Title Picture

హైదరాబాదులో సినీ సంగీత అకాడమీ

సుప్రసిద్ధ చలన చిత్ర సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు సారధ్యంలో త్వరలోనే చలన చిత్ర సంగీత అకాడమీ (అకాడమీ ఆఫ్ సినీ మ్యూజిక్) ఒకటి భాగ్యనగరంలో అవతరించబోతున్నది. ఆ సంస్థను ఎలా తీర్చిదిద్దాలి, ఎలా నిర్వహించాలి అన్న విషయమై సంగీత ప్రియులు, పాత్రికేయుల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం రాజేశ్వరరావు శనివారం ఉదయం రవీంద్రభారతి మినీ థియేటరులో ఒక గోష్ఠిని ఏర్పాటు చేశారు. ఈ అకాడమీని నెలకొల్పాలనుకోవడంలో తమ ఉద్దేశాలను ఆయన ముందుగా వివరించారు. నగరంలో చలనచిత్ర పరిశ్రమను సర్వతోముఖంగా అభివృద్ధి పరచడానికి చురుకుగా కృషి జరుగుతున్నది. ఇక్కడ చిత్రాలు నిర్మించడానికి స్టూడియో ఫ్లోర్ల కొరత లేదుకాని, పాటల రికార్డింగ్ సదుపాయాలు లేకపోవడం పెద్ద ఇబ్బందిగా ఉన్నది. మన చిత్రాలలో ఇప్పటికీ పాటలు తప్పనిసరిగా ఉంటున్నాయి. పాటలు లేకపోతే చిత్రాలకు ప్రజాదరణ ఉండదు. హైదరాబాద్ లో షూటింగు కార్యక్రమమంతా పూర్తి చేసుకున్నా, పాటల రికార్డింగు కోసం నిర్మాతలు మద్రాసును దర్శించక తప్పడం లేదు. గాయనీ గాయకులంతా అక్కడే ఉన్నారు. వాద్యకారులంతా అక్కడే ఉన్నారు. వారిని ఇక్కడకు తరలించడం సాధ్యం కాదు. ఎందుకంటే వారికి మద్రాసులో నాలుగైదు భాషల చిత్రాల గిరాకీ ఉంది. అంత గిరాకీని వదులుకొని వారు ఇక్కడికి వచ్చి స్థిరపడరు. అందుచేత నిర్మాతలు మద్రాసు వెళ్లి అక్కడే పాటలను రికార్డు చేయిస్తున్నారు. దీని వల్ల బోలెడు ఖర్చు అవుతున్నది.

ఈ ఖర్చు తప్పాలంటే గాయనీ గాయకులను, వాద్యకారులను ఇక్కడే తయారు చేసుకోవడం అవసరం. సినిమాలలో పాటలు పాడాలన్న ఆసక్తి గలవారు, ప్రతిభ గల వారు ఇక్కడ ఉన్నారు. వారికి తగు శిక్షణ కావాలి. గుర్తింపు, ప్రోత్సాహం కావాలి. నగరంలో ఇప్పుడు సినీ టాలెంట్స్ గిల్డ్ అని ఒకటుంది. అందులో ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. వారు అప్పుడప్పుడూ వాద్య బృందంతో సినీ సంగీత కచేరీలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి నుంచి మెరికల్లాంటి వారిని కొందరిని ఏరి, వారికి శిక్షణ యివ్వడం, సినిమాలలో వారికి అవకాశాలు యివ్వడం రాజేశ్వరరావు ప్రారంభించదలచిన అకాడమీ ఆశయం. ముందుగా వచ్చే ఫిబ్రవరిలో ఒక సంగీత విభావరిని నిర్వహించి, తద్వారా వసూలయ్యే నిధులను ఈ అకాడమీకి ఉపయోగించుకోవాలని ఆయన సంకల్పం. ముందు స్వశక్తితో కృషి చేసి కొంత ప్రగతి సాధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని ఆర్థించాలని ఆయన అనుకుంటున్నారు. ఆయన సంకల్పం సిద్ధిస్తే నిర్మాతలు పాటల రికార్డింగు కోసం మద్రాసు చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసిన అవసరం ఉండదు.

లలిత, శాస్త్రీయ, జానపద సంగీత రీతులలో ఈ అకాడమీ పరిశోధన కూడా సాగించగలదని రాజేశ్వరరావు చెప్పారు.

నండూరి పార్థసారథి
(1978 అక్టోబర్ 2వ తేదీ ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post