Title Picture
దేవానంద్, సాధన

పాపం పెచ్చుపెరిగి, ప్రళయం విరుచుకుపడబోతున్నప్పుడు ధర్మదేవత మూడు కాళ్ళు విరక్కొట్టుకొని నాలుగో పాదంపై అల్లాడుతున్నప్పుడు, ధర్మసంస్థాపనార్థం భగవంతుడు భూమిమీద అవతారాలు తాల్చినట్లే -డబ్బింగ్ చిత్రాల హోరు పరాకాష్ట నందుకొని ప్రేక్షకుల మనస్సులు కకావికలమై, తలలు పగిలిపోగల పరిస్థితి ఏర్పడినప్పుడు, సినీ ప్రపంచంలో కళాదేవత ఒంటికాలిపై అఘోరిస్తున్నప్పుడు, మలయమారుతంలా, పన్నీటిజల్లులా, వేణుగీతంలా సేదతీర్చి, హాయికూర్చి, ప్రేక్షకమనస్సులలో ఆశాభావాలను చిగురెత్తించడానికి ఏ నాలుగు నెలలకో అయిదు నెలలకో ఒకసారి కళాత్మకం, వినోదాత్మకం అయిన - 'హమ్ దోనో' వంటి - చిత్రాలు విడుదల అవుతూ ఉంటాయి. సకాలంలో ఇటువంటి చిత్రాలు వచ్చి ఆదుకొంటున్నందువల్లనే సినీమా పరిశ్రమ విద్యావంతుల కోపానలానికి, శాపానలానికి ఆహుతి కాకుండా పోతున్నదేమో.

చూసిన మూడు గంటలతో వదలక, రాత్రిళ్ళు కలల్లోకి కూడా వచ్చి పగబట్టి పీడించే దేశవాళీ క్రైం చిత్రాలలా కాకుండా, 'సాంఘిక ప్రయోజనం' ముసుగువేసుకున్న సెక్సు చిత్రాలలా కాకుండా, కిశోర్ మార్కు వికృతహాస్య చిత్రాలలా కాకుండా, 'ఆరోగ్యకరమైన వినోదం' సమకూర్చుతుంది నవకేతన్ వారి 'హమ్ దోనో' చిత్రం.

ఈ చిత్రంలో హాస్యం కోసం ప్రత్యేకంగా పాత్రను కేటాయించలేదు. ''విలన్'' అనబడే వ్యక్తి కూడా లేడు. సర్కసులు, ఈతకొలనులు మొదలైన దేశవాళీ హంగామాలు లేవు. క్లైమాక్సులో కారులు కీచుమంటూ దూసుకుపోవు. కోర్టు రూము దర్శన మివ్వదు. నీతి ప్రబోధాలు బొత్తిగా లేవు (జనరక్షణ). ఆట్టే శృంగారమూ లేదు. ఈ 'లోపాల' దృష్ట్యా, చిత్రం ఎక్కడా అడుగుమేరయినా విసుగుపుట్టించదు. ఛాయాగ్రహణం ప్రశంసనీయంగా ఉంది. శబ్దగ్రహణం సున్నితంగా ఉంది. సంగీతం ప్రశాంతంగా, హాయిగా ఉంది. సెట్టింగ్సు నిరాడంబరంగా ఉన్నాయి. వ్యర్థమైన సంభాషణలుగానీ, సన్నివేశాలుగాని లేకుండా కథాగమనం గంభీరంగా, ఉత్తమంగా సాగింది. ఏ సందర్భంలోనూ రసాభాస జరగలేదు.

దేవానంద్ ఈ చిత్రంలో ప్రథమ పర్యాయంగా ద్విపాత్రాభినయం చేశాడు. చాలాకాలం నవకేతన్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేసిన అమర్ జిత్ తొలిసారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బర్మన్ శిష్యుడు జయదేవ్ సంగీతం నిర్వహించడం కూడా ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో ఈ ముగ్గురి కృషి కూడా ఫలించింది.

Picture
నందా, దేవానంద్

కథ సుఖాంతమే అయినా అసమంజసంగా జరగలేదు. ఇందులోని సమస్య కూడా సమజంసమైనదే. ఈ చిత్రంలో దేవానంద్ సాధారణంగా ఎవరూ ఆశించనంత చక్కగా నటించాడు. ఇన్నాళ్ళూ కేవలం డ్యూయెట్లు పాడే కుర్రాడుగానే రాణించిన దేవానంద్, గంభీరమైన పాత్రలను కూడా తాను నిర్వహించగలనని నిరూపించుకున్నాడు. సాధన, నందా మితంగా, జాగ్రత్తగా నటించారు.

ఈ చిత్రంలో ఆరుపాటలున్నాయి. వీటిలో ఐదుపాటలు చాలా హాయిగా ఉన్నాయి. 'అభీ న జావో ఛోడ్ కర్' అనే పాట మరీ బావుంది. చిట్టచివర నందా పాడిన భక్తి గీతం ఒక్కటి మాత్రం అనవసరమనిపించింది. అక్కడ ఒక్కచోట మాత్రం ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయికి దిగజారిపోయింది. ఆ పాట వరస కూడా అంత బాగాలేదు. నేపథ్య సంగీతం ప్రత్యేకంగా ప్రశంసించతగ్గ విధంగా ఉంది. సంగీతం అంతా బర్మన్ బాణీలో సాగింది.

ఈ చిత్రాన్ని ఆంధ్రలో శ్రీ దుర్గా ఫిలిండిస్ట్రిబ్యూటర్సు విడుదలచేశారు. ఈ నెల 26వ తేదీన విజయవాడ అలంకార్ థియేటరులో పత్రికలవారికి, స్థానిక ఫిలిం ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. నిర్మాత దేవానంద్ పుట్టిన రోజు కూడా ఆ రోజే.

వినోదం కోసం ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన మంచి చిత్రం 'హమ్ దోనో'.

నిర్మాత: దేవానంద్; దర్శకుడు: అమర్ జీత్; కథ: నిర్మల్ సర్కార్; సంగీతం: జయదేవ్; పాటలు: సాహిర్ లూధియాన్వీ; ఛాయాగ్రహణం: వి.రాత్రా; తారాగణం: దేవానంద్, సాధన, నందా, లలితా పవార్, లీలాచిట్నీస్, జాగీర్దార్, రషీద్ ఖాన్ వగైరా...

నండూరి పార్థసారథి
(1961 అక్టోబరు 1వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post