Title Picture

(7)

బొంబాయి వి.టి. స్టేషన్

నాలుగైదు రోజులు ప్రయాణం చేసి సుబ్బణ్ణగారు బొంబాయి చేరాడు. స్టేషన్ లో దిగగానే రైల్వేవారు ఆయన దగ్గర్నుంచి టికెట్ తీసేసుకున్నారు. దాన్ని బట్టి ఆయన ఆ టికెట్ అక్కడి వరకేననీ, ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదనీ తెలుసుకున్నాడు. ప్లాట్ ఫారం మీది అరుపులను బట్టి అది బొంబాయి అని తెలిసింది. “ఇది ఏ ఊరైతే నాకెందుకు” అనుకుని ఆయన స్టేషన్ దాటి బైటికొచ్చి నగరంలో ప్రవేశించాడు. కలకత్తాలో బుకింగ్ క్లర్క్ టికెట్ తో పాటు తన చేతిలో పెట్టిన డబ్బులో ఈ నాలుగైదు రోజుల ప్రయాణంలో ఖర్చయినది పోగా ఇంకా రూపాయిన్నర మిగిలింది. కాస్త శుభ్రంగా కనిపించిన ఒక దుకాణంలో కొంచెం మిఠాయి కొనుక్కుని, ఒక దేవాలయం ఎదుటకు వెళ్ళి కూర్చున్నాడు. తరువాత కాసేపటికి ఒక కుళాయి కింద స్నానం చేసి, ప్రార్థన చేసుకుని, మిఠాయి తిన్నాడు.

ఐదురోజుల ప్రయాణంలో ఆయన ఆలోచించి ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. భార్యాబిడ్డల కోసం తను అంతగా దుఃఖపడవలసింది కాదని ఆయనకు అనిపించింది. ఇక ముందెప్పుడూ ఏ వ్యక్తిపైనగాని, వస్తువుపైనగాని మమకారం పెట్టుకోకూడదని అనుకున్నాడు. మమకారాన్ని జయిస్తేనే నిజమైన సంతోషం లభించగలదని తెలుసుకున్నాడు. “మమకారం పెంచుకోవడం అంటే దుఃఖాన్ని కొనితెచ్చుకోవడమే. మమకారం లేనివాడికి దుఃఖమే లేదు” అనుకున్నాడు. ఇదేం కొత్త సిద్ధాంతం కాదు. భగవద్గీతలో చెప్పింది అదే. దీన్ని గురించి సుబ్బణ్ణగారు అది వరకు చాలాసార్లు విన్నాడు. కాని అది నిజంగా ఆయన మనస్సుకు పట్టింది కడచిన ఐదురోజుల్లోనే. నిజానికి అది బైటి నుంచి వచ్చిన బోధలాగా కాక, ఆత్మబోధలాగా అనిపించింది.

బొంబాయి బజారు

“ఇది వరకు ఈ సూత్రం తెలుసుకోలేక ఇది నాది, ఇది నాది కానిది అనుకునేవాణ్ణి. ఆ భావన వల్లనే దుఃఖానికి లోనయ్యాను. అటువంటి తప్పు ఇంకెప్పుడూ చేయకూడదు. కేవలం సన్యాసిలాగా జీవించాలి” అని నిర్ణయించుకున్నాడు. బొంబాయి చేరేనాటికి చేతిలో ఉన్న రూపాయిన్నర నాలుగు రోజుల్లో ఖర్చయిపోయింది. ఐదోరోజు మిఠాయి కొనుక్కునేందుకు డబ్బులేదు. ఎలా సంపాదించడం? వీధిలో ఫిడేలు వాయిస్తే సంపాదించవచ్చు. ఒక్క క్షణం తన పరువు ప్రతిష్ఠల సంగతి జ్ఞాపకం వచ్చి సంకోచించాడు. కాని మరుక్షణం “ఇందులో పరువు ప్రతిష్ఠల ప్రసక్తే లేదు”-అని తీర్మానించుకున్నాడు. ఒక ముసలమ్మ మిఠాయి దుకాణం వద్దకు వెళ్ళి, అక్కడ కూర్చుని ఫిడేలు వాయించడం మొదలు పెట్టాడు. రోడ్డు మీద పోయే జనం కొందరు ఆయన సంగీతానికి ఆకర్షితులై అక్కడ ఆగారు. కాసేపటికి ఆయన చుట్టూ చిన్న గుంపు చేరింది. ఆ జనంలో కొందరు ఆ దుకాణంలో మిఠాయి కొనుక్కుని తిన్నారు. సుబ్బణ్ణగారు ఫిడేలు వాయించడం ఆపేసిన తరువాత జనం ఎవరి దారిని వారు పోయారు. దుకాణం ముసలమ్మ ఆయనను పిలిచి “అయ్యా... నీ వల్ల నా దుకాణంలో వ్యాపారం బాగా జరిగింది. ఏమైనా డబ్బిస్తాను తీసుకుంటావా?” అన్నది.

“నాకు డబ్బేమీ వద్దు. నీ దుకాణం దగ్గర వాయించాను కదా. అందుకని ఈ పూట భోజనానికి కాస్త మిఠాయి ఇవ్వుచాలు” అన్నాడు ఆయన.

