అమెరికా యువ విద్యార్థుల బృందం ఒకటి ఇటీవల మద్రాసులో 'కర్టెన్ టైమ్ యు.ఎస్.ఎ.' అనే సంగీత నృత్య ప్రదర్శనం ఇచ్చింది. మద్రాస్ మ్యూజికల్ అసోసియేషన్, అమెరికా సమాచార సంస్థల ఆధ్వర్యాన మార్చి 2, 3, 4 తేదీలలో ఈ ప్రదర్శనం జరిగింది. ఈ బృందం దేశంలోని మరికొన్ని నగరాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చింది.

యూటా రాష్ట్రంలోని బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన ఈ విద్యార్థి బృందం అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ పనుపున నాలుగున్నర నెలలపాటు పదమూడు దేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చేనిమిత్తం బయలుదేరింది.

లక్ష్యం, లక్షణం

పరస్పరం సహృదయంతో అర్థం చేసుకోగలిగితే వివిధ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పటం సాధ్యమవుతుంది. అర్థం చేసుకోవటం అనేది హృదయానికీ, మనస్సుకూ సంబంధించిన విషయం. ఒక దేశ ప్రజల హృదయాన్నీ, మనస్సునూ అర్థం చేసుకోవాలంటే ఆ దేశ సంస్కృతిని దర్శించాలి. కళలు సంస్కృతినీ, తద్ద్వారా అమెరికా ప్రజా హృదయాన్నీ, ప్రపంచ ప్రజల సమక్షంలో ఆవిష్కరించాలనే ఉద్దేశంతో స్టేట్ డిపార్ట్ మెంట్ ఈ బృందాన్ని రాయబారం పంపింది. ''కేవలం ప్రదర్శనలు ఇవ్వటమే కాదు, ఆయా దేశాల కళాకారులతో స్నేహాన్ని పెంచుకోండి. విజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోండి. ప్రపంచాన్ని ఒక కళాశాలగా భావించి, పర్యటనలో పాఠాలు నేర్చుకోండి. మనదేశ ప్రతిష్ఠను ఇనుమడింపచేయండి'' అని దీవించి పంపింది.

సాధారణంగా ఏ దేశమైనా ఇటువంటి సాంస్కృతిక బృందాలను పంపేటప్పుడు-ఉత్సాహం, ప్రతిభ, సమర్థత, సమయజ్ఞత, సంస్కారం, కలుపుగోలుతనంగల మెరికల్లాంటి వారిని ఏరి పంపిస్తుంది. ఈ బృందంలోవారు కూడా అటువంటివారే. వారు వేదికమీద ప్రదర్శనం ఇస్తూ పరిచయ వాక్యాలు మాట్లాడేటప్పుడు-రాజకీయ ప్రముఖుల ఉపన్యాసాలలో, వణిక్ర్పముఖుల మంతనాలలో, శాస్త్రవేత్తల చర్చలలో కనిపించని-ఆత్మీయత, స్నేహం, అవ్యాజమైన ఆపేక్ష వ్యక్తమైనాయి. వాటితోనే వారు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వేదికమీద నించుని కూడా వారు ఎంతోకాలంగా పరిచయం ఉన్నట్లు, చాలా సహజంగా, తెచ్చిపెట్టుకున్న ఆడంబరం ఏమీలేకుండా చనువుగా మాట్లాడారు. తమ ఊళ్ళో, తమ ఇంట్లో స్వతంత్రంగా మెలుగుతున్నట్లే వేదిక మీద కూడా హుషారుగా అందమైన అల్లరి చేశారు. ప్రేక్షకులకు వశీకరణ మంత్రం వేశారు.

వివిధ దేశాలకు చెందిన ఇటువంటి సాంస్కృతిక రాయబార బృందాలు తరచుగా మద్రాసు వస్తూనే ఉంటాయి. వారి ప్రదర్శనలు చూస్తుంటే - దేశాలమధ్య సత్సంబంధాలను నెలకొల్పడానికి రాజకీయ రాయబారాలకంటే ఇవే మంచి సాధనాలేమోననిపిస్తుంది. రాజకీయమైన అభిప్రాయభేదాలు ఎన్ని ఉన్నా-అవి ఆయా దేశాల కళారంగాల మధ్య అగాధాలుగా నిలవవనీ, నిలవకూడదనీ ఈ ప్రదర్శనలు నిరూపిస్తాయి.

