డాక్టర్ బాలమురళీకృష్ణ

ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, శ్రీరామవిలాససభల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16, 17, 18 తేదీలలో చిత్తూరులో జరిగిన రాష్ట్ర సంగీతోత్సవం నిర్విఘ్నంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా జరిగింది. కనుక-జయప్రదమైనదనే చెప్పవచ్చు. ఉత్సవానికి హాజరైన స్థానిక సంగీత ప్రియులకు, బైట నుంచి వచ్చిన వారికి ఆ మూడు రోజులూ చాలా సంతోషంగా గడచిపోయాయి. శ్రీరామవిలాససభ వారి నిర్వహణ సామర్థ్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ముఖ్యంగా వారి అతిథి మర్యాద మరపురానిది. ఆయితే, దీర్ఘకాలిక దృష్టితో చూస్తే చిత్తూరు సంగీతోత్సవానికి గల విలువ ఏ పాటిది, రాష్ట్రంలో సంగీత కళా వికాసానికి ఇది ఎంతగా దోహదం చేస్తుంది-అని ప్రశ్నించుకుంటే ఆశాభంగమే కలుగుతుంది. రాష్ట్ర సంగీతనాటకఅకాడమీ డాక్టర్ బాలమురళీకృష్ణ వంటి మహావిద్వాంసుని అధ్యక్షతన రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ఉత్సవం అనగానే సంగీత ప్రియులు సహజంగా-కచేరీల విషయంలో గాని, సదస్సుల విషయంలో గాని-ఎంతో ఉన్నత ప్రమాణాలను ఆశిస్తారు. ఆశించిన దానిలో సగమైనా ఈ ఉత్సవం అందించలేకపోయింది. ఉత్సవానికి హాజరైన వారందరూ మనవాళ్లే కాబట్టి సరిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి అనుభవజ్ఞులైన పెద్దలెవరైనా వచ్చివుంటే 'మీ రాష్ట్రంలో ఇంతకంటే గొప్ప విద్వాంసులు లేరా' అని ఆక్షేపించి ఉండేవారు. ఉత్సవంలో కచేరీలు చేసిన వారిలో డాక్టర్ బాలమురళీకృష్ణ, శ్రీమతి టి.టి. సీత మాత్రమే అగ్రశ్రేణి కళాకారులు. వారి కచేరీలు మాత్రమే అకాడమీ ప్రతిష్ఠకు తగిన స్థాయిలో ఉన్నాయి.

మనకు ఇంకా ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, షేక్ చిన మౌలానాసాహెబ్, డాక్టర్ పినాకపాణి, ఓలేటి వెంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి వంటి అగ్రశ్రేణి కళాకారులున్నారు. వారెవరూ ఈ ఉత్సవంలో పాల్గొనకపోవడానికి కారణం ఏమిటి? వారు లేకుండా ఇది 'రాష్ట్రస్థాయి' ఉత్సవం ఎలా అవుతుంది? ద్వితీయ శ్రేణి కళాకారులకు కూడా స్థానం కల్పించ వలసిందే. అయితే వారికి అవకాశం కల్పించడం కోసం అగ్రశ్రేణి వారిని రప్పించకుండా, ఉత్సవస్థాయిని తగ్గించడం సమంజసం కాదు. రోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 లేక 12 గంటల వరకు, వరసగా ఇద్దరు ద్వితీయ శ్రేణి కళాకారులకు, ఇద్దరు ప్రథమ శ్రేణి కళాకారులకు అవకాశం ఇవ్వవచ్చును. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు వ్యాసపఠన, సోదాహరణ ప్రసంగాలను నిర్వహించవచ్చును. మద్రాసు మ్యూజిక్ అకాడమీ అనుసరిస్తున్న పద్ధతి ఇదే.

