వేదాంతం సత్యనారాయణ శర్మ
ప్రాచీన నాట్య సంప్రదాయ పరిరక్షణకు కూచిపూడి కళాకారుల అవిరళ కృషి

బెంగళూరు, జూన్ 1: కూచిపూడి బ్రాహ్మణ కుటుంబాలవారికి ఎన్నో శతాబ్దాలుగా, అవిచ్ఛిన్నమైన వారసత్వంగా సంక్రమిస్తున్న ఉత్కష్ట నాట్యకళా సంప్రదాయాన్ని పరిరక్షించడానికి, ముందుతరాలకు అందజేయడానికి తాము ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా స్వగ్రామాన్నే అంటి పెట్టుకుని ఉండి శాయశక్తులా కృషి చేస్తున్నామని సుప్రసిద్ధ కూచిపూడి నర్తకుడు పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ క్రిందటి వారం ఇక్కడ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు.

కూచిపూడి (కృష్ణాజిల్లా)లో నాట్యకళకు జీవితాలను అంకితం చేసిన కుటుంబాల పరిస్థితులను గురించి ప్రశ్నించగా, వేదాంతం ఇంకా ఇలా వివరించారు: "కూచిపూడి నుంచి ఎంతో మంది ప్రముఖ నాట్యాచార్యులు మద్రాసుకు వెళ్ళి, అక్కడ సినిమా రంగంలో స్థిరపడ్డారు. ఇంకా కొందరు ఇతర పెద్ద నగరాలలో స్థిరపడ్డారు. ఆర్థికంగా వారందరి పరిస్థితి బాగానే ఉంది. నేటి పరిస్థితులలో దేశ వ్యాప్తమైన కీర్తి గడించిన కొద్దిమంది ప్రవీణులు తప్ప, ఇతరులు కేవలం నాట్యకళపై ఆధారపడి జీవించడం సాధ్యంకాదు. అందుకే మా గ్రామం నుంచి కుర్రవాళ్ళు పై చదువులకోసం పట్నాలకు వెళ్ళిపోతున్నారు. చదువులు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడుతున్నారు. మా కుటుంబాలలో ఒక కుర్రవాడు ఎం.ఏ. పాసై, కూచిపూడి నాట్యకళపై డాక్టరేట్ కోసం పరిశోధన చేస్తున్నాడు. మరి ఈ విధంగా చదువుల కోసం, ఉద్యోగాల కోసం, సినిమా రంగ ప్రవేశం కోసం అందరూ వెళ్ళిపోతే కూచిపూడిలో మిగిలేదేమిటి? అందుకే నేను గ్రామాన్నే అంటిపెట్టుకుని ఉండిపోయాను. నా బృందంలో 20 మంది ఉన్నారు. వారందరి బాధ్యత నాపై ఉంది".

"మా గ్రామంలో కళ అంతరించిపోకుండా ఉండేందుకు మేము కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాము. ప్రతి కుటుంబంలో కనీసం ఒక కుర్రవాడు నాట్యకళకు అంకితం కావాలని మేము నిర్ణయించాము. ఆవిధంగా ఇప్పుడు ప్రతి బ్రాహ్మణకుటుంబంలో కనీసం ఒక కుర్రవాడు శాస్త్రోక్తంగా నృత్యం నేర్చుకుంటున్నాడు. ఆ విధంగా అంకితమైన వారు కాక, ఇతర బాలురు కూడా నేర్పుకుంటున్నప్పటికీ వారు పైచదువులకు వెళ్ళవలసివచ్చినప్పుడు నృత్యం మానివేస్తున్నారు. అయితే, చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇతర చోట్లకు వెళ్ళినవారు కూడా ఏడాది కొకసారి-కృష్ణాష్టమి ఉత్సవాలకు-కూచిపూడి వచ్చి, అక్కడ నృత్య కార్యక్రమాలలో పాల్గొనాలని తీర్మానించాము. అందరూ ఆవిధంగానే వచ్చి, ఆ ఉత్సవంలో నృత్యం చేస్తున్నారు".

"స్వర్గీయ బందా కనకలింగేశ్వరరావు గారి కృషి ఫలితంగా కూచిపూడిలో ఒక 'కళాక్షేత్రం' వెలసింది. ఏలూరులో, గుడివాడలో, ఢిల్లీలో దాని శాఖలు ఉన్నాయి. అవన్నీ చక్కగా నడుస్తున్నాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ గ్రాంట్లు వాటికి లభిస్తున్నాయి".

