శబ్దానికి రూపం వస్తే ఎలా ఉంటుంది? శబ్దాన్ని కంటితో చూడగలిగితే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలు విచిత్రంగా, విడ్డూరంగా, హాస్యాస్పదంగా వినిపించవచ్చు. శబ్దాన్ని పట్టుకుని చట్రంలో బిగించి, ఘనీభవింపచేసి, దాని రూపాన్ని మనం రాబట్టలేకపోవచ్చుగానీ, మన మనస్సు అనుక్షణం తనకు తటస్థపడే ప్రతి శబ్దాన్నీ, ప్రతి స్పర్శనూ, వాసననూ, రుచినీ కూడా రూపాలుగా తర్జుమా చేసుకుని వాటి చిత్రాలను ముద్రించుకుంటూ ఉంటుంది. అది మనోధర్మం. అయితే ఈ తర్జుమా వ్యవహారమంతా మనస్సులోని అడుగు అరలో-అంటే నిశ్చేతనలో-జరుగుతున్నది కనుక ఏ శబ్దానికి, ఏ స్పర్శకు ఎటువంటి రూపచిత్రం ముద్రితమవుతున్నదో మనకు తెలియదు. అసలు రూపచిత్రాలు ముద్రితమవుతున్నట్లు కూడా తెలియదు.

మనస్సులోని పై అర-అంటే చేతనలో-ఆలోచనాశక్తి, భావనాశక్తి ఉన్నాయి. పంచేంద్రియాలద్వారా గ్రహించిన ప్రతి విషయం మీద చేతనలో ఆలోచన, భావన జరుగుతాయి. ఈ భావనకే కళాకారుడు కళారూపం ఇస్తాడు. ఇక మధ్య అరలో అంటే అర్ధ చేతనలో కూడా ప్రతి విషయం మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ జరిగే తతంగాన్ని పై అరలోకి తీసుకురావటం కొంతవరకే సాధ్యమవుతుంది. అడుగు అరలో జరిగేది మాత్రం అసలు తెలియదు. అంటే ఒకే శబ్దాన్ని, లేదా ఒకే స్పర్శను చేతన ఒక విధంగా, అర్ధ చేతన ఒక విధంగా, నిశ్చేతన ఒక విధంగా రూపించుకుంటున్నాయన్నమాట.

చేతనలో జరిగే భావనకు కళారూపం ఇవ్వటం మాత్రమేకాక, అర్ధ చేతనలో జరిగే వ్యవహారాన్ని భావన చేసి, దానికి కూడా రూపకల్పన చేయడానికి ఆధునిక కళాకారులు ప్రయత్నిస్తున్నారు. ఆధునిక చిత్ర కళలో, ఆధునిక కవిత్వంలో, ఆధునిక చలన చిత్రాలలో ఈ ప్రయత్నం కనిపిస్తున్నది. ఇప్పుడు పాశ్చాత్య కళాకారులు ఈ ప్రయత్నంలో మరొక అడుగు ముందుకు వేశారు. మనస్సు అడుగు అరలో ముద్రితమయ్యే చిత్రాలు ఎలా ఉండి ఉంటాయో భావనచేసి, వాటికి రూపకల్పన చేస్తున్నారు.

ఫలానా శబ్దానికి ఫలానా విధంగా రూపం ఉంటుందని నిర్థారించలేము. ఎందుకంటే-ఒకే శబ్దానికి ఒక్కొక్కరి భావనను బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది రూపం. ఒక శబ్దం యొక్క చిత్రం తన మనస్సు అడుగు అరలో ఫలానా విధంగా ఉండి ఉంటుందని ఒక వ్యక్తి భావించవచ్చు. కానీ అది నిజంగా అలా ఉండి ఉండకపోవచ్చు.

