Title Picture

నజీర్ హుస్సేన్ ఫిలింస్ నిర్మించిన శృంగార, హాస్య ప్రధాన చిత్రం ''జబ్ ప్యార్ కిసీసే హోతాహై'' పత్రికా విమర్శకుల దృష్టిలో కాకపోయినా బాక్సాఫీసర్ల దృష్టిలోనూ, వినోదార్థుల దృష్టిలోనూ అత్యుత్తమ చిత్రం అనడంలో సందేహం లేదు. చలన చిత్రాలలో నూటికి నూరు పాళ్ళూ వినోదం అనబడేదాన్ని చొప్పించడం నజీర్ హుస్సేన్ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు.

చలన చిత్రాలు విజయవంతం కావాలంటే, ప్రజలకు పుష్కలంగా వినోదం కల్పించాలంటే కథ అత్యవసరం కాదనీ, అసలు కధంటూ ఉంటే చిత్రం యథేచ్ఛగా, కులాసాగా షికారు చేయడానికి వీలుండదనీ, పానకంలో పుడకలా అడ్డువచ్చి చికాకు పెడుతూ ఉంటుందనీ నజీర్ హుస్సేన్ ఈ చిత్రంలో నిరూపించడానికి ప్రయత్నించారు. ఆయన లోగడ తాను దర్శకత్వం వహించిన ''తుమ్సా నహీ దేఖా'', ''దిల్ దేకే దేఖో'' చిత్రాలలో కూడా ఈ ప్రయత్నం చేశారు. ఈ విషయం ఎలా ఉన్నా మొత్తానికి ఆ రెండు చిత్రాలూ ఆర్థికంగా ఘన విజయాన్ని సాధించాయి. ఈ చిత్రం కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందనడంలో సందేహించవలసిన పనిలేదు.

''జబ్ ప్యార్ కిసీసే హోతాహై'' చిత్రం పదహారు వేలపై చిల్లర అడుగుల పొడుగు చిత్రం. కథను గురించి ప్రశ్నించే వ్యవధి చిక్కనీకుండా, గుక్కతిప్పుకోకుండా, ఏకధాటిగా చిత్రాన్ని నడిపించారు నజీర్ హుస్సేన్. పాటలతో, నృత్యాలతో, శృంగార చేష్టలతో, డార్జిలింగ్ టీ తోటల వెంబడి, కాశ్మీర్ లోయల వెంబడి చిత్రం విలాసంగా పరిగెట్టుకు పోతూ ఉంటే మధ్య మధ్య అడ్డదార్ల వెంబడి కథ వచ్చి కలుసుకుంటూ, ఆట్టే డిస్టర్బ్ చెయ్యకుండా తొంగి చూసి పోతూ ఉంటుంది.

అమోఘమయిన అభినయ కౌశలం, అద్భుతమైన దర్శకత్వం, హృదయాలను కదిలించే సన్నివేశాలు కాదు గానీ, డార్జిలింగ్ లోయలలో పూలచేల మధ్య నుంచి దేవానంద్, ఆశాపరేఖ్ చెట్టా పట్టాలు వేసుకుని పరుగెత్తే దృశ్యాలు, లలిత మధురమైన యుగళ గీతాలు మాత్రం ప్రేక్షకుల మనస్సులలో చాలా కాలం వరకు మెదులుతూ ఉండగలవు.

ఇందులో నాయకుడు సుందర్ (దేవానంద్), నాయిక నిషా (ఆశాపరేఖ్), కథాకాలం నాటికి 20 సంతవ్సరాల క్రిందటే - అంటే వాళ్ళ పసితనంలోనే - నిషా తండ్రి (ముబారక్) పెద్ద వాళ్ళయిం తర్వాత వీళ్ళిద్దరికీ వివాహం చేయగలనని సుందర్ తల్లిదండ్రులకు మాట ఇచ్చాడు.

తర్వాత వాళ్ళూ వీళ్ళూ విడిపోయారు. 20 సంవత్సరాల తర్వాత, మళ్ళీ కథా కాలం నాటికి కలుసుకుంటారు. కాని ఈలోగా ఆయన లక్షాధికారి అవుతాడు. తన కూతుర్ని ససేమిరా సుందర్ కు ఇవ్వనంటాడు. సుందర్, నిషా ప్రేమించుకుంటారు. కులాసాగా కాలం గడుపుతూ ఉంటారు. మధ్యలో విలన్ (ప్రాణ్) అడ్డుపడతాడు. అతను నిషా తండ్రి ఎస్టేటుకు మేనేజరు. నిషాను అతనికిచ్చి వివాహం చేయాలని ముసలాయన సంకల్పం. విలన్ ఫ్లాష్ బాక్ లో ఒక హత్య చేసి, దాన్ని సుందర్ మీదకు నెట్టివేశాడు. క్లైమాక్సులో విలన్ పాపం పండి నిజం బైటపడుతుంది. నాయికా నాయకుల వివాహం జరిగిపోతుంది. ఉన్నంత వరకు ఈ చిత్రంలో కథ అనబడేది ఇది.

శంకర్ జైకిషన్ సంగీతం ఈ చిత్రానికి ప్రథానమైన ఆకర్షణ. మొత్తం ఇందులో ఉన్న ఏడు పాటలలోను ఐదు పాటలు చాలా హాయిగా, మళ్ళీమళ్ళీ నెమరువేసుకోతగినవిగా ఉన్నాయి. టైటిల్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ''జిస్ దేశ్ మే....'' చిత్రం తర్వాత శంకర్ జైకిషన్ ఇంత చక్కటి వరసలను ఈ మధ్య కూర్చలేదు. ఈ చిత్రానికి మరొక ముఖ్యమైన ఆకర్షణ ఛాయాగ్రహణం. ఉక్కపోసే థియేటరులో కూర్చున్నా డార్జిలింగ్ లోని చలిని ప్రేక్షకులు అనుభవించగలుగుతారు. ఇది ఛాయాగ్రహణం ప్రభావమే. దేవానంద్, ఆశాపరేఖ్ అలవాటు ప్రకారం కులాసాగా నటించారు. రెండున్నర గంటల వినోదంకోసం, ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ చూడతగిన చిత్రం ''జబ్ ప్యార్ కిసీసే హోతా హై''.

నండూరి పార్థసారథి
(1960 నవంబరు 26వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post