Title Picture

తెలుగు సాహిత్య చరిత్రలో ఇది 'నవలా' శకం

1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరమన్నది ఎంత ఖాయమో, తెలుగు సాహిత్య చరిత్రలో ఇది 'నవలాశకం' అన్నది కూడా అంత ఖాయం. 'నవలాశకం' అంటే నవలలు రాజ్యమేలుతున్నాయనీ చెప్పుకోవచ్చు, నవల(స్త్రీ)లు రాజ్యమేలుతున్నారనీ చెప్పుకోవచ్చు. నవలా రచనను నవలలే గుత్తకు పుచ్చుకున్నారనీ చెప్పుకోవచ్చు. మొత్తం మీద 'నవల' మహారాణిగా సాహిత్య సింహాసనాన్ని అధిష్ఠించింది. పాఠకులు, పత్రికల వారు, ప్రచురణ కర్తలు, సినిమా వారు కూడా ఇప్పుడు 'నవల'కు జోహారులర్పిస్తున్నారు.

ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకం సాహిత్యానికి దశ పట్టుతుంది. అలా దశ పట్టిన సాహిత్యమంతా మంచిదని చెప్పడానికీ వీల్లేదు, బొత్తిగా చెత్త అని చెప్పటానికీ వీల్లేదు, ఒక్కొక్కప్పుడు ఉత్తమ సాహిత్యానికి దశ పట్టవచ్చు. ఒక్కొక్కప్పుడు చెత్త సాహిత్యం చెలామణీ కావచ్చు. మూడు నాలుగు దశాబ్దాల క్రిందట కొవ్వలి, జంపన నవలలు రాజ్యమేలాయి. కొంత కాలం శరత్ సాహిత్యం పాఠకలోకాన్ని ఉర్రూత లూగించింది. కొన్నాళ్ళు డిటెక్టివ్ నవలలు, సెక్సు నవలలు మంచి బిజినెస్ చేశాయి. ఇప్పుడు స్త్రీల నవలలకు రాజయోగం పట్టింది. అటు సినిమా రంగంలో కొన్నాళ్ళు విఠలాచార్య మార్కు జానపద చిత్రాలు స్వైరవిహారం చేశాయి. కొంత కాలం డబ్బింగ్ చిత్రాలు హడావిడి చేశాయి. ఒక దశలో పౌరాణిక చిత్రాలు కనకాభిషేకం చేయించుకున్నాయి. ఇప్పుడు స్త్రీరియల్ నవలాధార చిత్రాల జోరు ఎక్కువగా ఉంది. ఇన్నాళ్ళూ సినిమా, సాహిత్య రంగాల దారులు వేరుగా ఉండేవి. ఇప్పుడు రెండూ చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్నాయి. రెండింటికీ అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇప్పుడు ''యథా సినిమా తథా నవల' గా ఉంది పరిస్థితి.

మధ్య తరగతి పత్రికా సాహిత్యం

ఈనాడు తెలుగు సాహిత్యంలో 70 శాతం జాగాను నవల, 20 శాతం జాగాను కథ ఆక్రమించాయి. కవిత, వ్యాసం, నాటకం వంటి ఇతర సాహితీ ప్రక్రియలన్నీ మిగిలిన 10 శాతం జాగాలో సర్దుకుంటున్నాయి. ఈ నవలా, కథా సాహిత్యాలను వారపత్రికలు, మాస పత్రికలు పెంచి పోషిస్తున్నాయి. ఈ పత్రికలను, వాటి ద్వారా నవలా, కథా సాహిత్యాలను పోషిస్తున్న పాఠకులలో అత్యధిక సంఖ్యాకులు మధ్య తరగతి కుటుంబాల వారు-ముఖ్యంగా స్త్రీలు. ఈ పత్రికలకు రాసే రచయితలు, రచయిత్రులు కూడా ఆ వర్గం వారే. పత్రికల వారు- రచయిత (త్రు)లు-పాఠకులు-ఈముగ్గురి బాంధవ్య ఫలితంగా కడచిన పాతిక సంవత్సరాలలో ఒక ప్రత్యేక తరహా సాహిత్యం ప్రచారంలోకి వచ్చింది. ఒక్క తెలుగులోనే కాదు-పొరుగు భాషల్లో కూడా. దీనిని 'మధ్య తరగతి సాహిత్యం' అనవచ్చు. ఏక్కడో ఒకటీ అరా సందర్భాలను మినహాయిస్తే మొత్తం మీద ఈ సాహిత్యం ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత వర్గానికి చెందినవారి జీవితాలను, వారి సమస్యలను పట్టించుకోదు. అధమ వర్గం వారిని అసలే పట్టించుకోదు.

