విలాయత్ ఖాన్
బెంగుళూరులో అమీర్ ఖుస్రూ సంగీతోత్సవం:

బెంగుళూరు, నవంబర్ 18: హజరత్ అమీర్ ఖుస్రో సప్తశత జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 13, 14, 15 తేదీలలో ఇక్కడ లాల్ బాగ్ లోని గ్లాస్ హౌస్ లో గొప్ప హిందూస్థానీ సంగీత కచేరీలు జరిగాయి. మొదటి రోజు ఉస్తాద్ ఇష్తియాక్ హుస్సేన్ ఖాన్ గాత్ర సంగీత కచేరీ, రెండవ రోజు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయ్ కచేరీ, మూడవ రోజు ఉస్తాద్ విలాయత్ ఖాన్ సితార్ కచేరీ జరిగాయి. మూడు రోజులూ ఈ ప్రధాన సంగీత కార్యక్రమాలు ముగిసిన తర్వాత-అంటే రాత్రి సుమారు 11 గంటల నుంచి-మూడు నాలుగు గంటల సేపు కవ్వాలీ కచేరీలు జరిగాయి. ఈనాం అహమ్మద్ (ఢిల్లీ), ఇక్బల్ హుస్సేన్ (హైదరాబాద్), ఘనీ అహమ్మద్ (గుల్బర్గా), ఇల్లాన్ ముజాఫర్ (రాంపూర్) ప్రభృతులు కవ్వాలీలు గానం చేశారు. హజరత్ అమీర్ ఖుస్రో రచించిన కవ్వాలీలను, శతాబ్దాలుగా గానం చేస్తున్న సంప్రదాయంలో వారు కవ్వాలీలను వినిపించారు.

టికెట్లు లేకుండా అందరికీ ఉచిత ప్రవేశం ఏర్పాటు చేసినందువల్ల ఆ మూడు రోజులూ బెంగళూరులోని హిందూస్థానీ ప్రియులు, కవ్వాలీ ప్రియులు అందరూ లాల్ బాగ్ లోనే ఉన్నారు. గ్లాస్ హౌస్ నిండిపోగా బైటకూడా గుంపులు గుంపులుగా చేరి విన్నారు. బిస్మిల్లాఖాన్, విలాయత్ ఖాన్ ల కచేరీలకు 18 వేల మంది దాకా హాజరైనారు. జనంలో చిన్నపిల్లలు, సంగీతం పట్ల ఆసక్తి లేకపోయినా కాసేపు కాలక్షేపం చేయడానికి వచ్చినవాళ్లు కూడా చాలమంది ఉండడం వల్ల నిజమైన సంగీత ప్రియులు ప్రశాంతంగా సంగీతం వినడానికి వీల్లేకపోయింది. కచేరీ జరుగుతున్నంతసేపు జనం వచ్చేవారు వస్తుంటే, పోయేవారు పోతున్నారు. కారు హారన్లు, మోటారు సైకిళ్ల శబ్దాలు, పోలీసుల విజిల్స్, జనం గోల-ఇన్నింటి మధ్య విలాయత్ ఖాన్ సుతారంగా వాయించే సితార్ స్వరాలు నలిగిపోయాయి. ఆయన కచేరీ కోసం ఎంతో తహతహతో ఎదురు చూసిన సంగీత ప్రియులకు తీవ్ర ఆశాభంగం కలిగింది. బిస్మిల్లాఖాన్ రెండు మూడు సంవత్సరాల కొకసారి బెంగుళూరు వస్తూనే ఉంటారు గాని, విలాయత్ ఖాన్ రావడం అపురూపం. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈయన ఇప్పుడు వచ్చారు.

విలాయత్ ఖాన్ ఉత్తర హిందూస్థానంలో మామూలుగా ఐదుగంటలసేపు కచేరీ చేస్తారు. మద్రాసు వంటి చోట్ల మూడు, నాలుగు గంటల సేపు వాయిస్తారు. కాని, ఇక్కడ గ్లాస్ హౌస్ గోలలో గంటన్నరసేపు వాయించడమే కష్టమైపోయింది. మామూలుగా ఆయన విలంబిత లయలో ఎక్కువ సేపు వాయిస్తారు. మనోహరమైన నగిషీ స్వరాలతో నాజూకుగా వాయిస్తారు. కాని, మొన్నటి కచేరీ పూర్తి భిన్నంగా ఉంది.

