవత్సరాలు. ఇప్పుడు నాకు 'పదకొండేళ్ళు' (11x7) అని తమాషాగా అంటూ ఉంటాను. మేనరికం పెళ్ళి చేసుకొన్నాను. ఆ రోజుల్లో దగ్గర సంబంధాలే ఎక్కువ. ఇంటి పనులు, పిల్లల పెంపకం అన్నీ నా భార్యే చూసుకొంటుంది. నా విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోదు.

మాది చాలా సంపన్న కుటుంబం. నండూరి శివరావు అని మా పెదనాన్న గొప్ప పేరున్న డాక్టరు. ఆయన ఎవరికో హామీ (షూరిటీ) ఉన్నారు. చివరికి ఆ అప్పు తీర్చే బాధ్యత మా మీదపడింది. అప్పుడు ఉమ్మడి ఆస్తి, ఉమ్మడి కుటుంబం. నలభైవేల రూపాయలు చెల్లించవలసి వచ్చింది. దాంతో అప్పుల పాలయ్యాం. అప్పుడు ఎకరం రెండొందలు, మూడొందల రూపాయలే. మా కుటుంబం చితికింది. మా పెదనాన్న ఆ బాధతో దిగాలు చెంది మరణించాడు. మా నాన్నగారికి పదిమంది సంతానం - ఆరుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు.

జనరల్ గా బ్రాహ్మణుల్లో సోమరితనం ఎక్కువ. పొలాలు ఉండేవి కానీ కౌలుకి ఇచ్చేవారు. వాళ్ళు పంట సరిగా ఇచ్చేవారు కాదు. పైగా భోజన ప్రియత్వం, ఆతిథ్యం ఎక్కువ. తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయంటారు గదా! అలా సంపన్న బ్రాహ్మణ కుటుంబాలు చాలా విచ్ఛిన్నమయ్యాయి.

ఉమ్మడి కుటుంబాలు (జాయింట్ ఫ్యామిలీస్) నా ఉద్దేశంలో చాలా దండగమారి వ్యవస్థ. ఆ వ్యవస్థ పోవటమే మంచిది. ఆర్థికంగా చిక్కులుంటాయి. ఆడ, మగ మధ్య మరీ ఎక్కువ. విడి కుటుంబాలే మంచివి.

నూజివీడు, బందరు హైస్కూళ్ళలో చదివాను. వెంపటి రామయ్య గారనే హెడ్ మాస్టరుండేవాడు. చాలా స్ట్రిక్ట్. అంటే - క్రమశిక్షణ గొప్పది. ఆ డిసిప్లిన్ నాకు నచ్చేది.

నాకు మునిమాణిక్యం నరసింహారావు గారు మేష్టారు. హిస్టరీ చెప్పేవారు. జోకులు వేస్తూ హాయిగా బాగా చెప్పేవారు. కాంతం కథలు చెప్పమనే వాళ్ళం. అప్పుడాయన History అంటే His story తప్ప Her story కాదు అనేవారు. ఒకసారి క్లాసులో మునిమాణిక్యం 'ఆర్యులు ఏమి తినేవారు'? అని ప్రశ్నించారు. అందరూ బియ్యం, గోధుమలు... ఇలా చెప్పారు. మునిమాణిక్యం గారికి గోళ్ళు కొరుక్కొనే అలవాటుంది. ఒకతను 'ఆర్యులు గోళ్ళు తినేవారు' అన్నాడు. అప్పుడు మేష్టర్లకి 'నిక్ నేమ్'లు పెట్టడం వుండేది. ఒక మేష్టారి పేరు దశిక పురుషోత్తం గారు. ఆయన్ని 'డి.పి.' అనేవాళ్ళం. అంటే 'ధర్మపిండం'. బుట్టాయి పేటలో ఒకే ఇంట్లో పైన మునిమాణిక్యం గారు, క్రింద నేనూ ఉండేవాళ్ళం. అదొక అనుభూతి.

రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివాను. అప్పుడే కవిత్వం రాయటం మొదలు పెట్టాను. అది భావకవిత్వం. భావకవిత్వం రాయటం ఆ రోజుల్లో ఫ్యాషన్. దేవులపల్లి ప్రభావం అది! నాకెందుకో గోదావరి అంటే ఇష్టం. గోదావరిని చూస్తే కవిత్వం పుడుతుంది-పుట్టింది. గోదావరితీరంలో శ్రద్ధానంద ఘాట్ అని ఉండేది. అక్కడ కవితా గోష్ఠి చేసేవాళ్ళం. రాజమండ్రిలో ఉండగానే 'విజ్ఞానం' అనే లిఖిత పత్రిక నడిపాం.

