Title Picture
బి.ఎన్. రెడ్డి

దక్షిణ భారత చలనచిత్ర రంగానికి ఆదర్శ శిఖరం వంటి బి.ఎన్. రెడ్డి నవంబరు8వ తేదీన అస్తమించారు. కళాప్రియులు ఆయన ప్రతిభకు నీరాజనాలర్పించి, ఒక్కసారి ఆయన చిత్రాలను సింహావలోకనం చేసుకున్నారు. మధుర మధురంగా మల్లీశ్వరిని స్మరించుకున్నారు.

Picture
సుమంగళి

దేవకీబోన్, పి.సి. బారువా, శాంతారాం, ఫతేలాల్-దామ్లే వంటి గొప్ప దర్శకుల కోవకు చెందినవారు బి.ఎన్. రెడ్డి. అనేక విషయాలలో తెలుగు చలన చిత్ర దర్శకులకు ఆయన మార్గదర్శి. తెలుగు చిత్రరంగం పురాణకాలక్షేపం చేస్తున్న రోజులలో ఆయన సంఘ సంస్కరణాభిలాషతో, ప్రయోజనాత్మకమైన సాంఘిక చిత్రాలు నిర్మించారు. సాంఘిక చిత్రాలకు ఒక ఒరవడి పెట్టారు. తెలుగు చిత్ర రంగంలో బి.ఎన్.తో పోల్చదగిన ఉన్నత వ్యక్తిత్వం, సంస్కారం గల దర్శకులు మరి ఇద్దరు మాత్రమే వున్నారు. ఒకరు గూడవల్లి రామబ్రహ్మం, మరొకరు నాగయ్య. వీరు ముగ్గురూ ఇంచుమించు ఒకేసారి చిత్రరంగంలో ప్రవేశించారు. ఒకే ఆశయాలతో ప్రవేశించారు. ముగ్గురూ ఇంచు మించు సమవయస్కులు కూడా. చిత్ర రంగంలో ప్రవేశించక ముందు ముగ్గురూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. గూడవల్లి రామబ్రహ్మం గొప్ప పత్రికా రచయిత. సోషలిస్టు భావాలను ప్రచారం చేసిన తొలి తెలుగు పాత్రికేయుడు. ఆయన, 'ప్రజామిత్ర' అనే పత్రికను నిర్వహిస్తూ వుండేవారు. బి.ఎన్. రెడ్డి బి.ఎన్.కె. ప్రెస్ ను నడుపుతూ వుండేవారు. 'ప్రజామిత్ర' ముద్రణ బి.ఎన్.కె. ప్రెస్ లో జరిగేది.

Picture
దేవత

బి.ఎన్. ప్రప్రధమంగా 1938లో హెచ్.ఎం. రెడ్డి నిర్మించిన 'గృహలక్ష్మి' చిత్రానికి స్ర్కీన్ ప్లే రచించారు. అదే సంవత్సరంలో రామబ్రహ్మంగారి 'మాలపిల్ల' విడుదలయింది. నాగయ్య వెండితెరకు పరిచయమయింది 'గృహలక్ష్మి' చిత్రంతోనే. అప్పటి నుంచి 1947 వరకు బి.ఎన్. నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటిలోనూ నాగయ్య ప్రధాన పాత్రలు పోషించారు. 1938 ప్రాంతంలో బి.ఎన్. రెడ్డి వాహినీ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ నిర్మించిన తొలి చిత్రం 'వందేమాతరం' 1939లో విడుదలయింది. వాహినీ సంస్థ నుంచి 1940లో 'సుమంగళి', 1941లో 'దేవత' వెలువడినాయి. ఆ మొదటి మూడు చిత్రాలకు రచయిత సముద్రాల రాఘవాచార్య, ఫొటోగ్రాఫర్ రామనాథ్, కళా దర్శకుడు ఎ.కె. శేఖర్, ప్రధాన పాత్రధారి నాగయ్య. 1942లో బి.ఎన్. నిర్మించిన 'భక్తపోతన'కు కె.వి. రెడ్డి దర్శకత్వం వహించారు. కె.వి.కి మొదటి చిత్రం అదే. ఆ తర్వాత వాహినీ సంస్థ నుంచి వెలువడిన మరి మూడు చిత్రాలకు-'యోగి వేమన' (1947), 'గుణసుందరి' (1949), 'పెద్దమనుషులు' (1954) చిత్రాలకు- కె.వి. దర్శకత్వం వహించారు. 'గుణసుందరి', 'పెద్దమనుషులు' చిత్రాలకు నిర్మాత కూడా కె.వి. రెడ్డే. 'దేవత' తర్వాత వాహినీ సంస్థ పేరిట బి.ఎన్. నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రాలు - 'స్వర్గసీమ' (1945), 'మల్లీశ్వరి' (1951), 'బంగారు పాప' (1955), 'రాజమకుటం' (1960), 'రంగులరాట్నం' (1968), 'బంగారు పంజరం' (1969). పొన్నలూరి సోదరులు నిర్మించిన 'భాగ్యరేఖ' (1957) చిత్రానికి, శంభు ఫిలింస్ నిర్మించిన 'పూజాఫలం' (1964) చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహించారు. 30 సంవత్సరాలలో బి.ఎన్. దర్శకత్వం వహించిన చిత్రాలు 11 మాత్రమే. రాసిలో చాలా మంది కంటే తక్కువైనా, వాసిలో అందరికంటే మిన్న.

