Chardil Title Picture

సంగీతం, నృత్యం, హాస్యం, ఉత్కంఠ, ప్రేమ, వియోగం అన్నీ తగుపాళ్లలో చక్కగా మేళవించి పండిత పామర జనాలందరి హృదయాలను అలరించగల గొప్ప చిత్రం నయా సంసార్ వారి 'చార్ దిల్ చార్ రాహే'. చెత్త చిత్రాలను చూసి చూసి బూజుపేరుకున్న హృదయాలను చిగురింపచేయగల చిత్రం యిది. చిత్రం అంతటా స్వచ్ఛమైన, స్వతంత్రమైన, సరిక్రొత్త వాతావరణం, సగటు సినిమాల అవధులను అతిక్రమించి, బాక్సాఫీసు సూత్రాలనబడే బంధనాలను త్రెంచుకుని హాయిగా స్వేచ్ఛగా విహంగంలా విహరించిన మనోజ్ఞమైన ఇతివృత్తం, కరుణరసభరితమైన ఉత్కంఠతను పోషించే గొప్ప కథ, అంతకంటే అద్భుతమైన కథనం.

నిర్మాత, దర్శకుడు, కథకుడు కె.ఎ. అబ్బాస్ తన ప్రతిభలో, ప్రత్యేకతలో శిఖరాగ్ర ఔన్నత్యాన్ని సాధించాడు ఈ చిత్రంతో. ఆయనే వ్రాసిన ఒక నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం ప్రత్యంగుళంలోనూ ఆయన వ్యక్తిత్వం, ప్రత్యేకత ప్రతిబింబిస్తాయి. ప్రతి నటుడి నటనలోనూ అబ్బాస్ అదుపు కనిపిస్తుంది. వేగంగా పరుగెత్తే జవంగల గుర్రాన్ని కళ్ళెంపట్టి లాగి వదులుతున్నట్లు, అడుగడుగునా ఉత్కంఠతను రేపుతూ, చిత్రం చివరిదాకా ప్రశ్నార్థకాలు వేస్తూ, చిట్టచివర అన్ని చిక్కులకీ ముడులు విప్పి ఆశ్చర్యార్థకం వేస్తాడు అబ్బాస్. చిత్రం అంతంలో 'ది ఎండ్'కు బదులు 'ది బిగినింగ్' అని చూపిస్తాడు. ప్రేక్షకులు దిగ్ర్భమచెంది హాలు బయటికొస్తారు. నిజానికి ఆ పాత్రల ఒడిదుడుకులన్నీ సమసిపోయి, తిన్నని బాట అందుకుని క్రొత్త జీవితాలు ప్రారంభమయేది చిత్రం అంతంలోనే. అబ్బాస్ ఇంద్రజాలానికి బుర్ర ఝాడించుకుంటారు పండితులు. అబ్బాస్ ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక విభిన్నత కనిపించి తీరుతుంది. నేలబారు కథని ఆయన తాకడు. ఈ విభిన్నతే ఆయన వ్యక్తిత్వం. ప్రతి చిత్రంలోనూ ఆయన ఒక చిన్న విప్లవాన్ని లేవదీస్తాడు ప్రేక్షకుల్లో; చలనచిత్ర చరిత్ర పధంలో ఒక మైలురాయిని దిగవేస్తాడు. ఇంతమంది అగ్రనటీనటులతో ఇంత సాహసంగా ఇంత వరకు ఎవరూ చిత్రాన్ని నిర్మించలేదు. అన్ని పాత్రలూ చిన్నచిన్నవే. సమానమైన ప్రాముఖ్యం కలవే.

నాలుగు జీవిత పథాలు ఒక కూడలిలో కలుసుకుంటాయి. నాలుగూ నాలుగు విభిన్న పథాలు. కాని, వాటి గమ్యం మాత్రం ఒకటే. నలుగురు వ్యక్తులూ, తమ ప్రభావాలకు పరస్పరం ప్రభావితులై నూతన జీవితాలను పొందుతారు.