బృందం భోగట్టా

ఈ బృందంలో పదముగ్గురు ఆడవారు, పన్నెండు మంది మగవారు ఉన్నారు. వీరందరూ 19-35 సంవత్సరాల మధ్యవయస్కులు. అందరూ బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీ విద్యార్థులే. వీరిలో లలిత కళల (ఫైనార్ట్స్) విద్యార్థులూ ఉన్నారు. ఎకనమిక్స్, హిస్టరీ, ఇంజనీరింగ్ వంటి ఇతర విషయాలను అభ్యసించేవారూ ఉన్నారు. బృందంలో ఒక పియానిస్ట్, ఒక ఎకార్డియనిస్ట్, ఒక డ్రమ్మర్, ఎనిమిది మంది గాయకులు, పదిమంది నర్తకులు ఉన్నారు. లైటింగ్ వ్యవహారం చూసే వ్యక్తి ఒకరు, పర్యటన నిర్వాహకుడు ఒకరు, కార్యక్రమంలోని అంశాలను పరిచయం చేసే వ్యక్తి ఒకరు ఉన్నారు. విశేషమేమిటంటే బృందంలోని పాతిక మందికీ నృత్యం వచ్చును. చాలా మందికి సంగీతం, నృత్యం రెండూ వచ్చును. కార్యక్రమంలో 'సోలో' అంశాలూ, 'కోరస్' అంశాలూ కూడా ఉన్నాయి. అన్ని అంశాలకూ సంగీతం సమకూర్చాలి కనుక పియానిస్ట్, డ్రమ్మర్ మాత్రం నిలకడగా కూర్చుంటారు. లైటింగ్ చూసే వ్యక్తి కూడా మరే పనీ చేయడు. ఇక మిగిలినవారంతా అన్ని అంశాలలోనూ పాల్గొంటూ ఉంటారు. ఉదాహరణకు ఎకార్డియనిస్ట్ జెనెట్ టాడ్ అనే ఆమె ఎకార్డియన్ వాయించటం కాగానే అందరితోపాటు నృత్యం చేస్తుంది, పాటలు పాడుతుంది. పర్యటన నిర్వాహకుడు నార్మన్ నీల్సన్ ప్రదర్శన ఏర్పాట్లు చేయటం, బృందానికి వసతులు కల్పించటం వంటి పనులతోపాటు, వేదికమీద అందరితో కలిసి నాట్యం చేస్తాడు; పాటలు పాడతారు; బపూన్ గా నటిస్తాడు. ప్రతి అంశానికీ బృందంలో అందరూ క్షణాలమీద దుస్తులు మార్చేసుకుంటారు. ప్రేక్షకులకు ఆ పాతిక మందీ వందమందిలాగా కనిపిస్తారు. పాతిక మందీ కలిసి వందమంది చేసే హడావుడి చేస్తారు. వేదికమీద ఎప్పుడూ పాతికమందీ ఉండరు కనుక-కొందరు వేదికమీద ఉంటే మిగతావారు తెరవెనుక ఏర్పాట్లు చకచకా చేసుకుపోతూ, ఒక అంశానికీ ఇంకొక అంశానికీ మధ్య క్షణం కూడా ఖాళీ లేకుండా ఒకే ఊపులో కార్యక్రమాన్ని పరుగెత్తిస్తారు. ఇలా నిర్వహించగలిగేందుకు గానూ వారు-పర్యటనకు బయలుదేరేముందు-ఆరునెలలు శిక్షణ పొందారు. కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాలలోనూ అందరికీ తర్ఫీదు ఇవ్వబట్టి గానీ-లేకుంటే ప్రదర్శనను ఇంతగా రక్తి కట్టించటానికి వందమంది అయినా చాలరు. నాలుగున్నర నెలల్లో పదమూడు దేశాల్లో పదర్శనలు ఇవ్వాలంటే వందమందితో పర్యటన నిర్వహించటం చాలా కష్టం. అసలు ప్రయాణమే పెద్ద ఇబ్బంది అవుతుంది. అందుకే పాతిక మందితో సరిపెట్టుకున్నారు. విమాన ప్రయాణాలలో సరుకు ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది కనుక వీరు సామాను కూడా తక్కువగా, రవాణాకు తేలికగా ఉండేవి తెచ్చుకున్నారు. వీరు ఉపయోగించిన సెట్టింగ్స్ బహు స్వల్పం. వీరి దుస్తులు, వాద్యాలు, స్టేజి పరికరాలు అన్నీ కలిపి 800 పౌన్లు బరువు.

