Title Picture

వేశ్యలపై హాస్య చిత్రం

సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నాడు మహాకవి.

వేశ్యల కష్టాలు వేశ్యలవి.

వృత్తి పరమైన కష్టాలు ఎంతవారికైనా తప్పవు. వేశ్యలకైనాసరే.

ప్రపంచంలోని వృత్తులన్నింటిలో ప్రాచీనమైనది వేశ్యా వృత్తి. వివాహ వ్యవస్థ ఎంత పాతదో వేశ్యా వ్యవస్థ అంత పాతది. మానవ సమాజంలో 'భార్య' ఎప్పుడు అవతరించిందో 'వేశ్య' అప్పుడే అవతరించింది. మగ జనాభాలో అధిక సంఖ్యాకులు (పబ్లిగ్గా కాకపోయినా) వేశ్యను ఒక నిత్యావసర వస్తువుగా గుర్తించి అస్తారుపదంగా పోషిస్తున్నందువల్ల అల్ప సంఖ్యాకులు ఎన్ని ఆందోళనలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. వేశ్య చిరంజీవిగా వర్ధిల్లుతున్నది.

'గృహమే కదా స్వర్గసీమ' అని పబ్లిగ్గా పాడుకొనే వారూ, 'వేశ్యా గృహమే కదా స్వర్గసీమ' అని ప్రైవేటుగా పాడుకునే వారూ అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో ఉంటూనే ఉన్నారు. అయితే మంచి నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రైల్వే, తంతి, తపాలా సర్వీసులను గౌరవించినట్లుగా సమాజం వేశ్యల సర్వీసును గౌరవించడం లేదు. పోలీసులు, ప్రభుత్వాధికారులతో సహా అన్ని వర్గాల వారు, అత్యున్నత స్థానాలలో ఉన్నవారు సైతం వేశ్యల సేవలను సూర్యాస్తమయం తర్వాత వినియోగించుకొంటూ సూర్యోదయం కాగానే అసహ్యించుకొంటున్నారు.

ఈ విశ్వాస ఘాతుక వైఖరిని, ఈ కాపట్యాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నించిన చిత్రం 'ది బెస్ట్ లిటిల్ హోర్ హౌస్ ఇన్ టెక్సాస్'. నగరానికి, పెద్ద మనుషుల సమాజానికి అల్లంత దూరాన నిత్య సువాసినులతో నిత్య కల్యాణం పచ్చ తోరణంగా, కస్టమర్లతో కలకలలాడే కిలకిలలాడే ఒకానొక వేశ్యాగృహం (హోర్ హౌస్) కథ ఇది. వంద సంవత్సరాల చరిత్ర గల ఆ 'స్వర్గ సీమ'ను ప్రస్తుతం మోనా అనే అందాలరాశి ఓ పాతిక మంది పడుచు పడుపు పడతుల పటాలంతో ఏలుతోంది.

ఆ వేశ్యా గృహంలోపల అదొక చిన్న ప్రపంచం. అందులోని వారంతా స్వేచ్ఛా జీవులు. చీకూ చింతా లేకుండా పైలా పచ్చీసుగా జీవితాన్ని మజా చేస్తున్నారు. వాళ్ళపై మోనా 'పెత్తనం' ఏమీలేదు. అందరూ ఎంతో సఖ్యంగా ఒక్క కుటుంబంగా మెలుగుతున్నారు. వారు బైట ప్రపంచంలోకి వెళ్ళకపోయినా బైటి ప్రపంచంలోని వారు ప్రతి రాత్రీ ఈ చిన్న ప్రపంచంలోకి వచ్చిపోతూనే ఉన్నారు. ఈ రెండు ప్రపంచాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఈ వేశ్యా ప్రపంచం చట్టవిరుద్ధమే అయినప్పటికీ ఆ చట్టాన్ని అమలు జరపవలసిన అధికారులు కూడా కస్టమర్లే కనుక మోనా సామ్రాజ్యానికి ప్రమాదమేమీ వాటిల్లలేదు. పైగా ఆ అధికారులు గుట్టుగా ఆ సామ్రాజ్యానికి రక్షణ కల్పిస్తున్నారు.

Picture
డాలీ పార్టన్

అందరూ అలా చల్లగా కాలం గడుపుతున్న సమయంలో 'వాచ్ డాగ్ రిపోర్ట్' అనే బోర్డు తగిలించుకొన్న ఒక టీవీ జర్నలిస్టు పెద్ద న్యూసెన్సుగా తయారయాడు. అతగాడు తనటీవీ కెమెరాలతో, రికార్డర్లతో అడపాతడపా ఆ వేశ్యా గృహంపై దాడి జరుపుతూ అక్కడికి వచ్చే పోయే అధికారుల గుట్టు రట్టు చేయడం మొదలు పెట్టాడు. ఆ గృహాన్ని నిషేధించాలని టీవీలో ఉద్యమం ప్రారంభించాడు. సభ్య సమాజాన్ని రెచ్చ గొట్టడం మొదలు పెట్టాడు. దానితో ఇష్టం లేకపోయినా అధికారులు తప్పనిసరిగా ఆ గృహాన్ని మూసి వేయించ వలసివచ్చింది. వేశ్యలు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా బైటి ప్రపంచంలో అడుగు పెట్టారు. మోనా కోసం కాముకుడుగా వెళ్ళి క్రమంగా ప్రేమికుడుగా మారిన పోలీస్ అధికారి చివరికి ఆమెను పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

కోలిన్ హిగిన్స్ ఈ చిత్రాన్ని కేవలం కాలక్షేపం కోసం మ్యూజికల్ కామెడీగా తీద్దామని మొదలుపెట్టి సగంలో సైటైర్ గా మార్చి చివరికి (హీరోయిన్ చేత) కాస్త కంటతడిబెట్టించి 'త్రీఇన్ వన్' చేశాడు. గొప్ప చిత్రం కాదు గాని, ఓ మోస్తరు మంచి చిత్రమే. బెంగుళూరు రెక్స్ ధియేటర్లో మూడో వారం జోరుగా నడుస్తోంది. కథానాయిక డాలీ పార్టన్ బాగా నటించింది. బాగా పాడింది. అయితే అందం, అంగసౌష్టవం మరీ ఎక్కువ కావడం వల్ల ఆమె ప్రతిభ మరుగునపడిపోయింది. బర్ట్ రెనాల్డ్స్ లాంటి ప్రముఖ నటుడు హీరోగా నటించినా, జనం వెర్రెత్తి చూస్తున్నది ఆమె అంగ సౌష్ఠవాన్నే. అయితే పేరు చూసి జనం ఆశిస్తున్నంత 'పచ్చి'దృశ్యాలు చిత్రంలో లేవు. సెన్సారు వారి పుణ్యం కావచ్చు.

నండూరి పార్థసారథి
(1985 జూలై 29వ తేదీన ఆంధ్రప్రభ బెంగళూరు ఎడిషన్ లో ప్రచురితమయింది.)

Previous Post Next Post