శోభానాయుడు, చిట్టిబాబు. శోభా గుర్తు

అమృతం కురిసిన రాత్రులు

సుర్ మండల్ వారి 'మ్యూజిక్ ఈజ్ గోల్డ్' డిసెంబర్ 27న కుమారి శోభానాయుడు కూచిపూడి నృత్యంతో, శ్రీమతి శోభా గుర్తు ఠుమ్రీ-దాద్రా-ఘజల్-భజన్ కచేరీతో శోభాయమానంగా ప్రారంభమయింది.

నాట్య శోభ

కుమారి శోభానాయుడు సంప్రదాయానుసారం నాట రాగంలో పూర్వరంగ నృత్యంతో ఆరంభించి, 'రాధికా కృష్ణ రాధికా' అనే అష్టపదిని, నారాయణ తీర్థులవారి బాలగోపాల తరంగాన్ని, 'క్షీరసాగర శయన' త్యాగరాజ కృతిని, 'పలుకు తేనెల తల్లి పవళించెను' అనే అన్నమాచార్య సంకీర్తనను, చివరికి దశావతారాన్ని అభినయించింది. ఈ అంశాల మధ్య కుమారి రీటా డోంగ్రే మూడు అంశాలను ప్రదర్శించింది. గురువు శ్రీ వెంపటి చిన సత్యం నట్టు వాంగం నిర్వహించగా, శ్రీమతి కనకదుర్గ గానం చేసింది.

'క్షీరసాగర శయన', 'పలుకు తేనెలతల్లి' అంశాలతో కుమారి శోభ అభినయం ప్రశంసనీయంగా ఉంది. నాట్యానికి అనువైన అంగసౌష్టవం, సుందర వదనం, మంచి శిక్షణ వల్ల, సాధనవల్ల అబ్బిన ఆత్మవిశ్వాసం, సాత్వికాభినయంలో ప్రతిభ, ఆంగికాభినయంలో అవలీల-ఇవన్నీ శోభ నృత్యానికి శోభ చేకూర్చే ఆభరణాలు. అయినా వేదిక అనుకూలంగా లేకపోవడం వల్ల ఆమె కొంత ఇబ్బంది పడినట్టుగా కనిపించింది. శ్రీమతి కనకదుర్గ శ్రావ్యంగా గానం చేసి నాట్యరక్తికి ఎంతో దోహదం చేసింది.

చిట్టిబాబు 'నాదలోలుడై...'

శోభ నృత్యం తర్వాత సుప్రసిద్ధ వైణికుడు చిట్టిబాబు సుమారు గంటసేపు వీణ కచేరీ చేశారు. ఆయన యథాప్రకారం 'వాతాపి గణపతిం భజేహం' (హంసధ్వని)తో కచేరీ ప్రారంభించి సుమారు పావుగంటసేపు వాయించి ఆకృతి ఆకృతిని సమగ్రంగా ఆవిష్కరించారు. ఆ తర్వాత కళ్యాణ వసంత రాగంలో త్యాగరాజు గారి 'నాదలోలుడై' కృతిని అరగంటసేపు అద్భుతంగా, ఆపాతమధురంగా వాయించారు. వీణానాదలోలుడై చిత్రవిచిత్ర గమక విన్యాసాలను ప్రదర్శించి శ్రోతల ప్రశంసాధ్వానాలను అందుకున్నారు. చివర పది నిమిషాలసైపు మృదంగం-ఘటం లయ విన్యాసం జరిగింది. కె. వీరభద్రరావు మృదంగ వాదనం ప్రతిభావంతంగా, సున్నితంగా, హుందాగా ఉంది. ఆయన శిష్యుడు సోమయాజులు ఘటం చక్కగా వాయించారు. 'కళ్యాణ వసంతం' అతి మనోహరమైన రాగం. ఈ రాగంలో హిందూస్థానీ 'చంద్రకౌస్' ఛాయలు బాగా కనిపిస్తాయి. రెండు రాగాలకు ఆరోహణ (సగమధనిస) ఒకటే; ఆవరోహణలో మాత్రం 'కళ్యాణవసంతం'లో ఏడు స్వరాలు వస్తాయి.