“అలా కాదు. నీకు కావలసినన్ని తీసుకో. మొహమాటపడవద్దు” అని ఆమె మిఠాయిలు ఇచ్చింది. “రోజూ వచ్చి ఇక్కడ కూర్చుని ఫిడేలు వాయించు. నీకు కావలసినన్ని మిఠాయిలు తీసుకో” అని కూడా అన్నది. సుబ్బణ్ణ గారు అందుకు ఒప్పుకున్నాడు.

అప్పటి నుంచి ఆయన ప్రతిరోజూ ముసలమ్మ దుకాణం వద్ద ఫిడేలు వాయించేవాడు. ప్రతిఫలంగా ఒకపూట భోజనానికి అవసరమైనంత మిఠాయి తీసుకునేవాడు. అలా పదిహేను రోజులు గడిచాక ఒకరోజు ఆయన ఫిడేలు వాయిస్తుంటే ఒక గుర్రపు బగ్గీ వచ్చి దుకాణం ఎదుట ఆగింది. ఆ బగ్గీలో కూర్చున్న నడివయస్కుడు సుబ్బణ్ణగారి సంగీతాన్ని శ్రద్ధగా ఆలకించాడు. ఆయన బాగా ధనికుడై ఉంటాడు. ఎందుకంటే ఆయన వేలికి కొన్ని వేల రూపాయల ఖరీదు చేసే వజ్రపుటుంగరం ఉంది. గుర్రపు బగ్గీ అక్కడ ఆగగానే సుబ్బణ్ణగారి చుట్టూ మూగిన జనంలో కొందరు పక్కకు తప్పుకున్నారు. ఆ ధనికుడు సుమారు పది నిమిషాల సేపు సంగీతం విని, బగ్గీదిగి దుకాణం దగ్గరికి వచ్చాడు.

“ఆయనెవరు? నీ బంధువా?” అని ఆయన ముసలమ్మని అడిగాడు.

“అతగాడెవరో నాకు తెలియదు బాబూ. రోజూ వచ్చి ఇక్కడ కూర్చుని ఫిడేలు వాయిస్తూ ఉంటాడు. నేను మిఠాయిలు ఇస్తూ ఉంటాను” అని ఆమె జవాబిచ్చింది.

వీరిద్దరి సంభాషణ సుబ్బణ్ణ గారు వినలేదు. ఆయన వాయిస్తున్న రాగం ముగియగానే ఆ ధనికుడు దగ్గరకు వచ్చి “అయ్యా తమది ఏ ఊరండి?” అని అడిగాడు.

అప్పటికే సుబ్బణ్ణగారు ఇంకో రాగం మొదలుపెట్టాడు. సంగీత సుఖంలో లీనమైపోయిన ఆయన ఆ ధనికుని పట్టించుకోలేదు. గీత గోవిందంలోని ఒక అష్టపది వాయిస్తూ ఆయన పరవశిస్తున్నాడు. ఆ ధనికుడు కూడా పారవశ్యంలో మునిగిపోయాడు. సుబ్బణ్ణగారు వాయించడం ఆపగానే ఆయన ఎంతో గౌరవంగా “అయ్యా తమరు నాతో వస్తారా? ఇంకా చాలా సేపు మీ సంగీతం వినాలని కోరికగా ఉంది” అని అన్నాడు. సుబ్బణ్ణగారికి చర్రున కోపం వచ్చింది. “ఇతగాడు ఎవరు నన్ను రమ్మని పిలవటానికి” అనుకున్నాడు. తను ఇక్కడ వాయిస్తే పాపం ఆ ముసలమ్మ దుకాణానికి గిరాకీ దొరుకుతుంది కదా అని తనంతట తానుగా వస్తున్నాడు. ఆ విధంగా తాను ముసలమ్మకి ఉపకారం చేస్తున్నాడు. ఇందులో అవమానం లేదు. కాని ఈ షావుకారు వచ్చి తనని రమ్మని పిలుస్తున్నాడు. తను డబ్బుగలవాడు గనుక ఈ వీధిఫిడేలు వాడిని ఆజ్ఞాపించ వచ్చుననుకుంటున్నాడేమో అని ఆయనకి కోపం వచ్చింది. “నాతో ఈయనకేం పని?” అనుకున్నాడు. తనపై ఎవరూ కనికరం చూపించడం ఆయనకు ఇష్టం లేకపోయింది. కాని ఒక్కక్షణంలో ఆయన కోపం తగ్గిపోయింది. “నాకెందుకింత గర్వం? కలకత్తాలో సంగీత పాఠాలు చెప్పి డబ్బు సంపాదించలేదా? ఈ పెద్ద మనిషి ఆనందం కోసం వాయిస్తే తప్పేమిటి” అని అనుకుని, “వస్తాను పదండి” అంటూ లేచాడు. ముసలమ్మ ఆయనకు మిఠాయి పొట్లం ఇవ్వబోయింది.

“ఇక నుంచి నువ్వేమీ ఇవ్వక్కర్లేదమ్మా. ఈయన సంగతి నేను చూసుకుంటాను” అన్నాడు షావుకారు గారు. ముసలమ్మ “అలాగే బాబూ” అంటూ ఒక ఐదు రూపాయలు తీసి సుబ్బణ్ణ గారికి ఇవ్వబోయింది.

“నాకు డబ్బు దేనికి?” అన్నాడు సుబ్బణ్ణగారు.

