Title Picture
లతా మంగేష్కర్

ఆమె శ్రుతికి, స్మృతికి మృతిలేదు - ఆమె భౌతిక నిష్ర్కమణం ఒక 'యుగాంతం'.

అనుపమాన గాన చరిత్ర సృష్టించిన లతామంగేష్కర్ 1929లో జన్మించింది. పదమూడేళ్ళ వయస్సులో సినిమాలకు పాడడం మొదలు పెట్టింది. 92 యేళ్ళ వయస్సులో 2022 ఫిబ్రవరి 6వ తేదీన మరణించిన ఆమె బహుశా ప్రపంచంలో ఎవరూ పాడనన్ని పాటలు రికార్డులుగా ఇచ్చింది. దేశంలోని దాదాపు అన్ని భాషలలో సినిమా పాటలే కాదు - అన్ని రకాల పాటలూ పాడింది. ఆవిడ 'రికార్డు'ను ఇంకెవ్వరూ ఛేదించలేకపోవచ్చు. ఎందుకంటే - ఇప్పుడు సినిమాల్లో పాటల సంఖ్య బాగా తగ్గిపోయింది.

-నం.పా.సా (ఫిబ్రవరి 07, 2022)

 ఆమె స్వనము
 నవ్య నవనీత సమానము
 నవ పల్లవ కోమలము
 నవ మల్లికా సురభిళము
 మందార మరంద మధురము...

లతా మంగేష్కర్ గాన మాధుర్యాన్ని వర్ణించడానికి ఈ ధోరణిలో ఎందరో ఎన్నో ఉపమానాలు ఉపయోగించారు. కడచిన వంద సంవత్సరాలలో కవులు, రచయితలు లత సంగీతాన్ని వర్ణించినంతగా మరెవ్వరి సంగీతాన్ని వర్ణించలేదు.

ఆమె కంఠంలో పున్నమి వెన్నెల ఉందన్నారు కొందరు.

ఆమెను 'ప్రతిభామూర్తి' అన్నారు మరికొందరు.

"కేవలం ప్రతిభామూర్తి అనడం ఆమెను తక్కువగా అంచనా వేయడం అవుతుంది; ఆమె ఒక అద్భుతం" అన్నారు మరికొందరు.

ఆమె ప్రతిభను, గాన మాధుర్యాన్ని పదజాలంతో తూకం వేయడం సాధ్యంకాదని కొందరు ఆమె స్వర మాధురి వర్ణనాతీతమనీ, అనిర్వచనీయమనీ అన్నారు.

అందరూ ఏకగ్రీవంగా యిచ్చిన బిరుదం 'భారతీయ చలన చిత్ర సంగీత సామ్రాజ్ఞి'. కాని, నిజానికి ఆమె గానం సినిమా పాటలకే పరిమితం కాలేదు. ధ్రుపద్, ఖ్యాల్, తరానా, టప్పా, ఠుమ్రీ వంటి శాస్త్రీయ సంగీత రచనలను మినహాయించి ఆమె పాడకుండా వదిలిన సంగీత రీతులు లేవు. శాస్త్రీయేతర సంగీతంలో ఆమె చూపినంత వైవిధ్యం మరెవ్వరూ చూపలేదు.

సినిమా పాటలలో ఎన్ని రకాల పాటలు పాడడానికి అవకాశమున్నదో అన్నీ పాడింది ఆమె. దాదాపుగా అరవై సంవత్సరాలు గానం చేసిన గాయని భారతీయ సినిమా రంగంలో మరొకరు లేరు. రికార్డుల సంఖ్యలో ప్రపంచ రికార్డు ఆమెదే. సినిమా పాటలు కాక ఇతర గీతాలలో ఆమె మీరా, సూరదాస్, తులసీదాస్, కబీర్ భజనలు పాడింది; తుకారాం అభంగాలు పాడింది; భగవద్గీత గానం చేసింది; గాలిబ్ గజళ్ళు పాడింది; రవీంద్ర సంగీతం పాడింది. అన్నింటినీ ఎవరూ వంకపెట్టలేని విధంగా పాడింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో ఎన్నో రకాల పాటలు పాడి యావద్భారత శ్రోతలకు సన్నిహితురాలయింది ఆమె. దేశంలో మరెవ్వరూ యిన్ని భాషలలో పాడలేదు. ఏ భాషలో పాడినా అది తన మాతృభాష అయినంత సహజంగా, అనాయాసంగా పాడింది. ఆమె ఉచ్ఛారణ అంత చక్కగా ఉండేది. అరవై ఏడేళ్ళ క్రిందట 'సంతానం' తెలుగు సినిమాలో ఆమె పాడిన 'నిదురపోరా తమ్ముడా'పాట ఆ తరం ప్రేక్షకులకు మధుర స్మృతిగా యిప్పటికీ మనస్సులో మెదులుతూ ఉంటుంది. ఆ పాటలో ఆమె గొంతు తెలుగంత తీయగా, తేటగా వుంది.

