Title Picture

బోలెడు కాలం. ధనం, ఓపిక వెచ్చించి భారీ ఎత్తున వ్యాపార సరళిలో నిర్మించిన బొంబాయి వాళీ ఉత్తమ చిత్రం 'జిస్ దేశ్ మే గంగా బహతీ హై'. లోగడ రాజ్ కపూర్ నిర్మించిన చిత్రాల కోవకు చెందినదే అయినా వాటికంటే ఈ చిత్రం మరింత భారీ ఎత్తున, ఇంకా ఆకర్షణీయంగా నిర్మించబడింది. ఆ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు ఈ చిత్రం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. ప్రబోధాత్మక చిత్రమనీ, వాస్తవికత ఉట్టిపడేటట్లు చిత్రీకరించారనీ ఇంతకాలం ఈ చిత్రాన్ని గురించి జరిగిన ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకోకుండా చూస్తే మూడుగంటల కాలక్షేపానికేమీ కొదవ ఉండదు.

ఆదర్శలు, ప్రబోధాలు, కలిపి నేసిన మేలిముసుగు నొకదాన్ని ఈ చిత్రం అసలు స్వరూపానికి పైన వేశారు. (అగ్రశ్రేణి బొంబాయి నిర్మాతలంతా చేస్తున్నదిదే). ఆ మేలిముసుగు మాటునే ఈ చిత్రం అందం, ఆకర్షణ. అది తొలగించిచూస్తే బొంబాయివాళీ సెక్సు, క్రైమ్; ముసుగు తీయకుండా పై పైన చూసి 'మంచి చిత్రం అంటారు' ఒక వర్గం ప్రేక్షకులు. ఎక్కడ సెక్సువాసన పొడసూపినా ఇట్టే పసికట్టగల మెజారిటీ రసిక ప్రేక్షకులు అసలు స్వరూపాన్ని చూడగలుగుతారు. చూసి ఆనందిస్తారు.

కానీ, చిత్రం అసలు స్వరూపాన్ని చూసి, ప్రబోధాత్మక చిత్రం లక్షణాలు మచ్చుకైనా ఇందులో లేవని పెదవి విరిచే ప్రేక్షకులు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారు.

సెక్స్ తో, క్రైమ్ తో 14 రీళ్ళపాటు ప్రేక్షకులను విపరీతంగా రెచ్చగొట్టి పదిహేనో రీలులో లాంఛనప్రాయంగా పశ్చాత్తాపపడి, నీతి వాక్యం పలికి, లెంపలు వేసుకుంటున్నాయి మెజారిటీ హిందీ చిత్రాలు. 'జిస్ దేశ్ మే....' చిత్రంలో ఆ లక్షణాలు లేకపోలేదు.

అసలు ప్రయోజనాత్మక చిత్రాల స్వరూపమే వేరు. వాటి చిత్రీకరణ సంవిధానం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. డాక్యుమెంటరీ చిత్రాలవలె వాస్తవికంగా ఉంటాయి అవి. స్థూలంగా చెప్పాలంటే సత్యజిత్ రాయ్ చిత్రాల తరహాలో ఉంటాయి.

డాక్యుమెంటరీ సంవిధానంలో చిత్రాన్ని నిర్మిస్తే ఆర్థికంగా విజయం చేకూరక పోవచ్చును. అలాకాక, వ్యాపారదృష్టితోనే నిర్మించదలచుకున్నప్పటికీ మధ్యేమార్గం ఒకటి ఉన్నది. శాంతారాం, బిమల్ రాయ్ వంటి రెండవ రకం దర్శకులు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. చెప్పదలుచుకున్న విషయం నుంచి ప్రేక్షకుల దృష్టిని అసందర్భంగా శృంగారం మీదకు మళ్ళించరు వారు.

దుష్టులను ద్వేషించరాదనీ, ప్రేమాహింసలతో వారిహృదయాలను జయించి, సమాదరంగా సమాజంలోనికి ఆహ్వానించి, మంచి మార్గంలోనికి మళ్ళించాలనీ ప్రబోధించటం ఈ చిత్రం లక్ష్యం.

బందిపోటుల జీవితం ఎంత హీనమయినదో, ప్రమాదభరితమయినదో చిత్రించటం ఈ చిత్రం ఉద్దేశం.

ఇందులో నాయకుడు పరమసాధువు; కల్లా కపటం ఎరుగని అమాయకుడు; స్వచ్ఛమయిన భారతీయుడు; సనాతనుడు; అనాథుడు; దేశ ద్రిమ్మరి. ఒక పాతలాంతరు (విజ్ఞానజ్యోతి), ఒక డప్పు (సత్యాన్ని చాటి చెప్పే సాధనం) అతనికున్న ఆస్తులు. అతను బందిపోటు వాడలో చిక్కుకుంటాడు. హింసలపాలవుతాడు. అయినా బెదిరి పారిపోలేదు. అందరినీ మచ్చిక చేసుకున్నాడు. అందరి ప్రేమనూ చూరగొన్నాడు. వారిలో పరివర్తన తీసుకువచ్చాడు. కొత్త జీవితానికి బాట చూపించాడు. వారందరూ తమంతట తాము పోలీసులకు లొంగిపోయేటట్లు చేశాడు.

