Title Picture
మంచాళ జగన్నాథరావు

ఆయన సగం + ఈయన సగం = ఇద్దరూ ఒకరైనారు.
ఆయన ఆత్మ + ఈయన దేహం = దేహాత్మల సంయోగం.
ఆయన సాఫ్ట్ వేర్ + ఈయన హార్డ్ వేర్.
హార్డ్ వేర్ లేకపోతే సాఫ్ట్ వేర్ నిరాశ్రయంగా, నిస్సహాయంగా, నిరుపయోగంగా, నిరూపంగా ఉండిపోతుంది.
సాఫ్ట్ వేర్ లేకపోతే హార్డ్ వేర్ వట్టి ఇనపముక్క
రెండూ కలిస్తే అద్భుతాలు జరుగుతాయి.
"ఇంతకీ ఎవరి గురించి ఇదంతా? ఎవరా ఇద్దరు?"
వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్; ఏకోదరులు; అపూర్వ సహోదరులు. వారు - మంచాళ జగన్నాథరావు గారు; వాడ్రేవు పురుషోత్తం గారు.
"సహోదరులంటున్నారు... మరి ఇంటి పేర్లు మారాయేమిటి?"
పుట్టినప్పుడు పురుషోత్తం గారూ మంచాళ వారే. తర్వాత సమీప బంధువులకే దత్తత వెళ్ళారు. అందువల్ల ఆయన 'వాడ్రేవు' వారయ్యారు. అయినా జగన్నాథరావు గారూ, పురుషోత్తం గారూ జీవితమంతా ఒకే కుటుంబంగా కలిసి ఉన్నారు - ఆకాశవాణిలో ఉద్యోగం కూడా కలిసే చేశారు.
"అసలు ఎందుకలా?"

మంచాళ జగన్నాథరావు గారు 21.12.1921వ తేదీన విశాఖపట్టణం జిల్లా చీపురుపల్లి గ్రామంలో జన్మించారు. ఐదేళ్ళ వయస్సులోనే మసూచి వ్యాధి వల్ల ఆయనకు అంధత్వం ప్రాప్తించింది; చూపు పూర్తిగా పోయింది. ఐతే మద్రాస్ కు చెందిన డాక్టర్ శ్రీనివాసాచారి అనే గొప్ప వైద్యుని చికిత్సతో ఒక కన్నుకొద్దిగా కనిపించడం మొదలయింది. తమ్ముడు పురుషోత్తం గారి రూపంలో రెండు నేత్రాలు కూడా ఆయనకు లభించాయి. పురుషోత్తం గారు 02.08.1925న జన్మించారు. ఇద్దరూ కలిసి జీవితమంతా సంగీతజైత్రయాత్ర సాగించారు. అన్నగారు 30.07.1985లో స్వర్గస్థులైనారు. తమ్ముడు 28.12.1991లో -అన్నగారు పోయినలోకానికే పోయారు. జగన్నాథరావు గారు ఎంత అదృష్టవంతులు! జీవితంలో చివరిరోజు వరకూ ఆయనకు తమ్ముని చేయూత లభించింది. అన్నగారికంటే నాలుగేళ్ళు ఆలస్యంగా జన్మించిన పురుషోత్తం గారు నాలుగేళ్ళు ముందే పోతే ఏం జరిగి ఉండేది? ఊహించడమే బాధగా ఉంటుంది. అన్నగారు సృష్టించిన సంగీతమంతటినీ పురుషోత్తం గారు తనలో ఇముడ్చుకున్నారు. అన్న చేతి 'కలం'గా మారిపోయాడు; అన్నని చేయి పట్టుకుని నడిపించాడు. అంధత్వం వల్ల అన్నగారి సంగీత సాధన ఏమాత్రం కుంటుపడకుండా రక్షగా నిలిచాడు.

మంచాళవారు ప్రధానంగా వైణికుడు. ఆయన తల్లిదండ్రులు మంచాళ సుబ్బారావు గారు, జోగులాంబగారు తమ కుమారుని సంగీతాభిలాషను గుర్తించి ఆరేళ్ళ చిన్న వయస్సులోనే విజయనగరానికి చెందిన ఆదిరాజు నరసింహం గారి వద్ద సంగీతం నేర్పించడం మొదలు పెట్టారు. తర్వాత విజయనగరంలోని సంగీత కళాశాలలో చేర్పించారు. సుప్రసిద్ధ వైలిన్ విద్వాంసుడు ద్వారంవెంకటస్వామినాయుడుగారు అప్పట్లో ఆ కళాశాలలో బోధకుడుగా ఉండేవారు. ఆయన మంచాళ వారికి ఎంతో ప్రోత్సాహం అందించారు. పన్నెండేళ్ళ వయస్సు నుంచే మంచాళవారు వీణపై కచేరీలు చేయడం మొదలు పెట్టారు.