“నీకేం తెలీదు నాయనా. వట్టి అమాయకుడివి లాగా ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చావో ఏమో. ఇక్కడ నీకు తలనొప్పి వచ్చినా, నడుం నొప్పి వచ్చినా నిన్ను చూసేవారెవరు, చేసే వారెవరు? అశుభం పలకకూడదు గాని పరస్థలం నుంచి వచ్చిన వారు చచ్చిపోతున్నా ఇక్కడ జనం పట్టించుకోరు. కాస్త డబ్బు చేతిలో ఉంచుకోవడం మంచిది. అంతేకాదు. ఎవరైనా స్నేహితులని కూడా చూసుకో” అని హితవుచెప్పింది ముసలమ్మ.

సుబ్బణ్ణగారు “సరే... ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు. అవసరమైనప్పుడు నేనే వచ్చి తీసుకుంటాను” అని ఆ డబ్బు ముసలమ్మకే తిరిగి ఇచ్చేశాడు. తరువాత ఆయన షావుకారు వెంట వెళ్ళాడు.

ఆధునికుడి ఇల్లు రాజ సౌధంలా ఉంది. ఆయనకి తల్లి, భార్య, ఒక కూతురు మాత్రమే ఉన్నారు. కాని పరివారం మాత్రం చాలా మంది ఉన్నారు. షావుకారు గారు ఆ భవనంలో వీధి వైపున ఉన్న పెద్ద గది చూపించి “కావాలంటే మీరు ఇక్కడే ఉండవచ్చు” అని చెప్పాడు. ఆ గదిలో ఉంటూ బుద్ధి పుట్టినప్పుడు వైలిన్ వాయిస్తూ ఉండమని ఆయన కోరాడు. అటువంటి పెద్ద పెద్ద భవనాలు సుబ్బన్నగారికి కొత్తకాదు. కలకత్తాలో అటువంటివి చాలా చూశాడు. ధనికులతో తనకున్న పరిచయాలను బట్టి వాళ్ళ మీద ఆయనకు మంచి అభిప్రాయం లేదు. వాళ్ళు తమది వేరే జాతి అనీ, మామూలు మనుషులకంటే తాము చాలా గొప్ప వాళ్ళమనీ అనుకుంటూ ఉంటారు. వాళ్ళ ధోరణి అదో రకంగా ఉంటుంది.

“అయ్యా... నేను పరదేశిని. ఇక్కడ ఉండలేను. కాసేపు ఏదైనా అష్టపది వాయిస్తాను. మీరు వినవచ్చు” అన్నాడు సుబ్బణ్ణ గారు.

“మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? పోనీలెండి. వాయించండి” అన్నాడు షావుకారు గారు.

సుబ్బణ్ణగారు “సావిరహే తవదీనా రాధా” అనే అష్టపది వాయించారు. ఆయన వైలిన్ వాదనంలోని సొగసును నేను వర్ణించలేను. నేను మొదటిసారి తొరెయపురం దేవాలయంలో ఆయన వాయిస్తుండగా విన్నాను. ఆ తరువాత చాలాసార్లు విన్నాను. అనేక మంది ఇతరులు వాయిస్తుండగా విన్నాను. వారికి, సుబ్బణ్ణ గారికి తేడా ఇది : సుబ్బణ్ణగారు వాయిస్తుంటే మన ఆప్తులెవరో హృదయం విప్పి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇతరులు వాయిస్తుంటే సభలో ఉపన్యాసం ఇస్తున్నట్లు ఉంటుంది. ఈ తేడాను మరొక విధంగా కూడా చెప్పవచ్చు. ఇతరులు వైలిన్ ను తమ కౌశలం ప్రదర్శించడానికి ఒక సాధనంగా చూస్తారు. సుబ్బణ్ణగారు వైలిన్ ను తన బహిరాత్మగా భావిస్తాడు. వైలిన్ స్వరాలు తనలో నుంచే వెలువడుతున్నట్లుగా భావిస్తాడు. ముఖ్యంగా ఆయన పారవశ్యంలో వాయిస్తున్నప్పుడు ఆయనా, వైలిన్ వేరువేరు అనిగాని, ఆయన వైలిన్ ను చేతిలో పట్టుకుని వాయిస్తున్నాడని గాని అనిపించదు. ఇతరులు వాయిస్తుంటే వారు స్వరాలను వెతికి పట్టుకొచ్చినట్లుగా అనిపిస్తుంది. సుబ్బణ్ణగారు వాయిస్తుంటే స్వరాలు తమంతట తాము పరుగెత్తుకొచ్చినట్లుగా అనిపిస్తుంది. పారవశ్యంలో వాయిస్తున్నప్పుడు ఆయన ముఖంలో ఒకానొక భావం కదలాడుతూ కనిపిస్తుంది. అదే భావం ఆయన వైలిన్ పై కనిపిస్తుంది. 'సావిరహే తవదీనా' అష్టపదిలో ఒక గోపిక 'నీకోసం దీనంగా రాధ విరహపడుతోంది' అని కృష్ణుడికి చెబుతోంది. సుబ్బణ్ణగారు 'దేశితోడి' రాగంలో ఆ గీతం వాయిస్తున్నప్పుడు విరహిణియైన రాధ దైన్యం అంతా ఆయన ముఖంలో కనిపించేది. ఆయన ఆ అష్టపది వాయించగా చాలా సార్లు విన్నాను. ప్రతిసారీ ఆయన ముఖంలో అదే దైన్యం కనిపించేది. “కృష్ణా-రాధపై కనికరం చూపించు” అని వైలిన్ దీనంగా వేడుకొంటున్నట్లు అనిపించేది. ఆ మాదిరిగా మరొకరు వాయించడం నేనెప్పుడూ వినలేదు. సంగీతాన్ని పాండిత్య ప్రదర్శన కోసం కాక, ఆంతర్యంలో భగవంతుని అర్చనకు అంకితం చేసినవారు మాత్రమే ఆ విధంగా వాయించగలరు. “సంగీతం గొప్పది, నేను అల్పుడిని” అని తెలుసుకున్నవాడు, “నేను గొప్ప విద్వాంసుడిని, నా విద్యత్తు ప్రదర్శించడానికి సంగీతం ఒక సాధనం” అనే అహంకారం లేనివాడు మాత్రమే ఆ విధంగా వాయించగలడు. సంగీత కారులకు సంగీతకళ గురించి చెప్పగల వాణ్ణికాను. కాని, శ్రోతలు సుబ్బణ్ణగారి సంగీతాన్ని విన్నట్లుగా ఇతరుల సంగీతాన్ని మైమరచి వినడం నేనెప్పుడూ చూడలేదని మాత్రం చెప్పగలను.