రచయితలుగా పేరు తెచ్చుకోవాలనుకునేవారు, డబ్బు సంపాదించాలనుకునేవారు, పత్రికల మీదుగా ఒక్క అంగ వేసి సినిమా రంగంలో పడాలనుకునేవారు పత్రికలు ఏరకం రచనలను ఆదరిస్తాయో ఆ రకం రచనలే చేస్తున్నారు. మహారాజ పోషకులైన మధ్య తరగతి వారు ఏ రకం రచనలను ఆదరిస్తారో ఆ రకం రచనలే ప్రచురిస్తున్నారు పత్రికలవారు. అందుచేత పత్రికా సాహిత్యం మధ్య తరగతిని దాటి క్రిందికి గానీ పైకి గానీ పోయే అవకాశం లేదు. ఇంటలెక్చువల్ గా కూడా ఈ సాహిత్యం మధ్యతరగతిదే. ఎందుకంటే ప్రాచీన కావ్య సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ, పరిశోధన గ్రంథాలు, విమర్శ గ్రంథాలు రచిస్తూ డాక్టరేట్లు తీసుకుంటున్న పండిత వర్గం వారు, పీడిత, తాడిత వర్గం శ్రేయస్సుకై ఆవేదన చెందుతూ, సాంఘిక విప్లవ సాధనకై తమ కవితా ప్రతిభను అంకితం చేసిన విప్లవకవులు కూడా ఈ పత్రికా సాహిత్య రంగానికి దూరంగా ఉన్నారు.

సుమారు 15 సంవత్సరాల క్రిందటి వరకు పత్రికా రంగం, పుస్తక ప్రచురణ రంగం విడివిడిగా, ఒకదానిపై ఒకటి ఆధారపడకుండా ఉండేవి. ఇప్పుడు పత్రికల ప్రాచుర్యం విపరీతంగా పెరగడంతో పుస్తక ప్రచురణ సంస్థలు పత్రికా సాహిత్యంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇది వరకు విశ్వనాథ, బాపిరాజు, చలం, గోపీచంద్, బుచ్చిబాబు, కొడవటిగంటి వంటి రచయితల పుస్తకాలను, శరత్, టాగోర్ రచనల అనువాదాలను పాఠకులు విరివిగా ఆదరించారు. అవన్నీ పత్రికలలో సీరియల్స్ గా ప్రచురింపబడినవికావు. అసలు పత్రికలకు వ్రాయకుండా పేరులోకి వచ్చిన రచయిత లెందరో ఉన్నారు. కాని ఇప్పుడు పబ్లిషర్లు పత్రికలలో ప్రచురింపబడిన నవలలనే పుస్తకాలుగా అచ్చు వేస్తున్నారు. అవే బాగా అమ్ముడు పోతున్నాయి. 'ఎమెస్కో' వంటి కొందరు పబ్లిషర్లు నేరుగా కొన్ని నవలలు ప్రచురిస్తున్నా పత్రికలలో సీరియల్ నవలల ద్వారా విశేష ప్రజాదరణ పొందినవారి నవలలను మాత్రమే ఆ విధంగా ప్రచురిస్తున్నారు. మొత్తం మీద రచయిత (త్రు)లుగా పేరు తెచ్చుకోవడానికి పత్రికలు తప్ప వేరే మార్గం లేదు. రచయిత (త్రు)లను సినిమా రంగం వైపు దారిపట్టించే సాధనాలు కూడా పత్రికలే అయినాయి.

రచయిత్రుల శకం

1962లో 'ఆంధ్రప్రభ' సచిత్ర వారపత్రిక నిర్వహించిన నవలల పోటీలో కోడూరి కౌసల్యాదేవి రచించిన 'చక్ర్రభమణం' నవలకు ప్రథమ బహుమతి లభించడంతో రచయిత్రుల శకం ప్రారంభమయిందని చెప్పవచ్చు. ఆ నవలతో పత్రికా సాహిత్యం ఒక మలుపు తిరిగింది. అప్పటి నుంచే పాఠకులకు సీరియల్ నవలా పఠనం పట్ల 'క్రేజ్' (వేలం వెర్రి) ప్రారంభమయింది. 'చక్ర భ్రమణం' కంటే ముందే రంగనాయకమ్మ 'కృష్ణవేణి' 'ఆంధ్రప్రభ'లోనే సీరియల్ గా ప్రచురింపబడింది. అయితే అప్పటికి పాఠకుల పఠనాసక్తి 'క్రేజ్' అనదగిన స్థాయికి రాలేదు.