Picture
భక్తపోతన

బి.ఎన్. వలెనే రామబ్రహ్మం కూడా సమాజాన్ని సన్మార్గంలో పెట్టడానికి సినిమాను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో చిత్రరంగంలోకి అడుగు పెట్టారు. అయితే 'మాలపిల్ల', 'రైతుబిడ్డ' చిత్రాల తర్వాత సినీవ్యాపార పద్ధతులతో ఆయన చాలా వరకు రాజీపడ్డారు. బి.ఎన్. 'బంగారుపాప' వరకు వ్యాపారపు ఒత్తిడులకు లొంగకుండా, రాజీపడకుండా చిత్రాలు నిర్మించారు. ఆ తర్వాత కొంత రాజీపడినా, చివరి వరకు సగటు ప్రమాణానికి మించిన చిత్రాలనే నిర్మించారు.

Picture
బంగారు పాప

ఆయన చాలా నెమ్మది మనిషి అనీ, చిత్ర నిర్మాణానికి చాలా కాల వ్యయం, ధన వ్యయం చేస్తారనీ, ఆర్థికంగా ఆయన చిత్రాలన్నీ దండగ మారి చిత్రాలనీ పరిశ్రమలోని వారు విమర్శిస్తూ వుండేవారు. ఇప్పుడు కొందరు దర్శకులు ఏడాదికి ఐదారు చిత్రాలు తీస్తున్నారు. ఎంత త్వరగా తీస్తే అంత గొప్ప దర్శకుడని అంటున్నారు. అటువంటి వారి దృష్టిలో బి.ఎన్. రెడ్డిగారు చేతకాని దర్శకుడే. సాటి దర్శకులైన కె.వి. రెడ్డి, ఎల్.వి. ప్రసాద్ 'పాతాళభైరవి', 'పెళ్ళిచేసి చూడు' వంటి చిత్రాలతో విజయా వారికి కనకాభిషేకం చేయడం వల్ల, వారితో పోల్చి బి.ఎన్. ను దివాలా దర్శకుడుగా జమకట్టేవారు. కాని, నిజానికి ఆయన చిత్రాలను బొత్తిగా 'ఫ్లాప్' చిత్రాలనడానికి వీల్లేదు. కొన్ని చిత్రాలకు డబ్బు రాకపోయినా అవార్డులు వచ్చాయి. కె.వి. రెడ్డి చివరి చిత్రాలలో మూడు 'ప్లాప్' కావడమే కాక, బొత్తికా చౌకబారుగా కూడా వున్నాయి.

Picture
వందేమాతరం

'వందేమాతరం' నుంచి 'స్వర్గసీమ' వరకు బి.ఎన్. చిత్రాలన్నీ ఆర్థికంగా విజయం సాధించడమే కాక, సమాజంలో కొంత చైతన్యాన్ని సాధించాయి. 'వందేమాతరం'లో స్వదేశీ ఉద్యమ సందేశాన్ని ఆయన ప్రచారం చేశారు. 'సుమంగళి'లో వితంతు వివాహ సమస్యను, 'దేవత' లో స్త్రీ జనోద్ధరణను, వర్ణాంతర వివాహాన్ని కథా వస్తువులుగా స్వీకరించారు. అప్పట్లో అవి విప్లవాత్మకమైన భావాలు. అయితే, ఆ ఇతివృత్తాలే తర్వాత తర్వాత చౌకబారు, వ్యాపార చిత్ర నిర్మాతల చేతుల్లోపడి, మలినమై ఫక్తు బాక్సాఫీస్ ఫార్ములాలుగా మారిపోయాయి. బి.ఎన్. ఉదాత్తమైన ఆశయంతో స్వీకరించిన సమస్యలను ఇతరులు ధనార్జనకోసం మసాలా దినుసులుగా ఉపయోగించుకున్నారు. ఆయన చిత్రాలలో సందేశం కథలో అంతర్వాహినిగా వుంటుంది. పాత్రలు గుండెలు బాదుకుంటూ నీతి సూత్రాలు వల్లించవు. ఆయన తన సందేశాన్ని కళాత్మకంగా స్ఫురింపజేస్తారు. చౌకబారు చిత్రాలలో 15 రీళ్ళు జయమాలిని సిగ్గుమాలిన నృత్యాలు, తాగుడు, ఫైటింగు వుంటాయి. పదహారో రీలులో హీరో గారు భరత వాక్యంగా నీతి ప్రవచనాలు చేస్తారు.

