Title Picture

డజన్ల కొద్దీ చిత్రాలు నిర్మించి, ప్రభుత్వ ఆదాయాన్నీ, ముడిఫిలిం పరిశ్రమనూ పోషించటం ఫిల్మిస్థాన్ వారి ఆదర్శం. ఆ డజన్లలో కొన్ని చిత్రాలు (పా)తాళప్రమాణాన ఉంటాయి. అటు మరాఠీలోనూ, ఇటు హిందీలోనూ బహుపురాతన కాలం నుంచీ అత్యధిక సంఖ్యలో ఫిల్ములను ఉత్పత్తి చేసిన ఉభయభాషా ప్రవీణులు ఫిల్మిస్థాన్ వారు. ఫిల్మిస్థాన్ లో పనిచెయ్యని దర్శకుడూ, నటించని తార, తెరకెక్కని కథా లేదని కొందరు మాటవరసకి అంటుంటారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఫిల్మిస్థాన్ చిత్రాలను వ్రేళ్లమీద లెక్కించవచ్చును.

కథా సంగ్రహం

ధర్మపురం క్వారీ (గనులు త్రవ్వే కంపెనీ) యజమానురాలు ఒకావిడ ఉంటుంది (దుర్గా ఖోటే). ఆవిడ భర్త కథ మొదలు కాకముందే చనిపోయి, గోడమీద ఫొటోలో నివసిస్తూ ఉంటాడు.

ముసలి బీదనౌకరు (బద్రీప్రసాద్) అడవిలో, అందమైన బంగళాలో కాపురం ఉన్నాడు. అతనికి హంటర్ వాలీ లేక జంగిల్ గర్ల్ నమూనాలో ఒకకూతురు (అమితా) ఉంది. బీదవాళ్లు కావటం చేత ఆమె ఎప్పుడూ బిగుతుపాంట్లూ, బుష్ కోట్లూ, బూట్లూ వేసుకుంటూ ఉంటుంది. వేటకుక్కని వెంటవేసుకొని సరదాగా తుపాకీతో సింహాలూ మొదలయిన వాటిని చంపుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. శిష్టరక్షణా, దుష్టశిక్షణా ఆమె ఆదర్శం. రౌడీలను తుపాకీతో బెదిరిస్తూంటుంది. ఇలాఉండగా కొన్నాళ్ళకి క్వారీ యజమానురాలు కొడుకు కైలాశ్ బాబు (రవీంద్రకపూర్) అనే హంటర్ వాలా విదేశాలలో చదువు ముగించుకుని వచ్చి, అడవిలో తిరుగుతూ, ఈ అమ్మాయి దగ్గర తుపాకీ పేల్చటం నేర్చుకుని, బదులుగా జీపు నడపటం నేర్పుతాడు. తర్వాత డ్యూయెట్ పాడి, గుళ్లో పెళ్లి చేసుకుంటారు.

క్వారీ మేనేజరు చమన్ లాల్ దుష్టుడు. అతడు ఉక్రోషంతో యజమానురాలికి ఫిర్యాదు చేసి, కథానాయకుణ్ణి విదేశాలకు పంపిస్తాడు. తర్వాత ఆ అమ్మాయితల్లి అవుతుంది. పిల్లవాడిని దుష్టుడు దొంగిలించుకువస్తాడు. ఆమె గుడిసె తగులబడిపోతుంది. తండ్రి అంతకు ముందే పోతాడు. అంతా ఆమె చనిపోయిందనుకుంటారు. విదేశాలనుంచి తిరిగి వచ్చిన కైలాశ్ రెండో పెళ్ళి చేసుకుంటాడు. పిల్లాడు అనాధ శరణాలయంలో పెరుగుతుంటాడు. కథానాయిక ఈలోగా రెండు మూడు ఆశ్రమాలు మారుతుంది. దుష్టుని పన్నాగంలో చిక్కుకున్న పిల్లవాడిని ఆమె రక్షిస్తుంది. ఆమెకు విపరీతంగా గాయాలు తగులుతాయి. నాయికా నాయకులూ, వారి పిల్లవాడూ కలుసుకుంటారు. ఇక్కడ దర్శకుడు కాస్త తటపటాయించాడు - ఆమెను చంపాలా, బ్రతికించాలా అని. బ్రతికిస్తే సినిమా పండితులు దుమ్మెత్తిపోస్తారు.

కథ ఇక్కడివరకూ హుషారుగానే ఉంది కనుక, ఈ కాస్తా విషాదం చేసినంతలో పోయిందేమీలేదని గ్రహించి, పండితుల ఆత్మ శాంతికోసం ఆమెను కథకు బలిపెట్టారు. ఇందులో నూతన నటుడు రవీంద్రకపూర్.. దిలీప్ కుమార్, దేవానంద్ మొదలయిన వారి నటనలను సమపాళంలో రంగరించి వంటబట్టించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. అమితా చాలా అందంగా ఉంది. చక్కగా నటించింది. హంటర్ వాలీగా కంటే తల్లిగా బాగా నప్పింది.

రోషన్ సంగీతం బాగానే ఉంది. రెండు పాటలు చాలా చక్కగా ఉన్నాయి. వాటిలో ముఖేష్ పాడిన విషాదగీతంలో కొంత విశేషం వుంది. రోషన్ ఆ పాటలో చక్కని ప్రయోగాలు చేశాడు. పాట ఎక్కడ మంద్రంలోకి వస్తుందో, ఎక్కడ మధ్యస్థాయిలోకి పోతుందో శ్రోతలు ముందుగా ఊహించలేని విధంగా, స్వరాల ఎగుడు దిగుడు కూర్పుతో చక్కని చమత్కారాలు చేశాడు.

ఈ చిత్రానికి దర్శకుడు సతీష్ నిగమ్. అందమైన అమితా, ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. వినోదం కోసం తప్పక ఒకసారి చూడవచ్చును.

నండూరి పార్థసారథి
(1960 జనవరి 31వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post