రోషన్, జైకిషన్, మదన్ మోహన్ సచిన్ దేవ్ బర్మన్, వసంత్ దేశాయ్, గీతాదత్, సిహెచ్. ఆత్మా, ముఖేష్, పంకజ్ మల్లిక్ హిందీ చలన చిత్ర సంగీత ప్రపంచంలో ఎందరో మహానుభావులు. అందరూ ఒకరి తరవాత ఒకరు ఒక్క పదేళ్ల వ్యవధిలో చరిత్రలో కలిసిపోయారు. ఇప్పుడు మహమ్మద్ రఫీ కూడా వారిని అనుగమించాడు; చరితార్థుడయ్యాడు.

సైగల్ మరణానంతరం ఇప్పటి దాకా హిందీ సినీ సంగీత రంగానికి ఇంత పెద్ద నష్టం వాటిల్లలేదు. ఎవరూ భర్తీ చేయలేని నష్టం ఇది. 17 ఏళ్ళ పిన్న వయస్సులో పంజాబీ చలన చిత్ర రంగంలో అడుగు పెట్టి మొదటిపాట రికార్డ్ చేసినప్పటి నుంచి మరణించే నాటి వరకు-1941 నుంచి 1980 వరకు-నాలుగు నిండు దశాబ్దాల జీవితంలో ఇరవై ఆరువేల పైచిలుకు పాటలు రఫీ రికార్డ్ చేశారు. పంజాబీ, హిందీ, ఉర్దూ, గుజరాతీ, తెలుగు ఇంకా ఎన్నో భాషలలో ఎన్నెన్నో రకాల పాటలు ఆయన పాడారు. సోలోలు, డ్యూయెట్లు, కోరస్ లు, గీత్ లు, భజన్ లు, ఘజల్ లు, ఖవ్వాలీలు, వియోగ గీతాలు, విషాద గీతాలు, అల్లరి పాటలు, ఆకతాయి పాటలు... ఎన్నెన్నో. దేశం మొత్తం మీద మరో గాయకుడెవరూ అంత వైవిధ్యం చూపలేదు. ఆయన పాడలేని పాట లేదు. పాడని పాట లేదు. ఆయన పాడింది పాటగా గడిచిపోయింది నాలుగు దశాబ్దాల కాలం.

పృధ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, రిషికపూర్-మూడు తరాల హీరోలకు ఆయన గొంతు ఎరువిచ్చారు. ఆయన గొంతు ఎరువు తీసుకోని హీరో హిందీ రంగంలో లేనే లేడని చెప్పవచ్చు. ఆయన చేత ఒక్క పాటైనా పాడించుకోని హిందీ సినీ సంగీత దర్శకుడూ లేడని చెప్పవచ్చు. 1970 తరవాత ఒక్క ఏడెనిమిది సంవత్సరాలు తప్ప ఆయన ఎప్పుడూ గిరాకీలో ప్రథమ గణ్యుడుగానే ఉన్నారు. కిశోర్ కుమార్ విజృంభణతో కోల్పోయిన ప్రథమ స్థానాన్ని ఆయన ఈ మధ్యనే నెమ్మదిగా కూడ దీసుకున్నాడు.

నలభై సంవత్సరాలలో 26 వేల పాటలంటే సగటున ఇంచుమించుగా రోజుకు రెండు పాటలు రికార్డు చేశారు రఫీ. 'గినెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లోకి ఎక్కవలసిన ఘనకార్యమే ఇది. ప్రపంచం మొత్తం మీద ఒక్క లతా మంగేష్కర్ తప్ప మరెవ్వరూ ఇన్ని పాటలు రికార్డు చేయలేదు. రికార్డులలో రికార్డు ఇది. గినెస్ బుక్ లో రఫీ పేరు బదులు లతపేరు చేర్చడం న్యాయమా, కాదా అని ఆ మధ్య కొంత చర్చ జరిగింది. ఎవరు ఎక్కువ పాటలు రికార్డ్ చేశారో కచ్చితంగా లెక్కతేల్చడం కష్టం. లత కంటే రఫీ నాలుగైదు సంవత్సరాలు ముందుగ రంగంలో ప్రవేశించినా, రఫీ మధ్యలో ఏడెనిమిదేళ్ళు వెనకబడడం వల్ల, లత ఎప్పుడూ ప్రథమ గణ్యురాలుగానే ఉన్నందువల్ల, సంఖ్యలో ఆమెదే ప్రథమ స్థానం కావచ్చు. అయినా మగవాళ్ళలో ప్రథమ స్థానం నిస్సందేహంగా రఫీదే కనక ఆయన పేరు కూడా గినెస్ బుక్ లోకి ఎక్కదగినదే.