భావన చేయటం ఒక ఎత్తు, దానిని ప్రదర్శించటం ఒక ఎత్తు. కళాకారుడు భావించినదానికి, ప్రదర్శించిన దానికి తేడా ఎప్పుడూ ఉంటుంది. ఆ తేడా ఎంత తక్కువగా ఉంటే అంత గొప్ప కళాకారుడవుతాడు. మనస్సులోని మధ్య అరలో, అడుగు అరలో జరిగే వాటిని పైకి తీసుకురావటానికి చేసే ప్రయత్నం వల్లనే ఆధునిక చిత్రకళలో గానీ, కవిత్వంలోగానీ అస్పష్టత ఎక్కువగా కనిపిస్తున్నది. అందువల్లనే అర్థం చేసుకోవటమూ కష్టమవుతున్నది. సాంప్రదాయికమైన కళకంటే ఈ ఆధునిక కళ చాలా క్లిష్టమైనది. దానికంటే ఇది లోతైనది. ఇందులో అపజయం పొందేవారు ఎక్కువ కాబట్టి దానిపట్ల ఆదరణ తక్కువగా ఉంది.

విజయాన్ని సాధించగలిగినా, లేకున్నా ఇటువంటి ప్రయోగాలు ఎక్కువగా చేస్తున్నవారు యూరోపియనులు-ముఖ్యంగా పశ్చిమ జర్మనీవారు. పాశ్చాత్య దేశాలలో మిగిలినదేశాలన్నింటికంటే-పశ్చిమ జర్మనీ కళారంగంలో అగ్రగామి అని చెప్పవచ్చు. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలో పశ్చిమ జర్మనీ సాధించిన అభివృద్ధి ఏ దేశం సాధించలేదు. బీతోవెన్, మోజార్ట్ ల వంటి మహా గాయకులకు పుట్టినిల్లైన జర్మనీ, శాస్త్రీయ సంప్రదాయాలను పరిరక్షిస్తూనే అన్ని కళలలోనూ కొత్త ప్రయోగాలు చేస్తూ, కొత్త కొత్త కళారూపాలను సృష్టిస్తున్నది.

పశ్చిమ జర్మనీకి చెందిన నృత్యబృందం ఒకటి ఇటీవల మద్రాసులో రెండు రోజులు ప్రదర్శనలు ఇచ్చింది. శాస్త్రీయ సంగీతం పట్ల, నృత్యం పట్ల జర్మనీ వారికి ఎంత శ్రద్ధ, భక్తి ఉన్నాయో, ఆధునికతపట్ల వారికి ఎంత ఆసక్తి ఉన్నదో ఈ ప్రదర్శనలు వెల్లడిచేస్తాయి. అంతేకాదు-వారి కళ అత్యుత్కృష్టమైనదనీ, వారి సృజనాత్మక ప్రతిభ అత్యున్నతమైనదనీ కూడా ఆ ప్రదర్శనలు నిరూపించాయి.

వారు ప్రదర్శించిన అంశాలలో 'కాంటాక్ట్స్' అనేది అద్భుతమైన-బహుశా అపూర్వమైన ప్రయోగం. అతి నిశితమైన భావనాశక్తికీ, అతి స్పష్టమైన ప్రదర్శనాశక్తికీ అది నిదర్శనం. ఆ అంశానికి 'శబ్దరచన' చేసిన వ్యక్తి స్టాక్ హాసెన్, 'రూపరచన' చేసిన వ్యక్తి ఉల్ఫ్ గాంగ్ లీన్నర్. రంగస్థలంపై ప్రదర్శించిన వారు-లీన్నర్, వ్రెనీ, వోల్స్ క్లెగ్ల్. దీని ప్రదర్శనకాలం సుమారు పావుగంట.

