Title Picture

(నవల. రచయిత : విద్వాన్ బి. లక్ష్మణరాజు ఎం.ఎ., ప్రచురణ : రాజశేఖర బుక్ డిపో, కర్నూలు. ప్రాప్తి స్థానం కూడా అదే. క్రౌన్ సైజు. మూడు భాగములు. మొత్తం 1083 పేజీలు. వెల : 15 రూపాయలు. ఒక్కొక్క భాగము 5 రూపాయలు)

సుమారు 11 వందల పేజీలున్న ఈ బృహన్నవలను 15 రూపాయలు ధరపెట్టి ఒకే సంపుటంగా ప్రచురిస్తే (చదవటానికీ, కొనటానికీ కూడా) పాఠకులు జడుసుకోవచ్చుననే అభిప్రాయంతో కాబోలు ప్రకాశకులు దీన్ని మూడు సంపుటాలుగా ప్రచురించారు. 58 అధ్యాయాలతో, 30 పాత్రలతో అడయార్ వటవృక్షంలా వ్యాపించుకుంది ఈ నవల. భాషను బట్టి, రచనా శిల్పాన్ని బట్టి, ముద్రణనుబట్టి-ఇది 1920లో రచించిన నవల అని పాఠకులు అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. కాని ఇది 1963లో ప్రచురితమయింది.

ఈ బృహదారణ్యంలో ప్రవేశించడానికి పాఠకులు భయపడతారనే ఉద్దేశంతో కాబోలు రచయితగారు ముగ్గురు ప్రసిద్ధులచేత ధైర్యం చెప్పించారు. శ్రీ దివాకర్ల వెంకటావధానిగారు, వారి ఇంటనున్న వారు కూడా ఈ నవలను చదివి ఆనందించినారట. 'కథా నిర్మాణమునందును, పాత్ర పోషణమునందును, వర్ణన పాటవమునందును శ్రీ రాజుగారు చూపిన నేర్పు మిక్కిలి ప్రశంసనీయమై యున్నది'ట. ఇంక 'భాష నిరాడంబరమై, సహజమై సర్వ సుబోధకముగానున్నది'ట. భాషలో 'సహజత్వానికి' కొన్ని మచ్చుతునకలు : ఆనందంతో ఇద్దరి గుండెలు వేగంగా కొట్టుకొన్నాయని చెప్పడానికి రచయిత చెప్పింది ఇది : 'ఇరువురి దేహములందలి ధమనులు పరిశుద్ధ రక్తాన్ని మిక్కిలి వేగంగా హృదయములకు సరఫరా జేశాయి'. మరొకటి- 'సరళ బరువుగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పు నందలి బొగ్గుపులుసువాయువు రాంబాబు మనఃకలుషాన్ని ఈలాంటిదని చూపింది'. పైటతో కళ్లు తుడుచుకుంది అనటానికి- 'పైట చెరగు కనుగొనల దగ్గర ప్రవేశించి దిగజారిన కన్నీటి నింకింప జేసింది'. 'కర్పూరపుటనంటుల చల్లదనాన్ని కాలదన్ను శోభయొక్క తొడలపై తన శిరస్సును నిక్షిప్తము చేసి...'

శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులుగారు వ్రాసిన పరిచయ వాక్యాలలో 'పాత్రలు పరిమితంగా ఉన్నాయి. పరిమిత పాత్రలతో ఇంత రచనను నడపడం కొంత కష్టమే' అన్నారు. మరీ చిన్న పాత్రలు కాక ఒక మోస్తరు ప్రాధాన్యం గల పాత్రలే ఇందులో 26 ఉన్నాయి. వీటిలో 15 పాత్రలు ముఖ్యమైనవి. ఇందులో అరడజనుమంది యువతులు, అరడజనుమంది యువకులు ఉన్నారు. మగవాళ్లందరూ ఆజానుబాహులు, విశాల వక్షస్కులు, సత్పురుషులు. ఆడవాళ్లందరికీ తుమ్మెదరెక్కలవంటి శిరోజములు, తామరతూండ్ల వంటి చేతులు, 'కర్పూరపుటనంటులబోలు' తొడలు, చకోరములవంటి వక్షోజాలు, చెవులనంటు కన్నులు ఉంటాయి. అందరూ ఒక్క లోపము కూడా లేని నారీరత్నాలు. నవల ముగిసేటప్పటికి యువకులకూ, యువతులకూ పెళ్లిళ్లు అవుతాయి. ముసలివాళ్లలో కొందరు కాశీకి, కొందరు కాటికి పోతారు. మిగిలినవాళ్లు రెస్టు తీసుకుంటూ ఉంటారు. యువతీ యువకులంతా దేశసేవకు నడుం బిగిస్తారు.