1943లో రాజమండ్రిలో - ఆర్యాపురంలో - నవభారత్ గురుకులం వుండేది. అక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్కి జరిగిన సన్మానం 'నభూతో నభవిష్యతి' అనాల్సిందే. మూడు రోజుల పాటు జరిగిన ఆ ఉత్సవం మరపురానిది.

ఆర్థికంగా పై చదువులు చదవలేక ఉద్యోగాన్వేషణలో పడ్డాను. విజయవాడలో జైహింద్ టాకీస్ వద్ద 'జన్మభూమి' అనే డైలీ పత్రిక ఉండేది. అందులో సబ్ ఎడిటర్ గా నెలన్నర చేశాను. ఎం.ఎస్. శర్మ గారు మద్రాసులో ఆంధ్రపత్రికలో పనిచేసేవారు. ఆయన ప్రయత్నం వల్ల నేను మద్రాసు వెళ్ళి శంభు ప్రసాద్ గారిని కలిశాను. 'తర్వాత చూద్దాం' అన్నారు. తర్వాత శంభుప్రసాద్ గారి నుంచి ఆంధ్రపత్రికలో జాయినవ్వమని లేఖ వచ్చింది 1948 జనవరి ఒకటో తేదీన. వెళ్ళి జాయినయ్యాను. పన్నెండున్నర సంవత్సరాలు ఆంధ్రపత్రికలో పనిచేశాను. ఆంధ్రపత్రిక ఆఫీసు సాహిత్యానికి 'మీటింగ్ పాయింట్'గా ఉండేది. 'భారతి' అక్కడే కదా! అందుకని ఆంధ్ర నుంచి వచ్చిన కవులు, పండితులు, రచయితలు తప్పనిసరిగా ఆంధ్రపత్రిక ఆఫీస్ కి వచ్చేవారు. ఆంధ్రపత్రికలో అప్పుడు మంచి సాహిత్య వాతావరణం వుండేది.

నార్ల వెంకటేశ్వరరావు గారి ఆహ్వానంపై ఆంధ్రజ్యోతిలో 1960 జూలైలో చేరాను. అప్పటి నుంచి 1994 దాకా పని చేశాను. ఒక పక్క ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూనే మరో పక్క 'జ్యోతి' మాస పత్రికలో పనిచేసే వాణ్ణి. వి.వి. రాఘవయ్య, బాపు, రమణ, వి.ఎ.కె. రంగారావు, రావి కొండలరావు, నేను పనిచేశాం. ఎక్కువగా నేను చూసేవాణ్ణి. దానికి రాఘవయ్య గారు నెలకి నాలుగు వందలు జీతం (1963లో) ఇచ్చేవారు. నార్ల వారితో చెప్పే జేరాను. ఆర్థికంగా, సాహితి పరంగా 'జ్యోతి' మాస పత్రిక బాగుండేది.

ఒకసారి 'జ్యోతి' మాసపత్రికలో భార్యా, భర్తకి సంబంధించిన ఒక సెక్స్ ఆర్టికల్ వేయాల్సి వచ్చింది. వేశాను. ఇది నార్లవారి దృష్టికి వెళ్ళింది. ఆయన పూర్తిగా సెక్స్ వార్తలకి, కబుర్లకి వ్యతిరేకి. ఆయన పిలిచి 'ఏదో ఒక పత్రికే ఎంచుకో' అన్నారు. నేను 'జ్యోతి'లోనే వుంటాను. ఆంధ్రజ్యోతి వదిలేస్తాను అన్నాను. ఎందుకంటే నాకు బాపు, రమణల స్నేహమే ముఖ్యం. తర్వాత నార్ల వారు మళ్ళీ రెండింటిలోనూ పనిచేసుకోమన్నారు. 'జ్యోతి' మాసపత్రికలోనే మొదటి సారిగా యద్దనపూడి సులోచనరాణి 'సెక్రటరీ', 'విజేత' నవలలు సీరియల్స్ గా వచ్చి పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత రాఘవయ్య గారి అన్యవ్యాపకాల వల్ల ఆ పత్రిక సరిగ్గా నడవలేదు. ఆయన భార్య కొన్నాళ్ళు నడిపారు.