Picture
స్వర్గసీమ

'స్వర్గసీమ' తర్వాత బి.ఎన్. చిత్రాల ధోరణి మారింది. 'మల్లీశ్వరి', 'బంగారు పాప' చిత్రాలలో కథకంటే కథనానికి హెచ్చు ప్రాముఖ్యం కనిపిస్తుంది. బి.ఎన్. తొలి చిత్రాలలోని విప్లవాత్మకమైన అభ్యుదయ భావాలు ఈ చిత్రాలలో కనిపించవు. కాని, వీటిలో సున్నితమైన అనుభూతులకు సుందరమైన రూపకల్పన జరిగింది. ఇవి కళాఖండాలు. 'మల్లీశ్వరి'లో గొప్పశిల్పిగా, 'బంగారుపాప'లో కథా హృదయమెరిగిన రచయితగా కనిపిస్తారు. ఈ చిత్రాలన్నింటిలోనూ పూసల లోని దారం వలె-ఆయన కళా హృదయం ద్యోతకమవుతుంది. 'మల్లీశ్వరి', నాటికి కళాకారుడుగా ఆయన పరిపక్వదశకు వచ్చారు. 'మల్లీశ్వరి, 'బంగారుపాప' ఆయన చిత్రాలలో అత్యుత్తమమైనవి. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన చిత్రాలలో మణిపూసల్లాంటి చిత్రాలను ఐదింటిని ఏరితే, వాటిలో ఈ రెండూ వుంటాయి బి.ఎన్. తో పోల్చదగినంత గొప్ప కళా హృదయం గల తెలుగు దర్శకుడు ఒక్క నాగయ్య మాత్రమే. నాగయ్య నిర్మించి, దర్శకత్వం వహించిన 'త్యాగయ్య' చిత్రం బి.ఎన్. గారి ఏ చిత్రానికీ తీసిపోదు. ఇద్దరిదీ ఒకే శైలి, ఒకే హృదయం. ఒకరి ప్రభావం ఒకరి మీద బాగా కనిపిస్తుంది. చాలా సంవత్సరాలు ఇద్దరూ కలిసి పనిచేయడంవల్ల కావచ్చు. నాగయ్య సాటిలేని నటుడుగా పేరు పొందడం వల్ల, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు మూడు మాత్రమే కావడం వల్ల దర్శకుడుగా ఆయన ప్రసిద్ధుడు కాలేదు.

Picture
మల్లీశ్వరి

ఈ మధ్య ఒక ప్రముఖ సినిమానటుడూ మేధావీ ఒక సభలో 'మల్లీశ్వరి' చిత్రాన్ని విమర్శించారు. 'ఆ చిత్రాన్ని గొప్ప చిత్రమని ఇంత మంది ఎందుకు కీర్తిస్తున్నారో నాకు అర్థం కాదు. అప్పట్లో అది గొప్ప చిత్రమే కావచ్చు. కాని ఇప్పుడు దానిని గొప్ప చిత్రంగా భావించలేము. ఒక కాలానికి గొప్పదైన చిత్రం అన్ని కాలాలకు గొప్పది కానవసరం లేదు. కృష్ణదేవరాయల వారి అంతఃపుర వైభవం ఎవడిక్కావాలి? కొన్ని సన్నివేశాలని అందంగా చిత్రీకరిస్తే, మ్యూజియంలో ప్రదర్శించే అందమైన వస్తువుగా మలిచితే అది గొప్ప చిత్రం కాదు. రాయలవారి కాలంలోని వైభవాన్నే చూపించారు కాని, ఆ రోజుల్లో సామాన్య ప్రజలు ఎంత నికృష్టంగా జీవించారో చూపలేదు. బావా మరదళ్ళ ప్రేమకథే అయితే అటు వంటి చిత్రాలు చాలా వచ్చాయి. చారిత్రకమైన వాస్తవాలను ఆ చిత్రం ఎంత వరకు ప్రతిబింబించింది? ఈ ధోరణిలో సాగింది ఆయన విమర్శ. ఆయనకు బి.ఎన్. గారి పట్ల వ్యక్తిగతంగా గౌరవాభిమానాలున్నాయి. ఈ విమర్శలు చేయడంలో ఆయనకు దురుద్దేశమేమీ లేదు. ఆయన చిత్తశుద్ధిని శంకించనవసరం లేదు. ఆ విమర్శ కేవలం ఆయన ఒక్కరిదే కాదు. సమాజంలోని ఒకానొక మేధావి వర్గానిది. కాని, ఆ విమర్శ సమంజసమైనదిగా కనిపించదు.