ఇందులో శబ్దాలు, నిశ్శబ్దాలు, స్వరాలు ఉన్నాయి. వాటికి రూపాలు కల్పించే ప్రయత్నం జరిగింది. దీని సంగీతాన్ని-సంగీతమనే చెప్పవలసివస్తే-అది అతి వినూత్నమైనది, విచిత్రమైనది. ప్రదర్శనాంశాలను గురించి సంగ్రహంగా వివరించిన చిన్న పుస్తకంలో ఈ అంశాన్ని గురించి ఒక్క వాక్యంలో ఇలా వ్రాశారు. "ఎక్కడిదో తెలియని విచిత్ర శబ్ద సంచయానికి రూపాలు కల్పించే ప్రయత్నం ఇది". ఇందులోని శబ్దాలు ఏ లోకానికి చెందినవో తెలియనివి, ఏ లోకానికైనా చెంది ఉండతగినవి, మనం ఎన్నడూ విననివి, ఊహించనివి. దీనికి 'ఎలక్ట్రానిక్ మ్యూజిక్' అని వారు పేరు పెట్టారు. దీనిని తయారు చేసిన పద్ధతి ఇది. రకరకాల యంత్రాల చప్పుళ్లు, యంత్రాలవి కాని మరేవేవో శబ్దాలు టేప్ రికార్డ్ చేశారు. కీచురాయి శబ్దం మొదలు విమానం కూలిన శబ్దం వరకు-సన్నటివి, లావు పాటివి, పొట్టివి, పొడుగువి, గర్జించేవి, ఘీంకరించేవి, కీచుమనేవి, గరగరమనేవి ఉరిమేవి, అరిచేవి రకరకాలు ఉన్నాయి. అవి కార్ల శబ్దాలు కావచ్చు, రైళ్ల శబ్దాలు కావచ్చు, విమానాల శబ్దాలు కావచ్చు, పళ్లెరాలు పడిన శబ్దాలు కావచ్చు-అసలు ఇవేవీ కాకపోవచ్చు. ఇది ఫలానా దాని శబ్దం అని స్పష్టంగా ఏదీ తెలియదు. 'శబ్దరచయిత' తన భావనాశక్తితో, తను ఉద్దేశించిన 'మూడ్'ను కల్పించడానికి ఈ శబ్దాలలో దేని తరవాత దేనిని ఉంచితే బాగుంటుందో నిర్ణయించి, ఆ వరస క్రమంలో పేర్చి, మధ్య మధ్య అక్కడక్కడ పియానో, ట్రంపెట్, వైలిన్ మొదలయిన వాద్యాల స్వరాలను మేళవించి, మరికొన్ని చోట్ల నిశ్శబ్దాన్ని ఉపయోగించి, ఈ మొత్తం తోరణాన్ని రీ రికార్టు చేశారు.

ఇది ఎంత క్లిష్టమైనపనో, ఈ శబ్దాలకు రూప కల్పన చేయటం కూడా అంతే కష్టం. రంగస్థలం మీద ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉంటారు. వారు-తమ శరీరాల చలనాలతో-నేపథ్యంలోని శబ్దాలను రూపాలుగా తర్జుమా చేస్తూ ఉంటారు. శబ్దాలు సున్నితంగా ఉంటే వారి కదలికలు సున్నితంగా ఉంటాయి. శబ్దాలు భయాన్ని కలిగించేవిగా ఉన్నప్పుడు వారి కదలికలలో భయం ప్రతిఫలిస్తుంది. శబ్దం ఉన్నంత సేపూ వారు కదులుతూ ఉంటారు. నిశ్శబ్దం ఉన్నప్పుడు వారు నిశ్చలంగా చలిస్తూ ఉంటారు. శబ్దం స్థాణువు కాదు. అది నిరంతరం చలిస్తూ ఉంటుంది. అందుచేత రూపం కూడా చలిస్తూ ఉంటుంది. నిశ్శబ్దంలో చలనం లేదు. అందుచేత రూపంలో చలనం ఉండదు. ఇది దీని తర్జుమాలోని పద్ధతి. రంగస్థలం మీద వారిరువురూ రకరకాల కోణాలలో కదులుతూ, కలుసుకుంటూ, పెనవేసుకుంటూ, విడిపోతూ, నిశ్చలంగా నిలబడుతూ ఉంటారు. స్థూలంగా వీరి కదలికలకు పోలిక చెప్పాలంటే పిల్లలు ఆడుకునే కెలైడోస్కోప్ ను చెప్పవచ్చు. కెలైడోస్కోప్ లో రంగురంగుల గాజు ముక్కలు కదిలించినప్పుడల్లా రకరకాల రూపాలు పొందినట్లుగా ఉంటుంది ఈ 'నృత్యం'.