మ్యూజిక్ అకాడమీ మహాసభలతో పోల్చుకుంటే ఈ చిత్తూరు సంగీతోత్సవం ఒక లెక్కలోకి రాదు. మన సంగీత నాటక అకాడమీ లోగడ ఎన్నో ఉత్సవాలను నిర్వహించినప్పటికీ, ఆ అనుభవసారమేమీ ఈ ఉత్సవ నిర్వహణలో కనపడలేదు. ఏటా ఎన్నో ఉత్సవాలను, సదస్సులను నిర్వహించవలసి ఉన్నప్పుడు వాటికి ఒక కచ్చితమైన పథకం అంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఈసారి ఎలాగో అయిపోతే చాలు అనుకోకుండా దీర్ఘకాలిక పథకం సిద్ధం చేసుకోవడం అవసరం.

అకాడమీ వారు కల్పించిన అవకాశం మేరకు డాక్టర్ బాల మురళీకృష్ణ తన అధ్యక్ష విధులను అత్యంత సమర్థంగా, హుందాగా నిర్వహించారు. ఆయన అధ్యక్షోపన్యాసం, సదస్సులలో మధ్య మధ్య ఆయన చేసిన వ్యాఖ్యానాలు, ఆయన సంగీత కచేరీ, ఆయనకు జరిగిన సన్మానం, బిరుద ప్రదానం-ఇవే ఈ సంగీతోత్సవంలో చెప్పుకోదగిన అంశాలు. అవి లేకపోతే ఈ ఉత్సవంలో మిగిలే సారమేమీ ఉండదు.

అధ్యక్షోపన్యాసం

డాక్టర్ బాలమురళీకృష్ణ అధ్యక్షోపన్యాసంలోనే తన విశిష్టతను వ్యక్తం చేశారు. చాలామంది విద్వాంసులకు పాట పాడడమే తప్ప, మాటలాడడం చేతకాదు. డాక్టర్ బాలమురళీ పాటలే కాక, మాటలు కూడా నేర్చినవాడు. ఆయన గాయకుడే కాక, తెలుగు, తమిళ, సంస్కృత భాషలలో కృతులు, కీర్తనలు, జావళీలు, పదాలు, తిల్లానాలు వెలయించిన ఉద్దండవాగ్గేయ కారుడు. ఆ వైదుష్యం ఆయన ప్రసంగాలలో వ్యక్తమౌతుంది. ఆయన అధ్యక్షోపన్యాసంలో సంగీత ప్రియులు పదేపదే మననం చేసుకోదగిన వాక్యాలున్నాయి.

"సంగీతం జనరంజకంగా ఉండాలి. ఏవరో కొద్ది మందికి మాత్రం బాగుండేది సంగీతం కాదు. సంగీతానికి ప్రధానమైన అంశాలలో గీతం ఒకటి. ఒక రచనను అర్థం చేసుకొని పాడవలసియున్నది. రచనను అర్థం చేసుకోవాలంటే సాహిత్యాన్ని తెలుసుకోవాలి. సంగీతం కోసం సాహిత్యాన్ని, సాహిత్యం కోసం సంగీతాన్ని త్యాగం చేయరాదు. సంగీతం అంటే కేవలం పాట కచేరీలు చేయడానికి మాత్రమే ఉపయోగపడే సాధనం కాదు. కచేరీలలో వినే సంగీతం పరిపూర్ణమైనది కాదు... నవరసాలతో కూడిన సంగీతం కేవలం స్వానుభవైకవేద్యం... సంప్రదాయం నిత్యనూతనమైనది, అభివృద్ధికి మార్గదర్శి. సంకుచితమైనది, అభివృద్ధి నిరోధకమైనది సంప్రదాయం అనడం తప్పు..." ఇవి ఆయన అద్యక్షోపన్యాసంలోని కొన్ని అమూల్య వాక్యాలు.

లలితకళలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖను కల్పించాలని ఆయన సూచించారు. ఇప్పుడు విద్యా, సాంస్కృతిక వ్యవహారాల శాఖ అని ఒకటి ఉంది. సాంస్కృతిక వ్యవహారం విభాగం లలిత కళలకు సంబంధించినదే. అయితే, దానికి ప్రత్యేక డైరెక్టరేట్ లేదు. ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది.

"ఆంధ్రప్రదేశ్ కు ఒక ఆస్థాన సంగీత విద్వాంసుని నియమించాలని గూడా మళ్లీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తున్నాను" అనే వాక్యాన్ని డాక్టర్ బాలమురళి తన అధ్యక్షోపన్యాసంలో చేర్చకుండా ఉండవలసింది. ఆ విజ్ఞాపన మరెవరైనా చేస్తే బాగుండేది.

సదస్సులు

ఉత్సవం రెండవ రోజున, మూడవ రోజున 3 గంటల నుంచి 5.30 గంటల వరకు సదస్సులు జరిగాయి. 17వ తేదీ సదస్సులో అకాడమీ కార్యదర్శి శ్రీ కె.వి. సుబ్బారావు 'సంగీతం-లయ-తాళం' అనే వ్యాసం చదివారు. సంగీతానికి శ్రుతి తల్లివంటిది, లయ తండ్రి వంటిది అని చెబుతూ, భారతీయ సంగీత శాస్త్రంలో తాళానికి గల ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. తగినంత వ్యవధి లేని కారణంగా ఆయన తన వ్యాసంలో పెక్కు భాగాలను వదిలివేశారు.

శ్రీ ఇ.ఎన్. పురుషోత్తం 'త్యాగరాజ కీర్తనలలో శృంగార రసం' అనే ఇంగ్లీషు వ్యాసం చదివారు. త్యాగరాజు రచనలలో శృంగార రసం చిప్పిలే కొన్ని భాగాలను ఆయన ఉదాహరించారు.

మృదంగ విద్వాంసుడు, 'మృదంగ బోధిని' గ్రంథ రచయిత అయిన శ్రీ మహదేవు రాధాకృష్ణ రాజు 'ప్రక్కవాద్యం నాడు-నేడు' అనే వ్యాసం చదువుతూ, ఉదాహరణలు చూపించడానికై మృదంగ శబ్దాలను అతి శ్రావ్యంగా నోటితో పలికి శ్రోతలను ముగ్దులను చేశారు. యాభై సంవత్సరాల క్రిందటి కంటే ఇప్పుడు మృదంగ వాద్య వాదన ప్రావీణ్యం పెరిగిందనీ, వేగం, విన్యాస వైచిత్ర్యం పెరిగాయనీ, ఇది వరకటి కంటే ఇప్పుడు కచేరీలలో మృదంగానికి ఎక్కువ అవకాశమిస్తున్నారనీ ఆయన అన్నారు. పల్లవి, అనుపల్లవి, చరణాలను గురించి శ్రీ ఎస్. ఆర్. జానకి రామన్ ప్రసంగించారు.

19వ తేదీ సదస్సులో శ్రీ ద్వారం భావనారాయణరావు 'త్యాగరాజ సంగీత రచనా వైచిత్రి' గురించి వ్యాసం చదివారు. త్యాగరాజు ప్రతి పదాన్ని అతి జాగ్రత్తగా, సున్నితంగా తూకంవేసి పరీక్షించి ప్రయోగించారనీ, సాహిత్యంలోని భావాన్ని స్వరరచన ద్వారా వ్యక్తం చేయడంలో త్యాగరాజు కంటే గొప్పగా కృతకృత్యులైన వారు లేరనీ ఆయన అన్నారు.