ఆ రోజు సుబ్బణ్ణగారు షావుకారు గారింట్లో 'సావిరహే తవదీనా రాధా' అష్టపది వాయిస్తున్నప్పుడు కృష్ణుని కోసం రాధ పడే విరహం పరమాత్మ కోసం ప్రకృతి అనుభవించే విరహంగా ద్యోతకమయింది. ఆ విరహవేదన స్వరప్రవాహంగా శ్రోతలను ముంచి వేసింది. షావుకారు గారి కళ్ళలో నీళ్ళుతిరిగాయి. ఆయన భార్య “ఆహా... అద్భుతంగా ఉందండీ మీ సంగీతం” అన్నది. వారి కుమార్తె సుబ్బణ్ణగారికి దగ్గరగా కూర్చుని చాలా పరిశీలనగా చూస్తోంది. కాసేపు వైలిన్ పై ఆయన వేళ్ళ కదలికని, కాసేపు ఆయన ముఖంలో భావాలని గమనిస్తోంది. సుబ్బణ్ణగారు కూడా ఆ రోజు ఒక విశేషమైన అనుభూతి పొందారు. ఆ అష్టపదిలో తానిది వరకు ఎరుగని శక్తి ఏదో ఆయనను కుదిపివేసింది. ఆ విరహం రాధది కాదు-తనదే. తన దొక్కడిదే కాదు-సకల మానవాళిది. కాని మానవులందరికీ ఈ సంగతి తెలియదు. సంసారమే ఈ విరహం. ఈ సంసారంలోని దుఃఖమంతా భగవంతుని కోసం విరహమే. భగవంతుని నుంచి దూరంగా వచ్చేసి, ఆయన కోసం వెతుక్కుంటూ, ఆయన కనిపించక మానవులు పడే వేదనే ఇదంతా. లిప్తకాలం భగవంతుని దర్శించిన అనుభూతిని సుబ్బణ్ణగారు తన అరవైయేళ్ళ జీవితంలో మూడు సార్లు పొందారు. అదీ అస్పష్టంగా, కల మాదిరిగానే. జీవితంతో విసిగి వేసారి పోయినట్లు అనిపించింది సుబ్బణ్ణగారికి. భగవంతుడు తనని ఇక్కడ ఉండమని చెప్పి అంతర్ధానమైపోయినట్లు ఆయనకు అనిపించింది. “భగవంతుడా మళ్ళీ నువ్వు దర్శనమిచ్చేది ఎప్పుడు? నన్ను నీ దగ్గరకు తీసుకునేది ఎప్పుడు? నీ విరహంతో నాగుండె పగిలిపోయింది” అంటూ ఆయన తనలో తానే శోకించాడు.

షావుకారు గారు సుఖంగా ఉన్నాడు. ఆయన భార్య కుమార్తె దగ్గరే ఉన్నారు. వారి ఆనందాన్ని చూసినప్పుడు భార్యాబిడ్డలను కోల్పోయిన వ్యక్తికి సహజంగా, తనకి తెలియకుండానే వేదన కలుగుతుంది. సుబ్బణ్ణగారి వేదన ఆయన సంగీతంలో వ్యక్తమయింది. ఆయన వేదన మానవాళివేదన అయినట్లుగా, ప్రపంచమే నిర్వేదంతో రోదిస్తున్నట్లుగా అనిపించింది.