ఇంత చక్కని వస్తువును తీసుకున్న దర్శక నిర్మాతలు అసలు చెప్పదలుచుకున్న విషయంపై దృష్టిని కేంద్రీకరించలేకపోయారు. వారి దృష్టి శృంగారం మీదకు మళ్ళింది. పదహారున్నర వేల అడుగుల నిడివిగల ఈ చిత్రంలో అధిక భాగం శృంగారం, నృత్యాలు, పాటలు ఆక్రమించుకున్నాయి. కథానాయకునికి ప్రేమ వ్యవహారం, పెళ్ళి ఏర్పాటు చేశారు. శృంగారం కూడా మోతాదు మీరింది.

బందిపోటు జీవితం చీకు, చింతాలేని ప్రశాంత జీవిత మనిపించే విధంగా ఆకర్షణీయంగా ఆట పాటలూ, సర్కస్ వినోదాలూ గుప్పించారు.

వినోబా భావే సిద్ధాంతాలను చిత్రీకరించబోయి అంతకంటే ఎక్కువగా ఆయనకు అభ్యంతరంకాగల సన్నివేశాలను అనేకం ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని దాదాపు రెండు వేల అడుగుల వరకు సెన్సారు వారు కట్ చేసినట్లు వినికిడి. ఆ కట్ చేసిన భాగంలో 'ఎటువంటి దృశ్యాలు ఉండి ఉంటాయో ఊహించటం అంతకష్టంకాదు. వాటిని కట్ చేయటం వల్ల చిత్రంలో ఎటువంటి ఒడిదుడుకులూ ఏర్పడలేదు. గమనం సాఫీగానే సాగింది. అంటే కట్ చేసిన భాగాలు అంత అనవసరమయిన వన్నమాట. తమ ప్రబోధం మీద ప్రేక్షకుల దృష్టిని కేంద్రీకృతం చేయాలనుకున్నప్పుడు అందమయిన పడుచు అమ్మాయిలతో నిమిత్తం లేదు. కథానాయిక పాత్ర బొత్తిగా అనవసరం.

మరొక కోణం నుంచి చూడగలిగితే ఈ చిత్రం కావలసినంత వినోదమిస్తుంది. శంకర్-జైకిషన్ సంగీతంలో భారతీయత అవసరమయినంత లేకపోయినా, పాటలన్నీ హాయిగా ఉన్నాయి. పాటల వరసలకంటే వాద్యసమ్మేళనం మరింత మెచ్చుకోతగ్గ విధంగా ఉంది. ఛాయా గ్రహణం చాలా గొప్పగా ఉంది.

Picture
రాజ్ కపూర్, పద్మిని

కథానాయకుడుగా రాజ్ కపూర్ తను మామూలు తరహాలో నిరాడంబరంగా, చక్కగా నటించాడు. బందిపోటు నాయకుని కూతురుగా కథానాయకుణ్ని ప్రేమించిన పడుచుగా పద్మిని చాలా అందంగా ఉంది. అందాన్ని, లావణ్యాన్ని ప్రదర్శించటం తప్ప మరొక ప్రయోజనం ఏమీ ఆ పాత్రకు లేదు. ప్రాణ్, తివారీ, చంచల్, లలితాపవార్ మున్నగు వారంతా చక్కగా నటించారు.

దర్శకత్వం వహించటం ఇదే తొలిపర్యాయం అయినా, రాధూ కర్మార్కర్ వివిధ దృశ్యాల చిత్రీకరణలో ఎంతో ప్రతిభను, సౌలభ్యాన్ని ప్రదర్శించాడు. ఆది నుండి అంతం వరకు అడుగు మేరనైనా విసుగుపుట్టకుండా కథను వేగంగా, జవంగా నడపగలిగారు. క్లైమాక్సులో లక్షలాది సైనికులు బందిపోటులను ముట్టడించిన దృశ్యాన్ని చిత్రీకరించటంలో ఆయన అసాధారణమైన ప్రజ్ఞను చూపారు. ప్రతి ఒక్కరూ ఒకసారి తప్పక చూడవలసిన చిత్రం 'జిస్ దేశ్ మే గంగా బహతీ హై'.

నిర్మాత: రాజ్ కపూర్; దర్శకత్వం: రాధూ కర్మార్కర్; రచన: అర్జున్ దేవ్ ఋషిక్; సంగీతం: శంకర్-జైకిషన్; పాటలు: శైలేంద్ర, హస్రత్ జైపురి; ఛాయాగ్రహణం: తారాదత్; నేపథ్యగాయకులు: ముఖేష్, లతా, ఆశా, గీతాదత్, మన్నాడే, మహేంద్రకపూర్; తారాగణం: రాజ్ కపూర్, పద్మిని, ప్రాణ్, లలితాపవార్, రాజ్ మెహ్రా, తివారీ, చంచల్, నానాపల్సీకర్ వగైరా...

నండూరి పార్థసారథి
(1961 ఫిబ్రవరి 26వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post