తర్వాత మంచాళవారి కుటుంబం ఒరిస్సాలోని బరంపురానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ-కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముద్దుస్వామి దీక్షితులవారి కుటుంబానికి చెందిన శ్రీమతి సీతామహాలక్ష్మి, ఆమె భర్త శ్రీ పద్మనాభ అయ్యర్ ల కుటుంబంతో పరిచయం ఏర్పడింది. వారి దగ్గర మంచాళవారు పదిసంవత్సరాలు ముద్దుస్వామిదీక్షితుల రచనలన్నింటినీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు. సీతామహాలక్ష్మి, పద్మనాభ అయ్యర్ వెంట నెల్లూరు, సేలం, కోయంబత్తూరు లాంటి పట్టణాలకు కూడా వెళ్ళి నేర్చుకున్నారు. ఆకాలంలోనే ఒక గొప్ప విద్వాంసుని నుంచి క్షేత్రజ్ఞపదాలను నేర్చుకున్నారు.

1938లో పదిహేడేళ్ళ వయస్సులో మద్రాస్ ఆలిండియా రేడియోలో తరచుగా వీణ కచేరీలు చేయడం ప్రారంభించారు. మద్రాసులోనే ఆయన ఒక వాద్య బృందాన్ని ఇరవైమంది కళాకారులతో ప్రారంభించారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం-రెండింటి మేళనంతో ఆర్కెస్ట్రేషన్, హార్మొనైజేషన్ ప్రక్రియలలో ప్రయోగాలు చేశారు. 1948లో ఆకాశవాణి వాద్య సంగీత విభాగంలో ఉద్యోగిగా చేరి పాట్నా, అలహాబాద్ లలో పనిచేశారు. లలిత సంగీతంలో, శాస్త్రీయ సంగీతంలో లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. ఎందరో కళాకారులను ప్రోత్సహించారు. ఎందరో శిష్యులను తయారుచేశారు. ముఖ్యశిష్యులలో పురుషోత్తం గారి కుమార్తె శ్రీమతి నండూరి జోగులాంబ ఒకరు. మంచాళ వారి కుమార్తె శ్రీమతి సుబ్బలక్ష్మి, పురుషోత్తం గారి సంతానంలో మరికొందరు కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. వారంతా బృందగానం చేస్తుండేవారు. వారిది అచ్చమైన సంగీతకుటుంబం.

ప్రాచీన సంగీత గ్రంథాల ప్రచురణ

మంచాళ వారు ఆరు శతాబ్దాల కర్ణాటక సంగీత వాగ్గేయ రచనలను స్వరసాహిత్యాలతో తన జీవితకాలంలోనే సుమారు పదిహేను సంపుటాలుగా ప్రచురించారు. వాటిలో - 711 త్యాగరాజ కృతులను ఆరు సంపుటాలుగా వెలయించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల వారు వాటిని ప్రచురించారు. ఆయన స్వరపరచిన అన్నమాచార్యుని 477 అధ్యాత్మ, శృంగార సంకీర్తనలను మూడు సంపుటాలుగా దేవస్థానం వారే ప్రచురించారు. మంచాళ వారు స్వరసాహిత్యాలతో సిద్ధం చేసిన క్షేత్రజ్ఞపదాలను, రామదాసు కీర్తనలను ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు రెండు సంపుటాలుగా ప్రచురించారు. జగన్నాథరావుగారు, పురుషోత్తంగారు పోయేనాటికి స్వర సాహిత్యాలతో ప్రచురణకు సిద్ధంగా ఇంకా ఎన్నో వందల రచనలు మిగిలిపోయాయి. శ్రీమతి జోగులాంబ, శ్రీనండూరి శివశంకర శర్మ (నా తమ్ముడు), పురుషోత్తం గారి కుమారుడు వాడ్రేవు సుబ్బారావు 'లాస్య ఫైన్ ఆర్ట్స్' అనే సంస్థను నెలకొల్పి ఇప్పటికి నాలుగు సంపుటాలను వెలువరించారు. వాటిలో ముద్దుస్వామి దీక్షితుల 130 కృతుల సంపుటం ఒకటి. ఇంకా తచ్చూరి సింగరాచార్యులు, గర్భపురివారు, మైసూర్ సదాశివరావు, మైసూర్ వాసుదేవాచారి, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, ముత్తయ్య భాగవతార్, స్వాతితిరునాళ్ వంటి గొప్ప వాగ్గేయకారుల రచనలను కూడా స్వరసాహిత్యాలతో ప్రచురించారు. ప్రచురించవలసినవి ఇంకా ఎన్నో మిగిలిపోయాయి. వాటిని కూడా వెలుగులోకి తీసుకురావాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వీరి సంపుటాలన్నీ 'కృతిరత్నావళి' పేరుతో ప్రచురితమైనాయి. మంచాళవారు లలిత సంగీతంలో కూడా ఎంతో కృషి చేసి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, బసవరాజు అప్పారావు, అడివి బాపిరాజు, శ్రీశ్రీ, నార్ల వెంకటేశ్వరరావు, ఆరుద్ర, దాశరధి, నారాయణరెడ్డి, నాయని సుబ్బారావు, పిలకా గణపతి శాస్త్రి, వేటూరి ఆనందమూర్తి వంటి ప్రముఖ కవుల గేయ రచనలను స్వరపరచి రెండు సంపుటాలను 'ఆధునిక సంగీతము' అనే పేరుతో 1960వ దశకంలోనే ప్రచురించారు. వాటిలో ఆయన స్వయంగా రచించిన గేయాలు కూడా కొన్ని ఉన్నాయి. జయదేవుని అష్టపదులను, కబీర్, తులసీదాస్, సూర్ దాస్ ల రచనలను కూడా స్వరపరచి ఆ సంపుటాలలో ప్రచురించారు.