'కృష్ణవేణి' కంటే పూర్వం 'ఆంధ్రపత్రిక' సచిత్రవార పత్రికలో వరసగా కొన్ని సంవత్సరాలపాటు 'టామ్ సాయర్', 'రాజూ-పేద' 'కాంచనద్వీపం', 'హకల్ బెరీఫిన్', 'కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో', 'రెండు మహానగరాలు', 'ఘంటారావం' వంటి 'క్లాసిక్స్' అనదగిన నవలలను ఇంగ్లీషు నుంచి అనువదించి ప్రచురించారు. పాఠకులు వాటిని ఎంతో ఆసక్తితో చదివారు. ఆ తర్వాత అదే పత్రిక 'పథేర్ పాంచాలీ', 'స్వయంసిద్ధ' వంటి గొప్ప బెంగాలీ నవలల అనువాదాలను ప్రచురించింది. వాటిని కూడా పాఠకులు విరివిగా ఆదరించారు. వాటిని చదివిన వారు ఈనాటికీ వాటిని మరచిపోలేదు. అయినా, అప్పటి వారు వాటిని చదివి ఆనందించిన తీరుకు, ఇప్పటి వారు ఈనాటి రచయిత్రుల సీరియల్స్ చదివి ఆనందిస్తున్న తీరుకు చాలా తేడా ఉంది. అప్పటికీ ఇప్పటికీ పాఠకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అప్పటి పాఠకులలో స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ. ఇప్పటి పాఠకులలో పురుషులకంటే స్త్రీల సంఖ్య ఎక్కువ. అప్పటి పాఠకులపై సినిమా ప్రభావం అంతగా ఉండేదికాదు. ఇప్పటి వారిపై తెలుగు ఈస్ట్ మన్ కలర్ కమర్షియల్ సినిమా ప్రభావం విపరీతంగా ఉంది. అప్పటి వారు నవలను నవలగానే చదివేవారు. ఇప్పటి వారు నవలను సినిమాలాగా చదువుతున్నారు. అప్పటి సీరియల్ నవలలు ఎక్కువగా అనువాదాలు. ఎంత గొప్పగా ఉన్నా వాటిలోని మనుషులు తెలుగు వాళ్ళు కారు. వారి జీవితాలు తెలుగు జీవితాలు కావు. వాటిలోని సమస్యలు నేరుగా మనకు సంబంధించినవి కావు. అందుచేత పాఠకులు పాత్రలలో లీనం కావడం అంతగా ఉండేది కాదు. గోపీచంద్, చలం వంటి వారి రచనలు పుస్తక రూపంలో ఒకేసారి చదివేవారు. సీరియల్ గా కొద్ది కొద్దిగా చదవడంలో ఉండే 'త్రిల్' పుస్తక రూపంలో ఒకేసారి చదివితే ఉండదు. పాఠకులు ముఖ్యంగా పాఠకురాండ్రు-నవలలోని పాత్రలలో లీనమై తన్మయత్వంతో సీరియల్ చదవడం బహుశ 'కృష్ణవేణి'తో ప్రారంభమైనట్లుంది. 'చక్రభ్రమణం'తో ఇంకా ఎక్కువయింది. పాత్రలతో పాఠకుల ఐడింటిఫికేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంతగా నవల విజయవంతమవుతుంది. రచయిత్రుల సీరియల్ నవలలలోని విజయరహస్యం ఇదే. వారి రచనలలో ప్రధాన పాత్రలు స్త్రీలు కావడం వల్ల, మధ్య తరగతి స్త్రీల ప్రేమలు, పెళ్ళిళ్ళు, కట్నాల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉద్యోగ పరిస్థితులు, కష్టాలు, త్యాగాలు ఎక్కువగా వర్ణింపబడడం వల్ల స్త్రీలు అపారమైన సానుభూతితో చదువుతున్నారు. పురుషులు ఒకప్పుడు రచయిత్రుల పట్ల గ్లామర్ తో చదివారు. తర్వాత క్రమంగా ఆ రకం నవలలకు అలవాటుపడి ఎడిక్షన్ వల్ల చదువుతున్నారు.

'చక్రభ్రమణం'తో ఒక్కసారిగా 'ఆంధ్రప్రభ' ప్రతిష్ఠ ద్విగుణీకృతమయింది. అప్పటికి తెలుగులో వారపత్రికలు రెండే ఉన్నాయి. 'పత్రిక', 'ప్రభ'; మాసపత్రిక 'యువ' ఒక్కటే. అంతవరకూ 'ఆంధ్రపత్రిక' కంటే సర్క్యులేషన్ లో చాలా వెనకబడి ఉన్న 'ఆంధ్రప్రభ' ఒక్కసారిగా 'పత్రిక'ను మించిపోయింది. 'చక్రభ్రమణం' తర్వాత కౌసల్యాదేవి, రంగనాయకమ్మ నవలలను వరసగా ప్రచురించడంతో 'ఆంధ్రప్రభ' సర్య్కులేషన్ మూడింతలు పెరిగింది. ఇక 'పత్రిక'... 'ప్రభ'ను అనుసరించక తప్పలేదు. అప్పటి నుంచి ఎందరో రచయిత్రులు రంగంలోకి వచ్చారు. 1964 చివరలో 'జ్యోతి' మాసపత్రికలో ప్రారంభించిన 'సెక్రటరీ' సీరియల్ తో యద్దనపూడి సులోచనారాణి ప్రముఖ రచయిత్రి అయినారు. పెద్ద వారపత్రికల ప్రోత్సాహంతో నిమిత్తం లేకుండా 'జ్యోతి', 'యువ' వంటి మాస పత్రికలలో సీరియల్స్ వ్రాసి ఆమె కౌసల్యాదేవి, రంగనాయకమ్మలతో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

