శుద్ధ శాస్త్రీయ సంగీతంలో సాహిత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం సంగీతాన్ని అవమానించడమే అవుతుంది. సంగీతం స్వయం ప్రకాశంగల కళ. కవిత్వం కూడా అంతే. కాని, గానం చేయడానికి ఉద్దేశించిన-తాళబద్ధమైన-గీతాలు స్వయం ప్రకాశం గలవి కావు. సంగీతాన్ని ఆశ్రయించనిదే అవి రాణించలేవు.

శాస్త్రీయ సంగీత రచనల్లో సాహిత్యం కేవలం 'టేకాఫ్'కి మాత్రమే ఉద్దేశించినవి. పాడకుండా వట్టిగా చదివితే వాటికి అందం లేదు; పాడితే అందంగా ఉంటాయి గాని, వాటి సాహిత్యం కంటే సంగీతానికే ఆకర్షణ ఎక్కువ. సాహిత్యం ఆలోచనామృతం, సంగీతం ఆపాతమధురం. రెండూ ఒకేసారి వినిపించినా ముందుగా, వెంటనే మనస్సును ఆకర్షించేది సంగీతమే. ఉరుము ఉరిమే ముందు మెరుపు మెరుస్తుంది. మేఘాల ఒరిపిడి వల్ల ఉరుము, మెరుపు ఒకేసారి పుడతాయి. కాని, ముందు మెరుపు కనిపిస్తుంది. తర్వాత కొంతసేపటికి ఉరుము వినిపిస్తుంది. అలాగే పాట పాడినప్పుడు ముందు సంగీతం ఆకర్షించి 'ఆహా' అనిపిస్తుంది. తర్వాత కాసేపటికి సాహిత్యం సంగతి ఆలోచిస్తాము. ముందు 'ఎంత మధురంగా పాడుతున్నాడు' అనుకుంటాము. తర్వాత 'అవునూ... ఇంతకీ ఆ పాట అర్థం ఏమిటి'? అని ఆలోచిస్తాము.

కారు నేల మీద నడుస్తుంది. విమానం ఆకాశంలో ఎగురుతుంది. కారుకి చక్రాలుంటాయి. విమానానికి రెక్కలుంటాయి. కాని, విమానానికి కూడా చక్రాలుంటాయి. ఎందుకు? చక్రాలు లేకపోతేనేం? విమానం ఆకాశంలోకి లేవడానికి కొంతసేపు చక్రాల మీద నడిచి క్రమంగా పైకి లేస్తుంది. పూర్తిగా పైకి లేచాక దానికి చక్రాలతో అవసరం ఉండదు. చక్రాలు పైకి ముడుచుకుంటాయి. శాస్త్రీయ గాత్ర సంగీతం విషయంలోనూ సాహిత్యం విమానం చక్రాల లాగానే ఉండాలి. సాహిత్యం సంగీతాన్ని ముందుకు త్రోసి, అది వేగం పుంజుకోగానే తాను వెనక్కి తగ్గాలి.

సాహిత్య ప్రాధాన్యం భజనకీర్తనల్లో, పదాలలో, జావళీలలో ఉంటుంది. పదాలు, జావళీలలో సంగీత సాహిత్యాలేకాక అభినయం కూడా ఉంటుంది. అభినయంతో కూడినప్పుడే వాటికి పూర్తి సాఫల్యత సిద్ధిస్తుంది. వీటిలో సంగీత, సాహిత్య, అభినయాలకి మూడింటికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది.

గ్రామాలలో చెక్క భజనలు చేస్తూ ఉంటారు - దీపపు సెమ్మ చుట్టూ చేరి లయ బద్ధంగా అడుగులు వేస్తూ. అందులో సాహిత్యానికి ప్రాధాన్యం ఉంటుంది. భజనల్లో సాహిత్యానికి సంగీతం ఒక వాహకం మాత్రమే. అలాగే సాహిత్యం భక్తి భావానికి వాహకం. సాహిత్యం తనంతట తాను భక్తిని స్పందింపచేయలేక సంగీతాన్ని సహాయం కోరుతుంది. సంగీతం సహకరిస్తుంది. నిజానికి భజనలలో పాడేవారికి, వినేవారికి కూడా భక్తి ఆవేశాన్ని కలిగించేది సంగీతమే. అయితే, తన సహాయం అడిగారు కదా అని సంగీతం సాహిత్యాన్ని వెనక్కి తోసేయదు. అలా చేస్తే అది భజన సంగీతం అనిపించుకోదు. సంగీతం తాను వెనక ఉండి సాహిత్యాన్ని ముందుకు నడిపించాలి. అలాగే శుద్ధ శాస్త్రీయ గాత్ర సంగీతంలో సాహిత్యం వెనక్కి తగ్గడం అవసరం.

కచేరీల్లో శాస్త్రీయ సంగీత రచనలు విని ఆనందించేవారు ముగ్ధులయ్యేది సంగీతానికే గాని సాహిత్యానికి కాదు. త్యాగరాజ కీర్తనల్లో సాహిత్యం ఒక్క ముక్క కూడా అర్థం కాని వాళ్ళు కూడా సంగీతానికే ముగ్ధులవుతున్నారు. సాహిత్యం అర్థమైన వారు కూడా తలవూచేది సంగీతానికే. కర్ణాటక సంగీతంలో దిగ్దంతులవంటి వారు కూడా సాహిత్యార్థం పూర్తిగా తెలిసినవారు కాకపోవచ్చు. ఒక వేళ తెలుసుకున్నా వాళ్ళూ మనకు తెలిసేటట్లుగా పాడరు. అయినా-వారు సాహిత్యాన్ని ధ్వంసం చేస్తున్నా-మనం 'ఆహా' అని ఆనందించేది సంగీతాన్నే. త్యాగరాజు వ్యక్తిత్వంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశాలు మూడు. ఆయన గొప్ప రామభక్తుడు, కవి, సంగీత విద్వాంసుడు. కాని, ఆయన కీర్తికి ప్రధాన కారణం సంగీత విద్వత్తు, సంగీత రచనా ప్రతిభే.

