హిందూస్థానీ సంగీత విద్వాంసులలో ఈనాడు రవిశంకర్ కు, అలీ అక్బర్ ఖాన్ కు ఉన్నంత ప్రచారం, గిరాకీ మరెవ్వరికీ లేదు. దేశ విదేశాలలో వీరికి ఉన్నంత మంది శిష్యులు మరెవ్వరికీ లేరు. ప్రపంచంలో ఎక్కడైనా సరే వీరిద్దరిలో ఏ ఒక్కరు కచేరీ చేసినా హాలు కిటకిట లాడిపోతుంది. ఇక ఇద్దరూ కలిసి కచేరీ చేస్తే టిక్కెట్ల కోసం రద్దీ చెప్పడానికి వీల్లేదు. ఇద్దరూ బాల్యమిత్రులు, ఒకే గురువుగారి శిష్యులు, బావ, బావమరదులు. స్వర్గీయ అల్లాఉద్దీన్ ఖాన్ వారికి గురువు మాత్రమే కాక అలీ అక్బర్ కు తండ్రి, రవిశంకర్ కు మామగారు కూడా. మైహర్ గ్రామంలో ఇద్దరూ సంగీతం నేర్చుకొనే రోజుల్లోనే గురువు గారు కచేరీ చేసినప్పుడల్లా వారిద్దరూ వేదికపై ఆయన పక్కన కూర్చుని సితార్, సరోద్ వాయించేవారు. ఆ తర్వాత ఇద్దరూ స్వయంగా కచేరీలు చేయడం ప్రారంభించిన తర్వాత కూడా, అప్పుడప్పుడూ కలిసి కచేరీలు చేస్తూ ఉండేవారు. వారిద్దరి సితార్, సరోద్ జుగల్ బందీలు (జంట కచేరీలు) దేశంలో చాలా ప్రసిద్ధమైనాయి. క్రమంగా ఇద్దరూ దేశవిదేశాలలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని క్షణం తీరికలేని బిజీ ఆర్టిస్టులై పోవడంతో ఇద్దరూ కలిసి కచేరీలు చేయడం అరుదైపోయింది. 1963లో ఎడింబరో అంతర్జాతీయ సంగీతోత్సవంలో భారత ప్రతినిధులుగా వారిద్దరూ జంట కచేరీ చేశారు.

తిరిగి 1971 ఆగస్టులో బంగ్లాదేశ్ సహాయార్థం న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరిగిన చరిత్రాత్మకమైన కచేరీలో వారిద్దరూ జంటగా ఒక బెంగాలీ ధున్ వాయించారు. రవిశంకర్ తన శిష్యుడైన బీటిల్ జార్జి హారిసన్ తోడ్పాటుతో ఆ కచేరీని నిర్వహించారు. అందులో పెక్కు మంది ప్రఖ్యాత పాప్ గాయకులు పాల్గొన్నారు. ఆ కచేరీకి వసూలైనంత డబ్బు ప్రపంచంలో ఏ కచేరీకి వసూలు కాలేదు. మొత్తం ఆ కచేరీ అంతా మూడు రికార్డుల సెట్టుగా రెండు సంవత్సరాల క్రిందట విడుదలయింది. వాటిలో ఒక రికార్డుకు ఒక వైపు రవిశంకర్, అలీ అక్బర్ ల జుగల్ బందీ ఉన్నది. మిగిలిన రెండున్నర రికార్డులలో జార్జి హారిసన్, రింగోస్టార్ మొదలైన పాప్ గాయకుల ఇంగ్లీషు పాటలున్నాయి. ఆ రికార్డులను సొంత సంస్థ ఆపిల్ కంపెనీ ఉత్పత్తి చేసింది. ప్రపంచమంతటా అవి విపరీతంగా అమ్ముడు పోయాయి. 1972 సంవత్సరాంతానికి ఆ రికార్డులపై దాదాపు ఒకటిన్నర కోట్ల డాలర్లు (రు. 10.95 కోట్లు) వసూలు చేసి బంగ్లాదేశ్ నిధికి సమర్పించారు. కేవలం రవిశంకర్, అలీఅక్బర్ ల సంగీతం వల్లనే అంత ధనం వసూలయిందని చెప్పలేము కాని, వారిద్దరికీ అమెరికాలో ఉన్న పేరు ప్రతిష్ఠలకు అది ఒక నిదర్శనమని మాత్రం చెప్పవచ్చు.