సీరియల్ నవలలకు గిరాకీ పెరగడంతో పత్రికలు కథల కంటే నవలలను ఎక్కువగా ప్రచురిస్తున్నాయి. రెండు కథలు, నాలుగు నవలలు-నవలల్లో మూడు రచయిత్రులవి, ఒకటి రచయితది-సుమారుగా ఈ నిష్పత్తిలో ఉంటున్నాయి. రచయిత్రుల నవలలను ప్రచురించడంలో పత్రికలు పోటీపడుతున్నాయి. రచయిత్రుల నవలల వల్లనే సర్క్యులేషన్ పెరుగుతున్నదని పత్రికలవారు తెలుసుకున్నారు. ఒక ప్రముఖ రచయిత్రి నవల ముగియగానే వెంటనే మరొక ప్రముఖ రచయిత్రి నవల మొదలు పెట్టకపోతే సర్క్యులేషన్ ఠపీమని పడిపోవడం గమనించారు. అందుచేత తాము మామూలుగా రచయితలందరికీ ఇచ్చే రేటునకాక, అంతకు నాలుగయిదు రెట్లు ఎక్కువ పారితోషికం అడ్వాన్సుగా యిచ్చి రచయిత్రులచేత వ్రాయించుకొంటున్నారు. పబ్లిషర్లు కూడా ఇప్పుడు చాలా మంది స్త్రీల నవలలను మాత్రమే ప్రచురిస్తున్నారు. పురుషుల నవలలు వేయటానికి భయపడుతున్నారు. ఇక కథలు, వ్యాసాలు, కవితల సంపుటాలను ప్రచురించడం అంటే ఆ డబ్బు గంగలో పోసినట్లే అనుకొంటున్నారు.

నవలలకు సంబంధించినంత వరకు మగ రచయితలకు గిరాకీ బాగా తగ్గిపోయింది. అందుచేత వీరు కథలమీద పడ్డారు. రచయిత్రులు కథా సామ్రాజ్యంలోకి కూడా చొచ్చుకువచ్చారు. చీరలను, ధోవతులను చేనేత రంగానికి కేటాయించాలన్నట్టు నవలలను స్త్రీలకు కేటాయించాలనే నినాదం బయలుదేరేట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే పత్రికలవారు స్త్రీలకు నవలల్లో 75 శాతం కథల్లో 60 శాతం కోటాయిచ్చారు. దశలవారీగా ఈ కోటాను పెంచే ఉద్దేశం ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇప్పుడు మగ రచయితలకు పూర్తిగా వర్తమాన తెలుగు సాహిత్యంలో 70 శాతం తమవి అని చెప్పుకోదగిన ప్రక్రియలుగా నాటకం, వ్యాసం, కవిత, మిగిలాయి. నవలారంగంలోనే రచయిత్రులతో పోటీ పడాలంటే మగరచయితలు ఆడవేషాలు వేసుకోవడం తప్ప గత్యంతరం లేదు. అలా వేషం వేసుకుంటే మేకప్ జారిపోకుండా మగతనం బయటపడ కుండా ఉండడానికి చాలా అవస్థ పడవలసి ఉంటుంది.

