Humor Icon

'పురుషులకు సమానహక్కులు కావాలి' అంటూ నం.పా.సా. గారు ఆర్గ్యుమెంటును మంచి పకడ్బందీగానే వేశారు. అందుకు ఆయనను అభినందించవలసిందే. అది చదివితే మగవారు "హాయ్ హాయ్! వారేవా!!" అని హుషారుగా ఈలకొట్టచ్చు. వ్యాసం మంచి కాలక్షేపంగా, డబల్ గ్యాస్ సోడాకాయి లాగా వుంది. అయితే అదంతా వఠ్ఠిగ్యాస్. అంతాకాదు లెండి చాలా వరకు గ్యాస్.

మగవాడికి తెలివి ఎక్కువ. 'అతితెలివి' అనడం సబబుగా వుంటుంది తన ఆశపోతుతనాన్ని, స్వార్థాన్ని. పీనాసితనాన్ని చడీచప్పుడూ లేకుండా ఆడదానిమీదికి నెట్టేసి, ఏమీ ఎరగని వాడిలాగా, సర్వసంగపరిత్యాగిలాగా కోర్కెలను జయించిన వాడిలాగా చిన్మయ ముద్రపెట్టి కూర్చోడం మగవాడికి తెలుసు.

మగవాడు సంపాదిస్తుంటే ఆడది జల్సాగా ఖర్చు పెట్టుకుంటున్నట్లు ఆరోపించారు నం.పా.సా గారు. డబ్బు పెత్తనం అంతా ఆడవాళ్ళదే నన్నట్లుగా రాశారు. ఇందులో ఒక రహస్యం వుంది. అవసరాలకు మించిన ఆదాయం వున్న కుటుంబంలో డబ్బు పెత్తనం మగవాడిదే అయ్యుంటుంది. కొత్తిమీర, కరేపాకు కొనుక్కోవాలన్నా డబ్బులు అయ్యగారిని అడిగి తీసుకోవలసిందే. చాలీ చాలని ఆదాయం వున్న కుటుంబంలో మగవాడు జీతం అంతా తెచ్చి భార్యచేతిలో పెట్టి గొప్ప ఔదార్యంగల ఆదర్శ భర్తలాగా పోజుపెడతాడు. కుటుంబపోషణకు సంబంధించిన బాధ్యతలన్నీ భార్య నెత్తిన తోసేసి, 'పెత్తనం' అంతా ఆమెకే అప్పగించినట్లు నటిస్తాడు. అవసరాలకు చాలినంత జీతం లేనప్పుడు డబ్బు గొడవ అంతా ఆడదానికి వదిలెయ్యడంలో మగవాడికి చాలా సుఖం వుంది. ఇంట్లో ఏదీ లేదని అనడానికి వీల్లేదు ఆడది. "నాకేం తెల్సు? దమ్మిడీ మిగుల్చుకోకుండా మొత్తం జీతం అంతా నీ చేతుల్లోనే పోశాను కదా? నువ్వు మైంటైన్ చెయ్యలేకపోతే నేనేం చెయ్యను?" అంటాడు. లేకపోతే దుబారా చేస్తున్నావని అంటాడు. ఇంట్లో పిల్లలు ఏది అడిగినా "నాకేం తెలియదు. మీ అమ్మని అడగండి" అని భార్యమీదికి తోసేస్తాడు. పైగా వాళ్ళకి డబ్బు ఇవ్వమని తనే సిఫార్సు చేస్తాడు భార్యకి. "ఎక్కణ్ణించి తెచ్చి ఇవ్వనండీ నేనేం డబ్బు పోసుకు కూర్చున్నానా? మీరు కూడా వాళ్ల పక్షమే మాట్లాడతారేం?" అంటుంది ఆవిడ. "అదేమిటి, జీతం అంతా తెచ్చి నీకేయిస్తున్నాకదుటే. ఏంచేస్తున్నావే అంతా? పాపం వాళ్ళు అడుగుతుంటే లేదంటావేమిటే?" అంటాడు. ఆవిడ లెక్కచెప్పబోయినప్పుడల్లా "ఆ లెక్కలన్నీ నాకు దేనికే చెబుతావు? నువ్వే ఎలాగో సర్దుకోవాలి గానీ" అంటాడు పెద్దమనిషి. తను తెచ్చే జీతం ఏమూలకీ చాలదని ఆయన గారికి తెలుసు. తెలిసే అంతా నాటకం. పాపం పిల్లలు వాళ్ళ నాన్న ధర్మాత్ముడనీ, అమ్మే వట్టి పిసినిగొట్టుదనీ అనుకుంటారు. డబ్బు లెక్క ఆడది చూస్తున్న యింట్లో పిల్లలకెప్పుడూ తండ్రంటే ఎక్కువ యిష్టం వుంటుంది. పిల్లల మాట అలా వుంచి, అసలు ఆయన గారు కూడా పిల్లలతో సమానంగా సిగరెట్లకనీ, మాగజైన్లకనీ, సినిమాలకనీ, ఫ్రెండ్స్ కి కాఫీలు ఇప్పించాలనీ డబ్బులు అడుగుతూ వుంటాడు. ఆవిడ దేనికీ లేదనడానికి వీల్లేదు. "రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి, అంతా నీ చేతులో పోస్తుంటే ఒక్క సినిమాకి డబ్బులడిగితే లేదంటావేమే. తెచ్చిన జీతమంతా ఏమైపోతోందే" అంటాడు. పిల్లలకి నాన్న గారిమీద సానుభూతిగా వుంటుంది. "అయ్యోపాపం నాన్నకి కూడా అమ్మ డబ్బు లివ్వడం లేదు" అనుకుంటారు.