ఈ ఎలక్ట్రానిక్ సంగీతానికి, ఈ రకం నృత్యానికి పశ్చిమ జర్మనీలో కొంత ప్రచారం ఉన్నట్లుంది. ఎందుచేతనంటే, సుమారు ఆరు నెలల క్రితం మద్రాసు ఫిలిమ్ సొసైటీవారు ఈ మాదిరి చలన చిత్రాన్ని ఒక దాన్ని చూపించారు. ఈ నృత్య ప్రక్రియను, సంగీతాన్ని ఇతర ప్రపంచానికి పరిచయం చేయడానికి పశ్చిమ జర్మనీ వారు ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించారు. అది సినిమా కాబట్టి-ఆ నృత్యానికి కావలసిన 'మూడ్'ను కల్పించటం కోసం వారు రంగులను, సెట్టింగులను కూడా ఉపయోగించుకున్నారు. చిత్రం నిడివి ఎక్కువ కావటం వల్ల అది తలనొప్పి కలిగించింది. అసలు దానిని ఎందుకు తయారు చేశారో ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాక-అసలు మనుషులు లేకుండా ఏవేవో తెలియని వస్తువులతోనూ, శబ్దాలతోనూ ఒక చిత్రాన్ని నిర్మించారు. అది ఇంకా ఎక్కువ అయోమయంగా ఉండి తలనొప్పి కలిగించింది. కానీ ఈ నృత్య బృందం ప్రదర్శించిన 'కాంటాక్ట్స్' మాత్రం చాలా స్పష్టంగానూ, దర్శనీయంగానూ ఉంది. అయితే దీన్ని చూసి కూడా పెదవి విరిచేసినవారు చాలా మంది ఉన్నారు.

ఈ బృందంలో ముగ్గురు స్త్రీలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరిలో డుల్స్ అనాయా, కాన్ స్టాంజ్ వెర్నన్, వ్రెనీ వోల్స్ క్లెగెల్ స్త్రీలు, రైనర్ కోచెర్ మన్, విన్ ఫ్రిడ్ క్రిస్చ్, ఉల్ఫ్ గాంగ్ లీన్నర్ పురుషులు. డుల్స్ అనాయా, రైనర్ కోచెర్ మన్ కలిసి జంటగా 'ఎలిజీ', 'డాన్ కియోటీ' అనే రెండు అంశాలు ప్రదర్శించారు. కాన్ స్టాంజ్ వెర్నన్, విన్ ఫ్రిడ్ క్రిస్చ్ కలిసి జంటగా 'కంబాట్', 'జోన్ ఆఫ్ జెరిస్సా' అనే అంశాలు ప్రదర్శించారు. వ్రెనీ వోల్స్ క్లెగెల్, ఉల్ఫ్ గాంగా లీన్నర్ కలిసి 'రోమియో అండ్ జూలియట్', 'కాంటాక్ట్స్' ప్రదర్శించారు. ఈ మూడు జంటలు కలిసి 'ఇన్విటేషన్ టు ది డాన్స్' అనే అంశాన్ని ప్రదర్శించారు.