ఈ బృందంలో అందరూ ఒకే కుటుంబంలోని వ్యక్తులలాగా మెలగుతారు. వీరిలో పెళ్ళి అయినవారు, కానివారు కూడా ఉన్నారు. భార్యా భర్తల జంటలు కూడా రెండు ఉన్నాయి. ఒక జంట ఈ మధ్యనే ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.

'కర్టెన్ టైమ్ యు.ఎస్.ఎ.'

ఇది ఈ కార్యక్రమం పేరు. ఇది రెండు గంటల ప్రదర్శన. ఇందులో స్థూలంగా మూడు భాగాలు-సంగీతం, నృత్యం, హాస్యం. సంగీతంలో-సోలో పాటలు, కోరస్ పాటలు; డ్రమ్స్, ఎకార్డియన్, పియానోల సోలో అంశాలు ఉన్నాయి. నృత్యంలో-బాల్ రూమ్, స్క్వేర్ డాన్స్ వంటివి ఉన్నాయి.

ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఆమె మిస్ జేన్ థాంప్సన్, బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీలో పన్నెండు సంవత్సరాలుగా ఆమె సంగీత, నృత్య కార్యక్రమాల ప్రయోక్తగా ఉంటున్నారు. ఆమె తయారు చేసిన బృందం అమెరికా అంతటా పర్యటించి, ప్రదర్శనలు ఇచ్చింది. దరిమిలా కొన్ని విదేశాలలో కూడా పర్యటించింది. 1952 నుంచి నాలుగు సంవత్సరాల కాలంలో 2400 ప్రదర్శనలు ఇచ్చింది.

మద్రాసులో ఇచ్చిన ప్రదర్శనలో మొత్తం పధ్నాలుగు అంశాలు ఉన్నాయి. వీటిలో జెనెట్ టాడ్ ఎకార్డియన్ వాద్యం, రోసనీ ట్యూలర్ సోలో పాట, రోగర్, మైకేల్, జాన్, టేలర్ అనే నలుగురు యువకులు పాడిన క్లోజ్ హార్మొనీ పాట, బెర్నీ బెరెట్ డ్రమ్ వాద్యం, మరొక జానపద నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి.

బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీ

ఈ విశ్వవిద్యాలయం యూటా రాష్ట్రంలోని ప్రోవోలో ఉంది. మొత్తం విద్యార్థుల సంఖ్య 18 వేలు. వీరిలో ఫైనార్ట్స్ విద్యార్థుల సంఖ్య సుమారు ఐదు శాతం ఉంటుంది. తరగతులు అక్టోబరు నుంచి జూన్ వరకు జరుగుతాయి. ఈ విధమైన పర్యటనల వల్ల విద్యార్థులకు చదువు కొంత దెబ్బతింటుంది. అయినా-కళలపట్ల, పర్యటనపట్ల ఆసక్తిగల విద్యార్థులు దానిని అంత పెద్ద నష్టంగా పరిగణించరు. పర్యటనలో సంపాదించే అనుభవాలతో నష్టాన్ని భర్తీ చేసుకుంటారు. ఈ ప్రదర్శనం వల్ల విద్యార్థులకు ఆర్థికంగా ఒరిగేదేమీ ఉండదు. వారిది కేవలం ఔత్సాహిక బృందం. పర్యటన ఖర్చును ఆమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ భరిస్తుంది. సామగ్రిని మాత్రం యూనివర్సిటీ సమకూర్చుతుంది.

ఈ బృందం నుంచి మన విశ్వవిద్యాలయాలు నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ప్రతి విశ్వవిద్యాలయం ఈ మోస్తరు బృందాన్ని ఒకదాన్ని తయారు చేయాలి. ప్రతి బృందం దేశంలోని మిగిలిన విశ్వవిద్యాలయాలన్నింటినీ సందర్శించి, ప్రదర్శనలు ఇవ్వాలి. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. జాతీయ సమైక్యతకు ఇంతకు మించిన సాధనం మరొకటి లేదు. ఎప్పటికైనా జాతీయతకు ఆశ్రయమిచ్చేది కళారంగమే.

నండూరి పార్థసారథి
(1965 ఏప్రిల్ 14వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Next Post