కర్నాటక సంగీత అనన్య వైశిష్ట్యం

బెంగుళూరు, ఏప్రిల్ 5 : సుప్రసిద్ధ వైణికుడు, 'వీణా వరప్రసాది', 'వైణిక శిఖామణి', 'నాద స్వానుభవయోగి' ఇత్యాది బహుళ బిరుదాంకితుడు ఎస్. బాలచందర్ నేటి ఉదయం ఇక్కడ 'కర్నాటక సంగీతం యొక్క అనన్య వైశిష్ట్యం' అనే విషయంపై సోదాహరణంగా ప్రసంగించారు. కర్నాటక గాన కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో శంకరయ్య హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక సంగీత విద్వాంసులు, సంగీత ప్రియులు పలువురు హాజరైనారు. కర్నాటక సంగీత వైశిష్ట్యాన్ని వివరిస్తూ, అవసరమైనచోట్ల వీణ వాయిస్తూ బాలచందర్ దాదాపు మూడు గంటలసేపు శ్రోతలను ఆనందాశ్చర్యాలలో ముంచిఎత్తారు. బెంగుళూరులో ఆయన ఇట్టి సంగీతోపన్యాసం ఇవ్వడం ఇదే ప్రథమం. బెంగుళూరు రసికులకు ఇది అపురూపమైన అవకాశం.

బాలచందర్ ఏడెనిమిదేళ్ల చిరుతప్రాయంలోనే సంగీత సాధన ప్రారంభించారు. అప్పటి నుంచి నిరంతరంగా, ఏకాగ్రచిత్తంతో, ఒక తపస్సుగా సంగీతసాధన చేసి ఈనాడు కర్నాటక సంగీత ప్రపంచంలో ఒక అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించగలిగారు. బాలుడుగా ఆయన మొదట కంజీర, తర్వాత తబ్లా, సితార్ లు వాయించారు. చివరికి అన్నింటినీ త్యజించి వీణను చేపట్టారు. ఏ గురువును ఆశ్రయించకుండా, తనకు తానే గురువై స్వయంగా సాధన చేశారు.

నేటి ఆయన ప్రసంగం, వీణా వాదనం-హాజరైన ప్రతి రసికునికి-ఒక గొప్ప అనుభవం.

సంగీతంలో తాను సాధించినది ఏ కొంచెమైనా వుంటే అది కేవలం దైవ కృపయేననీ, తాను ఎవరి వద్ద నేర్చుకొనకపోయినప్పటికీ నలుగురు మహా విద్వాంసులను గురువులుగా భావించుకున్నాననీ, వారు స్వర్గీయ టైగర్ వరదాచార్యర్, స్వర్గీయ మహారాజపురం విశ్వనాథ అయ్యర్, శ్రీ రాజరత్నం పిళ్లె, శ్రీ సుందరేశ అయ్యర్ అనీ బాలచందర్ చెప్పారు.

బాలచందర్ తమిళంలో ప్రసంగించారు. మధ్య మధ్య ధారాళంగా ఇంగ్లీషు కూడా ఉపయోగించారు. పాశ్చాత్య సంగీతాన్ని, హిందూస్థానీ సంగీతాన్ని, కర్నాటక సంగీతాన్ని విడివిడిగా వాయించి చూపించి వాటిలోని పోలికలను, భేదాలను ఆయన వివరించారు. "పాశ్చాత్య సంగీతంలో స్వరాలు దేనికది విడివిడిగా ఎక్కడికక్కడ విరిగిపోతున్నట్లుగా ఉంటాయి. హిందూస్థానీ, కర్నాటక సంగీతాలలో గమకాలు ఉంటాయి. హిందూస్థానీలో కంటే కర్నాటక సంగీతంలో గమకాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి" అని చెబుతూ పాశ్చాత్య సంగీతంలో మేజర్ స్కేల్ ను వాయించి, దానినే హిందూస్థానీ బాణిలో గమకంతో వాయించారు. తర్వాత కర్నాటక సంగీతంలోని గమకంతో వాయించి దాన్ని వివరించారు. గమకం లేనంతమాత్రాన పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని తేలికగా తీసివేయరాదనీ, అది కూడా గొప్ప సంగీతమనీ ఆయన చెప్పారు.

పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో వాద్య సమ్మేళనానికి అవకాశం ఉందనీ, భారతీయ సంగీతంలో అది అసాధ్యమనీ, పాశ్చాత్యులవాద్య సమ్మేళనం అద్భుతంగా ఉంటుందనీ, అది వారి సంగీతపు ప్రత్యేకత అనీ ఆయన చెప్పారు.

మేజర్ స్కేల్ తర్వాత ఒక మైనర్ స్కేల్ నూ వాయించారు. అది 'కీరవాణి' రాగానికి సమమైనది. పిమ్మట శహన, వరాళి, శుభపంతువరాళి, దేవగాంధారి, మోహన, హిందోళం, ధన్యాసి, ఖరహరప్రియ, రీతిగౌళ మున్నగు పెక్కు రాగాలను క్లుప్తంగా వాయించి, ఆయా రాగాల ప్రత్యేకతను, కర్నాటక సంప్రదాయ ప్రత్యేకతను వివరించారు.

శ్పానిష్, జాపనీస్ సంగీత రీతులను, మధ్య ప్రాచ్య సంగీత రీతులను, జాజ్ ను కూడా ఆయన వినిపించారు. ప్రతి సంగీత సంప్రదాయానికి ఒక గొప్పదనం, ప్రత్యేకత ఉన్నాయని చెబుతూ, వాటి అన్నింటిలోని లక్షణాలు కర్నాటక సంగీతంలో ఉన్నాయనీ, కాగా కర్నాటక సంగీతంలోని ప్రత్యేక గాయనరీతులు మరి ఏ సంగీతంలోనూ లేవనీ ఆయన చెప్పారు.

తాను చిన్నతనంలో వీణను ఎలా సాధన చేసినదీ ఆయన వాయించి చూపారు. వీణను చేపట్టక ముందు సితార్ పై తనకు తానుగా కర్నాటక సంగీతాన్ని సాధన చేసిన పద్ధతిని వివరించారు. సితార్ కు, వీణకు గల భేదాన్ని వీణ వైశిష్ట్యాన్ని విపులీకరించారు.

నండూరి పార్థసారథి
(1976 ఏప్రిల్ 05వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post