నార్ల వెంకటేశ్వర రావు గారు గొప్ప మనిషి. ఆయనే ఒక గ్రంథాలయం. ఆయన ఇంట్లో వున్న లైబ్రరీ చూస్తే మహాశ్చర్యం వేస్తుంది. కొన్నివేల పుస్తకాలుండేవి. ప్రపంచంలోని ముఖ్యమైన సాహిత్యం అంతా ఉండేది. పుస్తక సేకరణలో, పఠనంలో ఆయనకి ఆయనే సాటి. ఆయన దగ్గర నేనూ చాలానే నేర్చుకొన్నాను. ఆంధ్రజ్యోతి వార పత్రికలో నా చేత 'విశ్వరూపం' రాయించింది నార్లవారే.

నార్ల వారితో విభేధం అంటే... ఒక్కసారే వచ్చింది. ఒక రోజు రాత్రి డ్యూటీ నాకు వేశారు. సంజీవయ్య కొత్త మంత్రివర్గం ఏర్పాటు వార్త రావాలి. టెలిఫోన్ లో ఆ వార్త రావాలి. అది వచ్చేదాకా ఉండమని చెప్పి నార్ల వెళ్ళిపోయారు. ఎందుకంటే అది చాలా ముఖ్యమైన వార్త. అన్ని పేపర్లలోనూ వచ్చి మన పేపర్లో రాకపోతే ఎలా? అందుకని ఆ పని నాకు అప్పజెప్పారు. తెల్లవారు ఝాము రెండు గంటలవరకు మేల్కొన్నాను. వార్తరాలేదు. బాగా నిద్రపట్టేసింది. మర్నాడు చూస్తే మంత్రివర్గ విస్తరణ వార్త అన్ని పేపర్లలో వచ్చింది. మా పేపర్లో రాలేదు. నార్ల వారు కోపంతో ''ఒక బాధ్యత అప్పగిస్తే ఇలాగేనా చెయ్యడం, సరిగ్గా చెయ్యవద్దా "I have half a mind to sack you" అని ఉద్యోగం నుంచి తీసెయ్యాలనుకొంటున్నాను అన్నారు. నాకూ బాధనిపించింది. కోపమూ వచ్చింది. వెంటనే రాజీనామా లేఖని పంపించాను. నార్ల వారు లోపలికి పిలిపించి 'నీ రాజీనామా లేఖ చింపేస్తున్నాను. కోపంతో అన్నాను కానీ తీసేస్తానని కాదు' అన్నారు. అలా ఆంధ్రజ్యోతిలోనే ఉండిపోయాను.

ఇంకొక గొప్ప అనుభవం ఏమిటంటే... ఆంధ్రపత్రికలో ఉండగా పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు ఉండేవారు. ఆయన 'ఒక రచయిత' అనే మారు పేరుతో 1955లో శ్రీ శ్రీ కి వ్యతిరేకంగా వరసగా రాశారు. శ్రీ శ్రీ మాస్కో మానసపుత్రుడని, ఇంకా ఏవేవో రాశారు. నేను శ్రీ శ్రీ భక్తుడ్ని (నాకు మంచి మిత్రుడు). నేను శ్రీ శ్రీ పక్షాన నాగేశ్వరరావు గారికి వ్యతిరేకంగా 'ఒకానొక రచయిత' అనే పేరుతో సమాధానం రాశాను. నాగేశ్వరరావు గారు పిలిచి 'ఈ పత్రికలో పనిచేస్తూ అలా ఎందుకు రాశావు' అని కోప్పడ్డారు. 'మీరు వేస్తే వేయండి. లేకపోతే విశాలాంధ్రకి ఇస్తాను' అన్నాను. శంభుప్రసాద్ గారు ఇంటికి పిలిపించి 'మన పేపరులో నువ్వు అలా రాయడమేమిటి? నేను నిన్ను ఆప్యాయంగా పిలిచి ఉద్యోగం ఇస్తే ఇలా చేస్తావా' అన్నారు. అప్పుడు నేను మళ్ళీ 'రాజీనామా చేస్తాను' అన్నాను. ఆయన 'వద్దులే, ఇక్కడే వుండు' అన్నారు. మొత్తానికి నా సమాధానం పత్రికలో వేశారు.

ఉద్యోగం పోతే ఎలా? అనే ప్రశ్న పుట్టేది కాదు. అప్పుడు నా వ్యక్తిత్వం అలా వుండేది. ఎలాగో బతకగలం అని వుండేది. ఆంక్షలు మనకి అడ్డుకాకూడదని.

ఆంధ్రప్రభ పత్రికా సంపాదకులుగా పనిచేసిన కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం నాకు క్లాస్ మేట్. రూమ్ మేట్ కూడా. బాగా చదివేవారు. రాజకీయాలలో ఉత్సాహం ఎక్కువ. మద్దూరి అన్నపూర్ణయ్య గారి శిష్యులు. పైకి సామాన్యంగా కనిపించినా ఎంతో ప్రజ్ఞగల వారు.

