సైగల్ బ్రదర్స్ నిర్మించిన 'కరోర్ పతి' హిందీ చిత్రం మే 19వ తేదీన విజయవాడ శేష్ మహల్ లో విడుదల అయ్యింది.
ఈ చిత్రంలో కిశోర్ కుమార్, శశికళ, కుంకుం, అనూప్ కుమార్, కె.ఎన్.సింగ్, రాధాకిషన్ ప్రధాన పాత్రలు ధరించారు. దర్శకుడు మోహన్ సెగాల్, సంగీతం శంకర్ జైకిషన్, సంభాషణలు ఐ.ఎస్.జోహార్, రాధాకిషన్ రచించారు. పాటలు శైలేంద్ర, హస్రత్ జైపురి రచించారు. నేపధ్య గాయకులు కిశోర్ కుమార్, లతామంగేష్కర్, ఆశాభాన్ స్లే, మన్నాడే. ఇంతమంది బాక్సాఫీస్ హేమాహేమీలు తయారు చేసిన ఈ చిత్రం ఆంధ్ర ప్రేక్షకులను మెప్పించగల విధంగా ఉంది. కిశోర్ కుమార్ నాయకుడు కాబట్టి ఇది హాస్య ప్రధాన చిత్రమని వేరే చెప్పనక్కరలేదు. 14 వేల పైచిల్లర అడుగుల పొడుగుగల ఈ చిత్రంలో 5 రీళ్ళు ఈస్ట్ మన్ కలర్ లో చిత్రీకరించబడినాయి.
అమెరికన్ మహిళాక్లబ్బువారి జలక్రీడా విన్యాసం ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ. ఈ దృశ్యాలను రంగులలో చిత్రీకరించారు. నాయికగా శశికళ నటన మెచ్చుకోతగ్గ విధంగా ఉంది. కుంకుం చక్కగా ఉంది. ఈ చిత్రాన్ని ఆంధ్ర ప్రాంతంలో వెరైటీ పిక్చర్సు వారు విడుదల చేస్తున్నారు.
నండూరి పార్థసారథి
(1961 మే 28వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works