Title Picture

బాలల చలన చిత్ర సంఘం నిర్మించిన 'చేతక్', 'యాత్రా' అనే చిత్రాలను విజయవాడ విజయాటాకీసు వారు బాలల చిత్రోత్సవ సంఘం తరపున క్రిందటి ఆదివారం నాడు బాలలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అంతకు క్రితం రోజు ఈ రెండు చిత్రాలనూ విజయాటాకీసు వారు పత్రికా విలేఖరులకు ప్రత్యేకంగా చూపించారు. బుధ, గురువారాలలో ఈ చిత్రాలను పిఠాపురంలో ప్రదర్శించారు. నేటి ఉదయం వీటిని విజయవాడ మారుతీ టాకీసులో ప్రదర్శిస్తున్నారు.

దేశంలో బాలల చిత్రాల నిర్మాణమే బహుకొద్ది. నిర్మించిన చిత్రాలు కూడా ఢిల్లీ కార్యాలయం దాటి సాధారణంగా బైటికి రావు. దేశంలోని 14 భాషలలోనూ ప్రతులు లభిస్తాయని వినడం, కేట్లాగులో చూడడమే గాని ఎన్నడూ తెరమీద చూసిన పాపాన పోలేదు. ఇక్కడి థియేటర్ల వారు రోజుకో ఉత్తరం చొప్పున వ్రాస్తే ఏ నాలుగైదు నెలలకో అది ఢిల్లీ కార్యాలయం దృష్టికి వస్తుంది. ఆ తర్వాత ఇంకో రెండు మూడు నెలలకి హిందీ ప్రతి ఒకటి పంపిస్తారు. ''మళ్ళీ మళ్ళీ పంపించడానికి మాకు తీరిక, ఓపిక లేవు కాబట్టి ఈ ప్రతిని పనిలో పని ఇప్పుడే ఆంధ్రదేశం అంతా తిప్పండి. అలా అయితేనే పంపిస్తాం' అని బెదిరిస్తూ మన మీద దయకొద్దీ పంపిస్తున్నట్లు ప్రతులను రవాణా చేస్తారు. ఈ చిత్రాలను విజయాటాకీసు వారు ఆ షరతు మీదనే తీసుకున్నారు. 26వ తేదీన బందరులో వీటిని ప్రదర్శిస్తారట. బహుశ ఈ నెలలోనే ఒంగోలులో కూడా ప్రదర్శిస్తారు.

వీటిలో 'చేతక్' చిత్రం రాణా ప్రతాప సింహుని యుద్ధాశ్వం ఆత్మకథ. రాణా ప్రతాప్ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన చేతక్ అశ్వం తన కథను తాను చెప్పుకొంటున్నట్టు దీనిని చిత్రీకరించారు. ఇందులో రాణాప్రతాప్ గా పృద్వీరాజ్ కపూర్ నటించాడు. ఇంకా ఈ చిత్రంలో బి.ఎం. వ్యాస్, ఉల్లాస్ కూడా నటించారు. దీనికి కేదార్ శర్మ దర్శకత్వం వహించాడు. సంగీతం స్నేహల్ భట్కర్ సమకూర్చాడు. ఈ చిత్రం 7, 12 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలకు ఉద్దేశించబడినట్టు ప్రకటించారు. నిడివి మూడు వేలపై చిల్లర అడుగులు. బాలల చిత్ర సంఘం నిర్మించిన కథా చిత్రాలన్నింటిలాగే ఇది కూడా డాక్యుమెంటరీ శైలిలో చిత్రీకరించబడింది. గమనం మందకొడిగా సాగింది. ఈ చిత్రం పత్రికా విలేఖరులకు నచ్చింది. కాని పిల్లలకు నచ్చుతుందని చెప్పడం కష్టం. పిల్లలను దృష్టిలో ఉంచుకుని చిత్రీకరించిన ధోరణి ఈ చిత్రంలో ఎక్కడా కనుపించదు.

'యాత్ర' చిత్రం 'చేతన్' చిత్రం కంటే ఎన్నో రెట్లు ఉత్తమంగా ఉంది. ఇది పిల్లలను, పెద్దలను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. దీనికి స్క్రీన్ ప్లే కేదార్ శర్మ వ్రాశారు. దర్శకత్వం రాజేంద్రకుమార్ నిర్వహించారు. సంగీతం శ్రీమతి మీనాక్షి సుబ్రహ్మణ్యం సమకూర్చారు. ఈ చిత్రం పూర్తిగా దక్షిణ భారతదేశంలో చిత్రీకరించబడింది. ఉత్తర హిందూస్థానానికి చెందిన ఒక తండ్రీ, కూతురు దక్షిణాదిన పర్యటించడం, అనేక క్షేత్రాలను, నగరాలను సందర్శించడం ఇందులో చూపించారు. దక్షిణాదిన వారికి బాలల యాత్రా బృందంతోడు అవుతుంది. మధుర, తంజావూరు, బెంగుళూరు, కంచి, పెరియారు మున్నగు అనేక ప్రదేశాలను వారు సందర్శిస్తారు. పిల్లల కోసం చిత్రాన్ని నిర్మిస్తున్న విషయాన్ని విస్మరించకుండా దర్శకుడు చాలా వేగంగా, హుషారుగా చిత్రాన్ని నడిపించారు. ఈ విధమైన పాత్రలు జాతీయ సమైక్యతకు దోహదం చేయగలవని ఈ చిత్రం ఉద్బోధిస్తుంది. మద్రాసు రేడియో కేంద్రంలో బాలలు ప్రధాని నెహ్రూతో ఇంటర్వ్యూ జరిపిన దృశ్యాన్ని కూడా ఇందులో పొందుపరచారు. ఈ చిత్రం నిడివి ఆరువేలపై చిల్లర అడుగులు. 13, 17 సంవత్సరాల మధ్య వయస్కులయిన పిల్లలకు ఈ చిత్రం ఉద్దేశించబడింది.

బాలల చిత్రాలు మళ్ళీమళ్ళీ రావుకాబట్టి అవకాశం దొరికినప్పుడే పిల్లలు ఈ రెండు చిత్రాలను చూడటం మంచిది.

నండూరి పార్థసారథి
(1961 నవంబర్ 19వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post