ఘజల్ శోభ

శోభా గుర్తు తన రెండు గంటల కచేరీలో ఠుమ్రీలు, దాద్రాలు, ఘజళ్ళు, భజన్ లు మొత్తం పది పాడింది. నసాళానికెక్కే ఘాటయిన శాస్త్రీయ సంగీత కషాయాన్ని హరాయించుకోలేనివారికి ఆమె లలిత శాస్త్రీయ సంగీతం హాయినిస్తుంది. శృంగారభావాలు గుబాళించే ఠుమ్రీలను, ఘజళ్ళను ఆమె మధురంగా, హుందాగా పాడుతుంటే రసిక హృదయాలు సొక్కి సోలిపోయాయి.

లలిత సంగీత రచనలను గానం చేయడంలో ఆమె శైలి బేగం ఆఖ్తర్ శైలికి చాలా దగ్గరగా ఉంటుంది. బేగం అఖ్తర్ వలెనే ఈమె కూడా ముందు శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకుంది. ఈమె శుద్ధ శాస్త్రీయ పద్ధతిలో ఖయాల్ లు కూడా పాడుతుంది. కాని ఈ కచేరీలో ఖయాల్ లు ఏవీ పాడలేదు. ఘజల్ గాయనిగానే ఆమె ఎక్కువ పేరు గడించింది.

మిశ్రఖమాజ్ రాగంలో 'ననదియా కాహేబోల్' అనే ఠుమ్రీతో కచేరీ ప్రారంభించి ఆమె సంగీత రసికుల మనస్సులలో బేగం అఖ్తర్ మధుర స్మృతులను రేపింది. ఆమె తన కచేరీలో 'మేరేహం నఫస్, మేరేహం నవాజ్ ముఝేదోస్త్', 'ఐ మొహబత్ తేరే అంజాం పేరోనా ఆయా' అనే మరి రెండు బేగం అఖ్తర్ మధు గీతాలను వినిపించింది. 'రంగ్ సారీ గులాబీ చునరియా' అనే పహాడీ దాద్రాలో రకరకాల రాగాలను రంగరిస్తూ ప్రతిపదంలో సాహిత్య భావాన్ని తొణికిస లాడిస్తూ ఆమె ప్రతిభావంతంగా గానం చేసింది. 'సయ్యా రూఠ్ గయే మై మనాతేరహే' మరో మంచి గజల్. ఈ శృంగార గీతాలన్నింటికీ పూర్తిగా భిన్నమైన మీరా భజన్ ('సునో సునోరే దయాలే') కూడా సాహిత్య గౌరవాన్ని పోషిస్తూ ఆమె చక్కగా గానం చేసింది.