'కర్ణాటక సంగీతం-గమకమర్యాద' అనే విషయంపై శ్రీ కె. చంద్రమౌళి వ్యాసం చదివారు. అన్ని రాగాలలో అన్ని గమకాలూ యిమడవనీ, కొన్ని రాగాలకు కొన్ని గమకాలు మాత్రమే నప్పుతాయనీ, ఆ ఔచిత్యాన్ని తెలుసుకొని గానం చేయాలనీ ఆయన చెప్పారు. ఆరోహణలో, అవరోహణలో ఒకే స్వరాలు గల రాగాలు కొన్ని ఉన్నాయనీ, కేవలం గమకాలను బట్టి అవి భేదిస్తున్నాయనీ, అందుచేత అట్టి రాగాల స్వరూపాన్ని నిర్దుష్టంగా ఆవిష్కరించాలంటే గమక మర్యాదను జాగ్రత్తగా పాటించడం అవసరమనీ ఆయన అన్నారు.

'కర్ణాటక సంగీతం-దాని అభివృద్ధి' అనే వ్యాసాన్ని శ్రీ కె. కృష్ణమూర్తి చదివారు.

భారతీయ సంగీతం కర్ణాటక, హిందూస్థానీ సంప్రదాయాలుగా విడిపోవడం గురించి, వాటి మధ్యగల పోలికలను గురించి, భేదాలను గురించి శ్రీ ఎం.ఎన్. పద్మారావు ప్రసంగించారు. తర్వాత ఆయన హిందూస్థానీ 'శైలి'లో వేణువుపై 'మాల్కౌస్' రాగం వాయించారు.

మొత్తం మీద సదస్సులలో అంతగా సారం కనిపించలేదు. వ్యాసాలలోని విషయాలకంటే, వాటిపై వ్యాఖ్యానిస్తూ డాక్టర్ బాలమురళీ మధ్య మధ్య చెప్పిన విషయాలే ఆసక్తి దాయకంగా ఉన్నాయి. ఉదాహరణకు గమక మర్యాద గురించి ఆయన ఇలా అన్నారు :

"కర్ణాటక సంగీతం పాడే వారిలో చాలా మందికి గమక మర్యాద తెలియదు. గమకం లేకపోతే అసలు కర్ణాటక సంగీతమే లేదంటున్నారు. కొందరు గమకాలు ఎంత ఎక్కువగా దొర్లితే అంత గొప్ప అనుకుంటున్నారు. మరికొందరు-ఏ రాగానికి ఎటువంటి గమకాలు సముచితమైనవో తెలుసుకోకుండా విచక్షణా రహితంగా గమకాలను 'ఇడియాప్పం'లాగా చుట్టలు చుట్టలుగా చుట్టి, మొదలు చివర తెలియకుండా, రాగ స్వరూపం బోధపడకుండా పాడుతున్నారు. కర్ణాటక సంగీతం పట్ల ప్రజలకు ఆసక్తి తగ్గిపోయిందంటే, సినిమా సంగీతం పట్ల ఆసక్తి పెరిగిందంటే అందుకు బాధ్యులు గాయకులే. అందులో ప్రజల తప్పేమీ లేదు. 72 మేళకర్తలను క్షుణ్ణంగా నేర్చుకోకుండా, వాటి గమకాల ఔచిత్యాన్ని తెలుసుకోకుండా వేదిక ఎక్కకూడదు. హిందూస్థానీ సంగీతం దినదినాభివృద్ధి చెందుతున్నది. వారు శ్రుతిశుద్ధంగా పాడుతున్నారు. గమక మర్యాదను పాటిస్తున్నారు. వారు ఒక రాగం పాడుతుంటే ఇంకో రాగం లాగా ఉండదు. శ్రుతి మధురంగా పాడితే హిందూస్థానీ బాణిలో పాడుతున్నామనీ, భావయుక్తంగా పాడితే లలిత సంగీతం పాడుతున్నామనీ, మన వాళ్ళు విమర్సిస్తూ ఉంటారు. ఇవి అర్థం లేని విమర్శలు".

వివాదిరాగాలను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన, అసలు 'వివాది' అనే మాటకు మనవాళ్లు చెబుతున్న అర్థమే తప్పు అనీ, వివాది అనేది దోషం కానే కాదనీ, 'వి' అనే అక్షరాన్ని విశేష వాచకంగా గ్రహించాలనీ చెప్పారు.