లత పాడిన మీరా భజన్ లను, గాలిబ్ గజళ్ళను వినడం ఒక గొప్ప అనుభవం. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చి మనస్సును సొక్కింపజేసే లక్షణం ఆమె పాడిన ఆ పాటల్లో ఉంది. ఆమె పాడిన మీరా పాటలు వింటుంటే లత గొంతుతో మీరా పాడుతున్నట్లు, మీరా తత్వం ఆమె ఆంతర్యమంతటా నిండినట్లు అనిపిస్తుంది. ఇల్లు, వాకిలి, సంసారం, సమాజం, సమస్త ప్రాపంచిక సౌఖ్యాలు త్యజించి, ఒంటరిగా ఎక్కడో అర్ధరాత్రివేళ పాడుపడిన గుడిలో ఏకతార మీటుకుంటూ, పాడుకుంటూ కృష్ణుని కోసం విరహంతో వేగిపోయే రాజపుత్ర రాజపుత్రి మీరా మన మనోనేత్రం ముందు సాక్షాత్కరిస్తుంది. మీరా గీతాలను యింతకంటే చక్కగా గానం చేయడం సాధ్యం కాదనిపిస్తుంది. ఆమె గాలిబ్ గీతాలను గానం చేస్తుంటే గాలిబ్ హృదయ స్పందనే మనకు వినిపిస్తుంది. ఆమె గానంలో గాలిబ్ తన గుండె బరువు దించుకుంటున్నట్లు అనిపిస్తుంది.

లత గానంలో అలౌకికమైన మాధుర్య గుణం ఉన్నది. శ్రోతలను ధ్యానంలోకి తీసుకుపోయే గుణం ఉన్నది. ఒక్కొక్కప్పుడు గీతంలోని సాహిత్య భావనల తీరాలను దాటించి మధుర వేదనాభరితమైన మరో లోకానికి తీసుకుపోతుంది ఆమె గానం. శాస్త్రీయేతర సంగీతంలో ఆ గుణం ఒక్క లత గానంలోనే ఉంది. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో అబ్దుల్ కరీంఖాన్, అమీర్ ఖాన్ ల గానంలో, పన్నాలాల్ ఘోష్ వేణు గానంలో ఆ గుణం కనిపిస్తుంది. ఆ ముగ్గురి గానం లాగానే లత గానం కూడా సత్వగుణ ప్రధానమైనది. శాంత రసప్రధానమైనది.

సహజత్వంలో, నిరాడంబరతలో, విశ్లేషణకు అందని ఆకర్షణలో, గాంభీర్యంలో, గళంలో వ్యక్తమయ్యే అనిర్వచనీయ సంస్కారంలో లతా మంగేష్కర్ తో పోల్చదగిన వ్యక్తి మరొకరు లేరు. అందుకే మామూలుగా లలిత సంగీతంలో ఎవరికీ లభించని, లభించడానికి వీల్లేని విశిష్టమైన స్థానం లతకు లభించింది. శాస్త్రీయ సంగీతంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి ఉన్నంత ప్రతిష్ఠ లలిత సంగీతంలో ఒక్క లతకు మాత్రమే ఉన్నది. కచేరీలు చేసేటంతటి పాండిత్యం లేకపోయినా శాస్త్రీయ సంగీతంతో ఆమెకు మంచి పరిచయం ఉన్నది.

