Title Picture

ఒక వర్గం వారికి నచ్చేవిధంగా చిత్రం తీస్తే రెండవ వర్గం వారు ఈసడిస్తారు కనుక పక్షపాతం లేకుండా, తెలుగు ప్రేక్షకుల సగటు సంస్కారాన్ని, విజ్ఞానాన్ని, అభిరుచిని అంచనాకట్టి అందుకు అనుగుణమైన హంగులనూ, హంగామాలనూ ఏర్చికూర్చి 'వెలుగు నీడలు' చిత్రాన్ని నిర్మించారు అన్నపూర్ణావారు. సగటు ప్రేక్షకునికి అంగుళం మేర అయినా విసుగుపుట్టకుండా, కొన్ని సందర్భాలలో 'శెభాష్' అని ఈలకొట్టేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో ఉత్తమ చిత్రాలుగా మనం లెక్కవేస్తున్న వాటి కోవలోకి వస్తుంది 'వెలుగు నీడలు' చిత్రం.

రవి అనే పేరుతో రహస్యంగా కవిత్వం రాసే చంద్రం అనే అబ్బాయికి ఆడపిల్లల టెక్కునిక్కులను అణచగల 'టెక్ నిక్' తెలుసు. ఈ విషయంలో స్నేహితులతో పందెం కాసి, సుగుణ అనే అందమైన అమ్మాయిపై 'టెక్ నిక్' ప్రయోగించి క్లాసులో ఆమె పక్కన కూచుని వందరూపాయలు గెల్చుకున్నాడు. ఆరోజు ఆవిడ తన బెంచిపై అతనికి కాస్త జాగా యిచ్చింది. మర్నాడు తన హృదయంలోనే జాగా యిచ్చింది. ఆ మరుసటినాడు తన హృదయపాత్రికలో ప్రేమామృతాన్ని నింపి అతనికి సమర్పించింది. అతనుకూడా అదేపని చేసి బదులు తీర్చుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళకి రఘు అనే అబ్బాయి లండన్ నుంచి వచ్చి తన హృదయాన్ని ఆవిడకు సమర్పించుకున్నాడు. కాని ఆవిడ బదులుగా తన హృదయానివ్వలేదు (ఆవిడ యిదివరకే చంద్రానికిచ్చేసింది కనుక). మరి కొన్నాళ్ళు పోయాక చంద్రానికి క్షయరోగం వస్తుంది ''నీ హృదయ పాత్రిక నా దగ్గర ఉండటం క్షేమం కాదు. పాపం రఘుకి ఇచ్చే సెయ్యి'' అని చెప్పి ఆవిడ తన కిచ్చిన ప్రేమను వాపసు ఇచ్చేసి, తన హృదయాన్ని ఆవిడదగ్గర్నుంచి తిరిగి పుచ్చుకుంటాడు చంద్రం. ఆవిడ దాన్ని రఘుకి ఇస్తుంది. ఇలా హృదయాల వాయనాలు ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగిన తర్వాత ఒకరోజున హఠాత్తుగా విధి అనే విలన్ రఘును కారుప్రమాదంలో హత్యచేస్తాడు. ఆ పోయేవాడు ఆమె హృదయాన్నీ, ప్రేమనూ ఆవిడకి తిరిగి యివ్వకుండానే చనిపోయాడు. తనకున్న ఒక్క హృదయాన్నీ రఘు దోచుకుని పోవడం వలన పాపం ఆవిడ విధవగానే ఉండిపోయింది. మాజీ ప్రియురాలి పరిస్థితి ఇలా ఉండగా తాను పెళ్ళి చేసుకొని సుఖపడటం ఇష్టంలేక ఊరుకొన్నాడు చంద్రం. కాని ''అంత పవిత్రమైన ప్రేమను వృధాపోనీయకూడదు. ఎవరైనా మంచి అమ్మాయిని చూసి వాయనం ఇచ్చుకో'' మంది ఆవిడ. కాదంటే ఒట్టు అంది. సరేనని అతను ఇంకో వరలక్ష్మి అనే పిల్లను చేసుకొంటాడు. స్థూలంగా కథలోని సారాంశం యిది.