72 మేళకర్తల పథకాన్ని ప్రప్రథమంగా వేంకటమఖి ప్రవేశపెట్టారన్న అభిప్రాయం సరికాదనీ, వ్యాసుడే దానిని ప్రవేశపెట్టినట్లు ఇటీవల పరిశోధనల వల్ల వెల్లడి అయిందనీ ఆయన చెప్పారు.

సదస్సులలో కొందరి ప్రసంగాల తీరు చూస్తే అసలు ఏ ప్రాతిపదికపై వారిని ఎన్నిక చేశారనే సందేహం వస్తుంది. ప్రసంగం చేసే అవకాశమిస్తే అధిక ప్రసంగం చేసేవారు కొందరుంటారు. కాలాతీతమైనదని కాగితం వ్రాసియిస్తే దాన్ని కన్నెత్తి చూడకుండా అనర్గళోపన్యాసం యిస్తారు కొందరు. ఈ అధిక ప్రసంగాలతో తర్వాత కార్యక్రమం అస్తవ్యస్తమవుతుంది. అందుచేత కార్యక్రమాన్ని సిద్ధం చేసేటప్పుడే అట్టి సుదీర్ఘోపన్యాసాలకు ఆస్కారం లేకుండా చూడాలి.

సదస్సులలో పాల్గొనే అవకాశం యోగ్యతగల ప్రతి వ్యక్తికీ లభించాలి. కొన్ని నెలల ముందుగా పత్రికా ముఖంగా ప్రకటించిన వ్యాసాలను ఆహ్వానించాలి. అత్యుత్తమమైన వాటిని ఎన్నికచేసి, సదస్సులలో వాటిని చదివే అవకాశం కల్పించాలి. ఆ వ్యాస రచయితలకు తగు పారితోషికం ఇవ్వాలి. ఆ వ్యాసాలను అకాడమీవారు తర్వాత పుస్తకరూపంలో ప్రచురించాలి.

వ్యాసాలకు ఈ క్రింది లక్షణాలలో ఏదో ఒకటైనా ఉండడం అవసరం :

(1) ప్రాచీన గ్రంథాలలో, శాసనాలలో నిక్షిప్తమైన, ఇంతకాలం మన దృష్టిలోకి రాకుండా ఉండిపోయిన విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చేవిగా ఉండాలి.

(2) వేర్వేరు గ్రంథాలలో చెల్లా చెదరుగా ఉన్న సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించి నూతన దృక్కోణం నుంచి విశ్లేషిస్తూ వ్యాఖ్యానించేవిగా ఉండాలి.

(3) ప్రస్తుతంగాని, ఇంతకు ముందుగాని వాడుకలోలేని నూతనమైన పద్ధతులను-ప్రయోగ సాధ్యమైన వాటిని-ప్రతిపాదించేవిగా ఉండాలి. ఒక నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేవిగా ఉండాలి.

ఈ లక్షణాలేవీ లేకుండా, కేవలం గ్రంథాలలోని సమాచారాన్ని, మన అందరికీ తెలిసిన విషయాలను ఏకరువు పెట్టే వ్యాసాల వల్ల ప్రయోజనం లేదు. అటువంటి సాదా వ్యాసాలు వ్యాపార సరళి పత్రికలలో వ్రాసుకోవచ్చు. కాని, సదస్సులలో వేదిక ఎక్కే అర్హత వాటికి ఉండదు.