ప్రతిమా బేడీ, డాక్టర్ సుబ్రహ్మణ్యం, భీమ్ సేన్ జోషి

కిరానా ఘరానా వైభవం

రెండవ నాటి కార్యక్రమంలో శ్రీమతి ప్రతిమా బేడీ ఒడిస్సీ నృత్యం, డాక్టర్ సుబ్రహ్మణ్యం వైలిన్ (కర్నాటక సంగీతం) కచేరీ, చివరికి పండిత్ భీమ్ సేన్ జోషి హిందూస్థానీ గాత్ర సంగీత కచేరీ జరిగాయి. ప్రతిమాబేడీ నృత్యం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఎందుకంటే ఒడిస్సీ శైలి అటు ఉత్తరాది కథక్ కు, ఇటు దక్షిణాది భరత నాట్యానికి మధ్యస్థంగా ఉంటుంది. డాక్టర్ సుబ్రహ్మణ్యం వైలిన్ కర్నాటక సంగీత ప్రియుల ప్రశంస లందుకున్నది. చివరి భీమ్ సేన్ జోషి కచేరీకి హిందూస్థాని శాస్త్రీయ సంగీత ప్రియులు మాత్రం మిగిలారు. హిందూస్థానీ సంగీతంతో పరిచయం లేని వారు ఎవరైనా షామియానాలో చెదురు మదురుగా మిగిలి ఉంటే వారు కూడా అరగంట సేపు విని 'ఇది మన సంగీతం కాదు' అని తేల్చేసుకుని వెళ్ళిపోయారు. హిందూస్థానీ సంగీతానికి ఆత్మార్పణం చేసుకున్న వారి కోసం భీమ్ సేన్ జోషి గంటన్నర సేపు 'బేహాగ్' రాగాన్ని మహాద్భుతంగా గానం చేశారు. ముందు ఆలాప్ తో రాగసౌధానికి పునాది వేసి విలంబిత్ ఖయాల్ గంట సేపు పాడి, తర్వాత ఇంకో పావు గంట ధ్రుత్ ఖయాల్ గానం చేశారు. 'బేహాగ్'లోని రసాన్నంతటినీ ఒక్క బొట్టు మిగల్చకుండా పిండేసినట్టు, శ్రోతలు ఎప్పటికీ మరిచిపోలేనట్టు హిందూస్థానీ సంగీతం వైభవ సమస్తం ఇదే నన్నట్టు ఆయన గానం చేశాడు. గంటన్నర సేపు పాడినా ఆయనకు తనివి తీరినట్టు లేదు. అయిష్టంగానే (మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాలెండి అన్నట్టు) ఆ రాగాన్ని ఆపుచేశారు. తర్వాత 'తిలక్ కామోద్' రాగాన్ని అరగంట సేపే అయినా మళ్ళీ అంత గొప్పగానూ గానం చేశారు. ఈ తరంలో కిరానా ఘరానాపీఠాధిపత్యం నిస్సందేహంగా ఆయనదే.

చిత్రావిశ్వేశ్వరన్, శివకుమార్ శర్మ, హరిప్రసాద్ చౌరసియా

చిత్ర భరత నాట్యం

మూడవ నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీమతి చిత్రావిశ్వేశ్వరన్ కు ఈ తరం భరత నాట్య కళాకారిణులలో చెప్పుకోదగ్గ ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె యామినీ కృష్ణమూర్తి లాగా, పద్మా సుబ్రహ్మణ్యం లాగా ఆత్మ విశ్వాసంతో అవలీలగా నృత్యం చేయగలదు. ఎవరినీ అనుకరించని సొంత శైలి ఆమెకు ఉన్నది. ఆమె ప్రదర్శించిన 'ఖండిత నాయిక', 'కృష్ణా నీ బేగన బారో' గొప్పగా ఉన్నాయి.

శివకుమార్ సంతూర్

నాలుగు రోజుల సంగీతోత్సవంలో రవి శంకర్ కచేరీతో సమానంగా - బహుశా ఇంకా ఎక్కువగా సంగీత ప్రియులను ఆకట్టుకున్న కచేరీ పండిత్ శివకుమార్ శర్మ సంతూర్ కచేరీ. ఆయన కచేరీ ప్రారంభిస్తే హిందూస్థానీ, కర్ణాటక, పాశ్చాత్య సంగీతాల ఎల్లలు చెరిగిపోతాయి. హిందూస్థానీ సంగీతాన్ని గురించి ఏ మాత్రం తెలియని వారు, శాస్త్రీయ సంగీతం అంటే పెడమొహం పెట్టేవారు కూడా ఆయన సంగీతాన్ని ఆనందించ గలరు. అసలు వాద్యంలోనూ, ఆయన శైలిలోనూ కూడా అంత ఆకర్షణ ఉంది.