సంగీత విద్వాంసుల సరసన సగర్వంగా కూర్చోగలిగిన అర్హత ఆమెకు ఉన్నది. కాకలు తీరిన విద్వాంసులు ఆమె గళ మాధుర్యానికి జోహారులర్పించారు. సినిమా సంగీతాన్ని ఈసడించుకునే 'సంగీత సమ్రాట్' బడే గులాం అలీఖాన్ ఆమెను 'శ్రుతికా అవతార్' అని కీర్తించారు. లత గానం చేసిన భగవద్గీ రికార్డులు వింటున్నప్పుడు ఆమె శ్రుతి అవతారమే అనిపిస్తుంది. సునాదం, సుస్వరం, సుశ్రుతి... అన్నీ ఆమె గళంలోనే ఉన్నాయి. భగవద్గీత, దాని అర్థం, తాత్పర్యం, సందేశం అన్నీ పక్కన బెట్టి కేవలం శ్రుతి మాధుర్యం కోసం ఆ రికార్డులను ఎన్నిసార్లయినా వినవచ్చు. అమర గానాన్ని మించిన సందేశం ఉంటుందా?

సినిమా పాటలు పాడేటప్పుడు లత చిత్రంలోని సన్నివేశాన్ని, తెరమీద కనిపించే కథానాయిక స్వభావాన్ని, గీతంలోని సాహిత్య భావాల్ని, సంగీత దర్శకుని స్వరకల్పనా శిల్పాన్ని దృష్టిలో పెట్టుకుని తన గాయన పద్ధతిని రూపొందించుకోవలసి ఉండేది. అయినా వీటి అన్నింటికీ నేపథ్యంలో ఆమె సహజ సంస్కారం కూడా ద్యోతకమవుతూ ఉండేది. అందుకే ఆమె పాడిన కేబరే డాన్సు పాటలలో కూడా అశ్లీలత ధ్వనించదు. ఆ కారణంగానే కొన్ని చౌకబారు పాటలకు సైతం ఆమె గాత్రం వల్ల గౌరవం అబ్బింది.

'నూర్జహాన్ సహజంగా గొప్ప గాయని, లత సాధన వల్ల గొప్ప గాయని అయింది' అని ఎప్పుడో ఎవరో సంగీత దర్శకుడు అన్నారు. ఆ తర్వాత అదే మాటను మరి కొందరు అన్నారు. నూర్జహాన్ దేశ విభజన అనంతరం పాకిస్థాన్ కు వెళ్లిపోవడం వల్లనే లతకు ప్రథమ స్థానం లభించిందని యింకా కొందరన్నారు. తన అభిమాన గాయని నూర్జహాన్ అనీ, మొదట కొంత కాలం ఆమెనే ఆదర్శంగా పెట్టుకొని తన బాణీని మలచుకున్నాననీ లత కూడా చెప్పింది. అయినా, నిజానికి నూర్జహాన్ ప్రతిభా ప్రావీణ్యాలు లతతో పోల్చదగినవికావు. నూర్జహాన్ సహజ గాయని, గొప్ప గాయని. అందుకేమీ సందేహం లేదు. కాని, మాధుర్యంలో, శ్రుతి శుద్ధతలో, వైవిధ్యంలో నూర్జహానే కాదు-మరెవ్వరూ లతతో పోల్చదగినవారు కారు. నూర్జహాన్ పాకిస్థాన్ కు వెళ్ళిపోవడం లత అదృష్టంకాదు-అది నూర్జహాన్ అదృష్టమే. ఆవిడ తన ప్రథమస్థానాన్ని పాక్ లో నిలబెట్టుకోగలిగింది. లతతో పోటీపడాల్సిన అవసరం లేకుండా పోయింది.

