ఈరకం చిత్రాలలో కళావిలువలను ఆశించే చాదస్తులు (ఇంకా ఈ కాలంలో ఎవరైనా ఉంటే) ఈ చిత్రాన్ని చూసి ఆశాభంగం పొందితే అది లెక్కలోకి తీసుకోతగింది కాదు. మామూలుగా తెలుగులో ఘనవిజయం సాధిస్తున్న చిత్రాల మాదిరిగానే ఉంది ఈ చిత్రం కూడా. శృంగారం, శోకం, స్టంటు, సస్పెన్సు, పాటలు, డాన్సులు, త్యాగం, సహనం, హాస్యం, శ్లేషకవిత్వం మొదలయిన దినుసులన్నీ సమపాళంలో పడినందున ఈ చిత్రం ప్రేక్షకులకు పరిపూర్ణమైన తృప్తినివ్వ గలదనడంలో సందేహం లేదు. బాక్సాఫీసు జాబితాలోని సూత్రాలన్నీ ఇందులో పూర్తిగా జమపడ్డాయి. అయితే ఇది ట్రాజెడీ కావడం ఒక్కటే ట్రాజడి అనిపిస్తుంది. చివరి దాకా అంతజోరుగా, హుషారుగా, షికారుగా సాగిన చిత్రం అంత అర్థంతరంగా ట్రాజెడీ కావలసిన అవసరం అంతగా లేదేమోననిపిస్తుంది. అయితే ఒకటి-టాక్సీరాముడు బ్రతికేకంటే మరణిస్తేనే ప్రేక్షకుల సానుభూతిని ఎక్కువగా చూరగొనగలడని నిర్మాతలు భావించివుండవచ్చును. అయినా చివరికి అతను టాక్సీలో తెలియని గమ్యం వైపుకు సాగిపోతూ ఉండగా ఫేడౌట్ అయితే బావుండేదని మెజారిటీ ప్రజలు భావిస్తారు.
టాక్సీరాముడు (రామారావు) ప్రేమించిన అమ్మాయి (దేవిక) అనివార్య కారణాల వల్ల మరొక యువకుణ్ణి (జగ్గయ్య) పెళ్ళి చేసుకొంటుంది. ఆ యువకుడు తాగుబోతు, వ్యభిచారి, జూదరి. కాని ఆ అమ్మాయి సాహచర్యం వల్ల బుద్ధిమంతుడు రామూగా మారుతాడు. ఈ బుద్ధిమంతుడు రామూను విలన్ల బారి నుండి కాపాడి, చివరికి ప్రాణాలు త్యాగం చేస్తాడు అమరజీవి టాక్సీ రాముడు.
తోటరాముడు, రిక్షారాముడు, అగ్గిరాముడు, బండరాముడు పాత్రలకు అతికినట్టుగానే రామారావు టాక్సీ రాముడి వేషానికి కూడా సరిపోయాడు. ఇటువంటి వేషాలే ఆయనకి అద్భుతంగా నప్పుతాయి. ఈ రకం పాత్రలలో ఆయన చాలా సహజంగా ఉంటాడు. ఇటువంటి పాత్రల వల్లనే ఆయనకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు విశేషంగా లభిస్తున్నాయి. నాయికగా దేవిక తన సహజ ధోరణిలో బాగానే నటించింది. విలన్ గా రాజనాల, విదూషకుడుగా రేలంగి చక్కగా నటించారు. గిరిజ కాస్తంత జోరు తగ్గించి ఉంటే మరింత ముచ్చటగా ఉండేది. ఇతర నటీనటులందరూ యథాశక్తిని నటించారు.
పాటలలో శ్లేషలు సుబోధకంగా ఉండి పామరజనులను విశేషంగా రంజింప చేశాయి. సంగీతంలో శ్రావ్యత పాలుకంటే శబ్దం పాలు ఒకింత ఎక్కువగా ఉన్నది. నైట్ క్లబ్ పాట ఒకటి, నృత్య గీతం ఒకటి చక్కగా ఉన్నాయి. వాటికి కూర్చిన వరసలలో కాస్త కొత్త దనం కనుపించింది.
మూడు గంటల కాలక్షేపం కోసం చూడతగిన వినోదప్రధాన చిత్రం 'టాక్సీరాముడు'. రాముడు మార్కు చిత్రాలన్నింటి వలెనే ఇది కూడా శతదినోత్సవాలు చేయించుకొంటుందని ఆశించవచ్చు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.మధుసూధనరావు; మాటలు: సముద్రాల (జూ); పాటలు: సముద్రాల (జూ), సముద్రాల (సీ), సదాశివ బ్రహ్మం, ఆరుద్ర, కొసరాజు; సంగీతం: టి.వి.రాజు; ఛాయాగ్రహణం: సి.నాగేశ్వరరావు; తారాగణం: ఎన్.టి.రామారావు, జగ్గయ్య, రేలంగి, గుమ్మడి, దేవిక, గిరిజ, రాగిణి, రాజనాల, కె.వి.ఎస్.శర్మ, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, చదలవాడ వగైరా.
నండూరి పార్థసారథి
(1961 అక్టోబరు 22వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works