మొదటి కథ గోవింద్ ది. గోవింద్ (రాజకపూర్), చావలి (మీనాకుమారి) అనే కడజాతి పిల్ల చిన్నతనంలో కలిసి ఆడుకున్నారు. పెద్దయిన తర్వాత ప్రేమగా మారింది. తక్కువ కులం పిల్లతో తిరుగుతున్నాడని తల్లిదండ్రులు చిన్నతనంలోనే అతన్ని పట్టణానికి పంపిస్తారు చదువుకి. తిరిగి వచ్చేసరికి చావలి పెద్దదై ఉంటుంది. కన్నవారినీ, బంధువులనూ ఎదిరించి, ఆమెను పెళ్ళి చేసుకునేందుకు సిద్ధపడే సమయానికి ఎవరో దుండగులు ఆమె గుడిసెకు నిప్పు ముట్టిస్తారు. గుడిసె దగ్ధమైపోతుంది. ఆమె కనుపించదు. ఆమెను వెతుక్కుంటూ పిచ్చివాడిలాపోతూ కూడలి దగ్గరికి వస్తాడు. అక్కడ ఆమె కాలి అందెలు కనిపిస్తాయి. ఆశతో అక్కడే వేచి ఉంటాడు. అక్కడితో అతని కథకి సెమికోలన్, ప్రేక్షకుల మనస్సుల్లో ప్రశ్నార్థకం వేసి, ఆపేస్తాడు దర్శకుడు.

రెండవ కథ : ఒక నవాబు (అన్వర్ హుస్సేన్) గారికి మధుర గాయని ప్యారీ (నిమ్మీ) అవసరమై తన కారు డ్రయివరను పంపుతాడు. డ్రయివరు (అజిత్) ప్రతి రోజూ ఆమెను తీసుకొచ్చి నవాబు గారింట దిగవిడుస్తూంటాడు. ఆమె తల్లవార్లూ పాటలు పాడుతూ నవాబును ఆనంద పెడుతూ ఉంటుంది. డ్రయివరుకూ, ఆమెకూ మధ్య ప్రేమ అంకురిస్తుంది. ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. ఆమె వృత్తిని విడిచి ఇతని వెంట వస్తుంది. డ్రయివర్ దిలేవర్ ఖాన్ ఆమె తల్లిని మాత్రం చేరదీయనంటాడు. తల్లిని విడవనంటుంది ఆమె. కోపంతో అతడు ఆమెని ఆ కూడలి దగ్గరే విడిచి వెళ్లిపోతాడు కారులో. ఆమె తల్లితో కూడా అక్కడొక కిల్లీ దుకాణం పెట్టుకొని ఉంటుంది. అక్కడ ఈ కథకు మరో సెమికోలన్.

మూడవ కథ : జానీ (షమ్మీకపూర్)ది. నిరుద్యోగి, నిరుపేద. టిక్కెట్టు లేని కారణం చేత బస్సు కండక్టరు అతన్ని ఆ కూడలిలో దింపేశాడు. అతడు ఆ బాటల్లో ఒక బాట వెంట పోయి సమీపంలో ఉన్న హోటల్లో సర్వర్ గా చేర్తాడు. ఆ హోటల్లోనే ఉంటున్న 'స్టెల్లా (కుంకుం) అనే పిల్లను ప్రేమిస్తాడు. హోటల్ యజమాని (డేవిడ్) అసూయతో దొంగసారా వ్యాపారి అని ఆరోపించి అతన్ని జైలుకు పంపుతాడు. జైలు నుంచి తిరిగి వచ్చేసరికి తన ప్రియురాలు 'స్టెల్లా' హోటల్ యజమానికి భార్యగా మారిపోయింది. నిరాశతో కూడలి దగ్గరకొచ్చి కార్ల మరమ్మత్తు షాపు అనే పేరుతో దొంగ సారా వ్యాపారం చేస్తూంటాడు. అతని ఖాతాదార్లలో సంపూర్ణ సింగ్ అనే గనుల కంట్రాక్టరు ఒకడు. చావలి అతని కంపెనీలో వందలమంది కూలీలలో ఒకతెగా పనిచేస్తోంది. అతను ఒక రోజు ఆమెను బలాత్కరించబోతే ఆమె సీసాలతో కొట్టేసరికి స్పృహతప్పి పడిపోతాడు. చనిపోయాడనుకొని ఆమె మీద హత్యానేరం మోపుతారు.