నూర్జహాన్ లాగా లత సహజ గాయని కాదనీ, కఠోర సాధన వల్లనే ఆమె గొప్ప గాయని అయిందనీ అనడానికి ఆధారాలు లేవు. అంతటి ప్రావీణ్యాన్ని సాధించడానికి ఎన్ని దశాబ్దాల నిరంతర సాధన అవసరం? అంత కఠోర సాధన చేసే అవకాశం ఆ రోజుల్లో ఆమెకు లభించిందా? 'అనోఖాప్యార్', 'మహల్', 'అందాజ్', 'బర్సాత్' చిత్రాలలో పాడినప్పుడు ఆమెకు నిండా యిరవైయేళ్లు లేవు. అప్పటికే ఆమె గానంలో గొప్ప పరిణతి కనిపిస్తుంది. ఆ గళ మాధుర్యం, భావ వ్యక్తీకరణంలో సౌలభ్యం అనుపమానం, అనితర సాధ్యం. ఆమె గొప్ప భావుకురాలు. ఆమె గానంలో ప్రావీణ్యం కంటే ప్రతిభనే ముందుగా చెప్పుకోవాలి.

లత 1929లో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గొప్ప రంగస్థల నటుడు. మరాఠీ నాట్య (నాటక) సంగీతంలో బాల గంధర్వ తర్వాత చెప్పుకోదగిన గాయకుడు. ఆయనకు లత తర్వాత యింకో ముగ్గురు కూతుళ్ళు - మీనా, ఆశా, ఉషా - ఒక కుమారుడు హృదయనాథ్ ఉన్నారు. నటుడుగా ఆయన రెండు చేతులా ఆర్జించాడు. సొంత కంపెనీ పెట్టి అదృష్టం కలిసి రాక సంపాదించినదంతా పోగొట్టుకున్నాడు. అప్పుల పాలయ్యాడు. 1942లో ఆయన మరణించే నాటికి లత వయస్సు పదమూడేళ్ళు. హృదయనాథ్ చంటివాడు. తల్లి, ముగ్గురు చెల్లెళ్ళు, తమ్ముడు, తనతో కలిసి ఆరుగురి పోషణ భారం లతపై పడింది. డబ్బు సంపాదించడానికి ఆమెకు తెలిసిన విద్య మరాఠీ పాటలు పాడటమే. ఏడవ యేటనే ఆమె పాడడం మొదలు పెట్టింది. అప్పట్లో తండ్రి వద్ద నుంచి ఆమె నేర్చుకున్నదంతా నాట్య సంగీతమే. అది శుద్ధ శాస్త్రీయ సంగీతం కాదు. ఉస్తాదుల సంగీతం కాదు. తండ్రి మరణానంతరం ఆమె మరాఠీ సినిమాలలో వేషాలుకోసం, పాటల కోసం స్టూడియోల చుట్టూ తిరగవలసి వచ్చింది. దీనానాథ్ పట్ల గౌరవంతో, అభిమానంతో ఆయన మిత్రులు కొందరు ఆమెకు అవకాశాలిచ్చారు. 1942లో ఆమె ప్రప్రథమంగా 'కిటీహంసల్' అనే మరాఠీ చిత్రంలో సదాశివ నెవ్రేకర్ సంగీత దర్శకత్వంలో ఒక పాట పాడింది. ఆ పాట రికార్డు అయింది కాని ఏ కారణంవల్లనో సినిమా రాలేదు. ఆ రోజుల్లోనే ఆమె మొదటిసారిగా 'పహలీ మంగళ్ గౌర్' అనే చిత్రంలో చిన్న వేషం వేసింది. ఆ చిత్రంలో నాయిక స్నేహప్రభతో కలిసి ఒక యుగళగీతం పాడింది.

