Title Picture

'కథ'కు నేపథ్యంలో ఉండే దేశం, కాలం, వేషభాషలు, కులమత వ్యవస్థలు, ఆచారవ్యవహారాలు, శీతోష్ణస్థితిగతులు, నాగరకత - ఇవన్నీ కలిపి 'వాతావరణం' అని చెప్పబడుతుంది. ఈ వాతావరణం కథకు జీవం. ఒకానొక వాతావరణంలో కొందరు వ్యక్తుల జీవితాల గమనమే 'కథ'.

వ్యక్తి జీవితగమనానికి వాతావరణం ప్రముఖ కారణమవుతుంది. ఒకానొక వాతావరణం ఒకానొక వ్యక్తి మనస్తత్వంపై ఎట్టి ప్రభావాన్ని ప్రసరించుతుందో, తదనుగుణంగా ఆ వ్యక్తి జీవితం సాగుతుంది. వాతావరణానికీ, మనస్తత్వానికీ, మధ్యగల పరస్పర సంఘర్షణే జీవితం. అదే 'కథ'.

పాత్రల నడవడికకు, సంఘటనలకూ నేపథ్యంగా వాస్తవికమయిన వాతావరణాన్ని సృష్టించనిదే అది కథ కాదు. వాతావరణం లేకుండా పాత్రల మనస్తత్వాలను అవగాహన చేసుకోవడం సాధ్యపడదు. అది కేవలం బొమ్మలాట మాత్రమే అవుతుంది. వాతావరణం కథకు ప్రాతిపదిక.

చలనచిత్రాలలో వాతావరణాన్ని ఏర్పరచవలసిన బాధ్యత రచయితలది. రూపకల్పన చేయడం దర్శకులూ, కళా దర్శకుల పని. పౌరాణిక చిత్రాలను గానీ, చరిత్రాత్మక చిత్రాలను గానీ, నిర్మించవలసి వచ్చినప్పుడు ఆయా, దేశకాలాలను దృష్టిలో ఉంచుకుని, వేషాలను, ఆచార వ్యవహారాలను, నాగరికతను పరిశోధించేందుకు చారిత్రకులను, పండితులను నియమించటం హాలీవుడ్ లో ఆచారం. ఉత్తమ చిత్రాలను నిర్మించే కొన్ని ఇతర దేశాలలో కూడా ఈ ఆచారం ఉన్నది. వాస్తవికమయిన, సమగ్రమయిన వాతావరణాన్ని సృష్టించేందుకు వారు అష్టకష్టాలు పడతారు.

కాని మెజారిటీ భారతీయ చిత్రాలలో అటువంటి ప్రయత్నం మనకు కనుపించదు. ముఖ్యంగా దక్షిణాది చిత్రాలలో వాతావరణం మరీ కృతకంగా ఉంటున్నది. దక్షిణాది చిత్రరంగంలో ఇటువంటి పరిస్థితికి రచయితల కంటే ముఖ్యంగా నిర్మాతలు బాధ్యులు.

మన చిత్రాలలో పౌరాణికాలు, జానపదాలు, చరిత్రాత్మక చిత్రాలు ఒకే పోలికగా ఉంటాయి. ఇతిహాస యుగంలోనూ, కృష్ణ దేవరాయల కాలంలోనూ మనుషులూ, వేషభాషలూ అన్నీ ఒకే మూసలో పోసినట్లు ఉంటాయి. మన చిత్రాలలో, కిరీటం పట్టుబట్టలను ధరించి, సింహాసంలో కూర్చుని 'నేను తొల్లి దశరధుండను నృపశ్రేష్ఠుండను' అని డైలాగు చెబితే గానీ, అది పౌరాణిక చిత్రమని మనకు తెలియదు.

రాజుగారి దర్బారుహాలు, పల్లెటూరి కరణంగారి ఇల్లూ ఒకే విధంగా ఉండటం కూడా మన చిత్రాలలో చూశాము.

దక్షిణాది రంగంలో నూటికి 99 చిత్రాలలో పాత్రలకు వ్యక్తిత్వాలంటూ ఉండడం లేదనుకుంటే ఇక వాతావరణం ప్రశ్నేరాదు. ఒక సంయోగ యుగళగీతం, ఒక వియోగ యుగళగీతం, నాయకీ నాయకులకు విడివిడిగా రెండు పాటలూ, ఒక వీధి నృత్య గీతం, మచ్చుకి ఒక భజనపాట, కత్తులతోనో, కర్రలతోనో కాసేపు యుద్ధం, అరజడను శృంగార ఘట్టాలు రెండర్థాలు వచ్చే బూతుమాటలు కాసినీ, ఏడుపులు, పెడబొబ్బలు, వెకిలి హాస్యం ఉంటే ఏ చిత్రమయినా చూస్తారు మన ప్రేక్షకులు. గత్యంతరం లేదు కనుక చూడక తప్పదు.

మన చిత్రాలలో మహారాజుల నివాసాలు కేవలం అట్ట భవనాలేనని ఇట్టే తెలిసిపోతూ ఉండడం వలన 'అబ్బో! రాజుగారు ఎంత ధనవంతుడో?' అనే భావం మనకు రాదు. హీరో, విలన్ యుద్ధం చేసేటప్పుడు అట్ట మేడల బండారం బయటపడిపోతుంది. ప్రేక్షకుల దృష్టి యుద్ధం మీదనుంచి వూగిపోతున్న సెట్టుమీదికి మళ్ళుతుంది. అదే రసాభాస.

అలాగే సాంఘిక చిత్రాలలో కూడా. కూటికి గతిలేని కరణం గారి ఇల్లు సోఫాలతో ఆడంబరంగా ఉంటుంది. కరణం గారు బీదవాడే పాపం అని మనకు జాలి కలుగదు. అతడు కార్చేవన్నీ దొంగకన్నీళ్ళని తెలిసిపోతూ ఉంటుంది. రచయిత ఎంత చక్కని సంభాషణలు రచించినా, రసాభాస అవుతుంది. ఈ వాతావరణం అతికృతకంగా వికృతంగా ఉంటుంది. విచక్షణాశక్తి ఉన్నవారెవరూ ఈ చిత్రాలను భరించలేరు.

వాతావరణం వాస్తవికంగా ఉన్నప్పుడే కథ సమగ్రమవుతుంది. అది లేనినాడు అది కథ అనిపించుకోదు. తెలుగు సినిమా అనిపించుకుంటుంది.

నండూరి పార్థసారథి
(1960 సెప్టెంబర్ 18వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post