1972 అక్టోబరులో వారిద్దరూ న్యూయార్క్ లోని ఫిల్ హార్మొనిక్ హాలులో జంటకచేరీ చేశారు. అంతకు నెల రోజుల క్రితం కీర్తి శేషుడైన తమ గురువు ఉస్తాద్ అల్లా ఉద్దీన్ కు ఆ కచేరీని అంకితం చేశారు. ఆ కచేరీని 'ఆపిల్' రికార్డింగ్ కంపెనీ డబుల్ ఆల్బంగా విడుదల చేసింది. మన దేశంలో 'గ్రామఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా' ఆ డబుల్ ఆల్బం (sapdo 1002)ను 'ఆపిల్' లేబిల్ పై ఇటీవలనే విడుదల చేసింది. హిందూస్థానీ సంగీతంలో డబుల్ ఆల్బం (రెండు రికార్డుల సెట్టు) విడుదల కావడం ఇదే ప్రథమం. కచేరీనంతటిని రెండు రికార్డులలో ఇమడ్చడం సాధ్యం కాదు కనుక కొంత ఎడిట్ చేశారు.

ఈ రెండు రికార్డుల్లో మూడు రాగాలు హేమ్ బిహాగ్, మాంజ్ ఖమాస్, సింధు భైరవి-వాయించారు. మొదటి రికార్డులో మొదటి వైపు 'హేమ్ బిహాగ్'లో ఆలాప్, జోడ్ 23 నిమిషాలసేపు వాయించారు. ఆ రికార్డు రెండో వైపున రెండో రికార్డులో మొదటి వైపున మొత్తం 50 నిమిషాల సేపు మాంజ్ ఖమాస్ వాయించారు. రెండో రికార్డులో రెండో వైపు సింధుభైరవి 23 నిమిషాలు వాయించారు. వాటిలో 'హేమ్ బిహాగ్' అద్భుతంగా ఉంది. ఇది స్వర్గీయ అల్లాఉద్దీన్ ఖాన్ సొంతరాగం. ఆయన సృష్టించిన రాగాల్లో 'హేమంత్' ఒకటి. దానిలో 'బిహాగ్' (లేక బేహాగ్) రాగాన్ని చేర్చి 'హేమ్ బిహాగ్' అని పేరు పెట్టారు. ఇది గంభీరమైన, మధురమైన సాయంకాలపు రాగం. ఈ రాగాన్ని రవిశంకర్, అలీఅక్బర్ ఖాన్ చాలా సీరియస్ గా, భావావేశంలో వాయించారు. కొన్ని చోట్ల రవిశంకర్ సితార్ కంటే అలీఅక్బర్ సరోద్ చాలా బావుంది. గత్ వాయించకుండా ఆలాప్, జోడ్ లతోనే ముగించడం వల్ల ఆ రాగం గంభీరంగా ముగిసింది.

రెండవ రాగం 'మాంజ్ ఖమాస్' మొదటి దానంత బాగాలేదు. 'హేమ్ బిహాగ్' వలె ఇది గంభీరమైన రాగం కాదు. నాజూకైన శృంగార రాగం. ఇది ఉత్తర ప్రదేశ్ జానపద సంగీతం నుంచి హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోకి ప్రమోషన్ పుచ్చుకున్న రాగం. రామ్ పూర్ ఘరానాకు చెందిన వారు-ముఖ్యంగా అల్లా ఉద్దీన్ ఖాన్ శిష్య పరంపర-ఈ రాగాన్ని ఎక్కువగా వాయిస్తారు. కళాకారుని మూడ్ ను బట్టి దీనిని సంయోగ శృంగార రాగంగానూ, వియోగ శృంగార రాగంగానూ కూడా వాయించవచ్చును. ఇందులో 'ఖమాస్' రాగం పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. రవి, అలీఅక్బర్ క్లుప్తంగా రెండు మూడు నిమిషాలు ఆలాప్ వాయించి, తర్వాత విలంబిత్ గత్, ధ్రుత్ గత్, చివరికి ఝాలా వాయించారు. చివరి భాగంలో సితార్, సరోద్ ల మధ్య సవాల్-జవాబ్ బాగుంది, కాని, మొత్తం మీద ఈ 50 నిమిషాలు 'మాంజ్ ఖమాస్' ఆశాభంగం కలిగించింది. 'హేమ్ బిహాగ్' వాయించినంత మంచి మూడ్ లో వాయించలేదు ఈ రాగాన్ని. ఎక్కువ భాగం ఊకదంపుడుగా ఉంది.

