Title Picture
షెర్లీ మెక్లేన్, డేవిడ్ నివెన్, కాంటిన్ ఫ్లాస్

చాలా కాలంగా ఎదురు చూస్తున్న 'ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్' చిత్రాన్ని జూల్స్ వెర్న్ రచించిన నవల ఆధారంగా మైఖేల్ టాడ్ నిర్మించాడు. మైఖేల్ ఆండర్సన్ దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రానికి కథాస్థలం లండన్. కథాకాలం 1872. విమానాలు లేని ఆ రోజులలో ఒక పెద్ద మనిషి 80 రోజుల్లో భూప్రదక్షిణం చేసి వస్తానని మిత్రులతో 20 వేల పౌనులకు పందెం కాశాడు. ఒక విదూషకుడిని, ఒక చిన్న బస్తాడు నోట్ల కట్టలనీ వెంట తీసుకుని యాత్ర ప్రారంభించాడు. బెలూన్లు, బస్సులు, రైళ్ళు, ఓడలు, స్లెడ్జి బళ్ళు, గుర్రాలు, ఏనుగులు ఇత్యాది నానారకాల వాహనాలలో ప్రయాణం చేసి, అనేక ఆపదలకు గురియై చివరకు పందెం గెల్చుకుంటాడు. ఈలోగా అతనికి యాత్రలో ఒక ప్రేయసి తటస్థ పడుతుంది. ఈ భూప్రదక్షిణంలో వారు చూచిన వింతలనూ, ప్రకృతి దృశ్యాలనూ, అనుభవించిన కష్టాలనూ, చేసిన సాహసాలనూ చిత్రిస్తుంది ఈ చిత్రం.

ఈ చిత్రాన్ని టెక్నికలర్ లో, సినిమాస్కోప్ లో భారీ ఎత్తున నిర్మించారు. దీన్ని నిర్మించి అప్పుడే నాలుగైదు సంవత్సరాలయింది. ఇండియాకు ఈ మధ్యనే వచ్చింది. ఇప్పటికే అనేక చోట్ల ప్రదర్శింపబడి బోలెడు కీర్తినీ, ధనాన్నీ, అవార్డూలనూ ఆర్జించింది.

ఈ చిత్రంలో నాయకుడుగా డేవిడ్ నివెన్, నాయికగా షెర్లీ మెక్లేన్, విదూషకుడుగా కాంటిన్ ఫ్లాస్, డిటెక్టివ్ గా రాబర్ట్ న్యూటన్ నటించారు. వీరు కాక ఇంకా చార్లెస్ బోయర్, రోనాల్డ్ కోల్మన్, బస్టర్ కీటన్, ఫ్రాంక్ సినాట్రా, పీటర్ లారే, ట్రెవర్ హోవర్డ్, ఫెర్నాండెల్, జాన్ మిల్స్, మేర్లిన్ డీట్రిచ్, రెడ్ స్కేల్టన్, మెల్విల్ కూపర్ మొదలయిన హేమాహేమీలు ఒక పాతికమంది ఇందులో నటించారు. వీళ్ళందరూ ఈ చిత్రంలో ఒక నిమిషం, రెండు నిమిషాల పాత్రలు ధరించారు. వీళ్ళల్లో చాలామందికి మాటలు కూడా లేవు. ఇంతమంది అగ్రశ్రేణి నటులు ఇంత చిన్న వేషాలు వేయడం ఈ చిత్రంలో ఒక విశేషం.

అద్భుతమైన ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు విక్టర్ యంగ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. టైటిల్స్ చూపిన పద్ధతి గొప్పగా, సరికొత్తగా ఉంది. చిత్రం నిడివి సుమారు పధ్నాలుగునర్నవేల అడుగులు. అయినా ఎక్కడా విసుగుపుట్టకుండా చూస్తున్నంత సేపూ హాయిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిన చిత్రం 'ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్'.

నండూరి పార్థసారథి
(1961 అక్టోబరు 22వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post