హిందూస్థానీ సంగీత ప్రియులకు రవిశంకర్ ను తలచుకోగానే చట్టుక్కున విలాయత్ ఖాన్ జ్ఞాపకం వస్తారు. అలాగే విలాయత్ ఖాన్ ను తలుచుకోగానే రవిశంకర్ జ్ఞాపకం వస్తారు. వారిద్దరిలో ఒకరిని గురించి చెప్పుకుని, ఇంకొకరిని గురించి చెప్పుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఇద్దరికీ మధ్య విపరీతమైన పోటీ ఉంది. దేశ విదేశాలలో ఇద్దరికీ అసంఖ్యాక అభిమానులు ఉన్నారు. సితార్ ప్రియులలో రవిశంకర్ పార్టీ, విలాయత్ ఖాన్ పార్టీ ఉన్నాయి. రెండు పార్టీలవారికీ ఇద్దరన్నా అభిమానమే. కాకపోతే ఒక పార్టీ వారికి రవిశంకర్ అంటే కాస్త ఎక్కువ అభిమానం. రెండో పార్టీ వారికి విలాయత్ ఖాన్ అంటే కాస్త ఎక్కువ అభిమానం. ఇద్దరికీ దేశమంతటా శిష్యులున్నారు. నలభై అయిదేళ్ళలోపు వయస్సులో ఉన్న సితార్ విద్వాంసులలో సగం మందికి పైగా వీరిద్దరి శిష్యులే. ఇప్పటికి దాదాపు ఇరవై ఏళ్ళుగా దేశంలో సితార్ కు సంబంధించినంత వరకు గట్టిగా చెప్పుకోదగినవి రెండే రెండు బాణీలున్నాయి. ఒకటి రవిశంకర్ బాణీ, రెండోది విలాయత్ ఖాన్ బాణీ.

హిందూస్థానీ సంగీతంలో-ప్రతిభలోనూ, పేరు ప్రఖ్యాతుల్లోనూ-అత్యున్నత స్థానంలో ఉన్న నలుగురు విద్వాంసుల్లో రవిశంకర్, విలాయత్ ఖాన్ ఉన్నారు. (మిగిలిన ఇద్దరు-అలీఅక్బర్ ఖాన్, బిస్మిల్లాఖాన్) 'సితార్ పథం'లో ధ్రువతారలు రవి, విలాయత్. ఒకరు ఉత్తర ధ్రువం. మరొకరు దక్షిణ ధ్రువం. ఇద్దరూ పూర్తిగా భిన్నతత్వాలు గలవారు. వారి సంగీత స్వభావాలు భిన్నమైనవి. వారి దృక్పథాలు భిన్నమైనవి. ఇద్దరు వాయించేది సితార్ అయినా, వారి సితార్ల నాదాలే వేర్వేరుగా ఉంటాయి. కళ్ళు మూసుకుని పావునిమిషం వింటే తెలిసిపోతుంది వాయించేది రవిశంకరో, విలాయత్ ఖానో. వారే కాదు-వారి శిష్యుల్లో ఎవరు వాయిస్తున్నా ఒక్క నిమిషం వింటే ఆ వాయించేది రవిశంకర్ శిష్యుడో, విలాయత్ ఖాన్ శిష్యుడో తెలిసిపోతుంది. వారి శిష్యులందరూ అన్ని విషయాల్లోనూ శ్రద్ధాభక్తులతో గురువును అనుకరిస్తారు. రవిశంకర్ చమక్కులన్నింటినీ ఆయన శిష్యులు వాయిస్తారు. అలాగే విలాయత్ చమక్కులను ఆయన శిష్యులు అనుకరిస్తారు. రవిశంకర్ సితార్ కి రెండో బుర్రతప్పనిసరిగా ఉంటుంది. అందుకని ఆయన శిష్యులంతా రెండో బుర్ర తగిలిస్తారు. విలాయత్ ఖాన్ సితార్ కి రెండో బుర్ర ఉండదు. ఆయన శిష్యులు కూడా చాలా మంది రెండో బుర్ర ఉపయోగించరు.

