Title Picture
'సంస్కార'లో గిరీశ్ కర్నాడ్

కన్నడ చిత్రసీమకు స్వర్ణయోగం ప్రసాదించిన తెలుగు ప్రతిభ

తెలుగు, తమిళం సినిమాల కంటే మూడు సంవత్సరాలు ఆలస్యంగా 1934లో టాకీయుగ ప్రవేశం చేసి, సుమారు పదేండ్ల క్రిందటి వరకు కేవలం తెలుగు, తమిళ చిత్రాలకు ఉపగ్రహంగా ఉండిపోయిన కన్నడ సినిమా 1966 నుంచి ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం ప్రారంభించింది. 1971లో 'సంస్కార' చిత్రంతో విప్లవ శకంలో అడుగుపెట్టి, అప్పటి నుంచి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పురోగమించి నాణ్యంలో తెలుగు, తమిళ చిత్రాలనేకాక, హిందీ, మలయాళ చిత్రాలను, మొదటి నుంచి ప్రతిభకు పెట్టింది పేరుగా ఉన్న బెంగాలీ చిత్రాలను కూడా దాటిపోయింది కన్నడ సినిమా.

'సంస్కార' చిత్రానికి రాష్ట్రపతి సువర్ణ పతకం లభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో కన్నడ చిత్రాలకు ఏవో కొన్ని బహుమతులు లభిస్తూనే ఉన్నాయి. ఉత్తమ దర్శకత్వానికి గానూ 'వంశవృక్ష' చిత్రానికి బహుమతి లభించింది. 'కాడు' చిత్రానికి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. ఆ చిత్రంలో నటించిన నందినికి 'ఊర్వశి' అవార్డు లభించింది. 1975 సంవత్సరపు అత్యుత్తమ చిత్రంగా 'చోమనదుడి'కి రాష్ట్రపతి పతకం లభించినట్లు మొన్న మొన్ననే వార్త వెలువడింది. ఆ చిత్రంలో నటించిన వాసుదేవరావు ఉత్తమ నటుడుగా ఎన్నికైనారు. 'హంసగీతె' చిత్రానికి ఉత్తమ సంగీతం అవార్డు, ఉత్తమ నేపథ్యగానం అవార్డు లభించాయి.

కన్నడ సినిమా ఇంతగా విజృంభించడానికి తెలుగువారు కూడా విశేషంగా దోహదం చేశారు. అసలు మొట్టమొదటి కన్నడ చిత్రం 'సతీసులోచన'కు దర్శకత్వం వహించిన వై.వి. రావు తెలుగువాడు. 'సతీసులోచన' తర్వాత ఆయన మరికొన్ని కన్నడ చిత్రాలు కూడా తీశారు. మొన్నమొన్నటి వరకు కన్నడ చిత్రరంగంలో అగ్రశ్రేణి దర్శక నిర్మాతగా, నటుడుగా వెలిగిన స్వర్గీయ బి.ఆర్. పంతులు తెలుగువాడు. కన్నడ రంగస్థల మహానటుడు స్వర్గీయ గుబ్బివీరన్న కొన్ని తరాల క్రిందట కన్నడ దేశంలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన వారు. ఆయన తెలుగు నాటకాలు కూడా ప్రదర్శించారు. కన్నడంలో సినిమా తీశారు. సినిమాలలో నటించారు.

మొదటి నుంచి కన్నడిగులకు కన్నడ చిత్రాలకంటే తెలుగు చిత్రాలంటేనే ఎక్కువ ఇష్టం. బెంగుళూరు నగరంలో మొన్నమొన్నటివరకు కన్నడ చిత్రాలకంటే తెలుగు చిత్రాలదే పైచేయి. వాహినీ, విజయా చిత్రాలు బెంగుళూరులో శతదినోత్సవాలు. రజతోత్సవాలు చేసుకున్నాయి. త్యాగయ్య, పోతన, వేమన, స్వర్గసీమ, మల్లీశ్వరి, పాతాళభైరవి, పెళ్ళి చేసిచూడు, లైలా మజ్నూ, విప్రనారాయణ వంటి తెలుగు చిత్రాలు కన్నడంవారికి మధుర స్మృతులుగా మిగిలిపోయాయి. అటువంటి చిత్రాలు అప్పట్లో కన్నడంలో రాలేదు.

విజయావారు తమ తెలుగు చిత్రాలలో కొన్నింటిని కన్నడంలో, కన్నడనటీనటులతో పునర్నిరించారు. 1970 వరకు దాదాపుగా కన్నడ చిత్రాలన్నీ మద్రాసులోనే తయారవుతూ ఉండేవి. అందుచేత తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా మంది కన్నడ చిత్రాలకు పని చేస్తూ ఉంటారు. తెలుగు చిత్రరంగంలో అంతగా ప్రజాదరణ పొందలేకపోయిన కళాకారులు కన్నడ చిత్ర సీమకు అగ్రశ్రేణి కళాకారులైనారు.

ఇప్పటికీ కన్నడ చిత్రరంగంలోని దర్శకులు, నిర్మాతలు, నేపథ్య గాయకులు, నటీమణులు నూటికి దాదాపు అరవైమంది తెలుగు వారేనంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కాని, ఇది నిజం. ఈ నిజాన్ని ఒప్పుకోవడం కన్నడం వారికీ బాధాకరంగా ఉంటుందేమో. ఇటీవల భాషా దురభిమానాలు పెచ్చుపెరగడంతో కన్నడ చిత్ర రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన తెలుగువారిలో చాలామంది తాము తెలుగు వారిమని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. తాము కన్నడిగులమనే చెప్పుకుంటున్నారు, అటువంటి వారిలో కొందరు కన్నడిగులకంటే ఎక్కువగా కన్నడ భక్తి ప్రదర్శిస్తున్నారు. తన భాషను తన భాషగా చెప్పుకోవడానికి భయపడేటంతగా భాషా దురభిమానాలు విజృంభించడం దురదృష్టం.

