Title Picture
సత్యజిత్ రాయ్

టాగోర్ శతజయంత్యుత్సవాల సందర్భంగా ఫిలింస్ డివిజన్ తరపున సత్యజిత్ రాయ్ నిర్మించిన 'రవీంధ్రనాథ్ టాగోర్' డాక్యుమెంటరీ చిత్రం దేశవ్యాప్తంగా విడుదల అయింది. వివిధ ప్రాంతీయ భాషలలో దీనికి వ్యాఖ్యానం కూడా జోడించారు. ఇంగ్లీషులో దీనికి సత్యజిత్ రాయ్ స్వయంగా వ్యాఖ్యానం రచించారు. ఆయనే వ్యాఖ్యానాన్ని చదివారు కూడా.

మధురకవి, గాయకుడు, చిత్రకారుడు, సౌందర్యోపాసకుడు, జ్ఞాని, వేదాంతి, ప్రేమమూర్తి, కళాతపస్వి అయిన రవీంద్రుని జీవితాన్ని, జీవన తత్వాన్ని తన సహజ దృక్పధంతో సత్యజిత్ రాయ్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానానికి అద్భుతంగా రూపకల్పన చేశారు. విశ్వకవి తత్వాన్ని పరిపూర్ణంగా తనలో నింపుకున్న సత్యజిత్ రాయ్ కొక్కనికే ఇలాంటి కళాసృష్టి సాధ్యమనిపిస్తుంది. టాగోర్ రచనలు చదివినా, సత్యజిత్ రాయ్ చిత్రాలు చూసినా, కళపట్ల వారిరువురికీ గల దృక్పథం ఒక్కటేనని పిస్తుంది.

ఇరువురి కళాసృష్టిలోనూ విశ్వజనీన భావం అంతర్లీనంగా కనుపిస్తుంది. సత్యజిత్ రాయ్ గొప్ప సౌందర్యోపాసకుడు, భావుకుడు, కవి, గాయకుడు, చిత్రకారుడు, చలన చిత్రకారుడు, కళాతపస్వి. భారతీయ సాంస్కృతిక చరిత్రలో విశ్వకవికి ఉన్న స్థానం సత్యజిత్ రాయ్ కి కూడా ఉన్నది. అందుకు ఈ చిత్రం కూడా తార్కాణం.

టాగోర్ వంశవృక్షాన్ని, ఆయన తండ్రిగారిని, తాతగారిని రాయ్ ఈ చిత్రంలో పరిచయం చేశారు. రవీంద్రుని బాల్యాన్ని, ప్రకృతితో ఆయనకు గల సాన్నిహిత్యాన్ని, బాల్యంలో అంకురించి క్రమంగా ఆయనలో పరిణతి చెందుతూ వచ్చిన భావుకతనూ, విశ్వప్రేమను ఆయన ఈ చిత్రంలో వ్యాఖ్యానించారు. రవీంద్రుని రచనా వ్యాసంగం, జీవితంలోని కొన్ని సంఘటనలు, ఆయన చిత్రాలు, శాంతినికేతనంలో ఆయన జీవితం, విదేశపర్యటన మొదలయిన అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు.

కేవలం రవీంద్రుని ఫొటోలు, చిత్రాలు, శిథిలమైపోయిన కొన్ని ఫిలిం షాట్లు, వార్తా పత్రికలలోని కత్తిరింపులు ఆధారంగా ఈ చిత్రాన్ని సత్యజిత్ రాయ్ నిర్మించారు. వీటినన్నింటినీ ఎడిట్ చేయడంలో, వాటికి వ్యాఖ్యానాన్ని జోడించడంలో రాయ్ అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించారు. కొన్ని కొన్ని దృశ్యాలను తప్పని సరిగా స్టూడియో సెట్స్ పై చిత్రీకరించవలసి వచ్చింది. బాల్యంలో రవీంద్రుని పాఠశాల దృశ్యాలను ఇలాగే చిత్రీకరించారు.

ఇండియాలో ఈ మాదిరి డాక్యుమెంటరిని నిర్మించడం ఇదే ప్రథమమని చెప్పడానికి వీల్లేదు. ఇంతకు ముందు బాలగంగాధర తిలక్ ను గురించి ఫిలింస్ డివిజన్ ఇదే విధంగా ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. అయితే ఆ చిత్రం ఎక్కువ భాగం స్టూడియోలో నిర్మించబడింది.

ఈ చిత్రం నిడివి 2 వేల అడుగులు.

'విశ్వసౌందర్యంలో విశ్వకవిలీనమైపోయారు' అన్న వాక్యంతో టాగోర్ చిత్రాన్ని రాయ్ అద్భుతంగా ముగించారు.

నండూరి పార్థసారథి
(1961 మే 21వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post