సాహిత్యాభిరుచిలో స్త్రీలకు, పురుషులకు తేడా కనిపిస్తుంది. సాధారణంగా స్త్రీలు-కవితలు రాయరు. వ్యాసాలు రాయరు, చదువరు. నాటకాలు రాయరు, చదవరు, చూడరు. కథలు రాస్తారు, చదువుతారు. నవలలు రాస్తారు, చదువుతారు, చూస్తారు (వెండితెరపై). 'స్త్రీలనందరినీ కట్టకట్టి జనరలైజ్ చెయ్యడానికి వీల్లేదు' అని కొందరు వాదించవచ్చు. ఆ మాటలకు వస్తే ప్రపంచంలో ఎవరూ దేనిని గురించీ జనరలైజ్ చెయ్యడానికి వీలులేదు. కాని, ఈనాడు వార, మాస పత్రికలు చదివే స్త్రీల అభిరుచులను గురించి ఎవరైనా సర్వే జరిపితే లభించే ఫలితాలు పై విధంగానే ఉంటాయి. మగ పాఠకులలో కూడా అధిక సంఖ్యాకులు నవలల పట్ల, కథల పట్ల మోజుపడే మాట నిజమే గాని, వారు ఇతర సాహితీ ప్రక్రియలను బొత్తిగా త్రోసివేయరు. ఇదంతా సామాన్య పాఠకవర్గాన్ని గురించి చెబుతున్న మాట. మేధావి వర్గానికి చెందిన స్త్రీ పురుషుల అభిరుచులలో ఈ వ్యత్యాసం కనిపించదు. వారు నవల, కథ, వ్యాసం, కవిత అనే భేదభావం లేకుండా ఉత్తమ శ్రేణి రచనలన్నింటినీ ఆదరిస్తారు.

ఒక్క తెలుగులోనే కాదు-ప్రపంచంలో ఏ భాషలో చూసినా సాధారణంగా రచయిత్రులు నవలా రచయిత్రులే అయి ఉంటారు. కొన్ని భాషలలో కవయిత్రులు కనిపిస్తారు. కాని నాటకాలు, వ్యాసాలు వ్రాసే స్త్రీలు చాలా అరుదు. స్త్రీల స్వభావానికి అన్నింటికంటే నవలే తగినది కాబోలు. అసలు 'నావెల్' అనే ఇంగ్లీషు మాటకు తెలుగులో 'నవల' అని అందమైన పేరు పెట్టిన మహానుభావుడు ఎవరో గాని, ఆయనకి ఈ రహస్యం తెలిసే ఉంటుంది. తెలుగు నవలా రంగంలో రచియిత్రుల డామినేషన్ ని ఆయన ముందుగానే ఊహించి ఉంటాడు.

స్త్రీరియల్ నవలాధార చిత్రాలు

'చక్రభ్రమణం' నవల 'డాక్టర్ చక్రవర్తి'గా వెండితెర కెక్కి ఘన విజయం సాధించినప్పటి నుంచి బహుశ ప్రజాదరణ పొందిన నవలలు ఒక్కొక్కటిగా తెరకెక్కడం ప్రారంభమయింది. నిర్మాతలు ఆ నవలలను యథాతథంగా కాక మెలోడ్రామా మసాలాఘాటు పెంచి, తమ ఫార్ములా ప్రకారం వండి ప్రేక్షకులకు వడ్డిస్తున్నారు. అది చూసి రచయిత్రులు కూడా ఆ ఫార్ములా ప్రకారం తిరమోత పెట్టడం నేర్చుకున్నారు. విజయవంతమైన నవలాధార చిత్రాలలో చాలావాటికి సంభాషణల రచయిత ఆత్రేయ. అందువల్ల సినిమా మీద కన్నుపడిన రచయిత్రులందరికీ ఆత్రేయ ఫార్ములా ఆదర్శమయింది. ఆత్రేయ శరత్ బాబు నవలల తెలుగు అనువాదాలలోని సంభాషణల స్టైలును అనుసరిస్తున్నట్లు కనిపిస్తారు. ఈ కారణంగా శరత్ స్టైలు ఆత్రేయ ద్వారా మన రచయిత్రులకు వారసత్వంగా సంక్రమించింది. అయితే తమ మీద శరత్ ఆత్రేయల ప్రభావం ఉన్న సంగతి చాలా మంది రచయిత్రులకు తెలిసినట్లు లేదు. ముఖ్యంగా కౌసల్యాదేవి రచనలపై శరత్, ఆత్రేయల ప్రభావం బాగా కనిపిస్తుంది. వారు కాక బాపిరాజు ప్రభావం కూడా కొంత కనిపిస్తుంది. కౌసల్యాదేవిని ఆదర్శంగా పెట్టుకుని, ఆమె అడుగుజాడల్లో నడుస్తున్న రచయిత్రులు చాలామంది ఉన్నారు. అంటే వారి రచనల్లోకి శరత్ శైలి మరొక వడపోతతో దిగుతున్న దన్నమాట.

