జంట నగరాల హిందూస్థానీ సంగీత ప్రియులకు ఈయేడాది వినాయక చవితి చిరస్మరణీయమైన పర్వదినం. విశ్వవిఖ్యాత సితార్ విద్వాంసుడు రవిశంకర్ నాటి రాత్రి ఫతేమైదాన్ ఇండోర్ స్టేడియంలో 'సుర్ మండల్' ఆధ్వర్యాన కచేరీ చేశారు. మూడు గంటలసేపు శ్రోతలను సంగీత సుధార్ణవంలో వోలలాడించారు. ఆయనకు ప్రక్క వాద్యంగా శంకర్ ఘోష్ తబ్లా వాయించారు.

ప్రసిద్ధ సాయంతనరాగం 'పూర్యాధనాశ్రీ'తో రవిశంకర్ కచేరీ ఆరంభించారు. కర్ణాటక సంగీతంలోని 'పంతురావళి'కి సమానమైన ఈ రాగాన్ని ఆయన గంటసేపు మధించి ఆనంద నవనీతాన్ని శ్రోతలకు అందించారు. ఆలాప్ ప్రారంభిస్తూనే ఆయన కన్నులు మూసుకుని రాగజలధిలో నిమగ్నమైనారు. మంద్రమధ్యతార స్థాయిలలో రాగ స్వరూపాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తూ ముప్పావుగంటసేపు ఆలాప్, జోడ్ (రాగం, తానం) వాయించిన తర్వాత శ్రోతల హర్షధ్వానాలతో ఆయన ధ్యానం నుంచి తేరుకుని కన్నులు విప్పారు. తర్వాత పావుగంట సేపు రూపక్ తాళంలో గత్ వాయించి 'పూర్యాధనాశ్రీ'ని ముగించారు.

తర్వాత తాను స్వయంగా సృష్టించిన 'తిలక్ శ్యాం' రాగాన్ని సుమారు 40 నిమిషాలు వాయించారు. 'తిలక్ కామోద్', 'శ్యామ్ కళ్యాణ్' రాగాల మనోహర మేళనమైన ఈ రాగంలో కొద్ది సేపు ఆలాప్ వాయించిన పిమ్మట విలంబిత్, ద్రుత్ గత్ లను తీన్ తాల్ లో వాయించారు. జలపాత సన్నిభమైన 'ఝాలా'తో రాగాన్ని ముగించారు.

విరామానంతరం రవిశంకర్ తాను స్వయంగా సృష్టించిన మరో రాగం 'జోగేశ్వరి' వాయించారు. ఆయన సృష్టించిన 'కామేశ్వరి', 'పరమేశ్వరి', 'గంగేశ్వరి', 'రంగేశ్వరి'రాగాల శ్రేణిలో ఇది సరికొత్తది. ఇది 'జోగ్', 'వాగేశ్వరి' రాగ స్రవంతుల అపురూప సంగమం.

వీటిలో 'రాగేశ్వరి' ప్రధాన స్రవంతి. 'జోగ్' ఉప స్రవంతి. ఈ రాగంలో ఆయన వాయించిన ఆలాప్ జోడ్, కచేరీ మొత్తం మీద అత్యంత మనోహరమైన అంశం. 'రాగేశ్వరి' ఆలాపిస్తూ మధ్యలో జోగ్ ను మేళవించినప్పుడల్లా శ్రోతలకు 'ఆహా' అనిపించింది. రెండు విభిన్న రాగాలను సంధించడంలో ఆయన అద్భుతమైన అనుభూతిని ప్రసాదించారు. ఆలాప్, జోడ్ తర్వాత ఝప్ తాల్ లో గత్ వాయించారు. గత్ లో లయ విన్యాసానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా రాగ మాధుర్యం స్థాయికొంత తగ్గినట్టుగా అనిపించింది. ఆలాప్ నుంచి జోడ్ వరకు గంభీర సుందరంగా సాగిన రాగం 'హుషారుగా' ముగిసింది.

కచేరీలో చివరి అంశం 'మిశ్రగారా' ఠుమ్రీ. ఇందులో కూడా ఆయన అధిక సంఖ్యాక శ్రోతలను మజా చేయడానికి అవసరమైన మసాలా చొప్పించారు. చివర రాగమాలికను ప్రవేశపెట్టి 'హంసధ్వని', 'జై జై వంతి', 'కళావతి', 'దేశ్' వంటి పెక్కు రాగాలను పరామర్శిస్తూ మళ్ళీ ఠుమ్రీలోకి వస్తూ శ్రోతలను ఉత్సాహపరచారు. కచేరీ ముగింపు దశలో యథాప్రకారంగా సవాల్-జవాబ్ చోటు చేసుకున్నది.

శంకర్ ఘోష్ తబ్లా వాదనం ప్రశంసనీయంగా ఉన్నది. శ్రోతలు పెక్కు సార్లు కరతాళధ్వనులతో తమ ప్రశంసను ప్రకటించారు. అయినా రవిశంకర్ ప్రక్కన ఎప్పుడూ ఉండే ఉస్తాద్ అల్లా రఖా లేకపోవడం కొంత లోటుగానే ఉంది. ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాలుగా రవిశంకర్ అభిమానులకు అల్లారఖా ప్రక్కవాద్యం బాగా అలవాటైపోయింది. రవిశంకర్ సితార్ కు అల్లారఖా తబ్లాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ముఖ్యంగా సితార్-తబ్లా సవాల్-జవాబ్ లో అల్లారఖా లేనిలోటు బాగా కనిపించింది.

నండూరి పార్థసారథి
(1980 లో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post