ఇది వెయ్యి పేజీల కథాసాధం కాబట్టి రచయితగారు పునాదిని బాగా మూడుతరాలలోతు నుంచి తవ్వుకుంటూ వచ్చారు. ఫ్లాష్ బాక్ లో హీరో వంశ వృక్షాన్ని పెల్లగించారు. సౌధ నిర్మాణానికి వేసిన ప్లాను పకడ్బందీగానే ఉంది కానీ, నిర్మాణమే అవకతవకలుగా ఉంది. ఒక్క మాటలో చెప్పదగినదానికి ఒక పేజీ, ఒక పేజీలో చెప్పదగినదానికి ఒక అధ్యాయం వ్రాశారు. అందుకే అరసంపుటంలో సరిపోయే నవలను మూడు సంపుటాలుగా సాగదీశారు. రమ, రమేష్ బీచికి వెళ్లి వచ్చారని చెప్పడానికి-ఇంటిలో నుంచి బయటకు రావటం, టాక్సీని పిలవటం, అది రావటం, ఎక్కడం, కూర్చోటం, కారు కదలడం, దాని స్పీడు, డ్రైవరు మీసాలు, దారిలో కనిపించే మేడలు, రోడ్డు, బూట్ పాలిష్ కుర్రాడు, షాపుల శోభ, బీచికి చేరటం, కారుదిగటం, ఇసకలో కూచోటం... ఇలా ఇలా ఎన్నో వ్రాసుకుంటూ పోయారు. హోటల్ కు వెళ్లితే అక్కడ బల్లలు, కుర్చీలు, వచ్చే పోయే జనం, కాషియరు ముఖవర్ణన మొదలయినవన్నీ వ్రాశారు. వీటికి ప్రయోజనమంటూ ఏమీలేదు. హీరో ఒక సభలో ఉపన్యసిస్తాడు. 'ఆతడిట్లు ఉపన్యసించెను' అంటూ నాలుగైదు పేజీలు వ్రాశారు. శోభనంనాడు నూతన దంపతులు బిగికౌగిటిలో పేజీల తరబడి రాజకీయాలు చర్చిస్తారు.

రైలు అనేదానిని రచయితగారు పొగబండి అనీ, ధూమశకటము అనీ, శతశ్శక్ర శకటము అనీ పిలుస్తారు. కారును అయో వాహనము అంటారు. రైలు మార్గాన్ని అయోమార్గము అంటారు. ఇదంతా భాషాభిమానమేమో అనుకుంటే అదీకాదు. నిక్షేపంలాంటి తెలుగు మాటలున్నా ఇంగ్లీషు పదాలు వాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. రైలు పెట్టెను 'పొగబండి యొక్క కంపార్టుమెంటు' అని అంటారు.

విద్వాన్ లక్ష్మణరాజుగారి భాషలో వికటసంధులు, వికృత పదప్రయోగాలు కొల్లలుగా ఉన్నాయి. కొన్ని మచ్చుతునకలు: 'నిస్పృహత', 'హస్తిమశకాంతరముతేడా', 'షూటూ బూటూ'. ఇక తీరైన వాక్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. భాష వ్యావహారికమో, గ్రాంథికమో, మధ్యస్తమో, అసలు ఏదీ కాదో తెలీదు. ఒకశైలి అంటూ లేదు. ప్రసాద గుణం లేదు.

అసందర్భంగా, అనౌచిత్యంగా ఉండే వర్ణనలకు కొదవలేదు. కడుపులో మెలిపెట్టే మాదిరి వర్ణనలున్నాయి. 'లక్ష్మి లేచి భోజనానికి లేవండన్నది. హరిహరరావు గురుశంకకు కాబోలు వెళ్లిపోయాడు'. ఈ వాక్యం చాలు రచయితకు ఎంత ఔచిత్యం తెలుసో తెలుసుకోవడానికి. ఒక చోట 60 ఏళ్ల ముసలావిడ తన కోడలుకు తన చిన్ననాటి రొమాన్సు గురించి పేజీల తరబడి వర్ణిస్తుంది. భర్త తనను ఎత్తుకుంటే ఒళ్లు ఎలా పులకరించిందో, ఆయన చేతులు తనకు ఎక్కడెక్కడ తాకాయో చెబుతుంది. ఆ జ్ఞాపకాలతో మళ్లీ తనకు ఒళ్లు గగుర్పొడుస్తుందని చెబుతుంది.

అచ్చుతప్పులు, పేజీల నంబర్ల తప్పులు, పంక్చుయేషన్ తప్పులు సమపాళంగా ఉన్నాయి. ముఖచిత్రం నవలకు తగినట్లుగానే ఉంది. మొత్తం మీద ఇది అపూర్వమైన నవల. ఇట్టి రచన అనన్యసాధ్యం.

ప్రసిద్ధుల పరిచయ వాక్యాలు చదివి పాఠకులు మొహమాటపడతారని నేను అనుకోను. నూటికీ కోటికీ ఎవరైనా ఒకరు పంతం కోసం చివరికంటా చదివినా మెచ్చుకుంటారనుకోను. ఇది ప్రజాసామాన్యం కోసం వ్రాసింది కూడా కాదు. ఎందుకంటే మన ప్రజాసామాన్యానికి ఒక్క నవలను 15 రూపాయలు పెట్టి కొనే స్తోమతులేదు. మన ఆర్థిక వ్యవస్థ ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ఈ పుస్తకం ముద్రణకు ఎన్ని వేలు ఖర్చయి ఉంటుందో తెలియదు గానీ మన దేశానికి-ముఖ్యంగా ప్రస్తుత అవాంతర పరిస్థితిలో ఇటువంటి నవలకోసం అమూల్యమైన ధనాన్ని వెచ్చించే స్తోమతు లేదు.

ఈ నవలలో నాకు బాగుందనిపించినది ఈ ఒక్క వాక్యం :

'భగవత్సృష్టికి దుఃఖమే పర్యవసానమైతే పరమేశ్వరునికంటే మించిన పాపిలేడు'.

నండూరి పార్థసారథి
(1964 ఫిబ్రవరి 26వ తేదీన ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post