సినిమా గిరాకీ వల్ల ఈనాడు రచయిత్రుల నవలల్లో నూటికి 99 తెలుగు కనకాభిషేక చలన చిత్రాలకు నకళ్ళుగా ఉంటున్నాయి. పదేళ్ల క్రిందట రచయిత్రులు నాగేశ్వరరావు-సావిత్రి కాంబినేషన్ తో రచించారు. ఇప్పుడు నాగేశ్వరరావు-వాణిశ్రీ కాంబినేషన్ తో, లేదా శోభన్ బాబు-శారద కాంబినేషన్ తో రచిస్తున్నారు. సినీరచయితల లాగా నవలా రచయిత్రులు కూడా ప్రముఖ తారాగణాన్ని మనస్సులో పెట్టుకొని రాస్తున్నారు. సీరియల్ నవల చదువుతున్న ప్రతి పాఠకుడికీ, ప్రతి పాఠకురాలికి ఆ నవలలోని హీరో నాగేశ్వరరావో, శోభన్ బాబో, హీరోయిన్ వాణిశ్రీయో, శారదో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నవల చదువుతుంటే ఈస్టమన్ కలర్ మేకప్ తో సహా ఆ తారలు మనస్సనే వెండితెరపై మెదులుతూ ఉంటారు. అందుకే అంత 'త్రిల్'తో చదువుతూ ఉంటారు. ఆ విధంగా సినిమా తారలను కళ్ళకు కట్టించలేని నవల సీరియల్ గా విజయవంతం కాదు.

సినిమా ఫార్ములాను ఇంతగా ఒంటబట్టించుకుని రాస్తున్నా నిర్మాతలు నేరుగా రచయిత్రుల నుంచి నవలలు తీసుకోరు. నవల ముందు సీరియల్ గా పత్రికలో రావాలి. పాఠకులు వేలం వెర్రిగా చదవాలి. ఆ తర్వాతనే దానికి వెండితెర యోగం. పాఠకులకు కూడా అటువంటి చిత్రాలను చూడడంలోనే 'త్రిల్' ఉంటుంది. నవలను సీరియల్ గా చదువుతున్నప్పుడు ఆయా సన్నివేశాలను తాము మనస్సులో ఊహించుకున్న విధంగా దర్శకుడు చిత్రీకరించాడా లేదా అని చూస్తారు. సినిమాలో సన్నివేశాలు తాము ఊహించుకున్నట్లుగా లేకపోతే ఆశాభంగం పొందుతారు. 'నవలని డైరెక్టరు తగలేశాడండీ' అంటారు-నవల గొప్ప కళాఖండమైనట్లు.

రచయిత్రుల శకం ప్రారంభంకాక ముందు-సుమారు 15 సంవత్సరాల క్రిందట - 'సినిమాలోని మాటలు, పాటలు పూర్తిగా పొందుపరచిన' వెండితెర నవలలు వస్తూ ఉండేవి. ఇప్పటి రచయిత్రుల నవలలు ఆ ధోరణిలో ఉంటున్నాయి. ఇప్పుడు ఏడాదికి 70 చిత్రాలు నిర్మించబడుతున్నందున చలన చిత్ర కర్మాగారాలకు ముడి పదార్థాల అవసరం చాలా పెరిగింది. రచయిత్రుల కార్ఖానాలలో ఉత్పత్తి అయే ముడి పదార్థాలను నిర్మాతల కర్మాగారాలకు చేరవేసే కన్వేయర్ బెల్టులుగా పత్రికలు ఉపయోగపడుతున్నాయి.

దయనీయ స్థితి

పూర్తిగా రచయిత్రులే బాధ్యులని చెప్పడానికి వీల్లేదు గాని, మొత్తం మీద ఈనాడు తెలుగు సాహిత్య రంగం దయనీయ స్థితిలో ఉన్నది. ఈ దయనీయ స్థితికి కారకులైన వారు కూడా ఈ సంగతి ఒప్పుకుంటారు. 'రామరామ అదీ ఒక నవలేనటండీ' అని ఒక రచయిత్రి అచ్చగా తన లాంటి పోలికలు గల మరొక రచయిత్రిని ఆక్షేపిస్తుంది. స్త్రీ పురుష విచక్షణ లేకుండా ఈనాడు నూటికి 99 వంతుల సాహిత్యంలో దారిద్ర్యం తాండవిస్తున్నది-భావ దారిద్ర్యం, భాషాదారిద్ర్యం, ప్రతిభా దారిద్ర్యం, ఇంకా అనేక రకాల దారిద్ర్యాలు. దారిద్ర్యం ఉన్నచోట సహజంగా దొంగబుద్ధి ఉంటుంది. గ్రంథచౌర్యానికి కారణం ఇదే. కాపీ కొట్టడంలో రచయిత్రులకు, రచయితలకు తేడాలున్నాయి. రచయిత్రులు సాధారణంగా సినిమాలను కాపీ కొడతారు. లేదా సాటి రచయిత్రుల నవలలను కాపీ కొడతారు. మగ రచయితలు విదేశీ సాహిత్యం నుంచి స్మగ్లింగ్ చేస్తారు. రచయిత్రి ఆత్రేయను కాపీ కొడితే, రచయిత స్టయిలుగా బెర్నార్డ్ షాను కాపీ కొడతాడు. షాను కాపీ కొట్టేవాడు ఇంటలెక్చువల్ గా చెలామణి అవుతాడు. ఆడవాళ్ళు నవలలను కాపీ కొట్టి నవలలు వ్రాస్తారు. మగవాళ్ళు నాటకాలను కాపీ కొట్టి నవలలు వ్రాస్తారు.