వైలిన్ వాదనం ముగించిన తరువాత సుబ్బణ్ణగారు లేచి, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజుకు తనకింకేమీ అక్కర్లేదని ఆయనకి అనిపించింది. దగ్గరలో ఒక గుడి కనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. తన పరిస్థితి గురించి ఆలోచిస్తూ దేవుడికి మొరబెట్టుకున్నాడు. “దేవుడా నన్ను అనుగ్రహించు. ఈ జీవన క్లేశం నుంచి నాకు విముక్తి ప్రసాదించు. నాకు దారి చూపించు” అని ప్రార్థించాడు. బ్రహ్మాండ భాండంలో జీవుల బాధలు సలసల కాగుతుంటే దానికి చిన్న చిల్లు పొడిచి, అందులో నుంచి బైటకు చిమ్మే ఉష్ణద్రవంలో తడిసిన పిల్లవాడిలా విలవిల్లాడిపోయాడు ఆయన. అంతగా దుఃఖించ వలసిందేమీ లేదని తనకు తానే ఎంత చెప్పుకున్నా ఆయనకు ఓదార్పుకలగలేదు. ఒక్క క్షణంలో మళ్ళీ నిస్పృహ, నిర్వేదం వరదలా ఆయనను ముంచి ఎత్తాయి. భగవంతుడు మానవ ఆత్మను తన దరి చేర్చుకునే పద్ధతి అదే కాబోలుననిపిస్తుంది. సరైన తరుణం చూసి దేవుడు మానవునికి కష్టాలు, సుఖాలు ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా మానవునికి తనపై నమ్మకం కలిగేటట్లు, తనకోసం ఆరాటపడేటట్లు చేస్తాడు. మానవుని హృదయంలో భగవంతుని కోసం ఆరాటం, తపన పరాకాష్ఠనందుకున్నప్పుడు మానవుడు భగవంతుని చేరుకుంటాడు. ఆ రోజు సుబ్బణ్ణగారికి అటువంటి అవగాహనే కలిగింది.

ఆరాత్రి సుబ్బణ్ణగారికి ఒక కలవచ్చింది. తాను మైసూరులో ఉన్నట్లు, తల్లిదండ్రులకు సేవచేస్తున్నట్లు కలవచ్చింది. అర్ధరాత్రి వేళ కల చెదరిపోయి మెలకువ వచ్చిన తరువాత ఆయన ఆ కల గురించి ఆలోచిస్తూకూర్చున్నాడు. “ఈ వయస్సులో అటువంటి కల రావడం విచిత్రంగా ఉంది. నాకు అరవైయేళ్ళుదాటాయి. ఈ నాటకానికి తెరపడే సమయం దగ్గరపడింది. ఇప్పుడు నాకు అమ్మని, నాన్నని చూడాలనిపిస్తోందా?” అనుకున్నాడు ఆయన. కాసేపు ఆ ఆలోచన విరమించుకున్నాడు. కాని ఆలోచించడానికి మరో విషయం ఏముంది? అందుకని ఆయన మనస్సు మళ్ళీ తల్లిదండ్రుల మీదకే మళ్ళింది. అంతలో ఎందుకో ఒక్కసారి మిఠాయికొట్టు ముసలమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. “ఈ దేశం కాని దేశంలో నీకేదైనా జబ్బుచేస్తే చూసే దెవరు, చేసే దెవరు? నువ్వు చచ్చిపోతే నీ శవాన్ని దహనం చేసేందుకు కూడా ఎవరూ లేరు. నీ శవాన్ని కుక్కలు పీక్కు తింటాయి”-అన్నది ఆ ముసలమ్మ. ఆ మాటలు జ్ఞాపకం రావడంతో ఆయనకు ఎలాగైనా సరే-బొంబాయి నుంచి బైటపడి సొంత ఊరు చేరాలన్న తపన మొదలయింది.

ఆ మరునాడు సుబ్బణ్ణగారు షావుకారు గారింటికి వెళ్ళేసరికి షావుకారు గారు ఇంట్లో లేరు. షావుకారు గారి భార్య సుబ్బణ్ణగారికి పండ్లు, పాలు తెచ్చి “దయచేసి ఇవి తీసుకోండి. ఆయన ఇప్పుడే వస్తారు” అని చెప్పింది. ఆమె కుమార్తె వచ్చి దగ్గర కూర్చుని, ఒక పండు తీసి ఆయన చేతిలో పెట్టి 'తినండి' అంది. ఒక్కక్షణం ఆయనెంతో సంతోషించాడు. మరుక్షణంలో తన కూతురు జ్ఞాపకం వచ్చి దుఃఖం కలిగింది. తన కూతురు అలాగే పండు చేతిలో పెట్టితినమనేది. “విధి ఎంత విచిత్రంగా ఉంటుంది! పాత సంగతులను మరచిపోదామనుకుంటే వాటిని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కణ్ణించి వీలైనంత త్వరగా బైటపడాలి” అనుకున్నాడు ఆయన.

షావుకారు గారు వచ్చిన తర్వాత సుబ్బణ్ణగారు గీతగోవిందంలోని మరో అష్టపది వాయించారు. షావుకారు గారు ఆనందపరవశుడైనాడు. “మీరూ మా ఇంట్లో మాతో పాటు ఉంటూ మీకు ఇష్టం వచ్చినప్పుడు వైలిన్ వాయిస్తూ ఉండండి. మీకు జీతం ఏర్పాటు చేస్తాను” అని ఆయన అర్థించాడు.

“అది బాగానే ఉంటుంది. కాని, నేను నా సొంత ఊరు విడిచివచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది. మా ఊరికి తిరిగి వెళ్ళాలని ఆరాటంగా ఉంది” అని చెప్పాడు సుబ్బణ్ణగారు.

“మీరు ఎక్కడి వారు? అక్కణ్ణించి ఎప్పుడొచ్చారు? ఎందుకు వచ్చారు?” అంటూ అడిగారు షావుకారు గారు.