"కూచిపూడిలో స్థిరపడిన మీవంటి వారికి ఆదాయం ఏవిధంగా లభిస్తున్నది? మీ ప్రదర్శనలకు తగినంత గిరాకీ వున్నదా?" అని ప్రశ్నించగా శ్రీ వేదాంతం, తమ బృందం రాష్ట్రంలోపల, రాష్ట్రం బైట ఏడాదికి సుమారు వంద ప్రదర్శనలిస్తున్నారనీ, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందనీ చెప్పారు. మద్రాసు, ఢిల్లీ, కలకత్తా వంటి నగరాలలో కూడా తాము పెక్కు సార్లు ప్రదర్శనలిచ్చినట్లు ఆయన తెలిపారు.

కూచిపూడి బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లలు నృత్యం నేర్చుకోరాదని మూడు వందల ఏండ్ల క్రిందట సిద్ధేంద్రయోగి విధించిన నియమాన్ని తాము ఇప్పటికీ పాటిస్తున్నామని ఆయన చెప్పారు. "ఇప్పుడు పట్టణాలలో, నగరాలలో చాలామంది ఆడపిల్లలు కూచిపూడి నృత్యం నేర్చుకొని, ప్రదర్శనలిస్తున్నారు కదా? యామినీ కృష్ణమూర్తి వంటివారు కూచిపూడి నాట్యాన్ని ప్రపంచమంతా ప్రచారం చేశారు కదా? మీరు మాత్రం మీ కుటుంబాలలో ఆడపిల్లలకు ఎందుకు నేర్పకూడదు?" అని విలేఖరి ప్రశ్నించారు.

"మాది చిన్న గ్రామం. ఇప్పటికీ అక్కడ ఆచార సంప్రదాయాల పట్టింపులు ఎక్కువ. గజ్జెకట్టిన ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావడం కష్టం. వారిని హీనంగా చూస్తారు. అందుకే మా కుటుంబాలలో ఆడపిల్లలకు నాట్యం నేర్పే సాహసం చేయలేకపోతున్నాము. మగపిల్లలు మాత్రం సగర్వంగా నేర్చుకుంటున్నారు. గజ్జెకట్టిన కుర్రవాడికి మంచి సంబంధాలు వస్తాయి. అందులోనూ ఆడవేషాలు వేయడం మరీ గొప్ప. మా కుటుంబాలలోకాక, ఇతర కుటుంబాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆడపిల్లలకు మేము నేర్పుతూనే ఉన్నాము. కాని, సాధారణంగా ఆ ఆడపిల్లలు వోణీలు వేసుకొనే వయస్సురాగానే మానేస్తున్నారు" అని వేదాంతం చెప్పారు.

"శృంగార నాయికగా మీరు రాణించినంత గొప్పగా ప్రసిద్ధ నర్తకీమణులు కూడా రాణించలేకపోతున్నారు. ఎందుచేత?"

"కొన్ని కొన్ని శృంగార చేష్టలను ప్రదర్శించడానికి స్త్రీలు సహజంగా సిగ్గు పడుతారు. ఆడవేషం వేసే నాలాంటి మగవాడికి ఆ బాధ లేదు".

కూచిపూడిని విడిచి మద్రాసు వంటి నగరాల్లో స్థిరపడిన కూచిపూడి నాట్యాచార్యులపై భరతనాట్య ప్రభావం కనిపిస్తున్నదనీ, వారు తమ శిష్యురాండ్రకు నేర్పే నాట్యం అచ్చమైన కూచిపూడి నాట్యంగా ఉండడం లేదనీ, వారి నాట్యంలో భరతనాట్యపు ముద్రలు కానవస్తున్నాయనీ ఆయన అన్నారు.

సత్యనారాయణశర్మ, ఆయన బృందం వారు క్రిందటివారం ఇక్కడ రెండు నృత్య నాటకాలను ప్రదర్శించారు. రంగస్థలంపై ఒయ్యారిభామగా ఆయనను చూసి, 'మోహించిన' కళాప్రియులు విడిగా ఆయనను చూస్తే నిర్ఘాంతపోతారనడంలో సందేహం లేదు. "చూడకుండా ఆ భామాస్మృతినే మధురమధురంగా నెమరు వేసుకుంటే బాగుండేది కదా" అని ఆశాభంగం పొందుతారు. 'ఆంధ్రప్రభ' విలేఖరికీ అటువంటి అనుభూతే ఎదురయింది. రంగస్థలం మీది అందాలరాశి, ఈయన ఒకరేనన్న సత్యాన్ని విశ్వసించడం బాధాకరమయింది. రెండూ పూర్తి విరుద్ధరూపాలు. కళ్ళు తప్ప గుర్తించడానికి ఆధారాలు లేవు.