మొత్తం మీద సాహిత్య సేవకోసం మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా తపన పడుతున్నారు. భావాలతో బుర్ర కిటకిటలాడి పోతూ వాటిని కాగితం మీద పెట్టాలని తపన పడడం ఒకరకం. బుర్ర బొత్తిగా ఎడారిలాగా ఉన్నా, ఆ ఇసుకలో నుంచి ఏదో పిండాలని తపన పడడం ఇంకో రకం. ఈ రెండు రకాల వారూ యథాశక్తిని సాహిత్య సేవ చేయవచ్చు. మొదటి రకం వారు రచించడం సాహితీ సేవ అవుతుంది. రెండో రకం వారు రచించక పోవడం సాహితీ సేవ అవుతుంది. మొదటిది కష్టమైన పద్ధతి. రెండోది తేలికపద్ధతి-కుర్చీలో కాలుమీద కాలువేసుకుని కూర్చుని, చిటికిన వేలు కదపకుండా కడుపులో చల్ల కదలకుండా సాహితీ సేవ చేయవచ్చు.

సామాజిక స్పృహ

ఇటీవల కొద్ది సంవత్సరాలలో తెలుగు వార, మాస పత్రికలను ఆశ్రయించుకున్న కథా, నవలా సాహిత్యాలలో ముఖ్యంగా రచయిత్రుల సాహిత్యంలో-సామాజిక స్పృహ మిక్కిలి అరుదైపోయింది. పుంఖాను పుంఖంగా సులువుగా సీరియల్ నవలలు రాసి పడేస్తున్న మన రచయిత్రులకు సినిమా స్పృహ తప్ప, సామాజిక స్పృహలేదు. సామాజిక స్పృహ లేకుండా ప్రబంధ కవిత్వమో, భావ కవిత్వమో రాయవచ్చు గాని, నవలలు రాయడం సాధ్యంకాదు. కాని, రాస్తున్నారు. అందుకే ఈ నవలలు భూమిమీద కాక, ఆఘమేఘాలలో విహరిస్తూ ఉంటాయి. రచయితలు గ్రంథాలను, సినిమాలను అధ్యయనం చేయవచ్చు, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కాని, అంతకంటే ముఖ్యంగా వారు తమ చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను అధ్యయనం చేయాలి. తమ చుట్టూ ఉన్న మనుష్యుల జీవితాలను అధ్యయనం చేయాలి. అవగాహన చేసుకోవాలి. కాని ఈనాటి రచయిత్రుల నవలల్లో అటువంటి అవగాహన కనిపించదు.

ఈ రకం రచనలు ఎప్పుడు అంతరిస్తాయి? సీరియల్ నవలాధార చిత్రాలు వరుసగా ఐదారు దివాళా తీస్తే నిర్మాతలకు ఈ నవలల మోజు తగ్గుతుంది. ఆ రోజు తప్పక వస్తుంది. సీరియల్ నవలలకు సినిమా గిరాకీ లేకుండా పోతే, నవల సినిమా మీద ఆధారపడకుండా, తన కాళ్ళపై తాను నిలబడుతుంది. అప్పుడు నవలా స్వరూపమే మారిపోతుంది. వైవిధ్యం పెరుగుతుంది. ఫార్ములా బంధం వదిలిపోతుంది. సినిమాలలోనూ, సాహిత్యంలోనూ కూడా కృత్రిమత్వాన్ని ప్రజలు అసహ్యించుకొనే రోజు ఇంక నాలుగైదు సంవత్సరాలలోనే వస్తుంది. అప్పుడు సామాజిక అవగాహన సాహిత్యానికి ప్రాణం అవుతుంది.