సుబ్బణ్ణగారు చెప్పినదంతా విని ఆయన “మీరు మీ స్వస్థలానికి వెళ్ళవలసిందే. కాని దయచేసి కొద్ది రోజులు ఇక్కడ ఉండి వెళ్ళండి” అని కోరారు.

“మీరు అనుగ్రహిస్తే రైలు ఖర్చులకు కావలసినంత డబ్బు పోగయ్యే వరకు ఇక్కడ ఉంటాను” అని సుబ్బన్నగారు సమాధానమిచ్చారు. షావుకారు గారు సరేనన్నారు.

మరునాడు సుబ్బన్నగారు వెళ్ళేసరికి షావుకారుగారు ఒక పళ్ళెంలో తాంబూలం, ఒక జత పంచెలు, మైసూరుకు రైలు టికెట్టు, ఒక వందరూపాయల నోటు పెట్టి, సవినయంగా అందించారు. “మీకు వాయించాలనిపిస్తే ఒక్క సారి వైలిన్ వాయించండి. లేకపోయినా ఫర్వాలేదు. కాని వెంటనే మీరు మీ ఊరికి బయలుదేరి వెళ్ళండి” అని ఆయన అన్నారు. కాని, సుబ్బణ్ణ గారు ఆ పళ్ళెరాన్ని అందుకోలేదు. “ఈ సొమ్ము నేను సంపాదించుకున్నది కాదు” అన్నాడు ఆయన. షావుకారు గారు “మీరు వాయించిన ఒక్క అష్టపదికి వెయ్యి రూపాయలిచ్చినా తక్కువే” - అంటూ ఆ కానుకను స్వీకరించవలసిందిగా కోరారు. మిఠాయి కొట్టు ముసలమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి సుబ్బణ్ణగారు ఆ కానుకను స్వీకరించారు. ఆ డబ్బు తన అంతిమయాత్రకు పనికొస్తుందని అనుకున్నాడు. షావుకారు గారు తన గుర్రపు బగ్గీలో సుబ్బణ్ణగారిని రైలు స్టేషన్ కు పంపించారు. సుబ్బణ్ణగారు ఆ ముసలమ్మ ఇస్తానన్న ఐదు రూపాయలు తీసుకోకుండానే బొంబాయి నుంచి బయలుదేరారు.

(8)

ఈ కథనం రసహీనంగా ఉందని నాకు తెలుసు. సుబ్బణ్ణగారి జీవితం అతివిచిత్రమైనది. ఎంత ప్రయత్నిస్తే మాత్రం ఆయన ఆలోచనలను, అనుభూతులను నేను ఊహించగలనా?

చామరాజ ఒడయర్ 1863-1894

మూడు రోజుల ప్రయాణానంతరం సుబ్బణ్ణగారు మైసూరు దరిదాపులకు చేరారు. మద్దూరు, మాండ్య, శ్రీరంగపట్టణం, పశ్చిమ వాహిని దాటారు. ఇవన్నీ ఎంత అందమైన పేర్లు అయినా, వైలిన్ పై విషాద స్వరాల లాగా ఇవి ఆయనకు బాధా మిళితమైన ఆనందాన్నే ఇచ్చాయి. దశాబ్దాల క్రితం ఎటువంటి పరిస్థితుల్లో తాను ఈ ప్రాంతం విడిచి వెళ్ళాడు? ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఇక్కడికి తిరిగి వస్తున్నాడు? అసలు ఈ సంఘటనలన్నీ ఒక్క జన్మలో జరిగినవేనా అని కూడా సందేహం కలుగుతుంది. కలలో తేలిపోతున్న మనిషిలాగా ఆయన మైసూరును సమీపించాడు. తాను ఈ ప్రాంతం విడిచి వెళ్ళిన తరువాత ఇక్కడ జరిగిన ముఖ్యమైన సంగతులను ఆయన రైలులో ప్రయణీకుల సంభాషణల వల్ల తెలుసుకున్నాడు. మైసూరు రాజ్య సింహాసనానికి వారసుడైన అలనాటి చిన్నారి యువరాజు శ్రీచామరాజ ఒడయారు పెరిగిపెద్దవాడై రాజరికం వహించి, కొంతకాలం పరిపాలించి, కొద్ది సంవత్సరాల క్రితం స్వర్గస్థుడైనాడు. ఈ సంగతి సుబ్బణ్ణగారికి కలకత్తాలోనే తెలిసింది. ఆ చామరాజ ఒడయరు గారి పెద్దకుమారుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నారు. సుబ్బణ్ణగారికి స్వదేశంలో ఎంతో మార్పు కనిపించింది. తాను ఈ ప్రాంతం విడిచి వెళ్ళిన రోజుల్లో మైసూరుకు రైలు మార్గం లేదు. తను వేరే యుగంలో అడుగుపెట్టానా అనిపించింది ఆయనకి. “నేనొక విరిగిన పాత వీణని” అనుకున్నాడు. కాని అంతలోనే “నేనిలా నన్ను గురించే ఆలోచించడం సరికాదు. నేను సన్యాసిలాగా ఉండాలి” అనుకున్నాడు. “అమ్మా నాన్నా ఇంకా బతికి ఉండి ఉంటారా? ఉంటే నా తప్పులన్నీ ఒప్పుకుంటాను. వారికి సేవ చేస్తాను” అని ఆలోచిస్తుంటే ఆయనకు కన్నీరు ఆగలేదు. రైలు మైసూరు చేరింది. వెంటనున్న చిన్నబట్టల మూట చంకన బెట్టుకుని, ఒకచేత్తో ఫిడేలు పట్టుకొని ఆయన స్టేషన్ లో దిగాడు. అక్కడి నుంచి పట్టణంలోకి నడిచాడు.