రవిశంకర్ కి ఉన్న కీర్తికి, విలాయత్ ఖాన్ కి ఉన్న కీర్తికీ చాలా తేడా ఉంది. రవిశంకర్ సామాన్య శ్రోతల అభిమానాన్ని విపరీతంగా చూరగొన్నారు. విలాయత్ ఖాన్ సంగీత విద్వాంసుల అభిమానాన్ని విపరీతంగా చూరగొన్నారు. శాస్త్రీయ సంగీతంలో ఆట్టే పరిచయం లేని వారు రవిశంకర్ సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వారిని మజా చేయడానికి అవసరమైన మసాలా తిరగమోత పెట్టడం ఆయనకు చేతనవును. అటువంటి మసాలా తిరగమోతలు విలాయత్ ఖాన్ కు గిట్టవు. ఆయన ఎప్పుడూ నికార్సయిన. ఆపాత మధురమైన సంగీతాన్నే వినిపిస్తారు. మంచి అభిరుచి లేని శ్రోతలను బుజ్జగించడం కోసం తన సంగీతం క్వాలిటీ తగ్గించడం ఆయనకు ఎంత మాత్రం యిష్టం ఉండదు. రవిశంకర్ ప్రజల కళాకారుడు. విలాయత్ ఖాన్ కళాకారుల కళాకారుడు.

రవిశంకర్ సంగీతం విశాలమైనది. విలాయత్ సంగీతం లోతైనది. సంగీత వ్యవసాయ క్షేత్రంలో రవిశంకర్ ది ఎక్స్టెన్సివ్ కల్టివేషన్, విలాయత్ ది ఇంటెన్సివ్ కల్టివేషన్. రవిశంకర్ ఎక్స్ ట్రావెర్ట్. విలాయత్ ఇంట్రావెర్డ్. రవిశంకర్ సంగీతం వర్డ్స్ వర్త్ అబ్జెక్టివ్ పొయైటీ (వస్త్వాశ్రయ కవిత్వం) వంటిది. విలాయత్ సంగీతం షెల్లీ, కీట్స్ ల సబ్జెక్టివ్ పొయైట్రీ (ఆత్మాశ్రయ కవిత్వం) వంటిది. రవిశంకర్ సంగీతం దూరం నుంచి చూసినా కంటికి నదరుగా కనిపించే పెద్ద సైజు, అందమైన శిల్పంలా ఉంటుంది. విలాయత్ సంగీత శిల్పం సైజు తక్కువ. నగిషీ పనితనం ఎక్కువ, హొయసల శిల్పం (బేలూరు, హళేబీడు) లా దాన్ని చాలా దగ్గరగా శ్రద్ధగా గమనించాలి. ప్రతి మిల్లి మీటరులోనూ అతి సున్నితమైన నగిషీ చెక్కడం కనిపిస్తుంది. రవిశంకర్ సంగీతం ఎప్పుడు విన్నా బాగానే ఉంటుంది. విలాయత్ సంగీతం పూర్తి నిశ్శబ్దంలో, ఏకాంతంగా చీకటిలో వింటే అద్భుతంగా ఉంటుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వినే సంగీతం కాదు అది. దానికి పూర్తి ఏకాగ్రత అవసరం.

