Title Picture

జగన్నాథుడు భక్తుల సహనాన్ని పరీక్షించినట్లు ఈ చిత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. భక్త రఘునాథునివంటి వారెవరో ఈ పరీక్షలో నెగ్గుతారు. టైటిల్స్ మొదలు కొని 'శుభం' వరకు 17 వేల అడుగుల దూరం, కథ సాగించిన దీర్ఘ యాత్రకు ఒక మజిలీ-(విశ్రాంతి) చాలదనిపిస్తుంది.

రఘునాథుడనే బావ, అన్నపూర్ణ అనే మరదలు ప్రేమించుకోవడం, వారి ప్రేమ పుష్పించ బోతుంటే విధి త్రుంచివేయడం, రఘునాథుడు తల్లి తండ్రులను, ఆస్తిని కోల్పోయి బికారికావడం, ప్రేమికులకు వియోగం, చిదానంద స్వాములవారి వద్ద రఘునాథుని శిష్యరికం, రఘునాథ్, అన్నపూర్ణల వివాహం, బ్రహ్మచర్యం, భక్తియోగం, మహిమా ప్రదర్శనం, భగవదైక్యం మున్నగు అనేక సంఘటనల పరంపర ఈ చిత్రం.

సినీబజారులో రెడీమేడ్ గా దొరికే మూసపోసిన మాటలు, పాటలు, నృత్యాలు, సన్నివేశాలతో నల్లేరుమీద బండిలాగా అనాయాసంగా కథను నడిపించారు దర్శకుడు సముద్రాల. మొత్తం మీద చిత్రం వయోజనమనోభిరామంగా ఉన్నదనవచ్చు. ఎందుకంటే యీ తరం కుర్రకారుకు సరిపడినంత రొమాన్సు ఈ చిత్రంలో లేదు. పెళ్ళిచేసికూడా నాయకుని చేత బ్రహ్మచర్యం అవలంబింపచేయడం కుర్రకారుకు భరించరానిదిగా ఉంటుంది. భక్తి, బ్రహ్మచర్యం కాక-ఇంకా ఏమైనా విశేషాలున్నాయేమో పోనీ అనుకుంటే, ఒకటి, రెండు మినహా అన్నీ భజనలు, మహిమలు.

హాస్యసంభాషణలు వ్రాయవలసిన ప్రయాస లేకుండా కాబోలు రేలంగికీ, సూర్యకాంతానికీ కూడా ఇందులో వేషాలిచ్చారు. ప్రత్యేకాకర్షణ ఏమీ లేదు. ఇందులో నటించినవారందరిలోకీ కాంతారావు నటన మిన్నగా వుంది-ముఖ్యంగా చరమఘట్టాలలో. భక్తి మినహా మిగతా అంతా బాగా అభినయించింది జమున. మొదటి భాగంలో మరదలుగా ఆమె ప్రేమాభినయం చక్కగా ఉంది. మిగతావారి నటన మామూలే.

ఘంటసాల సంగీతం మామూలుగానే ఉంది. పాటలన్నీ బాగా ప్రచారమయ్యే ధోరణిలో ఉన్నాయి. పాటలు, పద్యాలు, శ్లోకాలు, దండకాలు వగైరాఅన్నీ 18 ఉన్నాయి. వాటిలో పది వరకు భజనగీతాలు. ఒకటి రెండు పాటలు చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా 'ఈ ప్రశాంత నిశీధివేళా...' అన్న పాట బాగుంది.

Picture
సముద్రాల

నిర్మాత : జి సదాశివుడు; దర్శకత్వం : సముద్రాల; రచన : సముద్రాలద్వయం; సంగీతం : ఘంటసాల; నృత్యం : వెంపటి; ఛాయాగ్రహణం : కమల్ ఘోష్, జె. సత్యనారాయణ; తారాగణం : జమున, కాంతారావు, రేలంగి, నాగయ్య, సూర్యకాంతం, నిర్మల, సి.ఎస్.ఆర్., మల్లాది, పేకేటి, కమలకుమారి వగైరా.

నండూరి పార్థసారధి
(1960 నవంబరు 13వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post