సంగీత కచేరీలు

సంగీత కచేరీలు డాక్టర్ బాలమురళి కచేరీతో ప్రారంభమైనాయి. తాను అధ్యక్షోపన్యాసంలో చెప్పినట్లు - ఏదో కొద్ది మందికి కాక, అందరికీ నచ్చేటట్లుగా పాడడం ఎలాగో, సాహిత్యం కోసం సంగీతాన్ని, సంగీతం కోసం సాహిత్యాన్ని బలిచేయకుండా, సాహిత్యంతో సంగీతాన్ని, సంగీతంతో సాహిత్యాన్ని సంపన్నం చేస్తూ పాడడం ఎలాగో ఆయన నిరూపించారు. సుమారు రెండున్నర గంటల కచేరీని ఆయన 'ఎందరో మహానుభావులు' (శ్రీ రాగం) అనే త్యాగరాజ కీర్తనతో ప్రారంభించారు. ఘనరాగ పంచరత్నాలలో ఒకటైన ఆ కీర్తనను ఆయన గానం చేసిన పద్ధతి ఈనాటి విద్వాంసులందరూ భేషజానికి స్వస్తి చెప్పి జాగ్రత్తగా గమనించి, అవగాహన చేసుకోవలసినట్లుగా ఉన్నది. ఆ కీర్తనలో ప్రతి పదానికి గల ఔచిత్యాన్ని గౌరవిస్తూ, త్యాగరాజ మనోధర్మాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తూ మధురంగా, గంభీరంగా ఆయన గానం చేశారు. సాహిత్యాన్ని భావయుక్తంగా గానం చేస్తూ, తిరిగి ఆ సాహిత్యానికీ త్యాగరాజు కూర్చిన సంగీతాన్ని స్వరాలుగా పలుకుతూ, ఒక్కొక్క పంక్తిలోని సాహిత్య సౌందర్యాన్ని, సంగీత సౌందర్యాన్ని, ఆ రెండింటి సమ్మేళన సౌందర్యాన్ని విడివిడిగా వివరిస్తూ, బోధపరుస్తూ, ఆ సౌందర్యాన్ని తాను అనుభవిస్తూ ఆయన గానం చేశారు. నిజానికి త్యాగరాజు పంచరత్న కీర్తనల గానంలో గాయకునికి స్వాతంత్ర్యం తక్కువ. అయినా, ఇందులో కూడా బాలమురళీకృష్ణ తన విశిష్టతను వ్యక్తం చేశారు.

తర్వాత 'హంసానంది' రాగంలో ఆయన చేసిన విస్తారమైన రాగాలాపన అత్యంత ప్రతిభావంతంగా, మనోహరంగా ఉన్నది. కొద్ది సంవత్సరాల క్రిందటి కంటే ఇప్పుడు బాలమురళీ గానంలో పరిపక్వత కనిపిస్తున్నది. ఇప్పుడు ఆయన గొంతు త్రిస్థాయిలలో హాయిగా పలుకుతున్నది. ముఖ్యంగా మంద్రంలో ఆయన గొంతు మరీ మధురంగా ఉన్నది. ఇది వరకటి కంటే ఇప్పుడు ఆయన గానం మరింత గాంభీర్యాన్ని, సౌందర్యాన్ని సంతరించుకున్నది. 'హంసానంది' రాగంలో ఆయన 'మీనాక్షీ జయద వరద' అనే తన సొంత కృతిని గానం చేశారు. ఈ రాగంలో ఆయన స్వరప్రస్తారం గొప్పగా ఉన్నది. ముఖ్యంగా మంద్రస్థాయిలో స్వరకల్పన విశేషంగా ఉన్నది. తర్వాత 'స్వరరాగ సుధారస' (శంకరాభరణం), 'నగుమోము' (అభేరి) కృతులను, ఒక అన్నమాచార్య కీర్తన ఒక రామదాసు కీర్తన, ఒక ఉత్సవ సంప్రదాయ కీర్తన, 'కదన కుతూహలం'లో ఒక సొంత తిల్లానా, కొన్ని సినిమా గీతాలు గానం చేశారు.