1942 నుంచి 1948 వరకు ఆమె ఎనిమిది హిందీ, మరాఠీ చిత్రాలలో వేషాలు వేసింది. పాటలు పాడింది. అవేవీ ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. 1947లో నటనకు స్వస్తి చెప్పిన తర్వాత 'ఆప్ కీ సేవామే' అనే హిందీ చిత్రంలో నేపథ్య గాయనిగా ఆమె జీవితం ప్రారంభమయింది. అప్పటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు గులాం హైదర్ 'మజ్బూర్' చిత్రంలో అవకాశమివ్వడంతో ఆమెకు దశ తిరిగింది. ఆ చిత్రంలోని 'దిల్ మెరా తోడా' పాట ఆమె మొదటి హిట్ సాంగ్. అదే సంవత్సరం అనిల్ బిస్వాస్ 'అనోఖాప్యార్' చిత్రంలో, ఖేంచంద్ ప్రకాశ్ 'జిద్దీ' చిత్రంలో ఆమె చేత పాటలు పాడించారు. తరువాత సంవత్సరంలో 'మహల్' (ఖేంచంద్) చిత్రంలోని 'ఆయెగా ఆనే వాలా' పాటతో ఆమె సూపర్ స్టార్, నవంబర్ వన్ స్టార్ అయింది. 'అందాజ్' (నౌషాద్), 'బర్సాత్' (శంకర్ జైకిషన్), 'బడీ బహెన్' (హుస్నలాల్ భగత్ రామ్), 'ఏకీథీలడ్కీ' (వినోద్), 'చకోరి' (హన్స్ రాజ్ బెహల్) చిత్రాలలోని పాటలతో ఆమెకు అఖండ ఖ్యాతి లభించింది.

కుటుంబ పోషణకై సినిమాలలో వందలాది పాటలు పాడుతున్నా ఆమె సంగీత సాధన మానలేదు. తన చెల్లెళ్ళను, తమ్ముడిని కూడా మంచి సంగీత కళాకారులుగా తీర్చిదిద్దింది. ఆనాటి నుంచి కీర్తి శిఖరారోహణంలో వెనుకడుగు వెయ్యలేదు. క్రమంగా హిందీ సినిమా సంగీతంలో చోటు చేసుకున్న చౌకబారుతనంతో సహజీవనం సాగించలేక తనకు తానుగా చిత్రాల సంఖ్య బాగా తగ్గించుకుంది. తన ప్రతిష్ఠకు తగిన కొద్ది పాటలనే పాడింది. 1990 తర్వాత 'లేకిన్', 'రుదాలీ' చిత్రాలలో ఆమె అద్భుతంగా పాడింది. పాటల సంఖ్య ఎంత తగ్గించినా ఆమె సూపర్ స్టార్ స్టేటస్ చెక్కుచెదరలేదు. 'పద్మశ్రీ', 'పద్మభూషణ్', 'పద్మవిభూషణ్' సోపానాలమీదుగా అత్యున్నతమైన 'భారతరత్న' స్థాయికి ఆమె చేరుకున్నది.

తమకు అవకాశాలు రాకుండా లతా మంగేష్కర్ అడ్డుకున్నదని కొందరు గాయనులు పూర్వం ఆరోపించారు. ఆ ఆరోపణలలో కొంత నిజం ఉంటే ఉండవచ్చు. కాని, నిజమైన ప్రతిభగలవారిని, దీక్షతో, సహనంతో సాధన చేయగలవారిని ఎవరూ ఎల్లకాలం అడ్డుకోలేరు. లత అడ్డుపడకపోతే తామూ అంతటి గొప్ప గాయనులమై ఉండేవారమన్నట్లుగా కూడా కొందరు మాట్లాడారు. ఇప్పటికి ముప్ఫైయేళ్ళ క్రిందటే లత సినిమా సంగీతం నుంచి కొద్ది కొద్దిగా తప్పుకోవడం మొదలు పెట్టింది. అయినా అనూరాధ పౌడ్వాల్, అల్కా యాజ్ఞిక్, కవితా కృష్ణమూర్తి వంటి వారెవ్వరూ ఆమె స్థాయి నందుకోలేకపోయారు. వారి సంగతి అటుంచి చెల్లెలు ఆశాభోంస్లే కూడా ఎందుకు నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించలేక పోయింది? ఆమె ఎప్పుడూ లత కంటే ఒక మెట్టు కిందనే ఎందుకు ఉంది? లత కొత్త పాటలు పాడడం తగ్గించినా శ్రోతలు ఆమె పాత పాటలనే మళ్ళీ మళ్ళీ ఎందుకు విన్నారు? లత పాత పాటలు ఎందుకు యిప్పటికీ విపరీతంగా వింటున్నారు? లత పాత పాటలను కొత్త గాయనులు మళ్ళీ పాడి డబ్బులు చేసుకోడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అనిల్ బిస్వాన్, నౌషాద్, ఎస్.డి.బర్మన్, సలీల్ చౌదరి, మదన్ మోహన్, సి. రామచంద్ర, శంకర్ జైకిషన్, జైదేవ్ వంటి అగ్రశ్రేణి సంగీత దర్శకులంతా లతకే ఎందుకు ప్రథమస్థానం యిచ్చారు? ఆమె చేత ఒక్కపాట కూడా పాడించని ఒ.పి. నయ్యర్ కూడా ఆమె తన అభిమాన గాయని అని ఎందుకు ప్రకటించాడు? అదే పనిగా లతను పొగడవలసిన అవసరం వారికేమీ లేదు. నిజానికి వారిలో కొందరు నాలుగైదేళ్ళపాటు లత చేత పాటలు పాడించలేదు. అయినా వారు తమ ప్రతిష్ఠను నిలబెట్టుకున్నారు.