నిజాయితీ, మౌలిక ప్రతిభ గల రచయిత్రులు మనకిప్పుడు గట్టిగా లెక్క పెడితే అరడజను మంది ఉంటారేమో. రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాలతీ చందూర్, భానుమతి-ఈ నలుగురూ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవారు. రచనా ధోరణిలో వారివి పూర్తిగా వేర్వేరు దారులు కావచ్చు. వారి ఆదర్శాలు, అభిప్రాయాలు వేర్వేరు కావచ్చు. కానీ, వారిలో సమాన లక్షణాలు కొన్ని ఉన్నాయి. వారు కేవలం పేరుకోసం గానీ, డబ్బుకోసం గానీ వ్రాస్తున్న వారు కారు. వారి రచనలు అవాస్తవికంగా ఉండవు. రంగనాయకమ్మ రగులుతున్న అగ్నిపర్వతం. రచనల ద్వారా సమాజంలో-ముఖ్యంగా స్త్రీలలో చైతన్యం తీసుకురావడం ఆమె ధ్యేయం. చెప్పదలుచుకున్న దానిని జంకు గొంకు లేకుండా చెప్పడం, తన వాదాన్ని ఆరితేరిన న్యాయవాదిలాగా స్పష్టంగా, శక్తివంతంగా ప్రతిపాదించడం ఆవిడ ప్రత్యేకత. ఇటీవల ఆమె భాష పదును తేరిన కత్తిలాగా మెరుస్తున్నది. అంత పదునైన భాష తెలుగులో మరి ఏ రచయిత్రికీ లేదు. నిజాయితీ ఆవిడ రచనకు ప్రాణం. విప్లవం ఆమె తత్వం. సామాజిక అవగాహనతో, అభ్యుదయ దృక్పథంతో, వాస్తవిక చిత్రణతో రచనలు చేస్తున్న మరొక రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి.

కథలు, నవలలు ఆట్టే వ్రాయకుండా కేవలం వ్యాసాలతో, అంతకంటే ముఖ్యంగా 'జవాబులు' శీర్షికతో ఇప్పటికి దాదాపు పాతికేండ్లుగా స్త్రీల అభిమానాన్ని విపరీతంగా చూరగొన్న రచయిత్రి మాలతీచందూర్. 'జవాబులు' శీర్షిక ద్వారా ఆమె లక్షలాది స్త్రీ పురుషుల జీవితాలలోని కోట్లాది సమస్యలను అధ్యయనం చేసి, అవగాహన చేసుకున్నారు. జ్ఞాన సాధనకు అంతకు మించిన మార్గం మరొకటి లేదు. ఆవిడ విజ్ఞతతో, సహనంతో, సానుభూతితో సమాధానాలు యిచ్చి, సమస్యలకు పరిష్కారాలు సూచించి ఎందరికో వెలుగు చూపించారు. తెలుగుదేశంలో స్త్రీల ఆరాధనలను అంతగా అందుకున్న రచయిత్రి మరొకరు లేరు. తన జవాబులు శీర్షిక ద్వారా మహిళా లోకంలో చైతన్యం తీసుకురావడానికి ఆవిడ ఏకాగ్రతతో కృషి చేస్తున్నారు.

కల్తీలేని అచ్చమైన జానుతెనుగుతో, తనదైన ఒక ప్రత్యేక శైలితో నాజూకైన, నిరాడంబరమైన హాస్యంతో ఇప్పటికి ఇరవయేళ్ళుగా చిన్నచిన్న కథలు రచిస్తున్న రచయిత్రి భానుమతి. మూడు దశాబ్దాలకు పైగా ఆంధ్రదేశానికి దూరంగా ఆడంబరమైన సినిమా ప్రపంచంలో ఉన్నా ఆమె తెలుగుతనాన్ని కోల్పోలేదు. ఆమె కథల్లో విదేశీ సాహిత్య ప్రభావం గానీ, సినిమాల ప్రభావం గానీ కనిపించదు. అనుకరణ ఆమె స్వభావం కాదు. తెలుగులో పూర్తిగా హాస్య కథలు వ్రాసిన ఏకైక రచయిత్రి ఆవిడ. ఇంత వరకు ఆవిడ నవలల జోలికి పోలేదు.

ఈ నలుగురూ కాక ఇంకా చెదురుమదురుగా అప్పుడప్పుడూ మంచి నవలలు, కథలు వ్రాస్తున్నవారు లేకపోలేదు. కాని, రచయిత్రుల నవలా, కథా సాహిత్యాలను చౌకబారుతనం నుంచి, కృత్రిమత్వం నుంచి, గిటకబారినతనం నుంచి మళ్ళించి, వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చే బాధ్యత, వారి దృక్పథంలో మార్పు తీసుకువచ్చే బాధ్యత ప్రధానంగా ఈ నలుగురు రచయిత్రులపైనే ఉంటుంది.

(అభ్యుదయ దృక్పధంతో, విప్లవ భావాలతో మంచి నవలలు, కథలు రచించిన మరొక రచయిత్రి (?) ఉన్నారు కాని, ఆవిడ (?) 'మగరచయిత్రి' అనే విషయం బహిరంగ రహస్యం కనుక మంచి రచయిత్రుల సరసన 'ఆవిడ' పేరును చేర్చలేదని పాఠకులు గమనించగలరు).

నండూరి పార్థసారథి
(1975 డిసెంబర్ 21వ తేదీన ప్రజాతంత్రలో ప్రచురితమైనది)

Previous Post Next Post