కన్నడంలో వ్యాపారసరళి చిత్రాలకు సంబంధించినంతవరకు మకుటంలేని మహారాజుగా వెలుగుతున్న పుట్టణ్ణ కణగల్ తెలుగువాడే-కన్నడ దేశంలో స్థిరపడిన తెలుగు కుటుంబం వాడు. ఆయన అన్న కణగల్ ప్రభాకరశాస్త్రి కన్నడ చిత్రరంగంలో ప్రముఖ రచయిత. పేకేటి శివరాం కన్నడంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. 'సంస్కార' చిత్రంలో కన్నడ చిత్ర రంగంలో పెద్ద విప్లవం తీసుకువచ్చిన దర్శకుడు పట్టాభిరామరెడ్డి తెలుగు వాడేనని వేరేచెప్పనక్కర్లేదు. ఆయన 'పఠాభి'గా తెలుగు సాహితీ ప్రియులందరికీ సుపరిచితుడైన తిక్కవరపు పట్టాభిరామరెడ్డి. 'పెళ్ళిప్రమాణాలు', 'శ్రీ కృష్ణార్జున యుద్ధం' వంటి ఫక్తు వ్యాపార సరళి తెలుగు చిత్రాలను నిర్మించిన ఆయన ఒక్కసారిగా 'సంస్కార' వంటి విప్లవాత్మక చిత్రాన్ని-తెలుగులో కాకుండా కన్నడంలో ఎందుకు తీశారో మరి! ఆ ప్రయోగం తెలుగులో చేస్తే, దానికి సువర్ణ పతకం లభిస్తే ఈనాడు తెలుగు చిత్రరంగం ఏ విధంగా ఉండేదో! ఇక మళ్ళీ తెలుగు చిత్రరంగంలోకి తిరోగమించే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు లేదు. ఇటీవల ఆయన 'చండమారుత' అనే ఒక చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీషు భాషలలో తీశారు. ఇంగ్లీషులో దానికి 'వైల్డ్ విండ్' అని పేరు పెట్టారు. ఆ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. ఇప్పుడు మరొక చిత్రాన్ని మూడు భాషలలో కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో తీస్తున్నారు. కన్నడ, హిందీ భాషలలో దాని పేరు 'ఋతుసంహార'. ఇంగ్లీషులో 'పేపర్ బోట్స్', 'వంశవృక్ష' చిత్రాల నిర్మాత, 'హంసగీతె' దర్శక నిర్మాత అయిన జి.వి. అయ్యర్ కూడా కన్నడ దేశంలో స్థిరపడిన తెలుగు వారే కావచ్చు. ఆయన ధారాళంగా తెలుగు మాట్లాడుతారు.

Picture
హంసగీతె

మన తెలుగు నటీమణులు జమున, కృష్ణ కుమారి, జానకి, రాజశ్రీ, జయంతి, వాణిశ్రీ ఎన్నో కన్నడ చిత్రాలలో నటించారు. జయంతి ఇప్పటికీ కన్నడ చిత్ర సీమలో అగ్రతార. స్వర్గీయ నాగయ్య కూడా చాలా కన్నడ చిత్రాలలో నటించారు. కన్నడ చిత్రరంగంలోని నేపథ్య గాయకులందరూ తెలుగు వారే. పి.బి. శ్రీనివాస్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బాలమురళీకృష్ణ, సుశీల, జానకి కన్నడ చిత్రాలకు పాడుతున్నారు. 'హంసగీతె' కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, కథానాయకుని పాటలన్నీ పాడిన బాలమురళీకృష్ణకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడుగా, నేపథ్య గాయకుడుగా అవార్డులు లభించాయి.

తెలుగు దర్శకులు, కళాకారులు కన్నడ చిత్రాలకు అవార్డులు సంపాదించ గలుగుతున్నారుగాని, తెలుగు చిత్రాలకు సంపాదించి పెట్టలేకపోతున్నారు. వ్యాపార విషచక్రంలో ఇరుక్కుపోయిన తెలుగు సినిమా నిజమైన ప్రతిభావంతులను ఉపయోగించుకోలేకపోవడమే ఇందుకు కారణం. తెలుగువారికి అక్కరలేకపోయిన ప్రతిభను కన్నడిగులు మహాప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఇందులో మనం వారికి ఎంతైనా కృతజ్ఞులమై ఉంటాము.

నలభై ఏండ్ల క్రిందట కన్నడ సినిమా తెలుగువారి నుంచి తొలి పాఠాలు నేర్చుకున్నది. తెలుగు చిత్రాలను అనుకరించి కొంత అభివృద్ధి సాధించింది. తర్వాత చౌకబారు తెలుగు వ్యాపారచిత్రాలను అనుసరించి చెడిపోయింది. అనుకరణకు స్వస్తి చెప్పి, స్వతంత్ర ధోరణిలో విజృంభించి, దేశమంతటికీ తలమానికమయింది. ఇప్పుడు తెలుగు సినిమా బాగుపడాలంటే కన్నడ చిత్రాలనుంచి గుణపాఠాలు నేర్చుకోవడం మంచిది.

నండూరి పార్థసారథి
(1976 ఆగష్టు 8వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post