కాలేజ్ లో చదువుకొనే రోజుల్లోనే సంగీతం అంటే బాగా ఇష్టంగా ఉండేది. పాటలు పాడేవాడ్ని. బాగుందని అనేవారు. సంగీతం నేర్చుకోలేదు. నన్ను కొందరు 'ఆంధ్రపంకజ్' అనేవారు. కొంతమంది 'ఆంధ్రా సైగల్' అనీ అనేవారు. సినిమాలు బాగా చూసేవాణ్ణి. అశోక్ కుమార్, ముంతాజ్ శాంతి నటించిన 'కిస్మత్' హిందీ సినిమా నేనూ కూచిమంచి సుబ్రహ్మణ్యం కలిసి ఇరవై నాలుగుసార్లు చూశాం. రాజమండ్రి 'అమృత్' టాకీస్ లో అని గుర్తు. ఆ సినిమా అంటే పిచ్చి. అప్పుడు ఇంటి నుంచి నెలకి పద్ధెనిమిది రూపాయలు ఎం.ఒ. వచ్చేది. వాడ్రేవు వారి సత్రంలో వుండేవాళ్ళం. వాడ్రేవు వారి స్కాలర్ షిప్ కూడా వచ్చేది.

ఆ రోజుల్లో యాజమాన్యం జోక్యం పత్రికలలో పెద్దగా వుండేది కాదు. యాజమాన్యానికి రాజకీయాలతో సంబంధం వున్నా పత్రికా నిర్వహణలో సంపాదకుడికి స్వేచ్ఛ వుండేది. ఎందుకు రాశావని కానీ, ఇలాగే రాయాలని కానీ ఎప్పుడూ అనలేదు. వార్తల విషయంలో, రచన విషయంలో పూర్తిగా స్వేచ్ఛ వుండేది. ఆర్థికపరమైన అంశాలలో తప్ప పత్రికలు 'ఇండిపెండెంట్'గానే నడిచేవి. ఎన్.టి. రామారావుపై విభేదిస్తూ సంపాదకీయాలు రాసేవాణ్ణి. కానీ రామారావుగారు బర్తరఫ్ అయినప్పుడు 'అప్రజాస్వామిక చర్య' అని సంపాదకీయం రాశాను. మళ్ళీ ముఖ్యమంత్రిగా నియమించాలన్నాను. ఇది సంచలనం కలిగించింది. కానీ యాజమాన్యం జోక్యం చేసుకోలేదు. రాజకీయాల ప్రభావం పత్రికలపై లేదనే చెప్పాలి. పత్రికలు నిర్భయంగా ఉండేవి.

మద్రాసులో వుండగా ఆంధ్రపత్రిక వీక్లీకి కొడవటిగంటి కుటుంబరావు గారు నా చేత అనువాదాలు చేయించేవారు. మార్క్ ట్వైన్ నవలలు 'రాజూపేద' వగైరా అలా రాసినవే. 'సవ్యసాచి' అనే పేరుతో రాజకీయ గేయాలు రాయించారు. అంత్య ప్రాసలతో రాశాను. పందిరి మల్లికార్జునరావు గారి 'కిన్నెర' పత్రికా కార్యాలయంలో శ్రీ శ్రీ, ఆరుద్ర, జరుక్ శాస్త్రి, పిలకా గణపతి శాస్త్రి, గిడుగు సీతాపతి మొదలైన వారంతా కలిసే వాళ్ళు. అలాగే చెన్నపురి ఆంధ్ర మహాసభలకి అంతా వచ్చేవారు. ఆ రోజుల్లో మద్రాసులో సాహిత్య వాతావరణం బాగా వుండేది. కవుల్లో, రచయితల్లో వర్గ భేదాలుండేవి కావు. ఏ భావజాలానికి చెందినా అందరూ వచ్చేవారు. అడివి బాపిరాజు, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం - ఇలా ఎందరో వచ్చేవారు. సాహిత్య గోష్ఠులు బాగా జరిగేవి.

