ఒడిస్సీ నృత్య సామ్రాజ్జి శ్రీమతి సంయుక్తా పాణిగ్రాహి కళాసౌందర్యాన్ని తిలకించే అపురూప భాగ్యం ఈ నెల 14న భాగ్యనగర రసజ్ఞులకు లభించింది. గ్వాలియర్ ఘరానా గాయకమణి స్వర్గీయ రాజాభయ్యా పూఛ్ వాలే శత జయంత్యుత్సవాల సందర్భంగా మూడు రోజులు జరిగిన కచేరీలలో ఆమె నృత్య ప్రదర్శనం విశిష్టమైనది.

ఆమె నాట్యం ఒడిస్సీ నృత్యసౌందర్య సమస్తం. పూరీ, కోణార్క్ దేవాలయాల శిల్ప వైభవం ఆమె నృత్యంలో ప్రతిఫలిస్తుంది. అతి క్లిష్టమైన శిల్ప భంగిమలు ఆమె ఆంగికంలో అవలీలగా ఒదిగిపోతాయి. రంగు రంగుల రసభావాలను రకరకాలుగా రంగరించి క్షణానికొక రీతిగా చూపగల కెలైడోస్కోప్ ఆమె వదనం.

కవిత్వానికి భావం, భాష, చిత్రకళకు రేఖ, రంగు, సంగీతానికి శ్రుతి, లయ, నృత్యానికి ఆంగికం, సాత్వికం మాతాపితల వంటివి; రెండు ప్రాణశక్తుల వంటివి; సమానాధికారంతో వీటిని మేళవించుకోవడంలోనే కళాప్రతిభ ఆవిష్కృతమవుతుంది. వాటిలో ఏ ఒక్క దానిపై అధికారం కొరవడినా కళ నీరసపడుతుంది. చిత్రకళలో రేఖాశుద్ధి, సంగీతంలో శ్రుతిశుద్ధి ఎంత ముఖ్యమో, నృత్యంలో 'అంగ శుద్దం' అంత ముఖ్యం. 'అంగ శుద్ధం' అంటే ఆంగిక చాలనాలతో నిర్దుష్టత, స్పష్టత. 'అంగ శుద్ధం'లేని నాట్యం చిత్త శుద్దిలేని శివ పూజలాగా, భాండశుద్దిలేని పాకంలాగా ఉంటుంది. కళలోని ఈ 'శుద్ధత'యే వేదాంతులు వర్ణించే బ్రహ్మానందానుభవాన్ని చవిచూపిస్తుంది. బాపూ బొమ్మలో రేఖలాగా, కరీంఖాన్ పాటలో శ్రుతి లాగా సంయుక్త ఆంగికంలో 'శుద్ధత' 'ఆహా'అని పరవశింపజేస్తుంది. ఒకరు రేఖాతపస్వి, మరొకరు 'శ్రుతీకీ అవతార్'. ఈమె నాట్యయోగిని.

ప్రతి కళలోనూ ఇతర కళల అంశలు అలవోకగా తొంగి చూస్తూ ఉంటాయి. కవితలో లయ విన్యాసం లాగా సంగీతంలో భావనా సౌందర్యం లాగా, నృత్యంలో రేఖా విన్యాసాలు దర్శనమిస్తూ ఉంటాయి. సంయుక్త ఆంగిక చాలనాలలో అందమైన, శుద్ధమైన రేఖలెన్నో కనిపిస్తాయి. ఆ రేఖలతో శ్రుతి, లయ లతల్లాగా అల్లుకుపోయి, అతి మనోహరంగా కనిపిస్తాయి.

'రవీంద్రభారతి'లో రెండు గంటల పైగా జరిగిన కార్యక్రమంలో ఆమె మొత్తం ఏడు అంశాలను ప్రదర్శించింది. 'మంగళాచరణం'తో మొదలుపెట్టి, 'మోక్షమంగళ్'తో ముగించింది. ప్రతి అంశానికీ ముందు అందులోని భావాన్ని, ప్రక్రియా విశేషాన్ని ఆమె ఇంగ్లీషులో కవితా శైలిలో, అభినయాత్మకంగా వివరించింది. 'మంగళాచరణం'లో ఆమె 'ఓంకార పంజర శుకీం' అనే ప్రసిద్ధ శ్లోకానికి అభినయం చేసింది. రెండవ అంశం 'పల్లవి'. ఒడిస్సీ సంప్రదాయంలో ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. సాహిత్యం లేకుండా స్వరాలు, జతులు మాత్రమే ఇందులో ఉంటాయి. భరతనాట్యంలోని జతిస్వరం లాంటిది ఇది. గాయకుడు స్వరాలు, నట్టువాంగం నిర్వహించే గురువు జతులు పలుకుతుంటే నర్తకి వాటికి అనుగుణంగా నృత్యం చేస్తుంది. ఇందులో ఆంగికానికి ప్రాధాన్యం ఉంటుంది.

మూడవ అంశం 'అభినయ', సాలబేద అనే ఒక గొప్ప ముస్లిం కవి ఒరియా భాషలో రచించిన భక్తి గీతాన్ని సంయుక్త అద్భుతంగా అభినయించింది. ఇందులో గజేంద్రమోక్షం, ద్రౌపదీ మానసంరక్షణం, నరసింహావతారం వంటి భాగవత ఘట్టాలున్నాయి. ఇందులో సాత్వికాభినయానికే ప్రాధాన్యం.