'నగుమోము' కృతి మాత్రం ఇది వరకు పాడినంత బాగా పాడలేదని అనిపించింది. ఈ కృతిలో త్యాగరాజు ఆర్తిని బాలమురళి వ్యక్తం చేయలేకపోయారు. మామూలుగా అందరూ పాడే పద్ధతికి భిన్నంగా, చమత్కారంగా పాడాలనే ప్రయత్నం కనిపించింది. కచేరీలో మొదటి రెండు రాగాలలో అత్యున్నత ప్రమాణాన్ని అందుకున్న ఆయన సంగీతం ఆ తర్వాత కృతులలో క్రమంగా దిగజారింది. చివర శ్రోతల కోరికపై కొన్ని సినిమా పాటలు-వాటి వరసలు శాస్త్రీయమైనవే అయినప్పటికీ-పాడడంతో మొత్తం కచేరీ యొక్క శాస్త్రీయ వైభవం స్థాయి తగ్గింది.

రెండవరోజు శ్రీమతి టి.టి. సీత కచేరీ అద్భుతంగా ఉన్నది. కొన్ని విషయాలలో బాలమురళీ కచేరీ కంటే విన్నగా ఉన్నది. ఆమె కచేరీ మొదటి నుంచి చివరి వరకు ఉన్నత ప్రమాణంలో సాగింది. సంగీతం కోసం సాహిత్యాన్ని బలిచేయరాదన్న సూత్రాన్ని బాలమురళి కంటే ఎక్కువ శ్రద్ధా భక్తులతో ఆమె పాటించారు. "కృతి అంటే ఇలా గానం చేయాలి" అనిపించే విధంగా, సహజసుందరంగా, భావస్ఫోరకంగా ఆమె గానం చేశారు. బాలమురళి 'నగుమోము' మేధను రంజింపజేస్తే శ్రీమతి సీత 'నగుమోము' హృదయాన్ని రంజింపచేసింది. ఆమె గానంలో త్యాగరాజు ఆర్తి ధ్వనించింది. దానికి ముందు 'మధ్యమావతి' రాగంలో మరొక కృతిని ఆమె గొప్ప భావావేశంతో గానం చేశారు. రాగాలాపనలో 'మధ్యమావతి' రాగ స్వరూపాన్ని సమగ్రంగా, మనోహరంగా, ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. కచేరీలలో ఆమె మొత్తం 10 కృతులను గానం చేశారు. అన్నింటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కచేరీ విన్నప్పుడు ఆమెకు రావలసినంత పేరు రాలేదని అనిపించింది.

తిరుపతికి చెందిన శ్రీ జి. లక్ష్మణన్ తన వీణ కచేరీకి డోలును ప్రక్కవాద్యంగా పెట్టుకున్నారు. వీణాగానం ప్రశంసనీయంగా ఉన్నప్పటికీ, ఆయన వీణ కంటే శ్రీ మునిరామయ్య డోలు వాదం ఎక్కువగా శ్రోతలను ఆకర్షించింది. 'తని' వాయించినప్పుడు మునిరామయ్య తన ప్రావీణ్యంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. వీణ-డోలు మేళనాన్ని క్రమంగా ప్రచారం చేయడం అవసరం. అయితే డోలు వాయించేవారు గొప్ప ప్రవీణులైతేనే, ఔచిత్యమెరిగి తగుమోతాదులో వాయిస్తేనే ఈ ప్రయోగం రక్తికట్టుతుంది.

మిగిలిన కచేరీలను గురించి విశేషంగా చెప్పవలసినదేమీ లేదు. అకాడమీ ఇక ముందు ఇటువంటి సంగీతోత్సవాలు నిర్వహించినప్పుడు కచేరీలన్నింటినీ టేప్ రికార్డు చేసి, తన సంగీత భండారంలో భద్రపరచడం అవసరం. ఉత్సవాలకు హాజరు కాలేకపోయినవారు తర్వాత ఎప్పుడైనా వినడానికి అవి ఉపయోగపడతాయి.

నండూరి పార్థసారథి
(1976 డిసెంబర్ 16వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post