Title Picture

వేంకటేశ్వర మాహాత్మ్యం వంటి భారీ పౌరాణిక చిత్రాన్ని నిర్మించటం సామాన్యుల వల్లనయేది కాదు. డబ్బూ, ఓపిక, సామర్థ్యం అన్నీ కావాలి. 'ఇవన్నీమాకున్నాయి, మేము సామాన్యులం కాము' అని నిరూపించారు ఈ చిత్ర నిర్మాత, దర్శకుడూ. చాలా రోజులుగా ఎదురుచూస్తూన్న అశేష ప్రజానీకం ఆశించిన దానికన్నా రవంత ఉన్నత ప్రమాణంలోనే ఉంది చిత్రం. పౌరాణిక చిత్రం నవ్వులపాలు కాకుండా తీసి మెప్పించటం ఎంత కష్టమో తెలిసినవారికి ఈ చిత్రం ఇంతకంటే చక్కగా నిర్మించడం తెలుగు సీమలో ఎవరికీ చేతకాదని తెలుస్తుంది. తెలుగు చిత్ర రంగంలో ఇన్నాళ్ళనుంచీ ఆనవాయితీగా వస్తున్న పౌరాణిక ధోరణిలోనే ఉన్నా, కథ అందరికీ సుపరిచితమే అయినా దాన్ని చెప్పడంలో దర్శకుడు చూపిన ప్రతిభవల్ల, చిత్రం ఎంత పొడుగువున్నా చూడక తప్పింది కాదు. చిత్రంలో పౌరాణిక కథ ముగిసిన తరువాత, స్వామివారి ఉత్సవాలు, ఊరేగింపులూ, తీర్థ ప్రజలు, స్వామి వారి పవ్వళింపుసేవ మున్నగునవి అన్నీ డాక్యుమెంటరీ లా చూపారు.

కథ అంతా అయిన తర్వాత ఈ డాక్యుమెంటరీని అతకటం చాలా హాయిగా ఉందిగానీ దీనికి యింత జాగా ఇచ్చినందుకు అసలు కథ నిడివి కొంచెం కుదించితే బావుండేదనిపించింది. ఏడుకొండలవాని గురించి మూడు గంటల డాక్యుమెంటరీ తీసినా శతదినోత్సవాలు చేసుకొంటుంది. ఇక అగ్ర నటీనటులతో నిర్మించిన ఈ చిత్రం రజతోత్సవాలు చేసుకున్నా ఆశ్చర్యం ఉండదు. కథ, అందరికీ తెలిసిందే. సంక్ష్లిప్తంగా - కలిమాయ వల్ల లోకం సంక్షుభితమైపోతూ ఉంటే శాంతి కోసం సప్త ఋషులు యజ్ఞం చేస్తూ, హవిర్భోక్తగా త్రిమూర్తులలో ఎవరు అర్హులో తేల్చుకునేందుకు భృగువును పంపుతారు. త్రిమూర్తుల శాంతాన్ని పరీక్షించే సందర్భంలో అతడు విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నుతాడు. లక్ష్మి పరాభవంతో వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోతుంది. లక్ష్మిని వెతుక్కుంటూ నారాయణుడు కూడా భూమిని తరలిపోతాడు. భూలోకంలో విష్ణువు ఆకలి దప్పులతో అల్లాడుతుంటే లక్ష్మి శివుడినీ, బ్రహ్మనీ పిలుస్తుంది. వారు గోవు, దూడ రూపంలో భూలోకానికి వస్తారు. గోవు రోజూ విష్ణువుకు పాలు ఇస్తూంటుంది. తర్వాత విష్ణువు వకుళ అనే వృద్ధ తాపసి ఇంట ఉంటూ ఆమెకు పుత్రులు లేని లోపాన్ని తీర్చుతాడు. ఆ రాజ్యాన్ని ఏలే రాజు కుమార్తె పద్మావతిని ప్రేమిస్తాడు. విష్ణువు వంటి నిర్ధనుడికి పిల్ల నివ్వడానికి రాణి సమ్మతించక పోవటం వల్ల ప్రేమికులు విరహపడతారు. తర్వాత నారదుడు వచ్చి అతను సాక్షాత్తూ నారాయణమూర్తి అని తెలిసి వారికి వివాహం చేయిస్తాడు. విష్ణువు, పద్మావతీ వినోద విహారం చేస్తూంటారు. నారదుడు వెళ్ళి తపస్సు చేసుకొంటున్న లక్ష్మిని పిలుచుకొస్తాడు. సవతులిద్దరికీ ఘర్షణ జరుగుతుండగా విష్ణువు శిలారూపం పొందుతాడు. లక్ష్మి, పద్మావతి కూడా శిలారూపం పొందుతారు. ఆ క్షేత్రమే తిరుపతి.

రచనా, సంగీతం, దర్శకత్వం, ఒక్క త్రాటిమీద, చెప్పుకోదగినంత ఉన్నత ప్రమాణంలో సాగాయి. చిత్రం మొత్తం మీద ఎక్కడా అతి అనిపించే ధోరణి కనుపించదు. చిత్రం చూసి భగవంతుడి మీద విరక్తి పుట్టకుండా ఉండేందుకు గానూ, రచయిత, దర్శకుడూ, నటీనటులూ, చిత్తశుద్ధితో, తొందరపడకుండా సమర్థంగా తమ విధులను నిర్వర్తించారు. రచన ఇంత హాయిగా ఈ మధ్య ఏ చిత్రంలోనూ లేదు. అయితే ఇంత పొడుగు చిత్రానికి హాస్యం తక్కువ కావటం కొంచెం లోపమనే చెప్పవచ్చు. హాస్య పాత్ర ఒక్క రమణారెడ్డిదే. అతను ఎంత చక్కగా చేసినా పాత్ర చిన్నదైపోయింది. సంగీతం చాలా చక్కగా ఉంది. మొత్తం 29 పాటలున్నాయి. దాదాపు అన్నీ బావున్నాయి. అరడజను పాటలు మరీ బావున్నాయి.

ఎన్.టి. రామారావు ఇదివరకు అన్ని పాత్రలకంటే, ఈ పాత్రను చాలా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. సాక్షాత్తూ విష్ణువంతడివాడి పాత్రను ధరించేటప్పుడు, ఎక్కడ ఏ మాత్రం వెలితి అయినా, నటుడు నవ్వులపాలయిపోతాడు. అవుతున్నారు కూడా. అందుకే ఎన్.టి. రామారావు శాయశక్తులా శ్రద్ధగా నటించాడు. నిండుగా గంభీరంగా ఉన్నాడు. సావిత్రి, వరలక్ష్మి, శాంతకుమారి అందరూ చాలా జాగ్రత్తగా నటించారు. ఇంత మంది ఇంత జాగ్రత్తగా నటించటానికి దర్శకుడే బాధ్యుడని మొదటి నుంచీ తెలుస్తూనే ఉంటుంది.

దర్శకుడు : పి. పుల్లయ్య; రచన : ఆ్రతేయ; సంగీతం : పెండ్యాల; నటీనటులు : రామారావు, సావిత్రి, ఎస్. వరలక్ష్మి, శాంతకుమారి, రమణారెడ్డి, గుమ్మడి, నాగయ్య తదితరులు.

నండూరి పార్థసారథి
(1960 జనవరి 24వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post