బాలాంత్రపు రజనీకాంతరావుగారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు, పాలగుమ్మి విశ్వనాథంగారు మంచాళవారి రచనలను ప్రశంసిస్తూ ఆయన గ్రంథాలకు 'ముందుమాటలు' రాశారు. వారందరూ మంచాళ వారితో పాటు 'ఆకాశవాణి'లో పనిచేసినవారే.

1975లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రథమప్రపంచతెలుగుమహాసభ నిర్వహించినప్పుడు మంచాళవారు 'ఆంధ్రుల సంగీతకళ' అనే పుస్తకాన్ని రచించారు.

ఆంధ్రప్రదేశ్ సంగీత నాటకఅకాడమీ 'కళాప్రవీణ' బిరుదును ఆయనకు ప్రసాదించింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ తో, ఆంధ్రవిశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' బిరుదుతో ఆయనను సత్కరించాయి. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఎక్స్ పర్ట్స్ (ప్రవీణుల) కమిటీ గౌరవ సభ్యత్వం కూడా ఆయనకు లభించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో, బెంగుళూరులోని కర్ణాటక గాన కళాపరిషత్ లో, ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో, హైదరాబాద్ లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషలలో సంగీతంపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన సంగీత రచనల నుంచి, సోదాహరణ ప్రసంగాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఏడుగంటల ధ్వని ముద్రికలను కేంద్ర సంగీత నాటకఅకాడమీ తన భాండాగారంలో భద్రపరచింది. మంచాళవారు స్వరపరచిన కొన్ని అన్నమాచార్య సంకీర్తనలతో ఒక సి.డి.ని తిరుమల తిరుపతి దేవస్థానాల వారు విడుదల చేశారు.

ఈ సమాచారం చాలా వరకు మంచాళవారి గ్రంథాల నుంచి సేకరించినదే. ఇప్పుడు ఆ అపుర్వ సహోదరులతో నా పరిచయం గురించి కొన్ని మాటలు చెబుతాను:

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ జరిగిన నవంబరు నెలలోనే బి.ఏ చదవడం కోసం నేను విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ వివేక వర్ధనీ కాలేజీలో చేరాను. అప్పట్లో నా వయస్సు 17 సంవత్సరాలు. సుప్రసిద్ధ పండితులు వేటూరి ఆనందమూర్తిగారు మా తెలుగు లెక్చరర్. అప్పట్లో ఇక్కడ ప్రతి సంవత్సరం నిజాం కళాశాల ఆవరణలో ఆంధ్రాభ్యుదయోత్సవాలు జరుగుతూ ఉండేవి. ఉస్మానియావిశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఆ ఉత్సవాలలో జరిగే సంగీతనృత్యనాటక పోటీలలో పాల్గొంటూ ఉండేవారు. మా కాలేజీ నుంచి మేమూ పాల్గొనేవాళ్ళం. ఆనందమూర్తిగారు మమ్మల్ని బాగా ప్రోత్సహించేవారు. మంచాళ సోదరులు 1956లోనే పాట్నా నుంచి హైదరాబాద్ ఆకాశవాణికి ట్రాన్స్ ఫర్ పై వచ్చారు. ఆనందమూర్తి గారికి మంచాళ వారితో దగ్గరి బంధుత్వం ఉంది. ఆయన ద్వారానే నాకు మంచాళ వారితో పరిచయం కలిగింది. మంచాళవారు హిందూస్థానీ సంగీతం కూడా తనంతట తాను నేర్చుకుని, సాధన చేసి, స్వయంగా కొన్ని మూడేసి నిమిషాల వాద్య సంగీత రచనలు చేశారు. అటువంటి రచనలలో రెండింటినో, మూడింటినో మా నాటకంలో నేపథ్య సంగీతంగా వాడుకొనేందుకు మంచాళ వారు అందించారు. నాకు స్వయంగా హిందూస్థానీ బాణి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అందులోనూ మంచాళ వారి బాణి అంటే మరీ ఇష్టం. మంచాళవారు, పురుషోత్తం గారు పండిత భేషజం ఏమాత్రం లేకుండా నాతోనూ, అందరితోనూ చనువుగా మాట్లాడుతూ ఉండేవారు.