నిబద్ధ సంగీతంలో సంగీతం సాహిత్యానికి ఒదిగి ఉన్నట్లు కనిపించినా, సాహిత్యం కంటే అదే ఎక్కువ ఆకర్షిస్తుంది. ముందున్న సాహిత్యం కంటే వెనక ఒదిగి ఉన్న సంగీతాన్నే ఎక్కువగా ఆనందిస్తాము.

కర్ణాటక సంగీతంలో మనకున్న శుద్ధ సంగీత ప్రక్రియలు 'రాగం-తానం-పల్లవి', తిల్లానా మాత్రమే. వీటిలో తిల్లానా స్వతఃశాస్త్రీయ సంగీతానికి సంబంధించినది కాదు. అది నృత్య రంగం నుంచి సంగీత రంగానికి చుట్టపు చూపుగా వచ్చినది. దాని అసలు రంగం నృత్య రంగమే. అది హిందూస్థానీ సంగీతంలోని తరానాకు అనుకరణం. కాని తరానా స్వతఃశాస్త్రీయ సంగీత రంగానికి చెందినది. తర్వాత అది కథక్ నృత్య రంగానికి చుట్టుపు చూపుగా వెళ్ళింది.

హిందూస్థానీ సంగీత కచేరీల్లో ప్రధానంగా వినిపించేది శుద్ధ సంగీతమే. ఠుమ్రీ, దాద్రా, భజన్, ఝూలా, హోరీ వంటి ఉప శాస్త్రీయ రచనల్లో సాహిత్యానికి కొంత ప్రాముఖ్యం ఉంటుంది కాని, కచేరీల్లో వాటికి స్థానం తక్కువ. కచేరీల్లో విస్తారమైన ఆలాప్, నొంతొం ఆలాప్ లతో ఖ్యాల్ లు గానం చేసిన తర్వాత చివరలో ఒక ఠుమ్రీ గాని, భజన్ గాని, రెండూ గాని పాడుతారు. ఖ్యాల్, తరానా-రెండూ శుద్ధ సంగీత రచనలే.

ఖ్యాల్ లో సాహిత్యానికి ప్రాధాన్యం లేదు. గాత్ర సంగీతానికి కేవలం వాహకంగానే సాహిత్య రచన ఉంటుంది. సాహిత్యాన్ని ఎంత చిత్ర హింస చేసినా సంగీత రంజకత్వానికి ఏమీ అభ్యంతరం ఉండదు. నిజానికి-సాహిత్యంలోని భావాన్ని గాయకుడు తన సంగీతంతోనే చిత్రిస్తాడు. ఉదాహరణకు 'ఋతుబసంత్ ఆయీ, బన్ మే కోయల్ బోలే' అని సాహిత్యం ఉంటే ఆ మాటలు స్పష్టంగా ఉచ్చరించకపోయినా బసంత్ రాగంలో చేసిన స్వరరచనే శ్రోతల మనః ఫలకం మీద వసంత ఋతు శోభను, కోయిల రవాలను చిత్రిస్తుంది-వాద్య సంగీతంలో పదాలేవీ వినిపించవు కదా. అయినా వాద్యంపై 'బసంత్' రాగం వినిపిస్తే వసంత శోభ మనస్సులో మెదులుతుంది.

కర్ణాటక సంగీతంలో సాహిత్యపు సంకెళ్ళ భారం ఎక్కువ. సంగీతపు స్వేచ్ఛా విహారానికి సాహిత్యం అడ్డుపడుతూ ఉంటుంది. మనవాళ్ళు వాద్య సంగీతానికి కూడా సాహిత్యపు సంకెళ్ళు తగిలించారు. ఎందుకంటే మనవాళ్ళు వాద్యాలపైన కూడా త్యాగరాజకృతులే వాయిస్తారు. గాత్ర సంగీతానికీ, వాద్య సంగీతానికీ ఒకే సాహిత్య రచనలు వాడుతారు. వీణ మధురంగా వాయిస్తుంటే విని ఆనందించక భాష తెలిసిన విమర్శకులు ఆ వీణపై సాహిత్యం స్పష్టంగా-ఏ పదానికాపదం-పలుకుతోందా లేదా అని తర్కిస్తారు. హిందూస్థానీ సంప్రదాయంలో వాద్య సంగీతానికి అసలు సాహిత్యం ఉండదు. వట్టి స్వర రచన మాత్రమే ఉంటుంది. ఆరచనను 'గత్' అంటారు. ఖ్యాల్ లో మాదిరిగానే 'గత్'లకు కూడా 'రచన' అనేది రెండు పాదాలు మాత్రమే ఉంటుంది - ఒకటే స్థాయి', రెండోది 'అంతర'.

నండూరి పార్థసారథి
(జూన్ 2021లో వ్రాసినది)

Previous Post Next Post