అవి వైశాఖమాసపు చివరి రోజులు. ఐదారు రోజులు వర్షాలు కురిసి ఆ రోజే తెరిపి ఇచ్చింది. వీధులన్నీ ఊడ్చి, నీళ్ళు చల్లి, దేవుడి ఉత్సవానికి సిద్ధం చేసినట్లుగా ఉన్నాయి. పడమటి గాలి చల్లగా వీస్తోంది. దారిపొడుగునా పెద్ద పెద్ద చెట్లపై వందలాది పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. ఆ ఉదయం ఎంతో అందంగా ఉంది. బాలభానుడు తన కిరణాలు చాచి ప్రపంచానికి ఆనందాన్ని పంచిపెడుతున్నాడు. సుబ్బణ్ణగారి హృదయం ఒక్కసారి సంతోషంతో ఉప్పొంగిపోయింది. కాని ఒక్కక్షణంలో ఆ సంతోషం సమసిపోయింది.

ఆయనకి పాతరోజులు జ్ఞాపకం వచ్చాయి. ఆ రోజుల్లో తనుపొద్దున్నే లేచి పెద్ద చెరువుకి వెళ్ళి ప్రాతఃకర్మలు ముగించుకుని ఇంటికి తిరిగివస్తూ చల్లటిగాలికి పరవశించేవాడు. దారిపొడుగునా రాగాలను గురించి ఆలోచించేవాడు. “ఈ రాగ సంచారం ఇలా ఉండాలి. ఆ రాగంలో గమకాలు అలా ఉండాలి” అంటూ ఎంతో లోతుగా ఆలోచించేవాడు. రాగరహస్యాలను తెలుసుకుంటుంటే గొప్ప విజయగర్వం కలిగేది. ఆ ఉత్సాహం ఇప్పుడేది? ఆ రోజుల్లో ఒక క్రీడలాగా జీవితం తనను ఆహ్వానించేది. ఇప్పుడు ఆ క్రీడ చరమదశకు వచ్చింది. అది అర్థంలేని వ్యర్థమైన ఆట అని ఆరోజుల్లో ఎవరైనా అని ఉంటే తను ఒప్పుకునేవాడు కాడు.

“ఎందుకొచ్చిన ఆలోచనలివి? ఇంక నన్ను గురించి నేను ఆలోచించడం దేనికి? నేను సంతోషంగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఆ కాలపు వందమంది జనం స్థానంలో ఇప్పుడు ఇంకో వందమంది జనం ఉన్నారు. సూర్యుడు తన కిరణాలతో జనాన్ని అప్పుడూ ఆహ్లాదపరచాడు, ఇప్పుడూ ఆహ్లాదపరుస్తున్నాడు. బాలసూర్యుడిలాగానే రాజావారు ఆ రోజుల్లో తన ప్రజలను పోషించారు, వారికి ఆశ్రయమిచ్చారు. ఆ పోషణ, ఆశ్రయం ఇప్పుడు ఇంకొక తరం ప్రజలు పొందుతున్నారు. మంచిదే. ఈ తరం ప్రజలు జీవితంలో పొందుతున్న సంతోషాన్ని నేను పొందలేకపోయాను”.

ఇలా ఆలోచిస్తూ సుబ్బణ్ణగారు తన తండ్రి ఇల్లు ఉన్నవీధిలోకి వచ్చాడు. ఇంటిని సమీపిస్తుంటే ఎన్నో ఆలోచనలు, ఆయన మనస్సును ఆవరించాయి. పరధ్యానంగా వెళ్ళి ఇంటి ముందు వరండాలో కూర్చున్నాడు. వాకిలి మూసి ఉంది. వీధిలో జనసంచారం అంతగా లేదు. కొంతసేపటికి లోపలి నుంచి ఎవరో తలుపు తీశారు. సుబ్బణ్ణగారు అటువైపు చూశారు. ఎవరో అపరిచిత వ్యక్తి. వరండాలో చిన్న మూట, ఫిడేలు పెట్టుకుని కూర్చున్న ఈ ముసలాయన్ని చూసి తలుపు తీసిన వ్యక్తి “ఎవరండీ మీరు?” అని అడిగాడు. సుబ్బణ్ణగారు అప్రయత్నంగా “నేనొక పరదేశినండి” అని సమాధానమిచ్చాడు.