రస స్పందన కలిగించేది కళ. హృదయాన్ని రంజింపజేసేది కళ. అది సమాజాన్ని పూడ్చి శుభ్రం చేసే గొరకచీపురు కానవసరం లేదు. ఒక వేళ చీపురే అయినా అది హాండిక్రాఫ్ట్స్ ఎంపోరియం లోని అందమైన చీపురుకావాలి. చీపుళ్ళన్నీ కళాఖండాలు కావు. సుందర రూపం లేనిదేదీ కళ కాదు. 'కళ'లో వస్తువు (content) కంటే ఆకృతి (form)కి ఎక్కువ ప్రాముఖ్యం వుంటుంది. ఖజురాహో శిల్పాలలోని వస్తువు బూతే కావచ్చు. బూతును చూసి వాటిని మనం ఆరాధించడం లేదు. బూతు కదా అని అసహ్యించుకోవడం లేదు. ఆ శిల్పాలలోని సౌందర్యాన్ని ఆరాధిస్తున్నాము. ఆ శిల్పంలోని 'శిల్పా'న్ని ఆరాధిస్తున్నాము. అలాగే 'మల్లీశ్వరి' చిత్రాన్ని మార్క్సిస్టు దృక్పధంతో చూడము. కళాదృష్టితోనే చూస్తాము. ఎన్ని శతాబ్దాలు గడచినా, శిల్పకళలో అధునాతనమైన శైలులు ఎన్ని వచ్చినా ఖజురాహో, కోణార్క, బేలూరు శిల్పాలు ప్రపంచ కళాప్రియులను ఆకర్షించక మానవు. సినిమా సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, ఎన్ని కొత్త హంగులను సంతరించుకున్నా సత్యజిత్ రాయ్ గారి 'పథేర్ పాంచాలి', చార్లీ చాప్లిన్ 'గోల్డ్ రష్', బి.ఎన్. రెడ్డి గారి 'మల్లీశ్వరి' కళాహృదయాన్ని రంజింపక మానవు.

ప్రతి చిత్రంలోనూ పేద ప్రజల జీవన సమస్యలను చిత్రించడం సాధ్యం కాదు. సహజంగా ఇతివృత్తంలో అందుకు అవకాశం వుండాలి కాని, బలవంతంగా జాగా చేసి ఇరికించడం హాస్యాస్పదంగా వుంటుంది. ఒక చిత్రం కేన్వాస్ 16 రీళ్ళకో, 18 రీళ్ళకో పరిమితమై వుంటుంది. ఇందులో సమస్త విశ్వాన్ని, సమస్త మానవ జీవితాన్ని చిత్రించడం సాధ్యం కాదు. ఒక మనిషి ఒక క్షణంలో ఒక వస్తువును ఒక కోణం నుంచి మాత్రమే చూడగలుగుతాడు. ఫలానా కోణం నుంచి మాత్రమే చూడగలుగుతాడు. ఫలానా కోణం నుంచి చూడలేదని ఫిర్యాదు చేయడం సమంజసం కాదు. కళా సృష్టిలో రెండు దశలు వుంటాయి. ఒకటి భావన (conception) దశ. రెండోది రూపకల్పన (execution) దశ. భావనలోనూ, రూపకల్పన లోనూ సుందరత వున్నప్పుడే గొప్ప కళాఖండమవుతుంది. భావంలో సుందరత వున్నా, దానికి సరియైన రూపకల్పన జరగకపోతే కళా సృష్టి విఫలమవుతుంది. 'మల్లీశ్వరి'లో బి.ఎన్. రెడ్డి గారు తన భావనకు రూపకల్పన చేయడంలో చాలా వరకు కృతకృత్యులైనట్లే కనిపిస్తుంది. 'చాలా వరకు' అనడంలో వుద్దేశమేమిటంటే - ఏ కళాకారుడూ తన భావనను పూర్తిగా కళాఖండంలో వ్యక్తపరచలేడు. ప్రకృతిలో లాగే కళాసృష్టిలో కూడా పరిపూర్ణత లేదు.

నండూరి పార్థసారథి
(1977 డిసెంబర్ లో ప్రచురితమయింది)

Previous Post Next Post