Title Picture
మాలాసిన్హా, భరత్ భూషణ్

లైట్ అండ్ షేడ్ వారి ఈస్ట్ మన్ కలర్ హిందీ చిత్రం 'జహనారా' విషాద మధురమైన ప్రేమకథాచిత్రం. మొగల్ సామ్రాజ్య కళావైభవాన్ని చక్కగా ప్రతిబింబించిన చారిత్రక చిత్రం. ఇందులోని సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, ఛాయాగ్రహణం అలనాటి మొగల్ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, చెప్పుకోదగినంత ఉన్నత ప్రమాణంలో ఉన్నాయి. 'అనార్కలి', 'మొగల్-ఇ-ఆజం' చిత్రాల తర్వాత ఆ కోవకు చెందినవాటిలో-దీనిని ఉత్తమ చిత్రంగా చెప్పుకోవచ్చు.

ప్రేమకు పర్యవసానం సాధారణంగా విషాదమే అవుతుంది. ప్రపంచ చరిత్రలో, ప్రపంచ సాహిత్యంలో ప్రసిద్ధికెక్కిన ప్రేమ కథలన్నీ దాదాపు విషాదాంతాలే. ప్రేమకు ప్రధానమైన ప్రతిబంధకం సామాజికమైన అంతస్తుల వ్యత్యాసం. నూటికి తొంబై ప్రేమ కథలలో ఇదే కనిపిస్తుంది. సామాజిక వ్యవస్థ ఒక కొండలాంటిది. ప్రేమ దాన్ని ఢీకొనే పొట్టేలు వంటిది. పర్యవసానం పరాజయం. ఒక్క మొగల్ చరిత్రలోనే విషాదాంత ప్రేమగాథలు ఎన్నో కనిపిస్తాయి. వాటిలో 'జహనారా' కథ ఒకటి. జహనారా షాజహాన్ కూతురు. ప్రేమకు అభిజ్ఞగా తాజ్ మహల్ ను సృష్టించిన వ్యక్తి షాజహాన్. అయినా జహనారా ప్రేమకు అతని సానుభూతికూడా లభించలేదు. ఆమె ఒక పేద కవిని ప్రేమించింది. అనార్కలీని ప్రేమించిన సలీమ్ కు ఎదురైన సమస్యే ఆమెకూ ఎదురయింది. అయితే సలీమ్ లా ఆమె తండ్రిపై తిరుగుబాటు చేయలేదు. నలుగురిలో అల్లరిపాలు కాలేదు. వంశగౌరవాన్ని మంటగలిపే ఏ పనీ చేయననీ, తండ్రి మనస్సు నొప్పించననీ తల్లికి ఇచ్చిన మాటకోసం తన ప్రేమను త్యాగం చేసింది. మళ్ళీ ప్రియుణ్ణి కలుసుకోలేదు. తండ్రికి అవసానకాలంలో ఎంతో విశ్వాసంతో సేవలు చేసింది. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని పట్టుదలతో ఏడు సంవత్సరాలు ఆమె సౌధం చుట్టూ తిరిగిన ప్రియుడు చివరికి ఆమె శవాన్నే చూడగలిగాడు.

ఈ ప్రేమకథలో హాస్యానికి చోటు లేకపోయినా పామర రంజనం కోసం బలవంతంగా చోటుచేసి వెకిలిహాస్యాన్ని చొప్పించారు. ఈ హాస్య సన్నివేశాలు లేకుండా ఉంటే చిత్రం ఇంకా హుందాగా ఉండేది. మధ్యమధ్య కొన్ని చోట్ల విసుగనిపించినా మొత్తం చిత్రం అంతా చూసిన తర్వాత సదభిప్రాయమే మిగులుతుంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే గొప్ప భావకవిత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ సన్నివేశాలు చాలా కాలం జ్ఞాపకం ఉంటాయి.

షాజహాన్ గా పృథ్వీరాజ్ అద్వితీయంగా నటించారు. జహనారాగా మాలాసిన్హా కూడా ఆయనకు సమాన ఉజ్జీగా నటించింది. కథానాయకుని పాత్రకు భరత్ భూషణ్ ఎంత మాత్రం న్యాయం చేకూర్చలేదు. ఇంకా ఈ చిత్రంలో శశికళ, చంద్రశేఖర్, సిద్దూ, ఓం ప్రకాశ్, సుందర్ మున్నగువారు నటించారు.

మదన్ మోహన్ సంగీతం, సంత్ సింగ్ కళా దర్శకత్వం, జి.సింగ్ ఛాయా గ్రహణం ఉన్నత ప్రమాణంలో ఉన్నాయి. దాదాపు పాటలన్నీ హాయిగా ఉన్నాయి. అన్నీ ప్రజాదరణ పొందగలవు. పాటలు రాజేంద్రకిషన్ రచించారు. సంభాషణల రచన, దర్శకత్వం వినోద్ కుమార్ నిర్వహించారు. నిర్మాత ఓం ప్రకాష్ బక్షీ.

నండూరి పార్థసారధి
(1964 డిసెంబరు 16వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post