పెళ్ళానికి డబ్బు పెత్తనం అప్పగించడంలో ఇంకా అనేక సుఖాలున్నాయి. పనిమనుషులు ఎవరు మామూళ్ళడిగినా "నాకేం తెలీదయ్యా అమ్మగారిని అడుగు" అని తప్పించుకోవచ్చు, ఆవిడగారు ఎలాగూ లేదంటుంది. అప్పుడు పనిమనుషులు "అయ్యగారు ధర్మప్రభువు, అమ్మగారికే చెయ్యిరాదు ఇవ్వడానికి" అంటారు. డబ్బు పెత్తనం చేస్తున్న ఇల్లాలికి ఇటువంటి మాటలు తప్పవు. చాలీ చాలని జీతంతో సంసారాన్ని నడపడానికి ఆవిడ ఎంత అవస్థ పడుతుందో ఇంట్లో ఎవరికీ అర్థం కాదు. ఆవిడకి ఏ రోజూ కాసేపు ప్రశాంతంగా నిద్రపడ్టదు. కళ్ళుమూసుకుంటే పాలవాడికివ్వాల్సిన డబ్బు, కిరణా దుకాణంలో కట్టాల్సిన డబ్బు, వెన్నబాకీ, బట్టల బాకీ ఈ అంకెలే కళ్ళ ముందు మెదులుతూ వుంటాయి. ముందు ఎవడికిచ్చి, ఎవడికి ఆపు చేయాలి, వచ్చిన డబ్బును ఎలా సర్దాలి అన్న ఆలోచన తప్ప యింకోటి వుండదు ఆవిడకి.

నం.పా.సా. గారు చెప్పినట్లు కాస్తో కూస్తో వెనక వేయగలిగినా ఆ డబ్బు ఎప్పటికైనా, ఏదోవిధంగా ఇంటికే ఖర్చు అవుతుంది. ఏపండక్కో పిల్లలకి బట్టలు కుట్టిస్తుంది. లేకపోతే, దాచిన డబ్బు తీసి పిల్లాడికి ఫీజు కట్టుతుంది. ఇంకా అనేక చిల్లరమల్లర ఖర్చులకి తను దాచిన డబ్బు తీసి వాడుతూనే వుంటుంది. అయితే డబ్బు లెక్క బొత్తిగా పట్టించుకోని మగవాడికి యివ్వన్నీ తెలియవు.

డబ్బు పెత్తనం పెళ్లానికి అప్పగిస్తే స్నేహితులెవరూ అప్పుఅడగరు. "డబ్బు సంగతి నాకేం తెలీదయ్యా అది మా ఆవిడ డిపార్టుమెంటు" అని తప్పించుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండు ఇంటికొస్తే అతనికి వినిపించేట్టుగా "ఒసే చిట్టీ... మా ఫ్రెండు వచ్చాడే... ఓ అర్థరూపాయి ఇయ్యవే... అలా వెళ్ళొస్తాను"అంటే, ఆ ఫ్రెండు జీవితంలో ఇక ఎప్పుడూ ఇతడి నుంచి అప్పు ఆశించడు. పైగా హోటలు బిల్లులు కూడా తనే చెల్లిస్తాడు.

కట్నాల విషయంలో కూడా మగవాళ్లు చేసే తమాషా ఇదే. తనకి డబ్బు ఆశ బొత్తిగా లేదనీ, కట్నం బేరం చేసేదంతా తన తల్లేననీ చెబుతాడు ప్రతి పెళ్ళికొడుకు. డబ్బంటే చేదైనట్టూ, అదంటే చిరాకు అన్నట్టూ పోజుపెడతాడు; "కట్నమా? ఏమో నండీ... అదంతా మా అమ్మ గొడవ.. నాదేం లేదు. వాళ్ళూ వాళ్ళూ ఏం మాట్లాడుకుంటారో నాకు తెలీదు. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి ఆ మూడు ముళ్ళూ వేసి రావడమే నాపని" అంటాడు. ఠకాయించి వేలకు వేలు కట్నం వడేసి పుచ్చుకునే ప్రతి పెళ్ళి కొడుకూ ఇలాగే మాట్లాడతాడు. పైగా "ఏమిటోనండీ... పెద్ద వాళ్ళ చాదస్తం.. నాకేమో శుభ్రంగా రిజిస్టర్ మేరేజి చేసుకుందామని వుంది. కాని పెద్ద వాళ్ళు వూరుకుంటారా? పోనీలే అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడం దేనికని ఒప్పుకున్నాను" అంటాడు. "నాకు పదివేలు కట్నం కావాలి. ఇచ్చిన వాళ్ళనే చేసుకుంటాను" అని ధైర్యంగా ఒక్కడూ చెప్పడు.