Samyukta Picture

దీని తరవాత 'యుగ్మ-ద్వంద్వ్' అనే అంశం ప్రదర్శించింది. ఇది హిందుస్థానీ కచేరీలలోని 'జుగల్ బందీ', 'సవాల్-జవాబ్' లాంటిది. ఇందులో నర్తకి గాయకునితో పోటీపడుతూ స్వరాలకు, జతులకు, దరువులకు, ఆంగిక, సాత్వికాభినయాలు రెండింటితో సమాధానం చెబుతుంది. గాయకుడు 'భాగేశ్వరి' రాగం పాడుతుంటే సంయుక్త శృంగార నాయకిగా అభినయించింది. ప్రియుని రాకకోసం ఎదురు చూస్తూ, అతని కోసం అలంకరించుకుంటున్న నాయకిగా ఆమె ముగ్ధమోహనంగా అభినయించింది. ఇందులో స్వరాలు, జతులూ తప్ప సాహిత్యం ఉండదు.

దీని తరవాత 'కురుయదునందన' అనే జయదేవ అష్టపదిలో స్వాధీనపతికగా నవపల్లవ కోమలమైన శృంగార భావాలను అభినయిస్తూ రాధామాధవ ప్రణయ చిత్రాన్ని కళ్ళకు కట్టించింది. తులసీదాస్ రచించిన 'రామచరిత మానస్'లోని 'సీతాహరణ్' ఘట్టం మరొక అంశం. రాగమాలికగా, తాళమాలికగా కూర్చిన ఈ రచనలో సీత, రాముడు, లక్ష్మణుడు, రావణుడు, బంగారు లేడి అన్నీ తానేయై, పరస్పర విరుద్ధమైన హావభావాలను వెంట వెంటనే మార్చి మార్చి ప్రదర్శిస్తూ ఆమె చేసిన సాత్వికాభినయం ప్రేక్షకులను ముగ్ధులను చేసింది.

చిట్ట చివరి 'మోక్షమంగల్' అంశంలో సంయుక్త ప్రతిభ పరాకాష్ఠ నందుకొన్నది. 'సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే' అంటూ దేవీ స్తుతి చేస్తూ, భక్తి పారవశ్యం నుంచి క్రమంగా భావాతీత స్థితికి అభిగమించడం, చివరికి కేవల బ్రహ్మానందానుభవంతో ప్రణవవాడంలో లీనం కావడం-మహాద్భుతంగా, ఒళ్ళు గగుర్పొడిచే విధంగా అభినయించింది ఆమె.

ఈ మొత్తం కార్యక్రమం గొప్పగా రక్తి కట్టడానికి శ్రీమతి సంయుక్త భర్త రఘునాథపాణి గ్రాహి గానం ఎంతో దోహదం చేసింది. ఆమె నాట్యం ఎంత గొప్పగా ఉందో ఆయన పాట అంత గొప్పగా ఉంది. వారి నాట్య గానాల మేళనం పాలూతేనెల మధుర మిశ్రమంలాగా ఉంది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ మరాటీ కవి, పాత్రికేయుడు పి.ఎల్.దేశ్ పాండే వేదికపైకి వచ్చి సన్మాన పురస్పరంగా పాణిగ్రాహి దంసతులిద్దరికీ కలిసి ఒకే పెద్ద పూలమాల వేశారు. పార్వతీ పరమేశ్వరుల సంబంధం వాగార్ధాల సంబందం వంటిదని మహాకవి కాళిదాసు వర్ణించాడనీ, ఆ ఉపమానం ఈ దంపతులకు కూడా వర్తిస్తుందనీ ఆయన అన్నాడు. పాణిగ్రాహి దంపతుల కళామేళనం గురించి అంతకంటే చక్కగా చెప్పడం సాద్యంకాదు.

ఈ ప్రదర్శనంలోని అంశాలకు రఘునాథ పాణిగ్రాహి స్వయంగా సంగీతం సమకూర్చారు. 'మంగళాచరణం'లో ఆయన పాడిన 'యమన్' రాగం, 'పల్లవి'లో పాడిన 'ఆరభి' రాగం 'యుగ-ద్వంద్వ్'లో పాడిన 'భాగేశ్వరి' రాగం, 'మోక్షమంగళ్'లో పాడిన తోడి (హిందుస్థానీ) రాగం మళ్ళీ మళ్ళీ మధుర మధురంగా మనస్సులో మెదులుతాయి.

నట్టురాగం నిర్వహించిన గురు గంగాధర ప్రధాన్, సితార్ వాయించిన హేమంత కుమార్ దాస్ ఇప్పటికి ఇరవై ఏళ్లుగా సంయుక్త బృందంలో పాల్గొంటున్న సమర్థులైన కళాకారులు. జగదీశ్ ప్రసాద్ వేణువు వాయించగా, పాణిగ్రాహి దంపతుల కుమారుడు సవ్యసాచి పాణిగ్రాహి మంజీర (తాళాలు), స్వరమండల్ వాయించాడు. సర్వాంగ సుందరమైన ఈ నాట్య ప్రదర్శనం రసజ్ఞుల మధుర స్మృతుల మంజూషలో పదిలంగా ఉంటుంది.

నండూరి పార్థసారథి
(1974 ఆగష్టు 21వ తేదీన ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post