రఫీ పాడిన సినిమా పాటలలో అతి ప్రధానమైనవి-ఆయన నౌషాద్, సచిన్ దేవ్ బర్మన్, శంకర్ జైకిషన్, ఒ.పి. నయ్యర్ లకు పాడిన పాటలు. అవి నాలుగు ప్రత్యేకమైన తరహా పాటలు; రఫీ ప్రతిభను నాలుగు ముఖాల నుంచి ప్రదర్శించే పాటలు. నౌషాద్ కు పాడిన పాటల్లో దిలీప్ కుమార్ కు పాడినవి ఒక రకం. భరత్ భూషణ్ కు పాడినవి ఇంకోరకం. దిలీప్ చిత్రాలు, 'ఆన్', 'అమర్', 'ఉరన్ కఠోలా', 'దీదార్', 'కోహినూర్', 'లీడర్', 'గంగా జమునా' ముఖ్యమైనవి. 'దిల్ మే ఛుపాకే ప్యార్ కా', 'మాన్ మేరా ఎహ సాన్' (ఆన్) 'ఇన్ సాఫ్ కా మందిర్ హై' (అమర్), 'ఓ దూర్ కే ముసాఫిర్', 'మొహబ్బత్ కీ రాహోంమే', 'నాతూఫాన్ సే ఖేలో' (ఉరన్ కఠోలా), 'మధుబన్ మే రాధికా నాచేరే' (కోహినూర్) - ఇవి చిరస్మరణీయ గీతాలు. భరత్ భూషణ్ కు పాడిన 'బైజూ బావరా', 'షబాబ్' గీతాలు శాస్త్రీయ సంగీత సౌరభంతో కూడినవి. 'మన్ తడ్ పత్ హరిదర్శన్ కో', 'ఓదునియాకే రఖ్ వాలే', 'ఇన్ సాన్ బనో', 'తూగంగా కీ మౌజుమే' (బైజూ బావరా) , 'యేహి అర్మాన్ లేకర్', 'మన్ కి బీన్ మత్వాలీ' (షబాబ్) ఆయన మాత్రమే పాడదగిన మధుర గీతాలు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో (దిలీప్, భరత్ భూషణ్ లకు కాక) ఆయన ఇంకా 'సాజ్ ఔర్ ఆవాజ్', 'మేరే మెహబూబ్', 'మదర్ ఇండియా', 'సన్ ఆఫ్ ఇండియా' వంటి చిత్రాలలో గొప్ప పాటలు పాడారు.

సచిన్ దేవ్ జర్మన్ దర్శకత్వంలో రఫీ పాడిన పాటల్లో ముఖ్యమైనవన్నీ దేవానంద్ కు పాడినవే. వాటిలో మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చే పాటలు 'హం బేఖుదీమె తుమ్ కో పుకారే చలేగయే' (కాలాపానీ), 'ఖోయా ఖోయా చాంద్', 'ఊపర్ వాలా జాన్' (కాలా బజార్), 'దిన్ డల్ జాయే', 'తేరే మేరే సప్నే' (గైడ్), 'దీవానా మస్తానా', 'సాథీనా కోయీ మంజిల్' (బొంబాయ్ కా బాబూ), గురుదత్ తీసిన 'ప్యాసా', 'కాగజ్ కె పూల్' చిత్రాలలో బర్మన్ సంగీత దర్శకత్వంలో పాడిన ఘజల్ లు 'యేదునియా ఆగర్ మిలేభీ జాయేతో' (ప్యాసా), 'దేఖిజమానెకియారీ' (కాగజ్ కె పూల్) సినీ ఘజళ్ళలో ఆణిముత్యాల లాంటివి.

శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో రఫీ పాడిన పాటలలో బాగా హిట్టయినవి ఎక్కువగా షమ్మీకపూర్ కోసం పాడినవి. 'ప్రొఫెసర్', 'జంగ్లీ', 'రాజ్ కుమార్', 'లాట్ సాహెబ్', 'జాన్వర్', 'బ్రహ్మచారి', 'ప్రిన్స్', 'ఏన్ ఈవెనింగ్ ఇన్ పారిస్' చిత్రాలలో షమ్మీకి పాడినవి అన్నీ అల్లరి చిల్లరి పాటలే. ఆ పాటలన్నీ అప్పటి యువ తరాన్ని ఉర్రూత లూగించాయి. నయ్యర్ సంగీత దర్శకత్వంలో షమ్మీకి, జాయ్ ముఖర్జీకి పాడిన 'తుమ్సా నహిదేఖా', 'కాశ్మీర్ కీ కలీ', 'ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా', 'ఫిర్ వహీ దిల్ లాయాహూ, చిత్రాలలో పాటలూ ఈ కోవలోవే. రోషన్ సంగీత దర్శకత్వంలో 'ఆర్తి' 'బర్సాత్ కీ రాత్', 'చిత్రలేఖ', 'తాజ్ మహల్', 'భీగీరాత్' చిత్రాలకు పాడిన పాటలన్నీ ఉత్తమ శ్రేణికి చెందిన గీతాలు.

ఈ సినిమా పాటలన్నీ ఒక ఎత్తు, రఫీ పాడిన ఇతర గీతాలు-భజన్ లు, ఘజళ్ళు ఒక ఎత్తు. 'దిస్ ఈజ్ మహమ్మద్ రఫీ' అనే ఎల్.పి. రికార్డు (ఇసి.ఎల్.పి 2267)లో ఆయన ఒక వైపు భజన్ లలో ''శ్యాంసే నేహాలగాయె', 'మొరే శ్యాం', 'పావ్ పడూం తొరే శ్యా', అద్భుతమైనవి. గాలిబ్ ఘజళ్ళు ప్రత్యేకంగా ఇంకో ఎల్.పి. (ఇసి.ఎన్.డి. 2404)లో పాడారు. ఘజల్ ప్రియులందరూ తప్పక భద్ర పరుచుకోవలసిన రికార్డు అది. ఆ రికార్డులోనే బేగం అఖ్తర్ ఘజళ్ళు కూడా రెండు అపురూపమైనవి ఉన్నాయి. ఈ మధ్య ఆయన ప్రపంచ యాత్ర చేసి తిరిగి వచ్చిన తరవాత ఆయన కచేరీల డబుల్ ఆల్బం ఒకటి విడుదల అయింది.

రఫీకి లభించిన ఫిలింఫేర్ అవార్డులకు, జాతీయ అవార్డులకు లెక్కలేదు. పద్మశ్రీ అవార్డు ఆయన కో నూలు పోగు లాంటిది.

నండూరి పార్థసారథి
(1980 సెప్టెంబర్ 3వ తేదీన ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post