మంచాళ జగన్నాథరావు, నండూరి పార్థసారథి

ఇక్కడ నా చదువు అయిపోయాక 1959లో విజయవాడకు వెళ్ళి అక్కడ కొత్తగా ప్రారంభించిన 'ఆంధ్రప్రభ'లో సబ్ ఎడిటర్ గా చేరాను. అక్కడ నుంచి 'ప్రభ' చిత్తూరు, మద్రాసు, బెంగుళూరు ఎడిషన్లలో 17 సంవత్సరాలు పనిచేసి 1977లో మళ్ళీ హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ పై వచ్చాను. ఆలోగా 1975లో హైదరాబాద్ లో పురుషోత్తం గారి కుమార్తె జోగులాంబతో మా తమ్ముడు శంకరం వివాహం జరగడంతో మంచాళ వారి కుటుంబంతో మాకు సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఇక్కడ ఏడేళ్ళు పనిచేశాక నాకు మళ్ళీ బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మద్రాసు, ఢిల్లీ, బొంబాయి, భువనేశ్వర్ లలో 12 ఏళ్ళు పనిచేసి, రిటైరయి 1996లో హైదారాబాద్ కు తిరిగి వచ్చే నాటికి మంచాళవారూలేరు, పురుషోత్తంగారూలేరు. 1985లో మంచాళవారూ, 1991లో పురుషోత్తం గారూ పోవడంతో వారి నుంచి ఎన్నో సంగీత విషయాలు నేర్చుకోవాలనుకున్న నాకు తీవ్ర ఆశాభంగం కలిగింది.

సాత్విక వీణా గానశైలి

మంచాళవారి బాణీని ఇంకా ఎంతో లోతుగా, శ్రద్ధగా అధ్యయనం చేయాలనుకున్నాను గానీ అది సాధ్యపడలేదు. విన్నంతలో, జ్ఞాపకం ఉన్నంతలో ఆయన శైలి గురించి కొన్ని మాటలు చెబుతాను :

ఆయన వీణా వాదన శైలి పూర్తిగా స్వతంత్రమైనది. ఆయన వీణానాదమే ప్రత్యేకమైనది. ఆయనది శాంత, మధుర, గంభీర శైలి. చప్పట్ల కోసం, 'వాహ్వా... క్యాబాత్ హై' లకోసం ఆయన వాయించరు. ఎక్కువగా సహజ విలంబలయలోనే వాయించేవారు. సాహిత్య రచనలోని అర్థానికీ, భావానికీ, రసానికీ ప్రాధాన్యమిచ్చేవారు. ఆయన తన కుటుంబంలోని వారికీ, ఇతర శిష్యులకూ కూడా అటువంటి సంగీతాన్నే నేర్పారనీ, వీణా వాదనను నేర్పినట్లు లేదనీ నాకు అనిపిస్తుంది. ఆయన ఎవరైనా వైణికులను తయారుచేశారో లేదో నాకు తెలియదు. ఆయన నుంచి వీణ నేర్చుకున్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలా వాయిస్తారో వినాలని ఉంది నాకు. ఆయన రికార్డింగ్స్ ఇంకా శ్రద్ధగా వినాలని ఉంది. అటువంటి రికార్డింగ్స్ భద్రపరచారా?

మంచాళవారు హిందూస్థానీ బాణీలో వాయించిన రచనలు నాకు చాలా నచ్చాయి. అవి చాలా హాయిగా వినిపిస్తాయి నాకు. అది నా వ్యక్తిగత అభిరుచి కావచ్చు. తన ప్రత్యేక శైలికోసం ఆయన తన వీణ నిర్మాణంలో మార్పులు చేసినట్లుంది. ఆ మార్పును ప్రత్యేకంగా పరిశీలించాలని ఉంది. ఈలోగా 'లాస్యఫైన్ ఆర్ట్స్' వారు మంచాళ వారి శతజయంతి సందర్భంగా ఒక వర్క్ షాప్ ను నిర్వహించి ముఖ్య శిష్యుల చేత మాట్లాడిస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఇప్పటికి మిగిలివున్న మంచాళ వారి రికార్డింగ్ లను, రచలను, వ్యాసాలను కేటలాగ్ చేసి భద్రపరచడం అవసరం.

నండూరి పార్థసారథి
(2021 జనవరి 1వ తేదిన ప్రచురితమైనది)

Previous Post Next Post