సంతూర్ వంద తీగలుగల కాశ్మీర్ జానపద సంగీత వాద్యం, శతాబ్దాలుగా కాశ్మీర్ లోయహద్దుల మధ్య ఒదిగిఒదిగి ఉండిపోయిన సంతూర్ సుమధుర నాదాన్ని హిమాలయ శృంగాల నుంచి దించి దేశమంతటా ప్రవహింపజేసిన భగీరధుడు శివకుమార్ శర్మ. సంతూర్ కు శత తంత్రీ వీణ అనే పేరు కూడా ఉంది. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని ఎవరూ వంకబెట్టడానికి వీల్లేని విధంగా-సాధికారంగా వినిపించడం కోసం ఆయన దానికున్న వంద తీగలు చాలక ఇంకో పదహారు తీగలు తగిలించారు. తండ్రి దగ్గర నేర్చుకున్నదానికి తోడు స్వయంగా ఎంతో సాధన, శోధన చేసి సంతూర్ పై శాస్త్రీయ సంగీతాన్ని పలికించే పద్ధతిని కనిపెట్టారు. కేవలం మంగళవాద్యంగా ఉండి షెహనాయికి కచేరీ గౌరవం కల్పించడానికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎంత కృషి చేశాడో, సంగీత సభలలో సోలో వాద్యంగా వేణువుకు స్థానం కల్పించడానికి పన్నాలాల్ ఘోష్ ఎంత కృషి చేశాడో సంతూర్ కు కచేరీ స్థాయి కల్పించడానికి శివకుమార్ అంత కృషి చేశారు. సంతూర్ మరే వాద్యంతోనూ పోల్చడానికి వీల్లేని విశేషమైన వాద్యం. దాని నాదమాధుర్యం అనుభవైక వేద్యం. సంతూర్ వాదనం వినడానికే కాదు - చూడడానికి కూడా ఆకర్షకంగా ఉంటుంది.

శివకుమార్ సుమారు వంద నిమిషాల కచేరీలో రెండే రాగాలు వాయించారు. మొదట 'పూర్యాకల్యాణ్' రాగంలో ఆలాప్, జోడ్, ఝాలా, విలంబిత్ గత్, ధ్రుత్ గత్ - మొత్తం గంటంబావు సేపు వాయించారు. అడుగడుగునా చిత్రవిచిత్ర విన్యాసాల సవాళ్ళు విసురుతూ తనకు తబ్లా వాయించిన జాకీర్ హుస్సేన్ ను చూలా శ్రమ పెట్టారు. అయినా జాకీర్ హుస్తేన్ ఆట్టే వెనక పడకుండా, చాలా సార్లు శ్రోతల ప్రశంసలనందుకున్నాడు. 'పూర్యాకల్యాణ్' తరవాత శివకుమార్ శ్రోతల కోరికపై 'సోహిని' రాగం కొద్ది సేపు వాయించి కచేరీ ముగించారు.

హరి ప్రసాద్ వేణువు

చివరి రోజు రవిశంకర్ కచేరీకి ముందు సుప్రసిద్ధ వేణు విద్వాంసుడు పండిత్ హరిప్రసాద్ చౌరసియా కచేరీ జరిగింది. ఈ కచేరీకి కూడా జాకీర్ హుస్సేన్ తబ్లా వాయించాడు. పన్నాలాల్ ఘోష్ మరణానంతరం హిందూస్థానీ సంగీతంలో ప్రథమ గణ్యులైన ముగ్గురు వేణు విద్వాంసులలో హరిప్రసాద్ ఒకరు. ఆయన 'భూపాలీ' రాగాన్ని గంటసేపు వాయించారు. ఆలాప్, జోడ్, ఝాలా నలబై నిమిషాలు వాయించి ఝప్ తాల్ గత్ మరో ఇరవై నిమిషాలు వాయించారు. ('భూపాలీ' అంటే కర్ణాటక సంగీతంలో మోహన రాగం). తర్వాత 'హేమావతి' అనే దాక్షిణాత్య రాగాన్ని హిందూస్థానీ పద్ధతిలో వాయించారు. 'భాటియాలీ' ధున్ తో ఆయన కచేరీ ముగించారు. 'భూపాలీ', 'హేమావతి' రాగాలలో ఆయన ప్రతిభ పన్నాలాల్ ను జ్ఞాపకం చేసింది.

ఇంతమంది గొప్ప కళాకారులను ఒక్క వేదికపై సమావేశపరచిన సుర్ మండల్ వారికి, ఆర్థికంగా ఈ ప్రయత్నానికి అండగా నిలిచిన వజీర్ సుల్తాన్ కంపెనీ వారికి జంటనగరాల సంగీత ప్రియులు చాలా ఋణపడ్డారు.

నండూరి పార్థసారథి
(1980 డిసెంబర్ 30వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post