లత గొప్ప సంగీత దర్శకుల పాటలు పాడేటప్పుడు వారికి విధేయంగా, వారి శైలికి అనుగుణంగా, వారు చెప్పినట్లే పాడేది. వారిని డామినెట్ చేసి, ఆ పాటలపై తన ముద్ర వేయడానికి, తన సొంత నగిషీలు చెక్కడానికి ప్రయత్నించేది కాదు. ఇది సలీల్ చౌదరి అంతటివాడు చెప్పిన మాట.

సజ్జాద్ హుస్సేన్ కు 'మహా పొగరుబోతు', 'మహాతిక్క మనిషి' అనే బిరుదులున్నాయి. వాటితో పాటు ఎవరినీ అనుకరించని గొప్ప ఒరిజినాలిటీ గల సంగీత దర్శకుడనే పేరు కూడా ఆయనకుంది. ఆయన దృష్టిలో గొప్పవాళ్ళు ముగ్గురే. మొదటి వ్యక్తి తనే. రెండో వ్యక్తి నూర్జహాన్, మూడో వ్యక్తి లతామంగేష్కర్. ఆయన ఇంకెవరినీ మెచ్చుకోడు, గుర్తించడు. ఆయన రఫీ, తలత్, మన్నాడేల చేత పాడించాడు కాని వీళ్ళెవరినీ మంచి గాయకులుగా ఆయన ఒప్పుకోలేదు. అనిల్ బిస్వాస్, బర్మన్ లాంటి వాళ్ళని 'ఫరవాలేదు' అన్నాడు. ఆయన ప్రశంసలందుకోవడం లతకు గొప్ప సర్టిఫికెట్.

లత తర్వాత చెప్పుకోదగిన గొప్ప గాయని ఆశాభోంస్లే. లతది ప్రథమ స్థానం, ఆశాది ద్వితీయ స్థానం. వారిద్దరికీ మధ్య మరెవ్వరికీ స్థానం లేదు. ప్రావీణ్యంలో లతకు ఏ మాత్రం తీసిపోదు ఆశా. అయినా లత గానంలో వున్న కొన్ని ప్రత్యేక గుణాలు ఆశా గానంలో లేవు. ఏమిటా గుణాలు? ఆశా సినిమా పాటల్లోనే కాక ఇతర పాటలలో కూడా తన స్త్రీత్వాన్ని ప్రదర్శిస్తుంది - అవసరం లేక పోయినా. ఆమె గానంలో రెచ్చగొట్టే గుణం, కవ్వించే గుణాలు వున్నాయి. అవి శ్రోతలను ఎక్కువసేపు ఆకట్టుకోలేవు. హెలెన్ లాంటి వాళ్ళకి కేబరే డాన్సు పాటలు పాడిపాడి వాటి ప్రభావం ఆమె పాడే ఇతర గీతాల మీద కూడా పడింది. లత స్త్రీత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు - పాటకు అవసరమైనప్పుడు తప్ప. ఇంతకు ముందే చెప్పినట్లు ఆమె గానం శాంతరస ప్రధానంగా, సత్వగుణ ప్రధానంగా సాగుతుంది.

నండూరి పార్థసారథి

Previous Post