German Ballet Picture

వీరందరూ జర్మనీలోని ఒకే సంస్థకు చెందినవారు కారు. భారత పర్యటన కోసం గొథే ఇన్ స్టిట్యూట్ వారు దేశంలోని వివిధ బాలే సంస్థలలో పనిచేస్తున్న వీరిని సమీకరించి, ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జర్మన్ బాలేకు చెందిన మూడు శాఖలకూ ఈ కార్యక్రమంలో స్థానం కల్పించారు. ఆ మూడు శాఖలు ఇవి: రొమాంటిక్ బాలే, డ్రమాటిక్-స్టోరీ బాలే, ఆబ్ స్ట్రాక్ట్ బాలే. వీటిలో మొదటి రకం ఏదో ఒక భావాన్ని తీసుకొని దానిని నాట్యంగా ప్రదర్శించటం. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన 'ఎలిజీ', 'ఇన్విటేషన్ టు ది డాన్స్' అనేవి ఈ రకానికి చెందినవి. రెండవ రకం-ఏదైనా జానపద కథను, నవలను, లేదా నాటకాన్ని ఆధారంగా చేసుకొని ప్రదర్శించే అంశాలు. 'రోమియో అండ్ జూలియట్', 'కంబాట్', 'డాన్ కియోటీ', 'జోన్ ఆఫ్ జెరిస్సా' ఈ రకానికి చెందినవి. మూడవ రకానికి చెందినది 'కాంటాక్ట్స్ '.

పశ్చిమ జర్మనీలో బాలే సమగ్రంగా, క్రమబద్ధంగా అభివృద్ధి చెందటం లేదు. నృత్యం పట్ల వారికి ఆసక్తి విపరీతంగా ఉంది. మంచి నర్తకీ నర్తకులు ఉన్నారు; సంగీత విద్వాంసులు ఉన్నారు; కావలసినన్ని థియేటర్లు ఉన్నాయి. కానీ అభివృద్ధి మాత్రం విచ్చలవిడిగా జరుగుతున్నది కానీ ఏకోన్ముఖంగా జరగటం లేదు. దీనికి కారణం బాలే సంస్థలు అక్కడ మరీ ఎక్కువగా ఉండటమే. అన్ని సంస్థలూ ఒకే విధమైన శిక్షణ ఇవ్వటం లేదు. రష్యాలో బాలే సంస్థ లన్నింటికీ కేంద్ర స్థానంగా బోల్షోయ్ థియేటర్ ఉన్నట్లు వీరికి జాతీయ సంస్థ ఒకటి లేదు. అందుకని జర్మనీలో బాగా పేరుపొందిన నర్తకీ నర్తకులు అంతటితో తృప్తి పడక బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఇంకా ఎక్కువ శిక్షణ పొంది, ప్రదర్శనలు ఇచ్చి, వారి ప్రశంసలు అందుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈ బృందంలోని ఆరుగురూ ఆ విధంగా మూడు నాలుగు దేశాలలో శిక్షణ పొంది, బాగా పేరు సంపాదించుకున్న వారే.

వీరు ఎంచుకున్న అంశాలలో వైవిధ్యాన్ని బట్టి, స్వతహాగా వారికి ఉన్న ప్రతిభనుబట్టి, నేపథ్య సంగీతాన్ని బట్టి వారు ప్రదర్శించిన ఏడు అంశాలూ చాలా గొప్పగా ఉన్నాయి. 'కాంటాక్ట్స్' అనే అంశం తప్ప మిగిలినవి అన్నీ బాలే సంప్రదాయాన్ని తు.చ. తప్పకుండా పాటించినవే.

పాశ్చాత్య కళలను గురించి తెలుసుకోడానికి మన దేశంలో ప్రజాసామాన్యానికి అన్నిటికంటే ఎక్కువగా అందుబాటులో ఉన్నవి హాలీవుడ్ చలన చిత్రాలు. వాటిని చూసి పాశ్చాత్య సంగీతం, నృత్యం అంటే అవేననుకుని ఏవగించుకునేవారు ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఇటువంటి బాలేలు చూడాలి. వారి అభిప్రాయం తప్పక మారుతుంది.

నండూరి పార్థసారథి
(1966 ఏప్రిల్ 6వ తేదీన ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post