నాల్గవ కథ నిర్మల్ కుమార్ (జైరాజ్)ది. న్యాయం కోసం పోరాడటం అతని జీవిత లక్ష్యం. ఆమె తన గాధ అంతా అతనికి చెప్తుంది. అతను గోవింద్ కోసం ఆరాతీస్తుంటాడు. కూలీలందర్నీ ప్రోగుచేసి అందరినీ ఒక త్రాటిమీద నడిపి దేశాభ్యుదయం కోసం పాటుపడాలని అతని ఆశయం. కనిపించిన వారందరికీ బోధిస్తూంటాడు. అంతా కలిసి కొండలను త్రవ్వుతూంటారు. ఈ సందర్భంలోనే దిలేవర్ ఖాన్ (డ్రయివరు) అతనికి తటస్థపడతాడు లారీతో. ఒకరోజు వారిద్దరూ లారీలో వస్తూండగా తుఫాను వస్తుంది. జానీని చంపేందుకు కుట్రపన్నుతున్నారని తెలిసి, ఆ విషయం తెలపటానికి 'స్టెల్లా' పరుగెత్తుకొస్తూ, దారిలో స్పృహతప్పి పడిపోతుంది. డ్రయివరూ, నిర్మల్ కుమార్ ఆమెను మోసుకొని జానీ ఉండే షెడ్డుకి తీసుకువస్తారు. ప్యారీ ఉండే దుకాణం కూలిపోతుంది. వాళ్లని కూడా వీరు రక్షిస్తారు. డ్రయివరూ, ప్యారీ కలుసుకొంటారు. గోవింద్ ఉండే పాకను పరామర్శించటానికి వెళ్ళిన నిర్మల్ కుమార్ అతన్ని కూడా తమ ముఠాలో కలిసి కృషి చెయ్యమని బోధిస్తాడు. అంతా కలిపి నవ భారత నిర్మాణం ప్రారంభిస్తారు. ముగ్గురి జీవితాలను చక్కబరచి, తిన్నని దోవ చూపిన నిర్మల్ కుమార్ గనుల కంట్రాక్టరు కుట్ర వల్ల మరణిస్తాడు. 'ది బిగినింగ్'తో చిత్రం ముగుస్తుంది.

ఈ చిట్టచివరి నినాదాలూ, నీతులూ పాతవే అయినా, అబ్బాస్ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకు పోయే విధంగా వాటిని చిత్రించాడు. అబ్బాస్ కాక మరో రెండో తరగతి దర్శకుడు ఈ నీతులు చెప్పితే మనం పకాలున నవ్వేస్తాం. అనిల్ బిస్వాన్ సంగీతం - అబ్బాస్ యింకా ఎంతో చెప్పాలనుకుని చెప్పలేక వదిలేసిన దానికి వ్యాఖ్యానంగా ఉంది. ఉన్నవి మొత్తం 5 పాటలు. అన్నీ చాలా బావున్నాయి. ముఖ్యంగా మొదటి మూడు పాటలు, నర్తకి పాడేవి (లతా మంగేష్కర్) మరీ అద్భుతంగా ఉన్నాయి. ఆనందాన్ని భరించలేక కంటి వెంట నీళ్లు వచ్చేస్తాయి. ఆ పాటలు, అంత గొప్ప వరసలు-హిందూస్థానీ బాణిలో నవరంగ్, సుజాత చిత్రాల తర్వాత ఇంత మంచి సంగీతం ఈ మధ్య వినిపించలేదు.

నటులలో ఏ ఒక్కరినీ వంకపెట్టేందుకు వీలుదొరకదు. షమ్మీకపూర్, అజిత్ లు కూడా అంత చక్కగా నటించటం విశేషించి చెప్పుకోతగింది. ఇందుకు దర్శకుడు అభినందనీయుడు. రాజ్ కపూర్, మీనాకుమారి, నిమ్మీ చక్కగా నటించారు. ప్రతి ఒక్కరూ తప్పక చూడతగిన చిత్రం 'చార్ దిల్ చార్ రాహే'.

నండూరి పార్థసారథి
(1960 జనవరి 17వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post