Title Picture

చెప్పుకోతగ్గ కథ ఏమీ లేకుండానే నూటికి నూరుపాళ్ళూ ఉత్తమ వినోదచిత్రం అనిపించుకున్న హిందీ చిత్రాలు ఈమధ్య చాలా అరుదుగా వచ్చాయి. అలాంటి అరుదైన చిత్రాలలో 'మియాబీబీరాజీ' ఒకటి.

ఈ చిత్రంలో కథాబలం, తారాబలం బొత్తిగా లోపించాయి. అయితే వాటితో నిమిత్తం లేకుండానే దర్శక బలంతో, సాంకేతిక బలంతో ప్రేక్షకులకు రెండు గంటలపాటు మైకం గమ్మేటట్లు చేయగలమని సవాలుచేసి నెగ్గారు ఈ చిత్ర దర్శకుడు, సాంకేతిక నిపుణులు. రెండు మూడు సార్లు చూసినా విసుగుపుట్టని చిత్రం 'మియాబీబీరాజీ'. జ్యోతిస్వరూప్ దర్శకత్వం, బర్మన్ సంగీతం, ముఖ్రామ్ శర్మ సంభాషణలు (కథ ఆయన వ్రాయలేదు), రమణ్ లాల్ ఫోటోగ్రఫీ, శైలేంద్ర పాటలు ఈ చిత్రవిజయానికి కారణాలు. వారి ఐదుగురి సమర్థతకూ ఈ చిత్రం గీటురాయి.

నటీనటులలో మహమూద్ ను ముఖ్యంగా చెప్పుకోవాలి. అతను అద్భుతంగా నటించాడు. అతి త్వరలోనే అతనికి విపరీతంగా గిరాకీ పెరుగుతుందని ఈ చిత్రం సూచిస్తుంది. వెకిలి వేషాలు వెయ్యకుండా సున్నితమైన, హాస్యాన్ని అందించాడు. అతని జంటగా కొత్తనటి సీమా చాలా చక్కగా ఉంది. మరొక జంటగా శ్రీకాంత్ గౌరబ్, కామినీ కదమ్ నటించారు. కామినీకదమ్ సమర్ధురాలు అని ఇది వరకే చాలా చిత్రాలు నిరూపించాయి. నూతన నటుడు శ్రీకాంత్ నటన సంతృప్తికరంగా లేదు. అందగాడు అంతకన్నాకాదు. డేవిడ్, నిరంజన్ శర్మ, సబితాచటర్జీ, డైసీ ఇరానీ మున్నగువారంతా ఎంతో హాయిగా, కులాసాగా నటించారు.

ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేము ఎంతో ఉల్లాసజనకంగా, హాయిగా, సేదతీర్చేవిధంగా ఉంది. మంచి చిత్రాలని చెప్పుకోదగ్గ చాలా హిందీ చిత్రాలలో కూడా ఎక్కడో అక్కడ కొంత సేపు వెర్రి డాన్సులు, పాటలు, పొలికేకలు ఉంటున్నాయి. ఈ చిత్రంలో అవేమీ లేవు. నిడివి చాలా తక్కువ. 12 వేల చిల్లర మాత్రమే.

అడుగడుగునా 'ఓహో' అనతగ్గ విధంగా ఉన్నది ఛాయాగ్రహణం. పాటల చిత్రీకరణ చాలా గొప్పగా ఉంది. చిత్రంలో ఉన్న ఏడు పాటలూ చక్కగా ఉన్నాయి. బర్మన్ సంగీతం ఎలా ఉన్నదీ అన్న ప్రశ్న ఎవరికీ రాదు. ఆయన సంగీతం అందరూ ఎరిగినదే. ఎన్ని వందల పాటలకి ఆయన రాగాలు కూర్చుతున్నా సగటు పాట ఒక్కటీ ఉఁడదు. ప్రతిపాటలో ఏదో క్రొత్త దనం, ఏదో తమాషా తళుక్కుమంటూనే ఉంటుంది. సీమాను వెంటబెట్టుకొని మహమూద్ ఒక పార్కుకు షికారు వెళ్తాడు. అక్కడ అరుస్తూ పాటపాడితే నలుగురూ పోగవుతారని బర్మన్ కి తెలుసు. అందుచేత ఆ పాటను రహస్యంగా ప్రేయసికి మాత్రమే వినిపించేటంత నెమ్మదిగా పాడించారు. ఆ పాట అమృత ప్రాయంగా ఉంది. మరొకపాట కమలాసిస్ట పాడింది. ఆమె కంఠం లత కంఠాన్ని తలపింపచేసింది. ఎంతో హాయిగా పాడింది.

ఇందులో చెప్పేందుకు ఆట్టే కథలేదు. ఒకాయనకు ఒక కూతురు, కొడుకు ఉంటారు. ఇంకోఆయనకి ఒక కొడుకు,కూతురు ఉంటారు. వీళ్ళమ్మాయి వాళ్ళబ్బాయి, వీళ్ళబ్బాయి వాళ్ళమ్మాయి పరస్పరం ప్రేమించుకుంటారు. కట్నాల దగ్గర పేచీ వస్తుంది. ఈ పిల్లలే ఆ పేచీని పరిష్కరించి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ముందే చెప్పినట్లు కథ కోసం ఈ చిత్రాన్ని చూడనక్కరలేదు.

నండూరి పార్థసారథి
(1960 ఆగస్టు 21వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post