అమీర్ ఖుస్రూ సృష్టించిన 'యమన్' రాగంతో ఆయన కచేరీ ప్రారంభించారు. మూడు నాలుగు నిమిషాలలో 'ఆలాప్' ముగించి, సరాసరి 'ధ్రుత్' లయ 'గత్' అందుకున్నారు. జనాన్ని హుషారు చేయడానికన్నట్లు అతి వేగంగా వాయించారు. పెక్కుసార్లు జనం చప్పట్లు కొట్టారు. మామూలుగా గంటన్నర సేపు వాయించే 'యమన్' రాగాన్ని ఆయన అరగంటలో ముగించారు. తర్వాత 'భాటియాలీధున్' పది నిమిషాలు వాయించారు. సుమారు అరగంట విరామం తర్వాత కూడా ప్రశాంతత ఏర్పడక పోవడంతో, ఇంక ఇదే ఆఖరు అన్నట్లుగా ఆయన 'భైరవి' రాగం అరగంట సేపు వాయించి సితార్ క్రింద పెట్టేశారు. (హిందూస్థానీ కచేరీలో చివరి అంశంగా 'భైరవి' వాయించడం సంప్రదాయం) ఎంతో ఆశతో వచ్చిన సంగీత ప్రియులు చాలా నిరుత్సాహపడ్డారు. ఎవరూ కుర్చీలలో నుంచి లేవలేదు. మరి కాసేపు వాయించవలసిందని నిర్వాహకులు మరీ మరీ అభ్యర్థించగా విలాయత్ ఖాన్ 'సాజ్ గిరి' రాగంలో ఒక 'గత్'ను పదిహేను నిమిషాలు వాయించారు. ఇది కూడా అమీర్ ఖుస్రూ సృష్టించిన రాగమే.

మంచి 'మూడ్'లో ప్రశాంతంగా వాయించే అవకాశం లేకపోయినా, విలాయత్ ఖాన్ కచేరీలో కొన్ని భాగాలు అద్భుతంగా ఉన్నాయి. సితార్ వాద్యంపై ఆయనకు గల తిరుగులేని అధికారం స్పష్టంగా వ్యక్తమయింది.

బిస్మిల్లా ఖాన్

అంతకు ముందు రోజు ఆదివారం నాడు బిస్మిల్లాఖాన్ కచేరీ బాగా రక్తికట్టింది. ఆరోజు కూడా గ్లాస్ హౌస్ లో కొంత గోలగానే ఉన్నప్పటికీ, ఆయన షెహనాయ్ ఖంగుమని ధాటిగా వినిపించింది. మొత్తం రెండు గంటల సేపు జరిగిన కచేరీలో ఆయన మొదట 50 నిమిషాల సేపు 'యమన్' రాగం అద్భుతంగా వాయించారు. తర్వాత 'పూర్వీధున్' పది నిమిషాలు వినిపించారు. దాని తర్వాత 'దర్బారీ కానడ' రాగాన్ని 20 నిమిషాలు మాత్రమే వాయించడం ఆశాభంగం కలిగించినప్పటికీ, ఆ రాగంలో ఆయన వినిపించిన 'గత్' అతి మధురంగా ఉంది. దాని తర్వాత ఒక విచిత్రమైన, క్లిష్టమైన సరికొత్త రాగాన్ని అరగంటసేపు వాయించారు. ఆ అజ్ఞాత రాగంలో బిస్మిల్లా వాద్యవాదన ప్రావీణ్యం సంపూర్ణంగా వ్యక్తమయింది. 'గూంజ్ ఉఠీ షెహనాయ్' చిత్రంలోని ఒక పాటతో ఆయన కచేరీని ముగించారు. కచేరీలో పదే పదే కరతాళ ధ్వనులు చెలరేగాయి. బిస్మిల్లా కుమారుడు నాజిమ్ హుస్సేన్ తబ్లా వాదనం శ్రోతలను ముగ్ధులను చేసింది. అతడు తండ్రితో సమానంగా శ్రోతల అభిమానాన్ని చూరగొన్నాడు.

నండూరి పార్థసారథి
(1976 డిసెంబర్ 4వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post