రవిశంకర్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు గంభీరమైన రాగాలను - ముఖ్యంగా ఆలాప్, జోడ్, విలంబిత్, గత్ లను అద్భుతంగా వాయిస్తారు. కాని, తేలిక రకం రాగాలలో ఠుమ్రీలను, ధున్ లను వాయిస్తున్నప్పుడు-ముఖ్యంగా చివర వేగంగా వాయిస్తున్నప్పుడు-ఆయన సంగీతంలో మాధుర్యం పాలు తగ్గిపోతుంది. ఊకదంపుడుగా ఉన్నట్లు, బాలెన్స్ తప్పిపోయినట్లు, గ్యాలరీ జనం కోసం వాయిస్తున్నట్లు అనిపిస్తుంది. విలాయత్ ఖాన్ సంగీతంలో 'అతితనం' కనిపించదు. ఆయన సంగీతం ఎప్పుడూ బాలెన్స్ తప్పదు. రిపిటిషన్ ఉండదు. సీరియస్ రాగాలను ఎంత గంభీరంగా వాయిస్తారో 'ఠుమ్రీ అంగ్' రాగాలను అంత మధురంగా, నాజూకుగా, సున్నితంగా వాయిస్తారు. రవిశంకర్ శ్రోతలను హుషారు చేస్తారు. విలాయత్ ఖాన్ పరవశింపజేస్తారు. రవిశంకర్ కచేరీలో హర్షధ్వానాలు వినిపిస్తాయి. విలాయత్ ఖాన్ కచేరీ నిశ్శబ్దంగా ఉంటుంది. రవిశంకర్ కచేరీలో ఒక్కొక్కప్పుడు శ్రోతలు కబుర్లు చెప్పుకోవడం కనిపిస్తుంది. విలాయత్ ఖాన్ అభిమానులు ఆయన సంగీతాన్ని ఏకాగ్రతతో వింటారు. ఒక్కక్షణం కూడా ఆ సంగీతాన్ని మిస్ కావడం వారికి ఇష్టం ఉండదు. అసలు విలాయత్ ఖాన్ స్టేజి మీదకు రాగానే ఆయన అభిమానులు మూడ్ లోకి వెళ్ళిపోతారు. ఆయన ఎలా మొదలుపెడతారోనని ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూస్తారు. ఆయన మొదటి స్వరం వాయించగానే పరవశంతో మెలికలు తిరిగిపోతారు. అక్కడ నుంచి కచేరీ చివర వరకు ఆయన శ్రోతలను మంత్ర ముగ్ధులను చేస్తారు. అంతటి సమ్మోహన శక్తి బహుశ దేశంలో మరి ఏ విద్వాంసునికి లేదు. కచేరి చివరిలో పారవశ్యం పరాకాష్ఠనందుకున్నప్పుడు ఆయన పాడడం ప్రారంభిస్తారు. ఆయన సితార్ ఎంత అద్భుతంగా వాయిస్తారో అంత అద్భుతంగా పాడతారు. ఆయన గాత్రం అతి మధురమైనది, నాజూకైనది. అంత మధురమైన గొంతు హిందూస్థానీ గాయకులలో ఎవ్వరికీ లేదు. ఆయన ఖయాల్ ను, ఠుమ్రీలను కూడా అతి శ్రావ్యంగా పాడతారు. చాలా మంది హిందూస్థానీ గాయకులు ప్రదర్శించే వెర్రిపోకిళ్ళు ఆయన ప్రదర్శించరు. హిందుస్థానీ సంగీతంతో ఆట్టే పరిచయం లేని వారు కూడా ఆయన గానానికి ముగ్ధులవుతారు. ఖయాల్ పద్ధతిలో పాడుతూ, పాడిన దానిని సితార్ మీద వాయించి చూపుతారు. గాత్రం మాదిరిగా సితార్ పై వాయించడం ఆయనే కనిపెట్టారు. దానినే 'గాయకీ అంగ్' అంటారు.

సితార్ వాదనంలో విలాయత్ ఖాన్ కు నిస్సందేహంగా రవిశంకర్ కంటే కొంచెం ఎక్కువ ప్రావీణ్యం ఉన్నది. గమకాల మీద ముఖ్యంగా 'మీండ్'లో రవిశంకర్ కంటే విలాయత్ కు ఎక్కువ అధికారం ఉన్నది. రవిశంకర్ కంటే విలాయత్ ఖాన్ ఎక్కువ వేగం వాయించగలరు. అయితే విలాయత్ ఖాన్ కంటే రవిశంకర్ కొన్ని రంగాలలో ఎక్కువ కృషి చేశారు. రవిశంకర్ ప్రతిభ బహుముఖమైనది. ఆయన నిత్య నూతన ప్రయోగశీలి. భారతీయ సంగీత ప్రచారానికి ఆయన చేసినంత కృషి విలాయత్ ఖాన్ చేయలేదు. ముఖ్యంగా ఆర్కెస్ట్రేన్ వగైరా ప్రయోగాల జోలికి విలాయత్ ఖాన్ పోలేదు. ప్రచారకునిగా రవిశంకర్ కు ఉన్న లక్షణాలు విలాయత్ ఖాన్ కు లేవు. రవిశంకర్ సితార్ పుచ్చుకుని ప్రజల మధ్యకు వెడతారు. విలాయత్ ఖాన్ అలా వెళ్ళరు. ప్రజలే ఆయన్ను వెతుక్కుంటూ వెళ్ళాలి. రవిశంకర్ ప్రజానాయకుని వంటి వారు; విలాయత్ ఖాన్ రాజకుమారుని వంటి వారు.

రవిశంకర్ వలెనే విలాయత్ ఖాన్ కూడా కొన్ని సినిమాలకు సంగీతం సమకూర్చారు. సత్యజిత్ రే 'జల్సాఘర్'కు ఆయన అద్భుతమైన, చిరస్మరణీయమైన సంగీతం సమకూర్చారు. ఉత్తమ సంగీతానికి గానూ 'జల్సాఘర్'కు మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బహుమతి లభించింది.

నండూరి పార్థసారథి
(1965 జూలై 26వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Next Post