తల్లులు మాత్రం కట్నం అంత గీసి గీసి బేరం చేసి ఎందుకు తీసుకుంటారు? తమ కూతుళ్ళకి కట్నాలు ఇచ్చుకోవాలి కదా? ఆ కూతుళ్లకి రాబోయే పెళ్ళి కొడుకులు కూడా ఇదే బాపతుకదా మరి? పెళ్ళి కూతురు నచ్చలేదని వంకబెట్టేది ఆడవాళ్ళేనన్నారు నం.పా.సా గారు. అది కొంతవరకే నిజం. మాకు తెలిసినవాళ్ళలో ఒకబ్బాయి ఇప్పటికి పదేళ్ళ నుంచి చూస్తున్నాడు సంబంధాలు. ఏడాదికి యాభై మంది చొప్పున కనీసం ఇప్పటికి 500 మందిని చూసి వుంటాడు. పిల్ల నచ్చితే కట్నం చాలదు. కట్నం ఫర్వాలేదనుకుంటే పిల్లబావుండదు. రెండూ కుదిరితే ఇంకా కొంచెం ఎక్కువ కట్నం కోసం గీసి గీసి బేరం ఆడడం, చివరికి వాళ్ళకి విసుగుపుట్టి వేరే సంబంధం చూసుకోవడం-ఇలా జరుగుతోంది. అతను మాత్రం "అబ్బే నాదేం లేదండీ, అంతా మా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏది సెటిల్ చేస్తే అది నోరు మూసుకుని చేసుకోవడమే" అంటాడు.

అత్తవారింటిలో కొత్త కోడలును రాచిరంపాన పెట్టేది కేవలం ఆడపడుచులు, అత్తగారు మాత్రమే కాదు. మామగారు, బావగార్లు, మరుదులు కూడా చాకిరీ చేయించుకుంటారు. వితంతువు పునర్వివాహం చేసుకుంటే వృద్ధ తరం స్త్రీలు నోరు నొక్కుకునే మాట నిజమే కాని, పురుషులు మాత్రం, చులకనగా, హేళనగా చూడడం లేదూ? రాజా రామ్ మోహన్ రాయ్, గాంధీజీ వంటి పురుషోత్తములు కొద్దిమంది స్త్రీ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు సాగించినమాట నిజమేకాని, మెజారిటీ పురుషులు స్త్రీలపై పెత్తనం చెలాయిస్తూ, స్త్రీలను అణచివేస్తున్న మాట అంతకంటే నిజం.

తప్పులు చేయడం స్త్రీ పురుష విచక్షణ లేకుండా మానవులందరికీ సహజమే కాని, తప్పు చేసిన మగవాడు తప్పించుకున్నట్లుగా, ఆడది తప్పించుకోలేదు. తప్పు చేసిన మగవాడు తలెత్తుకుని తిరగగలడు. తప్పు చేసిన ఆడది అలా తిరగలేదు. అందుకు కారణం భగవంతుడు కూడా స్త్రీకి అన్యాయం చెయ్యడమే. భగవంతుడు మగవాడు కావడం వల్లనే స్త్రీకి ఇంత అన్యాయం చేశాడు. (విగ్రహారాధన చేయనివారు, భగవంతుడు నిరాకారుడనే వారు కూడా భగవంతునికి పుంలింగ శబ్దంతోనే వ్యవహిస్తున్నారు కనుక ఆయన్ని మగవాడనే అనవచ్చు). నం.పా.సా. గారు తన ఆర్గ్యుమెంటుకు అనుకూలంగా వుండే సంస్కృత శ్లోకాన్ని (స్త్రీణాం ద్విగుణ మాహారో బుద్ధి శ్చాపి చతుర్గుణా...) ఎరువు తెచ్చుకున్నారు, కాని ఆ శ్లోకం రాసిన వారు నం.పా.సా. గారి వంటి మగవాడే అయివుంటాడు.

ఇంకా నం.పా.సా గారి ఆరోపణలన్నింటికీ ఇలా సమాధానాలు చెప్పుకుంటూ పోవడం కష్టం కాదు. కాని, అనవసరం అనుకుంటాను. అయితే స్త్రీలు ముందు తమలో తాము ఐకమత్యాన్ని సాధించాలన్న విషయంలోనూ, అనేక సందర్భాలలో స్త్రీల హక్కులకు స్త్రీలే అడ్డుపడుతున్నారనే విషయంలోనూ నం.పా.సా గారితో ఏకీభవించక తప్పదు. 'ఉమెన్స్ లిబ్' ఉద్యమానికి ముందుగా 'ఉమెన్స్ సాలిడ్' (ఉమెన్స్ సాలిడారిటీ మూమెంట్) ఉద్యమం అవసరమనే మాట కూడా నిజం.

నండూరి పార్థసారథి
(1963లో 'స్వాతి' మాసపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post