1962లో మొట్టమొదటగా అమెరికా వెళ్ళాను. సంపాదకులైన నార్ల వారికి ఆహ్వానం వస్తే ఆయన నన్ను వెళ్ళమన్నారు. అప్పుడు వైట్ హౌస్ కి వెళ్ళి కెనెడీని కలిసి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత మొరార్జీ ప్రధానిగా వాజ్ పేయి విదేశాంగ మంత్రిగా ఉండగా వాళ్ళతో వెళ్ళాను. నాలుగో సారి 'ఆటా' వాళ్ళు పిలిచి సత్కరించినప్పుడు వెళ్ళాను. 1982లో రష్యా వెళ్ళాను. యూరోపియన్ దేశాలూ వెళ్ళాను. నా అభిప్రాయం ఏమిటంటే ఆ దేశాలు గొప్పవి. అక్కడ ఉన్న క్రమశిక్షణ మనకి లేదు. వాళ్ళు క్రమశిక్షణ వల్ల, పనితనం వల్ల గొప్ప వాళ్ళయ్యారు. సోమరితనం కనిపించదు. బిచ్చగాళ్ళు కనిపించరు (ఒక్క న్యూయార్క్ లో తప్ప).

సాహిత్య రంగంలోనే ఉండి జీవించటం మనకి కష్టం. అంటే మరో ఉద్యోగం వుండాలి. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రచనవల్ల బతకలేడు. ఇంగ్లాండ్ లో అయితే ఒక రచయిత పుస్తక రచన ద్వారా ఉదరపోషణ చేసుకోగలడు - అంటే జీవించగలడు.

కొడవటిగంటి కుటుంబరావు గారి వల్ల నేను కమ్యూనిజం వైపు ఆకర్షింపబడ్డాను. మార్క్సిస్టు సాహిత్యం విపరీతంగా కొనేవాడిని, చదివేవాడిని. 1948-56 మధ్య మార్క్సిజం నాకు అభిమాన సాహిత్యమైంది.

ముళ్ళపూడి వెంకటరమణ గారు నా బావగారు. మా మూడో చెల్లెల్ని ఆయనకిచ్చాము. 1964 జనవరి 26న పెళ్ళి జరిగింది. మా వూరు ఆరుగొలనులో (కృష్ణాజిల్లా). ఆ పెళ్ళికి శ్రీ శ్రీ, కొ.కు., ఆరుద్ర, దాశరథి మొదలైనవాళ్ళంతా వచ్చారు.

మరపురాని సంఘటన - ఒకటి జరిగింది. ఇంట్లో చెప్పకుండా 1945 డిసెంబరు నెలలో హృషీకేశ్ వెళ్ళిపోయాను. అక్కడ స్వామి శివానంద ఆశ్రమం 'ఆనంద కుటీర్'కి వెళ్ళాను. ఆధ్యాత్మిక అన్వేషణతో వెళ్ళాను. అప్పటికే వివేకానంద, రామకృష్ణ పరమహంస పుస్తకాలు, భగవద్గీత, ఉపనిషత్తులు బాగా చదివేశాను. స్వామి శివానంద పుస్తకాలు కూడా చదివాను. అక్కడ ఆరు నెలలున్నాను. 1946 మే నెలలో హృషీకేశ్ నుంచి కొందరు యాత్రికులతో కలిసి ఘాట్ రోడ్ పై పాదయాత్ర చేస్తూ ఉత్తరకాశీ మీదుగా గంగోత్తరి (గంగోత్రి) చూడాలని బయలుదేరాను. 150 మైళ్ళు సుమారు పదిరోజులు నడిచి ఉత్తరకాశీ దాటిపోతుండగా ఒక సాయంత్రం పెద్ద వడగళ్ళ వాన, గాలి దుమారంతో ఆ రాత్రి కటిక చీకటిలో ఘాట్ రోడ్ పైనే గడిపాను. ఒక వైపు కొండ, మరో వైపు అగాథం. మర్నాడు ఒంటరిగా తిరుగుముఖం పట్టి హృషీకేశ్ చేరుకొన్నాను. అదొక పెద్ద సాహసయాత్ర. అడుగడుగునా ప్రాణాపాయంతో చెలగాటమే! హృషీకేశానికి గుడ్ బై చెప్పి 1946 జూన్ 16కి బెజవాడ చేరుకొని రాజమండ్రిలో బి.ఎ. రెండవ సంవత్సరం చదువుకొనసాగించాను.

హృషీకేశం నుంచి వచ్చాక కొన్నాళ్ళు అస్తినాస్తి విచికిత్సలో పడ్డాను. 1948 జనవరి 30న గాంధీజీ హత్యతో పూర్తిగా నాస్తికత్వంలోకి మారాను. ఇప్పటికీ నాది నాస్తిక మార్గమే. మా ఆవిడ మాత్రం ఆస్తికురాలే. ఆవిణ్ణి మార్చటానికి ప్రయత్నించాను. కానీ ఆమె అంగీకరించలేదు. నా భావాలను బలవంతంగా ఎవరిపైనా రుద్దడం ఇష్టం లేదు.

నండూరి రామమోహనరావు
(2004)

Previous Post Next Post