Title Picture

(చరిత్రాత్మక నవల రచన : మహాకవి సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. ప్రచురణ, ప్రాప్తిస్థానం : రాజశేఖర్ బుక్ డిపో, ఆళ్ళగడ్డ, కర్నూలు జిల్లా. క్రౌన్ సైజు 270 పేజీలు. వెల : ఐదు రూపాయలు)

ఇందులోని ఇతివృత్తం తంజావూరు రఘునాథ రాయలకు సంబంధించినది. 'విజయనగర రాజులను గురించి ఆచార్యులవారు సల్పిన పరిశోధనా ఫలితముగా నిది వెలువడినది' అని ప్రకాశకులు పేర్కొన్నారు. పరిశోధనాంశాలను రచయిత నవలా రూపంలోగాక, చరిత్ర గ్రంథం రూపంలోనే వ్రాస్తే బాగుండేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో నవలా లక్షణాలకంటే హిస్టరీ పాఠ్య పుస్తకం లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.

కథగానీ, నవలగానీ, మరి ఏ రచనగానీ-ఉత్సాహంగా ఒక్క బిగిన చదివించగల శక్తిగలదై ఉండాలి. ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు, ఎన్ని కొత్త విషయాలు చెప్పారు అనే దానికంటే ఎంత పఠనీయంగా, అందంగా, సరళంగా, సరసంగా చెప్పారు అన్నది ముఖ్యం రచనకు. పఠనీయంగా లేని పాషాణపాకంలో రచిస్తే భారతం కూడా చదవరు, సాహితీ ప్రియులు. హిస్టరీ పాఠ్య పుస్తకం సంగతి వేరు. దానికి ఇది వర్తించదు.

ఈ పుస్తకాన్ని బలవంతంగా చదవ వలసినదే కానీ, ఉత్సాహంగా చదవలేము. కథనంలో సొంపులేదు. నడకలో బిగువు, హుందాతనం లేవు. భాషలో సరళతలేదు. కాసేపు చదవగానే విసుగుపుట్టుతుంది. కొన్ని చోట్ల కథను మరిచిపోయి పేజీల తరబడి చారిత్రకాంశాలు ఏకరువు పెట్టారు. కథ కాసేపు వర్తమానంలోనూ, కాసేపు భూతం (ఫ్లాష్ బాక్)లోనూ నడుస్తూ ఉంటుంది. వర్తమానం (కథాకాలం)లో కంటే భూతకాలంలోనే ఎక్కువగా నడుస్తుంది. అంటే కథాసౌధంకంటే పునాది ఎక్కువగా ఉందన్నమాట. అసలు సౌధ నిర్మాణానికి వేసిన ప్లానే పకడ్పందీగా లేదు. ఇఁదులో నాయకుడు ఎవరో తెలియదు. రఘునాథరాయలను కథా నాయకుడుగా ప్రవేశపెట్టారు కానీ, అతను నవల ఆధ్యంతాలలో మాత్రమే వస్తాడు. మధ్యలో అతని స్నేహితుడు దీక్షితులు వచ్చి నాయకునికి ఉచితమైన ఘన కార్యాలన్నీ చేసేస్తాడు. రఘునాథుడికి చేసేందుకు ఏమీ మిగలలేదు.

'భావపుష్టికి, భాషాసౌందర్యమునకీ నవల ఆలవాలము' అని ప్రకాశకులు అన్నారు. కానీ ఆ 'పుష్టి'గానీ, ఈ 'సౌందర్యము' గానీ ఎక్కడా కనిపించలేదు. కొన్ని చోట్ల వృథావర్ణనలు ఉన్నాయి. ఉదాహరణ : కళావతి వీణ వాయిస్తున్న సంగతి వ్రాస్తూ 'ప్రక్క నొక దాసి నిలిచినది. దాని హస్తమున వీవన. వీవన పిడికి దాపినది వజ్రకరూరు దొరుకు మగరాలు. ఒకప్పుడు కృష్ణరాయల తమ్ముడైన అచ్యుతుడు తన మరదలికా వీవన పుట్టినింటి యుడుగరగా నొసగెను. దాని నా యంతఃపురమట్లే యొక మహా భాగ్యముగ సంరక్షించుకొని వచ్చుచున్నది' అని వ్రాశారు. వీవన గురించి ఇంత వర్ణన అనవసరం. దానికి వేరే ప్రయోజన మేమీ లేదు.

ఈ పుస్తకం నవలా ప్రియులను రంజింపచేయలేకపోయినా, చారిత్రకాంశాలు తెలుసుకోగోరేవారికి ఉపయుక్తం కావచ్చు. ముఖచిత్రం ఆకర్షణీయంగా లేదు. ముద్రణ ముచ్చటగా లేదు. అచ్చుతప్పులు కొల్లలు.

నండూరి పార్థసారథి
(1964 డిసెంబర్ 9వ తేదీన ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post