కొంచెం మాసిన అడ్డపంచె కట్టుకున్న ఆయన 'రండి' అంటూ నవ్వుతూ ఆహ్వానించారు. ఆ నవ్వులో భామవిసిరే విరితూపులు లేవు. నల్లగా, బొద్దుగా ఉన్నారు. పైగా బట్టతల. ఆయన నిజరూపంతో విలేఖరి 'రాజీ' పడడానికి పది, పదిహేను నిమిషాలు పట్టింది. కాస్త అలవాటు పడిన మీదట ఆయన మళ్ళీ ఆరాధించదగిన గొప్ప కళామూర్తిగా కనిపించాడు. ఆయన అతి నిరాడంబర వ్యక్తి. తెచ్చి పెట్టుకున్న దర్జా, డాబు, 'పద్మశ్రీతనం' ఏకోశానా లేవు. ఆయన స్వచ్ఛంగా, అమాయకంగా నవ్వుతారు. ఆయన మాటల్లో, చేష్టల్లో సంస్కారం అతిసహజంగా వ్యక్తమవుతుంది. ఆయన ఎంత అపురూపమైన వ్యక్తో, ఎంత ఉత్కృష్టమైన కళావైభవానికి ప్రతినిధో తెలిసినవారికి ఆయనను దగ్గరగా చూస్తుంటే తాజ్ మహల్ నో, తంజావూరు బృహదీశ్వరాలయ గోపురాన్నో చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

"ఇక్కడ కూర్చునేందుకు ఇంతకంటే ఏమీ లేవు" అని ఆయన నేలమీద ఒక దుప్పటి పరచి ఆహ్వానించారు. 'ఇంత గొప్ప కళాకారుని ఆహ్వానించిన వారు ఇంత కంటే మంచి బస ఏర్పాటు చేయలేకపోయారా' అని విలేఖరికి మనస్సు చివుక్కు మనిపించింది. వేదాంతం, ఆయన బృందం వారు ఒక హాస్టల్ లో విడిది చేశారు. అదొక హాలు. మంచాలు, పరుపులు కాదుకదా, కనీసం చాపలు కూడా లేవు. కూచిపూడి కళాకారులు తాము తెచ్చుకున్న పక్క చుట్టలే పరుచుకుని పడుకుంటున్నారు. కాని తమకు సరియైన మర్యాద జరగలేదన్న చింత వేదాంతంగారికి ఆవంతైనా ఉన్నట్లు కనిపించలేదు. చాలా సహజంగా ఆయన నేలమీద చతికిలపడి, గోడకానుకుని కూర్చున్నారు. మన కళాపోషకులు విదేశయాత్రలు చేసివచ్చిన కళాకారులకు మాత్రం 'ఫైవ్ స్టార్' హోటళ్ళలో బస ఏర్పాటు చేస్తారు. కూచిపూడి వారికి 'జనతా' విడిది చాలుననుకున్నారేమో.

ఏడు మల్లెపువ్వుల ఎత్తు సత్యభామలోని నాజూకుతనం వేదాంతం స్వభావంలో, మాట తీరులో ఉన్నది. కాని, భామలోని దర్పం, జాణతనం మాత్రం లేవు. ఆయన చూపులో బేలతనం, జాలితనం కనిపిస్తాయి. ఏదో అందమైన లోకం నుంచి దారితప్పి వచ్చినవాడిలాగా, జారవిడుచుకున్న ఏదో అమూల్య వస్తువుకోసం వెతుక్కుంటున్న వాడిలాగా కనిపిస్తారు.

వేదాంతం 1934లో కూచిపూడిలో వేదాంతం వెంకటరత్నం గారి మూడవ కుమారుడుగా జన్మించారు. ఆయన పెద్ద అన్నగారు వేదాంతం ప్రహ్లాదశర్మగారు ప్రముఖ నాట్యాచార్యుడు. రెండవ అన్నగారు వీరరాఘవయ్య. ఈయన సూత్రధారుడుగా వేదాంతం వారి బృందంలో పాట పాడుతూ ఉంటారు. కుటుంబ సంప్రదాయానుసారం సత్యనారాయణశర్మ ఏడవ యేట నృత్యా భ్యాసం ప్రారంభించారు. ఇరవయ్యేళ్ళకే యావద్భారత ఖ్యాతి గడించారు. 24 ఏళ్ళకు కేంద్ర ప్రభుత్వ ప్రశస్తి పొందారు. పద్మశ్రీ బిరుదు నందుకున్నారు.

వేదాంతం ఇంతవరకు విదేశాలలో పర్యటించలేదు. కూచిపూడి నాట్యకళా ప్రతినిధిగా కూచిపూడి నాట్య ప్రచారానికి ఆయనను విదేశాలకు పంపడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, అకాడమీల ధర్మం. విదేశాలలో ఆయన ప్రదర్శనలివ్వడమేకాక, సోదాహరణ ప్రసంగాలు ఇవ్వడం అవసరం. కరచరణ విన్యాసాలలో కూచిపూడి శైలికి, భరతనాట్య శైలికి గల తేడాలను ఆయన చక్కగా ప్రదర్శిస్తూ వివరించగలరు.

నండూరి పార్థసారథి
(1976 జూన్ 2వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post