ఆ సంఘటన తరువాత ఎనిమిదేళ్ళకు సుబ్బణ్ణగారు నాకు ఆ సంగతి చెబుతూ ఇలా అన్నారు. “చూడు నాయనా... ఆ మనిషి ఆ ప్రశ్న అడగ్గానే నానోటి నుంచి వచ్చిన జవాబు అది. నేను ఆ ఇంట్లో పుట్టాను. ఆ ఇంట్లో పెరిగాను. ఇరవై అయిదు సంవత్సరాలు ఆ ఇంట్లో నివసించాను. తరువాత కొన్ని సంవత్సరాలు ఇంకెక్కడో ఉన్నంత మాత్రాన నేను ఆ ఇంట్లో పుట్టి పెరిగిన మాట వాస్తవం కాకుండా పోతుందా? అయినా 'ఎవరండీ మీరు' అని అడగ్గానే అనాలోచితంగా పరదేశినని చెప్పాను. ఒక్క క్షణం తరువాత నా జవాబు నాకే వింతగా అనిపించింది. ఇది నా ఊరు కాకపోతే ఏది నా ఊరు? కలకత్తానా? మనం దేవుడి దగ్గర నుండి ఈ లోకానికి వచ్చాం. ఇక్కడ కొంత కాలం ఉండి మళ్ళీ దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ద్వారపాలకుడు 'ఎవరు నువ్వు?' అని అడిగితే పరదేశిని అని సమాధానమిస్తానేమో. అప్పుడు ద్వారపాలకుడు 'ఇక్కడి వాడివి కాకపోతే ఎక్కడి వాడివో అక్కడికేపో' అంటాడేమో! ఈ లోకం నా శాశ్వత స్థానమని నా ఉద్దేశమా? ఆ రోజు ఆ అపరిచిత వ్యక్తి అడిగిన ప్రశ్నకు జవాబివ్వగానే కాసేపు ఆలోచించాను. పరదేశినని చెప్పాను గాని కలకత్తా వాడినని చెప్పలేదు. నిజానికి మైసూరు నాది కాదు. కలకత్తా నాది కాదు. ఇప్పుడెవరైనా ఆ ప్రశ్న అడిగితే నాది కైలాసమని చెబుతాను”.

ఆనాటి సుబ్బణ్ణగారి పరిస్థితి ఆలోచిస్తే ఎవరైనా కంటతడి పెడతారు. తలుపు తీసిన వ్యక్తి తలుపు మూసి బైటకు వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో తనకు తెలియని వారెవరో కాపరం ఉంటున్నారని సుబ్బన్నగారు తెలుసుకున్నాడు. అక్కడి నుంచి రాజా వారి గోశాల సమీపాన గల ఒక ఇంటికి వెళ్ళి వరండాలో కూర్చున్నాడు. ఆ ఇంటికి తాళం పెట్టి ఉంది. కాసేపాగి మళ్ళీ తన పాత ఇంటికి వెళ్ళాడు. బైట ఎవరో కనిపిస్తే “చూడండి బాబూ... ఇది వరకు ఈ ఇంట్లో నారాయణశాస్త్రిగారని ఒకాయన ఉండేవారు. ఆయన సంగతి మీకైమైనా తెలుసా?” అని అడిగాడు.

'ఆ ముసలాయన పోయి చాలా కాలమయింది” అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు.

“ఆ కుటుంబం వారు ఎక్కడున్నారు?”

“ఆ కుటుంబం వారెవ్వరూ లేరు”.

“శాస్త్రిగారి భార్య?”

“ఆవిడా పోయింది”

“వారి కుమార్తెలు ఇక్కడే ఎక్కడో ఉంటున్నారని విన్నాను?”

“శాస్త్రిగారి కూతుళ్ళలో ఒకావిడపోయింది. ఇంకొక ఆవిడ ఎక్కడో తన కొడుకు దగ్గర ఉంటోంది. ఆ కొడుకు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడట. ఎక్కడో నాకు తెలియదు. మేము ఈ ఇల్లు కొనుక్కున్నాము”.

తన తల్లిదండ్రులు చనిపోయి ఉంటారనీ, తన అక్కలు ఇది వరకున్న చోటనే ఉండకపోవచ్చుననీ సుబ్బన్నగారికి తెలుసు. అయినా ఇప్పుడు ఆ అపరిచిత వ్యక్తి చెప్పేప్రతి మాటా ఆయన మనస్సుకు సమ్మెటపోటులాగా తగిలింది. అక్కడి నుంచి ఆయన నెమ్మదిగా చెరువు వైపు నడిచాడు. ఎక్కడ పుట్టినా, పెరిగినా నువ్వు అక్కడి ప్రజలతో కలిసిపోయి, వారి మనస్సుల్లో నీ స్మృతులను మిగల్చలేకపోతే అది నీకు పరస్థలమే అవుతుంది. సుబ్బణ్ణగారు చెరువులో స్నానం చేసి, తన తల్లిదండ్రులకు తర్పణలు విడిచాడు. “మీ కుమారుడి నైనందుకు నేను మీకు చేసే శుశ్రూష ఇదే, ఉత్తరక్రియలూ ఇవే” అంటూ ఆయన తర్పణ విడిచాడు. ఇక్కడ నుంచి నంజనగూడు వెళ్ళాలా, తొరెయపురం వెళ్ళాలా అని కాసేపు ఆలోచించాడు. నంజనగూడులో జనం సందడి ఎక్కువ. తొరెయపురం అయితే ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నారు. “తొరెయ పురం వెళ్ళి శేషజీవితం దైవ చింతనలో గడుపుతాను. జీవితంలో ఇంక నాకు కావలసిందేముంది” అనుకుని ఆ ఊరికి బయలుదేరాడు.

నండూరి పార్థసారథి
(1987లో అనువదించబడినది)

Previous Post Next Post