చివరి 'సింధుభైరవి' బాగుంది. ముందు కొద్ది నిమిషాలు ఆలాప్ వాయించి, తర్వాత ఠుమ్రీ శైలిలో విలంబిత్ గత్, ధ్రుత్ గత్, ఝాలా వాయించారు. ధ్రుత్ గత్ లో రెండు మూడు ఇతర రాగాలలోకి షికారుగా వెళ్ళి వచ్చారు. 'మాంజ్ ఖమాస్' లోనూ, 'సింధుభైరవి'లోనూ కూడా అల్లారఖా తబలా మహాద్భుతంగా ఉంది.

రవిశంకర్, అలీఅక్బర్ ఖాన్ ల రికార్డులను అలవాటుగా కొనుక్కునేవారికి ఈ డబుల్ ఆల్బం కొంత ఆశా భంగం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ రాగాలను వారిద్దరూ ఇదివరకే కొన్ని రికార్డులలో వాయించారు. 'హేమ్ బిహాగ్' రాగాన్ని రవిశంకర్ ఇదివరకు D MOAE 5009 రికార్డులో వాయించారు. అయితే ఆ రికార్డులో గత్ వాయించారు. ఇప్పుడు ఆలాప్, జోడ్ వాయించారు. 'మాంజ్ ఖమాస్' రాగాన్ని రవిశంకర్ ఇది వరకు రెండు 78 ఆర్.పి.ఎం. రికార్డుల్లోనూ, కాంచెర్టో రికార్డులోనూ వాయించారు. రవి, అలీ అక్బర్ కలిసి 7 EPE 57 ఇ.పి. రికార్డులో కూడా ఈ రాగాన్ని వాయించారు. ఆ ఇ.పి.లో వాయించిన గత్ నే మళ్ళీ ఈ డబుల్ ఆల్బంలో వాయించారు. 'సింధుభైరవి'ని రవిశంకర్ ఇది వరకు ఒక 78 ఆర్.పి.ఎం. రికార్డులోనూ, కాంచెర్టో రికార్డులోనూ, మరి రెండు ఎల్.పి. లలో కూడా వాయించారు. పదేళ్ళ క్రితం రవి, అలీఅక్బర్ లు EASD 1296 రికార్డులో ఈ రాగాన్ని వాయించారు. ఆ రికార్డులో వాయించిన గత్ నే తిరిగి ఈ డబుల్ ఆల్బంలో వాయించారు. ఇంతకు ముందు వారి రికార్డులలో లేని వేరే రాగాలను వాయించినట్లయితే బాగుండేది. వారి 'సింధుభైరవి' ఈ డబుల్ ఆల్బంలో కంటే ఇది వరకటి రికార్డులో చాలా బావుంది.

రవి, అలీఅక్బర్ ల మొట్టమొదటి జుగల్ బందీ రికార్డు (EALP 1251) వీటి అన్నింటికంటే మంచి రికార్డు. 14 సంవత్సరాల క్రితం అది విడుదలయింది. అందులో పలాస్ కాఫీ (భీమ్ పలాస్ కాఫీ) ధున్, 'బిలాస్ ఖానీ తోడి' ఆలాప్, జోడ్, గత్ లను వాయించారు. వాటిలో ధున్ మరీ అద్భుతంగా ఉంది. అందులో ఇద్దరూ ఒకరిని మించి ఒకరు చమత్కారాలు గుప్పించారు. డబుల్ ఆల్బంతో కలిపి వారి జుగల్ బందీ రికార్డులు ఇప్పటికి మొత్తం ఐదు వచ్చాయి.

నండూరి పార్థసారథి
(1974 జూన్ 28వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post