Picture
సావిత్రి, నాగేశ్వరరావు

ఈ విధంగా హృదయాలతో బంతులాట లాడుకోవడం సాధ్యమా? తనను అంత గాఢంగా ప్రేమించిన అమ్మాయి తనను మరచిపోయి, మరో వ్యక్తితో సుఖపడగలదని అతను ఎలా అనుకున్నాడు? అతని ప్రేమకు రాజీనామా ఇచ్చి తను ప్రేమించిన వ్యక్తికి తన హృదయాన్ని ఆవిడ ఎలా బదిలీ చేయగలిగింది? ఆడది ఒక్కసారి మాత్రమే ప్రేమించగలదని సినీకవులు పలుకుతూ ఉంటారు కదా! ఎన్ని సార్లయినా ప్రేమించగలిగితే చివరికి మళ్ళీ చంద్రాన్ని చేసుకోవచ్చును కదా? ఇలాంటి ప్రశ్నలు నూటికి ఒకరిద్దరికి మాత్రమే వస్తాయి కనుక ఈ చిత్రం ఆర్థిక విజయానికి భంగమేమీ రాదు.

పైన చెప్పినట్లు సగటు ప్రేక్షకుని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని కట్టుదిట్టంగా నిర్మించారు ఆదుర్తి. కథ, కథనం చాలా బిగువుగా ఉన్నాయి. వదులుగా, పేలవంగా ఉన్న పన్నివేశాలు ఏమీ లేవు. అతిగా ఉన్న చేష్టలు కూడా అంతగా లేవు.

కథకులు, దర్శకులు కల్పించిన విశాలావకాశాన్ని నాగేశ్వరరావు పూర్తిగా ఉపయోగించుకున్నాడు. శక్తినంతా ధారపోసి నటించాడు. సావిత్రి ఈ మధ్య ఈ మాదిరి పాత్రలను కొన్నింటిని ధరించింది. వాటిలో వలెనే ఇందులో కూడా మితంగా, నిబ్బరంగా నటించింది. సూర్యకాంతం చిత్రానికి ప్రత్యేకాకర్షణ. ఆమె నటన అద్భుతంగా, అతి సహజంగా ఉంది. మిగతా నటులంతా రెచ్చిపోకుండా మితంగా నటించారు.

ఆత్రేయగారి రచన చిత్రానికి ఆయువుపట్టు, సంభాషణలు అమితంగా ఉన్నా హాయిగా ఉన్నాయి.

పెండ్యాలగారి సంగీతం కమ్మగా ఉంది. మొత్తం 9 పాటలలో 'శివగోవింద', 'పాడవోయి భారతీయుడా' అన్న పాటలు బాగా ఉన్నాయి. మరొక రెండు పాటలు బాగానే ఉన్నాయి. మిగతావి ఫరవాలేదు.

మొత్తం మీద ఈ చిత్రం విపరీతంగా జనాదరణ పొందుతుందని చెప్పవచ్చును.

నిర్మాత : డి. మధుసూధనరావు; దర్శకత్వం : ఆదుర్తి; రచన : ఆత్రేయ; సంగీతం : పెండ్యాల; పాటలు : కొసరాజు, శ్రీశ్రీ; ఛాయాగ్రహణం : సెల్వరాజ్; నేపథ్యగాయకులు : ఘంటసాల, జిక్కి, మాధవపెద్ది సత్యం, సుశీల, స్వర్ణలత. తారాగణం : నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, రేలంగి, రంగారావు, గిరిజ, సూర్యకాంతం, సంధ్య వగైరా.

నండూరి పార్థసారథి
(1961 జనవరి 14వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post